రైల్వే మంత్రిత్వ శాఖ

“మిషన్ జీవన్ రక్షా” పేరిట 601మందిని కాపాడిన ఆర్.పి.ఎఫ్.!


గత ఏడాది కాలంలో ఆర్.పి.ఎఫ్. సేవలు..
ఆక్సిజన్ రవాణా చేసే 522 ప్రత్యేక రైళ్లకు భద్రత...

మనుషుల అక్రమ రవాణాదార్లనుంచి
630మందికి రక్షణ..

రైలు ప్రయాణికులు పొరపాటున వదిలేసిన
రూ. 23కోట్ల విలువైన సామాన్లు
భద్రంగా తిరిగి వారికే అప్పగింత,
“ఆపరేషన్ అమానత్” కింద ఆర్.పి.ఎఫ్. సేవలు...


టికెట్ల అక్రమ విక్రయదార్లపై 4,100 కేసులు,
4,600మంది నిందితుల అరెస్టు...
రూ. 2.8కోట్ల రైల్వే టికెట్ల జప్తు...

ప్రధాన రైల్వే స్టేషన్లలో 244

“మేరీ సహేళీ” బృందాల ఏర్పాటు

Posted On: 06 JAN 2022 1:42PM by PIB Hyderabad

  రైలు ప్రయాణం భద్రంగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా సాగేందుకు వీలుగా రైల్వే రక్షణ దళం (ఆర్.పి.ఎఫ్.) సిబ్బంది 24 గంటలూ నిర్విరామంగా పనిచేస్తూ ఉంటారు. రైల్వేల ఆస్తులను, రైలు ప్రయాణికుల ప్రాంతాన్ని, ప్రయాణికులను సురక్షితంగా ఉంచే బాధ్యతను నిర్వర్తించేందుకు  వారు తమ విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. వినియోగదార్లకు సురక్షితమైన సరకు రవాణా సేవలందించేందుకు కూడా ఆర్.పి.ఎఫ్. సిబ్బంది సేవలు ఉపయోగపడుతున్నాయి. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విస్తరించిన రైల్వేల ఆస్తుల పరిరక్షణా బాధ్యతలను నిర్వహించడంలో ఆర్.పి.ఎఫ్. ఎంతో సమర్థవంతంగా పనిచేస్తోంది. ఇందుకోసం తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటుగా, రైల్వే ఆస్తులపై నేరాలను పసిగట్టేందుకు కూడా కృషి చేస్తోంది. అంతర్గత భద్రత, శాంతి భద్రతల నిర్వహణ, జాతీయ స్థాయి ఎన్నికలల్లో, రాష్ట్రాల ఎన్నికల్లో బందోబస్తు విధుల నిర్వహణ వంటి అంశాల్లో ఆర్.పి.ఎఫ్. ముఖ్యపాత్ర పోషిస్తోంది. తద్వారా జాతీయ భద్రతా రంగంలో కీలకమైన భూమికను నిర్వహించే భాగస్వామిగా ఆర్.పి.ఎఫ్. సేవలందిస్తోంది. 2021వ సంవత్సరంలో ఆర్.పి.ఎఫ్. సాధించిన పలు విజయాలను ఈ దిగువన చూడవచ్చు.

  • కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు
    • ద్రవరూప మెడికల్ ఆక్సిజన్ వాయువును రవాణా చేసే 522 ప్రత్యేక రైళ్లకు  ప్రాప్తి స్థానంనుంచి గమ్యస్థానం వరకూ ఆర్.పి.ఎఫ్. రక్షణ కల్పించింది. 
    • రైలుమార్గాల్లోని ప్రధాన స్టేషన్లలో కోవిడ్ సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. బాధితులకు, అవసరమైన వారికి తగిన తక్షణ సహాయం అందించేందుకు వీలుగా తగిన సమాచారాన్ని, వనరులను అందించడమే లక్ష్యంగా ఈ సహాయక కేంద్రాలు పనిచేశాయి.
    • కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు నిర్దేశించిన నిబంధలను అమలుకు ఆర్.పి.ఎఫ్. తగిన చర్యలు తీసుకుంది. మాస్కుల ధారణ, శానిజైజేషన్, భౌతిక దూరాన్ని పాటించడం వంటి నిబంధనల విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంది.
    • 2021లో తమ విధి నిర్వహణ నిమగ్నమై ఉన్న సమయంలో కోవిడ్ వైరస్ సోకి, 26మంది ఆర్.పి.ఎఫ్. సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు 
  • విలువైన ప్రాణాలకు రక్షణ కల్పించడం

 2021వ సంవత్సరంలో తమ విధులకు అతీతంగా పనిచేసిన ఆర్.పి.ఎఫ్. సిబ్బంది తమ భద్రతను కూడా పట్టించుకోకుండా 601మంది ప్రాణాలను రక్షించగలిగారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, జాతీయ రాజధాని ప్రాంతం పరిధిలోని భర్వారీ రైల్వే స్టేషన్ వద్ద ఈ ఏడాది మార్చి 3వ తేదీన ఆత్మహత్యకు ప్రయత్నించిన ఒక మహిళను రక్షించే క్రమంలో జ్ఞాన్ చంద్ అనే హెడ్ కానిస్టేబుల్  ఎంతో  ధైర్యసాహసాలను ప్రదర్శించినా, తన ప్రాణాన్ని కూడా త్యాగం చేశారు. “జీవన్ రక్షా పథకం” పథకం కింద ఆర్.పి.ఎఫ్. సిబ్బంది, పలువురి ప్రాణాలను రక్షిస్తూ వచ్చింది. పలు రైల్వే స్టేషన్ల వద్ద రైలుచక్రాల కింద పడి ప్రాణాలు పోగొట్టుకోకుండా గత నాలుగేళ్లలో  1,650మందిని ఆర్.పి.ఎఫ్. సిబ్బంది రక్షించారు. గత నాలుగేళ్లలో పలువురి ప్రాణాల రక్షణలో ఆర్.పి.ఎఫ్. సిబ్బంది చేసిన కృషికి గుర్తింపుగా వారికి 9 జీవన్ రక్షా పతకాలను, ఒక ధైర్యసాహస పురస్కారాన్ని  గౌరవ రాష్ట్రపతి ప్రదానం చేశారు.

  • మహిళా భద్రత

దూర ప్రయాణం రైళ్లలోని ప్రయాణించే మహిళలకు, ప్రత్యేకించి ఒంటరిగా ప్రయాణించే వారికి తగిన రక్షణ కల్పించేందుకు “మేరీ సహేళీ” పేరిట ఒక పథకాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో “మేరీ సహేళీ” బృందాలను ఆర్.పి.ఎఫ్. ఏర్పాటు చేసింది. మేరీ సహేళీ కార్యక్రమం ఏ మేరకు ప్రభావం చూపిందో మధింపుచేసుకుని, కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా అమలుచేసేందుకు వీలుగా, రైళ్లలోని మహిళా ప్రయాణికులనుంచి సమాచారాన్ని ఆర్.పి.ఎఫ్. సేకరిస్తోంది. మహిళా ప్రయాణికుల భద్రత లక్ష్యంగా, ఇతర ముందు జాగ్రత్త చర్యలు కూడా ఆర్.పి.ఎఫ్. తీసుకుంటోంది. వారికి రక్షణగా నిలవడం, 840 స్టేషన్లలో, దాదాపు 4,000 రైల్వే బోగీల్లో సి.సి.టి.వి. వ్యవస్థలను ఏర్పాటు చేయడం, మహిళల ప్రత్యేక సబర్బన్ రైళ్లలో మహిళా ఎస్కార్ట్ సిబ్బందిని నియమించడం, మహిళా బోగీల్లో అక్రమంగా ప్రయాణించే వారిని పసిగట్టేందుకు అవసరమైన ప్రత్యేక చర్యలు తీసుకోవడం తదితర సేవలను కూడా ఆర్.పి.ఎఫ్. అందిస్తోంది.

  • మనుషుల అక్రమ రవాణా

 రైళ్ల ద్వారా జరిగే మనుషుల అక్రమ రవాణాను అరికట్టడంలో ఆర్.పి.ఎఫ్. తక్షణం స్పందిస్తూ వస్తోంది.  సమస్యను అరికట్టడంలో కీలకపాత్ర వహిస్తోంది. 2021వ సంవత్సరంలో మానవ అక్రమ రవాణాదార్లనుంచి 630మందిని ఆర్.పి.ఎఫ్. రక్షించింది. ఇలా ఆర్.పి.ఎఫ్. ద్వారా రక్షణ పొందినవారిలో 54మంది మహిళలు, 94మంది మైనర్ బాలికలు, 401మంది మైనర్ బాలురు ఉన్నారు.

  • చిన్నారుల రక్షణ

అనేక కారణాల రీత్యా తమ తమ కుటుంబాలనుంచి తప్పి పోయిన, వేరుపడిన చిన్నారులను తిరిగి వారి కుటుంబాల చేరువకు చేర్చడంలో ఆర్.పి.ఎఫ్. ఎంతో కీలకపాత్ర పోషిస్తూ వస్తోంది. ఇప్పటివరకూ రైల్వే శాఖను సహాయంకోసం సంప్రదించిన పలు సందర్భాల్లో 11,900మంది చిన్నారులకు ఆర్.పి.ఎఫ్. రక్షణ కల్పించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 132 బాలల రక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఎంపిక చేసిన కొన్ని ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలతో కలసి ఆర్.పి.ఎఫ్. ఈ కేంద్రాల ద్వారా ఆర్.పి.ఎఫ్. సేవలందిస్తోంది.

  • ప్రయాణికులపై నేరాలకు పాల్పడిన వారిపై చర్యలు

 పోలీసులతో రక్షణ కల్పించడం ఆయా రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల బాధ్యత. రైల్వేల్లోని ప్రభుత్వ రైల్వే పోలీసు (జి.ఆర్.పి.), జిల్లాల పోలీసు యంత్రాగాల ద్వారా వారు ఈ బాధ్యతను నిర్వర్తిస్తారు. రైలు ప్రయాణికులపై నేరాలను పసిగట్టేందుకు, అరికట్టేందుకు పోలీసులు చేసే కృషికి ఆర్.పి.ఎఫ్. సిబ్బంది కూడా  తగిన సహకారం అందిస్తారు. 2021లో రైలు ప్రయాణికులపై వివిధ నేరాలకు పాల్పడిన ఆరోపణలపై 3వేల మందికిపైగా నిందితులను ఆర్.పి.ఎఫ్. అరెస్ట్ చేసింది.  అరెస్టయిన వారిని ప్రభుత్వ రైల్వే పోలీసులకు, సంబంధిత జిల్లాల పోలీసులకు అప్పగించింది.

  • రైల్వే ఆస్తులకు భద్రత, రక్షణ కల్పించడం

 రైల్వై ఆస్తులకు రక్షణ కల్పించాలని, రైల్వే ఆస్తులకు సంబంధించిన జరిగిన నేరాలపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించిన సూత్రాల మేరకు 2021వ సంవత్సరంలో ఆర్.పి.ఎఫ్. సిబ్బంది 8,744మందిని అరెస్ట్ చేసింది. చోరీకి గురైన రూ. 5.83కోట్ల రూపాయల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

  • అక్రమ విక్రయదార్లపై చర్యలు

కోవిడ్ వైరస్ మహమ్మారి వ్యాప్తి సమయంలో పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రయాణికుల రైళ్లను నడిపారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రోటోకాల్ పాటించేందుకు వీలుగా రైళ్లలో రద్దీని నియంత్రించేందుకు కేవలం ముందస్తుగా టికెట్టు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులను మాత్రమే ప్రయాణానికి అనుమతించారు. దీనితో అక్రమ విక్రయదార్లు రిజర్వేషన్ టెకెట్లను సంపాదించి, వాటిని అధిక ధరలకు అక్రమంగా విక్రయించే, అక్రమ వ్యాపారం నడిపేందుకు అవకాశం, ఆస్కారం ఏర్పడింది. ఈ నేరాన్ని అరికట్టేందుకు ఆర్.పి.ఎఫ్. ఎంతో చురుకుగా వ్యవహరించింది. వారిపై చర్యలకోసం గత సంవత్సరమంతా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేరాలకు సంబంధించి 4,100కు పైగా కేసులను నమోదు చేసి, 4,600మందికిపైగా నిందితులను అరెస్టు చేసింది. రూ. 2.8కోట్ల విలువైన ప్రయాణం టికెట్లను జప్తు చేసింది.

  • మాదక ద్రవ్యాల రవాణాపై చర్యలు

 మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధక చట్టం (2019) మేరకు దఖలు పడిన అధికారాలతో ఆర్.పి.ఎఫ్. పలు చర్యలు తీసుకుంది. 2021లో రైళ్ల ద్వారా అక్రమంగా రవాణా అవుతున్న సుమారు రూ. 15.7కోట్ల మేర విలువైన మాదక ద్రవ్యాలను, మత్తు పదార్థాలను ఆర్.పి.ఎఫ్. సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.  ఇలా మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్న ఆరోపణలపై 620మందిని నిర్బంధంలోకి తీసుకున్నారు.

  • వన్యప్రాణుల అక్రమ రవాణాదార్లపై (స్మగ్లర్లపై) చర్యలు

 వన్యప్రాణులను, వన్యప్రాణుల అవయవాలను రవాణా చేయడం చట్టప్రకారం నేరం. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. వన్యజీవులను అక్రమ రవాణాతో ప్రమేయం ఉన్నవారిపై ఆర్.పి.ఎఫ్. కఠిన చర్యలు తీసుకుంది. 2021వ సంవత్సరంలో అనేక పక్షులు, పాములు, తాబేళ్లు, నెమళ్లు, పాకే జంతుజాతి, తదితర వన్యజీవులను స్మగ్లర్లనుంచి ఆర్.పి.ఎఫ్. సిబ్బంది స్వాధీనం చేసుకుంది. వాటితోపాటు పలు అటవీ ఉత్పత్తులను, ఎర్రచందనాన్ని, ఇతర వన్య సంపదను కూడా స్వాధీనం చేసుకున్నారు.

  • వయోజనులకు, మహిళలకు, వికలాంగులకు ప్రయాణాన్ని సౌకర్యవంతం చేయడం

 నిస్సహాయులైన ప్రయాణికులకు, ప్రత్యేకించి వయో వృద్ధులకు, అస్వస్థులకు, గర్భిణులకు, అంగవైకల్యం కలిగిన వారికి, మహిళా ప్రయాణికులకు ఆర్.పి.ఎఫ్. ఎప్పటికప్పుడు సహాయం అందిస్తూనే ఉంది.  ఈ విషయంలో మానవతా దృక్పథంతో పనిచేస్తూ వస్తోంది. వారు సురక్షితంగా ప్రయాణం సాగించేందుకు వీలుగా 2021లో పలు చర్యలు తీసుకుంది. మహిళలకోసం కేటాయించిన బోగీల్లో అక్రమంగా ప్రయాణిస్తున్న 25,000మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. అంకవికలులకు మాత్రమే కేటాయించిన బోగీలనుంచి 9,307మందిని కూడా అదుపులోకి తీసుకుంది.

  • అత్యవసర స్పందన

రైల్వేలు నిర్వహణలో 24 గంటలూ నిర్విరామంగా పనిచేసే టోల్ ఫ్రీ హెల్ప్.లైన్ ద్వారా, అలాగే ట్విట్టర్ మాధ్యమం ద్వారా సహాయం కోసం ప్రయాణికులు చేసిన 80లక్షలకు పైగా కాల్స్.కు, ఫిర్యాదులకు సత్వర స్పందన లభించింది. అందిన ఫిర్యాదులన్నింటినీ అత్యవరస ప్రాతిపదికన వెంటనే పరిష్కరించారు.

  • సామాన్ల అప్పగింత

 రైలు ప్రయాణంలో ప్రయాణికులు పొరపాటున వదిలేసి వెళ్లిన సామగ్రిని తిరిగి వారికి అందజేయడంలో ఆర్.పి.ఎఫ్. చక్కని సేవలందించింది.  2021వ సంత్సరంలో రూ. 23కోట్లకు పైగా విలువైన 12,377మంది ప్రయాణికులకు చెందిన సామగ్రిని ఆర్.పి.ఎఫ్. సిబ్బంది కనిపెట్టి వెరిఫికేషన్ అనంతరం తిరిగి వారికే అప్పగించింది. “ఆపరేషన్ అమానత్” పేరిట చేపట్టిన కార్యక్రమం కింద ఆర్.పి.ఎఫ్. ఇలాంటి సేవలను అందిస్తూ వస్తోంది.

 

****



(Release ID: 1788158) Visitor Counter : 185