రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

17.78లక్షల ఎకరాల రక్షణ భూముల సర్వే!


అధునాతన టెక్నాలజీ సాయంతో
మూడేళ్లలోనే ముగిసిన ప్రక్రియ..

Posted On: 09 JAN 2022 10:23AM by PIB Hyderabad

  రక్షణ మంత్రిత్వ శాఖ తన యాజమాన్యంలో,.. 17.99లక్షల ఎకరాల సవిశాల విస్తర్ణంలో భూమి ఉంది. అందులో దాదాపుగా లక్షా 61వేల ఎకకరాల భూమి 62నోటిఫైడ్ కంటోన్మెంట్ ప్రాంతాల పరిధిలోనే ఉంది.  దాదాపు 16.38లక్షల ఎకరాల భూమి,. కంటోన్మెంట్ వెలుపల వివిధ ప్రాంతాల్లో ఉంది. 16.38లక్షల ఎకరాలకుగాను,  దాదాపు 18,000 ఎకరాల్లో కొంతభాగాన్ని, వివిధ రాష్ట్రాలు అద్దెకు తీసుకున్నాయి. మిగిలిన భాగంలో కొంత భూమి, ప్రభుత్వంలోని ఇతర శాఖలకు బదిలీ జరగడంతో సదరు భూములను రికార్డులనుంచి తొలగించాల్సిన పరిస్థితి నెలకొని ఉంది.

  రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ భూములకు స్పష్టంగా సరిహద్దులను నిర్ధారించడం ప్రస్తుతం చాలా అవసరం. రక్షణ భూముల పరిరక్షణ,.. రక్షణ మంత్రిత్వ శాఖ యాజమాన్య టైటిల్ హక్కులకు భద్రత, భూమి రికార్డుల, భూమి మ్యాపుల నవీకరణ, భూ ఆక్రమణల నివారణ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని రక్షణ భూములకు సరిహద్దులను నిర్దేశించడం అవసరమైంది. ఇందుకోసం,..2018 అక్టోబరు నెలనుంచి రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిఫెన్స్ ఎస్టేట్స్ డైరెక్టరేట్ జనరల్ (డి.జి.డి.ఇ.) ఆధ్వర్యంలో రక్షణ భూములపై సర్వే ప్రారంభమైంది.

   దేశవ్యాప్తంగా వివిధ కంటోన్మెంట్ల పరిధిలోని లక్షా 61వేల ఎకరాల రక్షణ భూమి, కంటోన్మెంట్ వెలుపల ఉన్న 16.17లక్షల ఎకరాల రక్షణ భూమిపై, సర్వే ప్రక్రియ పూర్తయింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖ యాజమాన్యంలోని మొత్తం భూమిని తొలిసారి సర్వే చేయించడం ఎంతో గొప్ప కార్యక్రమంగా చెప్పవచ్చు. వివిధ రాష్ట్రాల రెవెన్యూ అధికారుల సహకారంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో ఈ సర్వేను పూర్తిచేయగలిగారు. సువిశాలమైన భూమి విస్తీర్ణం, ఈ భూమి, దేశవ్యాప్తంగా 4,900 ప్రాంతాల్లో విస్తరించి ఉండటం, అనేక చోట్ల దుర్గమ ప్రాంతాల్లో ఈ భూమి ఉండటం,..ఇలాంటి కారణాలవల్ల దేశంలోనే అతిపెద్ద భూమి సర్వేల్లో ఒకటిగా ఈ సర్వే ప్రక్రియ నిలిచింది.

  ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ (ఇ.టి.ఎస్.), డిఫరెన్షియల్ పొజిషనింగ్ సిస్టమ్ (డి.జి.పి.ఎస్.) వంటి అధునాతన సర్వే సాంకేతిక పరిజ్ఞాన వ్యవస్థలను ఈ భారీ సర్వే ప్రక్రియకోసం వినియోగించారు. సర్వేను మరింత వేగవంతం చేసేందుకు, సకాలంలో ఫలితాలు సాధించేందుకు డ్రోన్ చిత్రాలు, శాటిలైట్ చిత్రాల ప్రాతిపదికతో కూడిన పరిజ్ఞానాన్ని కూడా సానుకూలంగా వినియోగించుకున్నారు.

  రాజస్థాన్ రాష్ట్రంలో రక్షణ మంత్రిత్వ శాఖ యాజమాన్యంలోని లక్షలాది ఎకరాల భూమిని సర్వే చేసేందుకు డ్రోన్ చిత్రాలతో కూడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని తొలిసారిగా వినియోగించారు. భారతీయ సర్వేయర్ జనరల్ సహాయంతో మొత్తం విస్తీర్ణాన్ని కొన్ని వారాల వ్యవధిలోనే పూర్తి చేయడం విశేషం. ఇంతకు ముందు ఇలాంటి సర్వే చేయాలంటే కొన్ని సంవత్సరాలు పట్టేది.

  దీనికి తోడుగా, రక్షణ భూముల్లో కొన్ని ప్రాంతాలకు అంటే దాదాపు కొన్ని లక్షల ఎకరాల విస్తీర్ణంపై సర్వే కోసం తొలిసారిగా ఉపగ్రహ చిత్రాల ఆధారిత పరిజ్ఞానాన్ని  వినియోగించారు. కొండప్రాంతాల్లో నెలకొన్న భూములను మరింత మెరుగ్గా పరిశీలించేందుకు త్రీ డి. మాడలింగ్ మెలకువలు అనుసరించారు. ఇందుకోసం, డిజిటల్ ఎలివేషన్ మాడల్ (డి.ఇ.ఎం.)ను ఉపయోగించారు.  బాబా అణు పరిశోధనా కేంద్రం (బార్క్) సహాయ సహకారాలతో  ఈ మాడల్.ను  వినియోగించారు.

  గత ఆరునెలల వ్యవధిలోనే ఈ సర్వే ప్రక్రియ మరింత వేగంగా సాగింది. రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి క్రియాశీలక ప్రమేయంతో పాటుగా, అధునాతన సర్వే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం వల్ల ఇది సాధ్యమైంది. మొత్తం 17.7లక్షల ఎకరాల్లో 8.90లక్షల ఎకరాల సర్వే గత మూడు నెలల్లోనే పూర్తయిందంటే సర్వే ఎంత వేగవంతంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు.  రక్షణ శాఖ భూముల్లో ఆక్రమణలను తెలుసుకునేందుకు టైమ్ సిరీస్ శాటిలైట్ చిత్రాల ఆధారిత పరిజ్ఞాన వ్యవస్థను ఈ సర్వేలో చేపట్టారు. హైదరాబాద్.కు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ పరిధిలోని కొన్ని ప్రాంతాలనుంచి సేకరించిన రక్షణ భూముల చిత్రాలపై సర్వేకోసం తొలుత ప్రయోగాత్మక పరీక్షను నిర్వహించారు. సర్వేకి సంబంధించి డిఫెన్స్ ఎస్టేట్ డైరెక్టర్ జనరల్, రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు సత్వరం నిర్ణయం తీసుకునేందుకు వీలుగా జియో రెఫరెన్స్డ్ డిజిటీకరణ రూపంలోని ఫైల్స్.ను అందుబాటులో ఉంచారు. సర్వేలో రెవిన్యూ అధికారులకు ప్రమేయం కల్పించడం కూడా వివాదాల పరిష్కారానికి దోహదపడే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య వర్గాల మధ్య సరిహద్దు వివాదాలు పరిష్కారమై, వివిధ స్థాయిల్లో తలెత్తే చట్టపరమైన వివాదాలను పరిహరించుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది.  భూమి సర్వేకి సంబంధించిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే మెలకువల్లో  సాంకేతిక పరిజ్ఞాన సిబ్బందికి, డిఫెన్స్ ఎస్టేట్స్ సంస్థ అధికారులకు సామర్థ్యాల మెరుగుపరుస్తూ ఇచ్చిన తర్ఫీదు కారణంగానే ఇంతటి భారీ స్థాయి సర్వే ప్రక్రియ వేగంగా ముగిసింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ కేంద్రం, నేషనల్ ఇన్.స్టిట్యూట్ ఆఫ్ జియో ఇన్ఫర్మాటిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సంస్థల ప్రమేయంతో ఇంతటి వేగవంతంగా సర్వే సాధ్యమైంది.

   అధునాతన సర్వే మెలకువల్లో డిఫెన్స్ ఎస్టేట్స్ అధికారులకు సామర్థ్యాల నిర్మాణంకోసం జాతీయ డిఫెన్స్ ఎస్టేట్స్ మేనేజిమెంట్ సంస్థ (నిడెమ్)లో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ (సి.ఒ.ఇ.) ఆన్ ల్యాండ్ సర్వే అండ్ జి.ఐ.ఎస్. మ్యాపింగ్.ను ఏర్పాటు చేశారు. సర్వే ప్రక్రియపై వివిధ స్థాయిల్లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులకు సి.ఒ.ఇ. శిక్షణను అందిస్తుంది. అంతేకాక, భూ యాజమాన్య నిర్వహణ, పట్టణ ప్రణాళికల విషయంలో మెరుగైన మెలకువలకోసం స్లామ్/జి.ఐ.ఎస్. సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించడం తన లక్ష్యంగా సి.ఒ.ఇ. నిర్దేశించుకుంది. సి.ఒ.ఇ.ని  రక్షణమంత్రి గత నెలలోనే లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూమిసర్వేలో తన ప్రతిభా పాటవాలను మెరుగుపరుచుకోవాలని డిఫెన్స్ ఎస్టేట్స్ డైరెక్టర్ జనరల్.కు సూచించారు. దేశవ్యాప్తంగా దాదాపు 18లక్షల ఎకరాలమేర విస్తరించిన రక్షణశాఖ భూముల సర్వే కోసం ఇప్పటివరకూ మానవ ప్రమేయంపై మాత్రమే ఆధారపడ్జారు. అయితే, తాజా పరిస్థితులను పరిశీలించినపుడు డిజిటల్ సాంకేతక పరిజ్ఞాన వినియోగానికి ఉదాహణగా రక్షణ భూముల సర్వే ప్రక్రియ నిలిచిపోతుంది. కేంద్రప్రభుత్వం అనుసరించే డిజిటల్ ఇండియా కార్యక్రమం ఆశయాలకు అనుగుణంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి రక్షణ శాఖ భూముల సర్వేనే ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు.  స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత భూమి సర్వేపై ఇంతటి భారీ స్థాయి కరసత్తును చేపట్టడం,  ఆజాదీ కా అమృత్ మహోత్సవం సంబరాల్లో భాగంగా పరిగణించవచ్చు.

 

****



(Release ID: 1788777) Visitor Counter : 210