ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దేశంలో ఒమిక్రాన్‌ రకంతో కోవిడ్‌ కేసుల పెరుగుదల నేపథ్యంలో సన్నద్ధతపై ప్రత్యేక దృష్టితో కోవిడ్‌-19 పరిస్థితిపై ప్రధానమంత్రి సమీక్ష

జిల్లాల స్థాయిలో తగిన ఆరోగ్య మౌలిక వసతులు ఉండేలా చూడాలి: ప్రధానమంత్రి;

యువజనులకు టీకా కార్యక్రమాన్ని ఉద్యమస్థాయిలో వేగిరపరచాలి: ప్రధానమంత్రి;

వైరస్ నిరంతర వృద్ధి నేపథ్యంలో జన్యుక్రమ నమోదుసహా పరీక్షలు.. టీకాలు.. ఔషధ ఆవిష్కరణలలో నిర్విరామ శాస్త్రీయ పరిశోధన అవసరం: ప్రధానమంత్రి;

మారుమూల.. గ్రామీణ ప్రాంతాల ప్రజారోగ్య సంబంధ మార్గనిర్దేశం కోసం కోవిడేతర ఆరోగ్య సేవలతోపాటు దూరవైద్య విధాన వినియోగం కొనసాగేలా చూడాలి: ప్రధానమంత్రి;

రాష్ట్ర-నిర్దిష్ట నేపథ్యాలు.. ఉత్తమాచరణలు.. ప్రజారోగ్య ప్రతిస్పందనపై
చర్చల దిశగా ముఖ్యమంత్రులతో సమావేశాలు నిర్వహించాలి: ప్రధానమంత్రి;

కోవిడ్-19పై మన పోరులో కీలకమైన కోవిడ్ నిర్దిష్ట ప్రవర్తనపై
ప్రధానంగా దృష్టిసారిస్తూ ప్రజా ఉద్యమం కొనసాగాలి: ప్రధానమంత్రి

Posted On: 09 JAN 2022 7:49PM by PIB Hyderabad

   దేశంలో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితిని అంచనా వేయడం కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ తన అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆరోగ్య మౌలిక సదుపాయాలు, వ్యూహాలు, ప్రస్తుత సన్నద్ధత, దేశంలో టీకాల కార్యక్రమం పురోగతి, కోవిడ్-19 కొత్తరకం ఒమిక్రాన్ వైరస్‌ వ్యాప్తి-ప్రజారోగ్యంపై దాని ప్రభావాలు తదితరాలపై ఆయన ఈ సందర్భంగా సమీక్షించారు. ప్రస్తుతం ప్రపంచమంతటా కేసుల నమోదులో పెరుగుదలను ఆరోగ్య శాఖ కార్యదర్శి వివరణాత్మకంగా ప్రదర్శించారు. అదేవిధంగా కేసుల పెరుగుదల, అత్యధిక వ్యాధి నిర్ధారణ ఫలితాలపై నివేదికల ప్రకారం దేశంలోని వివిధ రాష్ట్రాలు, జిల్లాల్లో కోవిడ్-19 స్థితిగతులను అధికారులు వివరించారు. అంతేకాకుండా భవిష్యత్‌ సవాళ్లను ఎదుర్కొనడంపై రాష్ట్రాలకు మద్దతు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా చేపట్టిన కృషిని కూడా విశదీకరించారు. అలాగే కేసుల ఉధృతికి సంబంధించిన అంచనాలను కూడా అందజేశారు.

   త్యవసర కోవిడ్‌ ప్రతిస్పందన ప్యాకేజీ (ఈసీఆర్‌పీ-2) కింద ఆయా రాష్ట్రాల్లో ఆరోగ్య మౌలిక సదుపాయాలు, పరీక్షల సామర్థ్యం, ఆక్సిజన్‌—సీయూ పడకల లభ్యత, కోవిడ్‌ అత్యవసర మందుల ముందస్తు నిల్వల తదితరాల పెంపునకు ఇస్తున్న మద్దతు గురించి  ప్రధానమంత్రికి అధికారులు వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ- జిల్లాల స్థాయిలో తగిన ఆరోగ్య మౌలిక సదుపాయాలు ఉండేలా చూడాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. దీనికి సంబంధించి రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూండాలని అధికారులను కోరారు. టీకాల కార్యక్రమంపై దేశంలో సాగుతున్న కృషి గురించి అధికారులు తమ వివరణలో ప్రముఖంగా దృష్టి సారించారు. గడచిన 7 రోజుల వ్యవధిలోనే దేశంలోని 15-18 ఏళ్ల యువజనంలో 31 శాతానికి తొలి మోతాదు టీకాలివ్వడం పూర్తయినట్లు తెలిపారు. అయితే, యువజనులకు టీకా కార్యక్రమాన్ని ఉద్యమ స్థాయిలో మరింత వేగిరపరచాల్సిందిగా ప్రధాని స్పష్టం చేశారు.

   మావేశంలో సమగ్ర చర్చ అనంతరం- కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఆవాస  సముదాయాల్లో ముమ్మర నియంత్రణ, పటిష్ట నిఘా కొనసాగించాలని గౌరవనీయ ప్రధానమంత్రి సూచించారు. అలాగే ప్రస్తుతం కేసులు అధికంగా నమోదయ్యే రాష్ట్రాలకు అవసరమైన సాంకేతిక సహాయం అందించాలని ఆదేశించారు. దీంతోపాటు వైరస్‌ వ్యాప్తి నిరోధానికి కొత్త జీవన విధానం రూపంలో మాస్కుల ప్రభావశీల వాడకం, భౌతిక దూరం పాటింపువంటి చర్యల అవసరాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. తేలికపాటి/లక్షణాలు లేని కేసుల విషయంలో ఏకాంత గృహవైద్యం పద్ధతిని సమర్థంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతయినా ఉందని ప్రధాని స్పష్టం చేశారు. దీంతోపాటు సమాజానికి వాస్తవ సమాచారం విస్తృత స్థాయిలో చేరేలా ప్రచారం చేయాలని సూచించారు. రాష్ట్ర-నిర్దిష్ట నేపథ్యాలు, ఉత్తమాచరణలు, ప్రజారోగ్య ప్రతిస్పందనపై చర్చల దిశగా ముఖ్యమంత్రులతో సమావేశాలు నిర్వహించాలని ప్రధాని చెప్పారు.

   ప్రస్తుత కోవిడ్ కేసులతో సమాంతరంగా కోవిడేతర ఆరోగ్య సేవలు కొనసాగేలా చూడాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. దీంతోపాటు మారుమూల, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సంబంధ మార్గనిర్దేశం కోసం దూరవైద్య విధాన వినియోగం కొనసాగేలా చూడాలని కూడా చెప్పారు. కోవిడ్-19 నిర్వహణలో ఇప్పటిదాకా ఆరోగ్య కార్యకర్తలు నిర్విరామ సేవలు అందిస్తుండటంపై ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలతోపాటు ముందువరుస సిబ్బంది కూడా ముందుజాగ్రత్త టీకాలివ్వడాన్ని ఉద్యమ తరహాలో విస్తరింపజేయాలని ఆయన సూచించారు. వైరస్ నిరంతర పరిణామం నేపథ్యంలో జన్యుక్రమ నమోదుసహా పరీక్షలు, టీకాలు, ఔషధపరమైన ఆవిష్కరణలకు సంబంధించి నిర్విరామ శాస్త్రీయ పరిశోధన కొనసాగాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

   సమీక్ష సమావేశంలో-కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, ఆ శాఖ సహాయమంత్రి శ్రీమతి భారతి ప్రవీణ్ పవార్, నీతి ఆయోగ్‌ (ఆరోగ్య విభాగం) సభ్యుడు డాక్టర్ వి.కె.పాల్, కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా, హోంశాఖ కార్యదర్శి శ్రీ ఎ.కె.భల్లా, కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ, (ఔషధవిభాగం) కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రాజేష్ గోఖలే, ‘ఐసీఎంఆర్‌’ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరామ్ భార్గవ, ‘ఎన్‌హెచ్‌ఏ’ సీఈవో ఆర్.ఎస్.శర్మలతోపాటు ఔషధ, పౌర విమానయాన, విదేశాంగ శాఖల కార్యదర్శులు ‘ఎన్‌డీఎంఏ'’సభ్యుడుసహా ఇతర సీనియర్‌ అధికారులు కూడా పాల్గొన్నారు.(Release ID: 1788852) Visitor Counter : 80