రక్షణ మంత్రిత్వ శాఖ
చండీగఢ్ యూనివర్సిటీలో కల్పనా చావ్లా సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్పేస్ సైన్స్ & టెక్నాలజీని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు
–అంతరిక్ష రంగాన్ని బలోపేతం చేసే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగని పేర్కొన్నారు.
–భారతదేశాన్ని నాలెడ్జ్ ఎకానమీగా మార్చేందుకు దీర్ఘకాలిక ప్రభుత్వ-–ప్రైవేట్ భాగస్వామ్యం రావాలని రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.
–సమగ్ర అభివృద్ధికి భవిష్యత్ సాంకేతికతల అభివృద్ధి తప్పనిసరని స్పష్టం చేశారు.
Posted On:
03 JAN 2022 2:01PM by PIB Hyderabad
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జనవరి 03, 2022న చండీగఢ్ యూనివర్సిటీలో కల్పనా చావ్లా సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్పేస్ సైన్స్ & టెక్నాలజీ (కేసీసీఆర్ఎస్ఎస్టీ)ని ప్రారంభించారు. త్రివిధ సేవలకు చెందిన డిఫెన్స్ పర్సనల్ వార్డుల కోసం రూ. 10 కోట్ల విలువైన స్కాలర్‌షిప్ పథకాన్ని కూడా ప్రారంభించారు. రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా తన ప్రసంగంలో పలు అంశాలను స్పృశించారు. పరిశోధనా కేంద్రం స్థాపనను దేశంలోని అంతరిక్ష రంగాన్ని బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన దశగా అభివర్ణించారు, ఈ ప్రయత్నాల ద్వారానే భారతదేశం భవిష్యత్ సాంకేతికతలలో అగ్రగామిగా మారగలదని స్పష్టం చేశారు. కేసీసీఆర్ఎస్ఎస్టీని 'ప్రైడ్ ఆఫ్ ఇండియా కల్పనా చావ్లా’ అని వ్యాఖ్యానించారు. మన దేశానికి సార్వత్రిక గుర్తింపును తెచ్చిన దివంగత భారతీయ వ్యోమగామి సాధించిన అద్భుతమైన విజయాల మాదిరిగానే, ఈ పరిశోధనా సదుపాయం ఎన్నో కొత్త విజయ శిఖరాలను తాకాలని ఆకాంక్షించారు. “నక్షత్రాలను, గ్రహాలను చేరుకోవాలనే తపన ఉన్నప్పుడే 21వ శతాబ్దంలో భారతదేశ భవిష్యత్తు సురక్షితంగా మారుతుంది. మీ కళ్లు వివిధ గ్రహాలను, రాశులను గమనిస్తే మీరు కూడా ఆర్యభట్ట, విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్ కల్పనా చావ్లా వంటి వ్యోమగాముల మాదిరిగా ఎదుగుతారు ”అని రక్షణ మంత్రి ఈ సందర్భంగా అక్కడున్న విద్యార్థులతో అన్నారు. ఈకాలంలో అంతరిక్ష రంగానికి చాలా ప్రాధాన్యం ఉందని స్పష్టం చేసిన రాజ్‌నాథ్ సింగ్ దీంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. వెదర్ మ్యాపింగ్, ఇమేజింగ్ కనెక్టివిటీ సదుపాయాలు, వేగవంతమైన రవాణా, వాతావరణ సూచన, విపత్తు నిర్వహణతో పాటు సరిహద్దు భద్రత విషయంలో అంతరిక్షరంగం పాత్ర కీలకమని అన్నారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రపంచాన్ని అనుసంధానించడం, ల్యాబ్ల నుండి డేటా- బదిలీ & విశ్లేషణల వరకు ఎన్నో ప్రయోజనాలు కలిగాయని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారని అన్నారు. ఆయన పేర్కొన్న నాలుగు మూల స్తంభాల గురించి ప్రస్తావించారు. ఇవి: ప్రైవేట్ రంగానికి ఆవిష్కరణ స్వేచ్ఛ; ప్రభుత్వ పాత్ర పెరగడం; భవిష్యత్తు కోసం యువతను సిద్ధం చేయడం, అంతరిక్ష రంగాన్ని పురోగతికి వనరుగా చూడటం.. అని వివరించారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అంతరిక్ష రంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయని, దేశ పురోగతికి కొత్త దిశను ఇస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
విద్య & సైన్స్ రంగాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి భారతదేశాన్ని నాలెడ్జ్ ఎకానమీగా మార్చడానికి క్రియాశీల దీర్ఘకాలిక ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం అవసరమని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. "నేడు ప్రైవేట్ రంగం అన్ని రంగాల్లో పెద్ద సంఖ్యలో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నది. అది రక్షణ లేదా అంతరిక్షం అయినా, మేం ప్రైవేట్ రంగాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం”అని ఆయన అన్నారు. దేశం సమగ్ర అభివృద్ధికి ప్రైవేట్ రంగాన్ని బలోపేతం చేయడం ముఖ్యమని, ఇందుకు ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని పునరుద్ఘాటించారు.
ప్రైవేట్ రంగం సత్తాను వెలికితీసే లక్ష్యంతో తీసుకున్న కొన్ని చర్యలను మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరిస్తూ, ప్రభుత్వం సాంకేతికత & నైపుణ్యాన్ని పంచుకుంటుందని, పరిశ్రమ కోసం దాని వివిధ సౌకర్యాలను తీసుకువస్తున్నదని చెప్పారు. మెచ్యూర్డ్ టెక్నాలజీల బదిలీ ప్రతిపాదన పరిశీలనలో ఉందని తెలిపారు. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) ఏర్పాటుపై మాట్లాడుతూ, ఒక స్వతంత్ర ఏజెన్సీ అంతరిక్ష రంగానికి సంబంధించిన విషయాల కోసం సింగిల్ విండో ఏజెన్సీగా పనిచేస్తుందని చెప్పారు. ప్రతి రంగం ద్వారా స్పేస్ ఆధారిత అప్లికేషన్ల వినియోగాన్ని ప్రోత్సహించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని రక్షణ మంత్రి తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం జియో ట్యాగింగ్‌ను ఉపయోగించడం, ఉపగ్రహ చిత్రాల ద్వారా మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పర్యవేక్షించడం, రైతులకు పంటలు, పొలాలకు సంబంధించిన సమస్యలను గుర్తించడం వంటి అనేక విధాలుగా ఇవి ప్రభుత్వానికి సహాయపడుతున్నట్లు ఆయన తెలిపారు. దేశ సమగ్ర అభివృద్ధికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్-డేటా, బ్లాక్-చెయిన్ వంటి భవిష్యత్ సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. అంతరిక్ష సాంకేతికతలో పురోగతి దేశంలోని యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని, భారతదేశం సరిహద్దు టెక్నాలజీలతో ముందుకు సాగుతుందని ఆయన వివరించారు.
గత కొన్నేళ్లుగా చండీగఢ్ విశ్వవిద్యాలయం పరిశోధన & ఆవిష్కరణలలో విజయవంతమైన రికార్డులను నెలకొల్పినందుకు రక్షణమంత్రి ప్రశంసించారు. విద్యారంగంలో ప్రయివేటు భాగస్వామ్యానికి ప్రతీకగా యూనివర్సిటీ సాధించిన విజయాలను వివరించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) దశాబ్దాల తరబడి కృషి వల్ల ప్రపంచంలోని అత్యుత్తమ అంతరిక్ష సంస్థల్లో ఒకటిగా నిలిచిందని ఆయన ప్రశంసించారు. భారతదేశంలో జన్మించిన దివంగత వ్యోమగామి కల్పనా చావ్లాను స్మరించుకుంటూ, రాజ్‌నాథ్ సింగ్ ఆమెను మహిళా సాధికారతకు చిహ్నంగా అభివర్ణించారు. ఊహకు అందని రీతిలో ఆమె ప్రయాణించారు. అన్ని రంగాలలో మహిళల భాగస్వామ్యం పెరగాలనే ప్రభుత్వ దార్శనికతను ప్రతిధ్వనిస్తూ, ఆమె స్ఫూర్తిని & ఉత్సాహాన్ని కొనసాగించాలని, వారి కుమార్తెలను ముందుకు సాగేలా ప్రోత్సహించాలని ప్రజలను కోరారు. అంతరిక్ష శాస్త్రంలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, ఉపగ్రహ అభివృద్ధి, అంతరిక్ష పరిశోధనలో భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడం వంటి లక్ష్యంతో అత్యాధునిక కేసీసీఆర్ఎస్ఎస్టీని చండీగఢ్ విశ్వవిద్యాలయంలో స్థాపించారు. ఇది యూనివర్సిటీ స్టూడెంట్ శాటిలైట్కు (సీయూశాట్) గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌గా ఉంటుంది. ఇక్కడే ఒక నానో శాటిలైట్ను అంతర్గతంగా అభివృద్ధి చేశారు. ఇతర ప్రాజెక్టులతో పాటు పరిశోధనల కోసం జియో-స్పేషియల్ సెంటర్ను ప్రారంభించారు. 2022లో భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అంతరిక్షంలోకి పంపించే 75 విద్యార్థి -నిర్మిత ఉపగ్రహాలలో సీయూశాట్ కూడా ఒకటి. ఫలితంగా చండీగఢ్ విశ్వవిద్యాలయం.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్, ఐఐటీ బాంబే వంటి 13 సంస్థల జాబితాలో చేరింది. ఉత్తర భారతదేశంలో సొంతంగా ఉపగ్రహాన్ని రూపొందించి అభివృద్ధి చేసిన మొదటి విశ్వవిద్యాలయం కూడా ఇదే. ఈ ప్రాజెక్ట్ కోసం, యూనివర్సిటీకి చెందిన 75 మంది విద్యార్థులు ప్రముఖ భారతీయ శాస్త్రవేత్తల మార్గదర్శకత్వంలో చండీగఢ్ యూనివర్సిటీ స్టూడెంట్ శాటిలైట్ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నారు. సీయూశాట్ ప్రయోగంతో, అంతరిక్షంలో తన స్వంత ఉపగ్రహాన్ని కలిగి ఉన్న భారతదేశంలోని మొదటి సరిహద్దు రాష్ట్రంగా పంజాబ్ అవతరిస్తుంది. విశ్వవిద్యాలయానికి చెందిన నానోశాటిలైట్ – సీయూశాట్ ప్రయోగం దేశానికి ఒక ముఖ్యమైన దశ. ఎందుకంటే ఇది సరిహద్దు చొరబాట్లను గుర్తించడం, వ్యవసాయం, వాతావరణ అంచనా, ప్రకృతి వైపరీత్యాల అంచనాలకు సంబంధించిన డేటాను సేకరిస్తుంది. ఈ ప్రాంతాల్లోని వివిధ సమస్యలపై పరిశోధనలు అధ్యయనానికి ఉపయోగపడుతుంది. అంతేగాక జీసీఎస్ ఉపగ్రహ పరిశోధన సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి, ఉపగ్రహ సాంకేతికతను అభివృద్ధి చేయని దేశాలలో ఉపగ్రహాలను ప్రయోగించడానికి సహాయపడుతుంది. కేసీసీఆర్ఎస్ఎస్టీ ప్రారంభోత్సవంలో చండీగఢ్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ ఎస్. సత్నామ్ సింగ్ సంధు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
***
(Release ID: 1787829)
Visitor Counter : 217