ప్రధాన మంత్రి కార్యాలయం

తమిళనాడులో 11 వైద్య కళాశాలలు.. ‘సీఐసీటీ’ కొత్త ప్రాంగణానికి ప్రధాని ప్రారంభోత్సవం


వైద్య కళాశాలలు ఏర్పాటయ్యే జిల్లాలు: విరుదునగర్,

నామక్కళ్‌, నీలగిరి, తిరుప్పూర్, తిరువళ్లూరు, నాగపట్నం,

దిండిగల్, కళ్లకురిచ్చి, అరియలూర్, రామనాథపురం, కృష్ణగిరి;

దేశంలో గత ఏడేళ్లలో 54 శాతం వృద్ధితో 596కు పెరిగిన వైద్య కళాశాలల సంఖ్య;
మెడికల్ అండర్/పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ల సంఖ్య 2014లో 82 వేలు కాగా..

దాదాపు 80 శాతం పెరుగుదలతో నేడు రమారమి 1.48 లక్షలకు చేరిక;

2014లో ‘ఎయిమ్స్‌’ సంఖ్య కేవలం 7 కాగా… నేడు 22కు పెరుగుదల;

“ఆరోగ్య సంరక్షణలో పెట్టుబడి పెట్టే సమాజాలకే ఉజ్వల భవిష్యత్తు..
కేంద్ర ప్రభుత్వం ఈ రంగంలో అనేక సంస్కరణలు తెచ్చింది”;

“రాబోయే ఐదేళ్లలో తమిళనాడుకు రూ.3 వేల కోట్లకుపైగా సహాయం అందుతుంది.. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ఆరోగ్య-శ్రేయో కేంద్రాలు.. జిల్లా ప్రజారోగ్య ప్రయోగశాలలు.. అత్యవసర చికిత్స విభాగాల ఏర్పాటుకు ఇది తోడ్పడుతుంది”;
“తమిళ భాష సంస్కృతి.. సుసంపన్నత నన్ను సదా సమ్మోహితం చేస్తుంటాయి”

Posted On: 12 JAN 2022 5:45PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ తమిళనాడులో 11 కొత్త వైద్య కళాశాలలతోపాటు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ (సీఐసీటీ) కొత్త ప్రాంగణాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ మన్‌సుఖ్‌ మాండవీయతోపాటు డాక్టర్ ఎల్.మురుగన్, డాక్టర్ భారతి పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎం.కె.స్టాలిన్ కూడా  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ- రాష్ట్రంలో 11 వైద్య క‌ళాశాల‌లతోపాటు  సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లాసిక‌ల్ త‌మిళ్ కొత్త భ‌వ‌నం ప్రారంభంతో తమిళ సమాజ ఆరోగ్యం ఉన్నతస్థాయికి చేరడమేగాక మనదైన సంస్కృతితో అనుబంధం మరింత దృఢమవుతుందని అన్నారు.

   దేశంలో వైద్యుల కొరత చిరకాల సమస్య కాగా, ప్రస్తుత ప్రభుత్వం ఈ సంక్లిష్ట అంతరాన్ని తొలగించేందుకు ప్రాధాన్యమిస్తున్నదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తాము 2014లో పాలన పగ్గాలు చేపట్టేనాటికి దేశవ్యాప్తంగా 387 వైద్య కళాశాలలు మాత్రమేనని గుర్తుచేస్తూ, కేవలం ఏడేళ్లలోనే 54 శాతం వృద్ధితో ఈ సంఖ్య 596కు పెరిగిందని వివరించారు. అదేవిధంగా మెడికల్ అండర్/పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ల సంఖ్య 2014లో 82 వేలు కాగా.. గత ఏడేళ్ల వ్యవధిలో దాదాపు 80 శాతం పెరుగుదలతో నేడు రమారమి 1.48 లక్షలకు చేరిందని ప్రధాని చెప్పారు. ఇక 2014నాటికి దేశంలో ‘ఎయిమ్స్‌’ సంఖ్య 7 మాత్రమే కాగా.. ఆ తర్వాతి కాలంలో మరింత పెరిగి నేడు 22కు చేరిందని ఆయన వెల్లడించారు. అదే సమయంలో వైద్యవిద్య రంగంలో మరింత పారదర్శకత దిశగా అనేక సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఏకకాలంలో 9 వైద్య కళాశాలలను ప్రారంభించానని ప్రధానమంత్రి గుర్తుచేశారు. అయితే, నేడు తమిళనాడులో ఒకేసారి 11 వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టడంద్వారా తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నానని చమత్కరించారు. నీలగిరి పర్వత జిల్లాతోపాటు ప్రగతికాముక జిల్లాలు రామనాథపురం, విరుదునగర్‌లలో వైద్య కళాశాలల ఏర్పాటుతో ప్రాంతీయ అసమతౌల్య పరిష్కారం సాధ్యమైందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

   జీవిత కాలంలో ఒకసారి ముంచుకొచ్చే కోవిడ్‌-19 వంటి మహమ్మారి మన ఆరోగ్య రంగం ప్రాధాన్యాన్ని పునరుద్ఘాటించిందని ప్రధానమంత్రి అన్నారు. కాబట్టి ఆరోగ్య సంరక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టే సమాజాలకే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రంగంలో అనేక సంస్కరణలు తెచ్చిందని గుర్తుచేశారు. ఇందులో భాగంగా పేదలకు అత్యుత్తమ నాణ్యత, సరళ వ్యయంతో ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకి తెస్తూ ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్ భారత్‌’ పథకం ఒక వరం వంటిదని పేర్కొన్నారు. అలాగే మోకాలి కీళ్ల మార్పిడి పరికరాలు, రక్తనాళాల్లో వేసే స్టెంట్లు వంటి వైద్య ఉపకరణాల ధర మునుపటితో పోలిస్తే మూడో వంతుకు దిగివచ్చిందన్నారు. పేద మహిళలకు రూపాయికే శానిటరీ న్యాప్‌కిన్‌  అందించడం ద్వారా వారి ఆరోగ్యకర జీవనశైలి మెరుగవుతుందని ఆయన చెప్పారు. దేశంలో… ముఖ్యంగా జిల్లాల్లో ఆరోగ్య మౌలిక వసతుల కల్పనతోపాటు ఆరోగ్య పరిశోధనలలో సంక్లిష్ట అంతరాలను పరిష్కరించడాన్ని ‘ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ మౌలిక వసతుల కార్యక్రమం’ లక్ష్యంగా పెట్టుకున్నదని వివరించారు.

   మిళనాడుకు రానున్న ఐదేళ్లలో రూ.3 వేల కోట్లకుపైగా సహాయం అందుతుందని ప్రధాని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ఆరోగ్య-శ్రేయో కేంద్రాలు.. జిల్లా ప్రజారోగ్య ప్రయోగశాలలు.. అత్యవసర చికిత్స విభాగాల ఏర్పాటుకు ఈ సాయం తోడ్పడుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో- “భారతదేశం నాణ్యమైన, సరళవ్యయంతో అందుబాటులోగల ఆరోగ్య సంరక్షణ గమ్యం కావాలన్నది నా ఆకాంక్ష. వైద్య పర్యాటకానికి కూడలికాగల సదుపాయాలన్నీ భారత్‌లో ఉన్నాయి. మన వైద్యుల ప్రతిభాపాటవాలను బట్టి నేనిలా చెప్పగలుగుతున్నాను” అని ప్రధాని అన్నారు. అదే సమయంలో దూరవైద్య విధానంపైనా దృష్టి సారించాల్సిందిగా ఆయన వైద్యలోకాన్ని కోరారు.

   మిళ భాష సంస్కృతి, సుసంపన్నత తనను సదా సమ్మోహితం చేస్తుంటాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. “ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే సందర్భంగా అతి ప్రాచీన ప్రపంచ భాషల్లో ఒకటైన తమిళంలో కొన్ని పదాలు పలికే సదవకాశం ఓసారి లభించడం నా జీవితంలోని సంతోషకర క్షణాల్లో ఒకటి” అని ఆయన గుర్తుచేసుకున్నారు. బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో తమిళ భాషాధ్యయనంపై ‘సుబ్రమణ్య భారతి పీఠం’ ఏర్పాటు చేయడం తమ ప్రభుత్వానికి దక్కిన గౌరవంగా ఆయన పేర్కొన్నారు. తన పార్లమెంటు నియోజకవర్గంలోగల ఈ పీఠం తమిళ భాషపై ఆసక్తిని మరింత పెంచుతుందన్నారు.

   జాతీయ విద్యావిధానం-2020లో భారతీయ భాషలు, విజ్ఞాన వ్యవస్థలను ప్రోత్సహించేందుకు ప్రాధాన్యం ఇవ్వడం గురించి ప్రధానమంత్రి వివరించారు. ఈ మేరకు మాధ్యమిక, ప్రాథమికోన్నత స్థాయిలో తమిళాన్ని ప్రాచీన భాషగా అధ్యయనం చేసే వీలుందని ఆయన చెప్పారు. ఆడియో వీడియోల ద్వారా వివిధ భారతీయ భాషల్లోని వంద వాక్యాలను పాఠశాల విద్యార్థులకు పరిచయం చేయడంలో భాగంగా రూపొందించిన ‘భాషా-సంగమం’లో తమిళం కూడా ఒకటని ఆయన వెల్లడించారు. అలాగే ‘భారతవాణి’ ప్రాజెక్టు కింద తమిళంలో అత్యధిక సారాంశాన్ని డిజిటలీకరించినట్లు చెప్పారు. “పాఠశాలల్లో మాతృభాషతోపాటు స్థానిక భాషలలో విద్యాబోధనను మేం ప్రోత్సహిస్తున్నాం. అంతేగాక విద్యార్థులకు భారతీయ భాషల్లో ఇంజనీరింగ్ వంటి సాంకేతిక కోర్సులను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది” అని వివరించారు.

   దేశంలో భిన్నత్వంలో ఏకత్వం స్ఫూర్తిని పెంపొందించి, ప్రజలను మరింత సన్నిహితం చేసేందుకు ‘ఒకే భారతం-శ్రేష్ఠ భారతం’ ద్వారా కృషి చేస్తున్నామని ప్రధాని చెప్పారు. “హరిద్వార్‌లోని ఓ బాలుడు తిరువళ్లువర్‌ విగ్రహాన్ని చూసి, ఆయన ఔన్నత్యాన్ని తెలుసుకున్నపుడు ఆ యువ మేధస్సులో ‘ఒకే భారతం-శ్రేష్ఠ భారతం’ బీజం పడినట్లే కాగలదు” అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత కోవిడ్‌ సంక్షోభ సమయంలో ముందుజాగ్రత్తలు పాటించడమేగాక కోవిడ్‌ నిర్దిష్ట జీవనశైలిని అనుసరించాలని ఆయన ప్రతి ఒక్కరినీ కోరారు.

   మిళనాడులో కొత్త వైద్య కళాశాలలను రూ.4,000 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో దాదాపు రూ.2,145 కోట్లు కేంద్రం నుంచి అందుతుండగా తమిళనాడు ప్రభుత్వం మిగిలిన నిధులను సమకూరుస్తుంది. కాగా, రాష్ట్రంలోని విరుదునగర్, నామక్కళ్, నీలగిరి, తిరుప్పూర్, తిరువళ్లూరు, నాగపట్నం, దిండిగల్, కళ్లకురిచ్చి, అరియలూర్, రామనాథపురం, కృష్ణగిరి జిల్లాల్లో ఈ వైద్య కళాశాలలు ఏర్పాటవుతాయి. దేశవ్యాప్తంగా సరళ వ్యయంతో కూడిన వైద్యవిద్యకు ప్రోత్సాహం, ఆరోగ్య మౌలిక వసతుల మెరుగుపై ప్రధానమంత్రి చేస్తున్న నిరంతర కృషికి అనుగుణంగా ఈ వైద్య కళాశాలలు ఏర్పాటవుతున్నాయి. వీటన్నిటిలో కలిసి 1450 సీట్లు అందుబాటులోకి రానుండగా, ‘ప్రస్తుత జిల్లా/రిఫరల్ ఆసుపత్రులకు అనుబంధంగా కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్ర ప్రాయోజిత పథకం’ కింద ఈ కళాశాలలు ప్రారంభమవుతాయి. ఈ పథకం కింద ప్రభుత్వ లేదా ప్రైవేట్ వైద్య కళాశాల లేని జిల్లాల్లో కొత్త కళాశాలు ఏర్పాటవుతాయి.

   భారతీయ వారసత్వ రక్షణ, పరిరక్షణతోపాటు భారతీయ ప్రాచీన భాషలను ప్రోత్సహించాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా చెన్నైలో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ (సీఐసీటీ) కొత్త ప్రాంగణం ఏర్పాటవుతోంది. ఈ కొత్త ప్రాంగణం ఏర్పాటుకు రూ.24 కోట్లు వ్యయం కాగా, కేంద్ర ప్రభుత్వమే పూర్తి నిధులు అందించింది. దీంతో ఇప్పటిదాకా అద్దె భవనంలో నడుస్తున్న ‘సీఐసీటీ’ ఇక మూడంతస్తుల కొత్త భవనంలోకి మారుతుంది. కొత్త ప్రాంగణంలో విశాలమైన గ్రంథాలయం, ఇ-లైబ్రరీ, సమావేశ మందిరాలు, మల్టీమీడియా హాలు నిర్మించబడ్డాయి. కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ పరిధిలోని ‘సీఐసీటీ’ ఒక స్వయంప్రతిపత్తిగల సంస్థ. ప్రాచీన తమిళ భాషపై పరిశోధన కార్యకలాపాల ద్వారా ఆ భాష ప్రాచీనత్వం, వైశిష్ట్యాన్ని మరింతగా వెలుగులోకి తెస్తుంది. ఈ సంస్థ గ్రంథాలయంలో 45,000 ప్రాచీన తమిళ పుస్తకాలతో కూడిన అపూర్వ గ్రంథనిధి ఉంది. ప్రాచీన తమిళ భాషను ప్రోత్సాహంతోపాటు విద్యార్థులకు చేయూతనిచ్చే దిశగా సదస్సులు, చర్చాగోష్ఠులు, శిక్షణ కార్యక్రమాలు వగైరాల నిర్వహణతోపాటు విద్యార్థి పరిశోధక సభ్యత్వం మంజూరు వంటి విద్యా కార్యకలాపాలు చేపడుతుంది. తమిళ ఐతిహాసిక గ్రంథం ‘తిరుక్కురళ్‌’ను వివిధ భారతీయ భాషలతోపాటు 100 విదేశీ భాషలలోకి అనువదించి ప్రచురించడం కూడా ఈ సంస్థ లక్ష్యంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రాచీన తమిళ భాషకు ప్రపంచవ్యాప్త  ప్రాచుర్యం కల్పించే క్రమంలో ఈ కొత్త ప్రాంగణం ‘సీఐసీటీ’కి కార్యసాధన అనుకూల వాతావరణాన్ని సృష్టించగలదనడంలో సందేహం లేదు.

***

DS/AK



(Release ID: 1789565) Visitor Counter : 194