వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

400 బిలియన్ల అమెరికన్ డాలర్లు!


2021-22లో ఇది వాణిజ్య ఎగుమతుల లక్ష్యం..

గత నెలవరకూ 66శాతం లక్ష్యం పూర్తి..
2021 ఏప్రిల్-నవంబరు కాలంలో

263 బిలియన్ డాలర్ల ఎగుమతులు,..
గత ఏడాది ఇదేకాలంలో ఎగుమతులకంటే
ఏకంగా 51శాతం ఎక్కువ..

భారత్, మారిషస్ మధ్య కుదిరిన
సమగ్ర ఆర్థిక సహకార భాగస్వామ్య ఒప్పందం..

సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందంపై
ఆస్ట్రేలియాతో తుదిదశలో చర్చలు..,
త్వరలోనే మధ్యంతర ఒప్పందం.


దుబాయి వరల్డ్ ఎక్స్.పోలో
భారీ ఆకర్షణగా ఇండియా పెవిలియన్..

జి.ఇ.ఎం. పోర్టల్.లో దాదాపు 32లక్షల విక్రేతలకు చోటు..


ఖరారు దశలో జాతీయ లాజిస్టిక్స్ విధానం..

Posted On: 30 DEC 2021 12:35PM by PIB Hyderabad

 2021వ సంవత్సరంలో కేంద్ర వాణిజ్య శాఖకు సంబంధించిన ప్రధాన అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

 1. 2021-22వ సంవత్సరానికి ఎగుమతి లక్ష్యం 400బిలియన్ల అమెరికన్ డాలర్లు

ఎ. 200 దేశాలకు 400 బిలయన్ అమెరికన్ డాలర్ల లక్ష్యం, 30 సత్వర అంచనా సరుకుల సమూహాలు..ఎగుమతులపై కేంద్ర వాణిజ్య శాఖ 2021-22వ సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యం ఇది. భారతదేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాల్లో వాణిజ్యపరంగా గతంలో నెలకొన్న ధోరణి, ప్రస్తుత పరిస్థితి, విధానాన్ని అమలులు చేసే పద్ధతులు తదుతర అంశాలను ప్రాతిపదిగా చేసుకుని ఈ లక్ష్యాన్ని నిర్ణయించారు. భారతదేశపు వర్తకంలో 2021 నవంబరు నెలవరకూ ఎగుమతుల లక్ష్యం  65.89శాతం దాకా నెరవేరింది.

బి.  లక్ష్యాల సాధన తీరుపై నెలవారీ పర్యవేక్షణకోసం ఎగుమతుల పర్యవేక్షణ డెస్క్.ను ఏర్పాటు చేశారు. విదేశీ వాణిజ్య వ్యవహారాల డైరెక్టరేట్ జనరల్ (డి.జి.ఎఫ్.టి.) పరిధిలోని గణాంక విభాగం ఆధ్వర్యంలో ఈ డెస్క్ ఏర్పాటైంది. వివిధ దేశాల వారీగా, ప్రాంతం వారీగా, పథకం వారీగా, ఉత్పాదనలవారీగా, సరుకుల సమూహం ప్రాతిపదికగా, ఎగుమతి పోత్సాహక మండలుల వారీగా ఈ పర్యవేక్షణను సునిశితంగా నిర్వహించారు.

సి. 400 అమెరికన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం సాధనకు, “ప్రపంచ స్థాయికి స్థానికం – ప్రపంచం కోసం భారతదేశంలో తయారీ” అనే అంశంపై ప్రధానమంత్రి 2021, ఆగస్టు 6వ తేదీన ప్రసంగించారు. వివిధ దేశాల రాయబారులు/ హై కమిషనర్లు/ వాణిజ్య సంస్థలు, అమలు చేసే మంత్రిత్వ శాఖల ప్రతినిధులు/ శాఖలు, రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు, ఎగుమతి ప్రోత్సాహక మండలలులు, సరుకుల బోర్డులు/ అధికారులు, పారిశ్రామిక ప్రతినిధులు/వాణిజ్య సంఘాల ప్రతినిధులు తదితరులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.  

 1. ఎగుమతుల తీరు

వాణిజ్యం

 ఎ. భారతీయ ఎగుమతులు గత 8 నెలల్లో ఎంతో బాగా కొనసాగుతూ వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక     సంవత్సరంలో వరుసగా 8వ నెలలో ఎగుమతులు 30 బిలియన్ల అమెరికన్ డాలర్లను అధిగమించాయి.

 బి.  2021 ఏప్రిల్-నవంబరు మధ్య కాలంలో జరిగిన ఎగుమతుల మొత్తం విలువ 263.57 అమెరికన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది ఏప్రిల్-నవంబరు మధ్యకాలంలో 174.16 అమెరికన్ డాలర్ల మేర ఎగుమతులు మాత్రమే నమోదయ్యాయి. దీనితో ఎగుమతుల్లో 51.34శాతం సానుకూల వృద్ధి చోటు చేసుకుంది. 2019వ సంవత్సరం ఏప్రిల్-నవంబరు మధ్య జరిగిన ఎగుమతులతో పోల్చినపుడు, 2021 ఏప్రిల్-నవంబరు మధ్యకాలంలో జరిగిన ఎగుమతుల్లో 24.82శాతంమేర సానుకూల వృద్ధి జరిగింది.

సేవలు

ఎ.  వైరస్ మహమ్మారి వ్యాప్తితో 2020వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా పలుచోట్ల వాణిజ్య సేవలు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ భారతదేశపు సేవల ఎగుమతులు మాత్రం పటిష్టంగానే కొనసాగాయి. ప్రపంచ వాణిజ్య సేవల్లో భారతదేశం వాటా 2019లో 3.5శాతం ఉండగా, 2020లో 4.1శాతానికి పెరిగింది. దీనితో వాణిజ్య సేవల్లో దేశీయ ఎగుమతుల ర్యాంకు మెరుగుపడింది. 2020వ సంవత్సరంలో వాణిజ్య సేవల ఎగుమతుల్లో భారతదేశం 8 ర్యాంకు నుంచి 7ర్యాంకుకు ఎదిగింది.

 1. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (ఎ.కె.ఎ.ఎం.)

ఎ. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా 2021వ సంవత్సరం సెప్టెంబరు 20నుంచి 26వరకూ కేంద్ర వాణిజ్యశాఖ ఆధ్వర్యంలో ‘వాణిజ్య సప్తాహం’ జరిగింది. అంతర్జాతీయ వాణిజ్య సానుకూల వ్యవస్థలో ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కోగల నాణ్యమైన ఉత్పత్తుల తయారీకి  సంబంధించి ప్రతి భాగస్వామ్య వర్గానికి భారతదేశం ఎలా సాధికారత కల్పిస్తుందో ప్రధానంగా తెలియజేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ అవసరాలకోసం భారతదేశంలో ఉత్పత్తుల తయారీ అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సప్తాహంలో భాగంగా వారం పొడవునా కార్యక్రమాలను నిర్వహించేందుకు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనా వ్యవస్థలు, దేశవ్యాప్తంగా ఎగుమతుల ప్రక్రియతో ప్రమేయం కలిగిన భాగస్వామ్య వర్గాల సహకారంతో కేంద్ర వాణిజ్య శాఖ ఈ కార్యక్రమాలను నిర్వహించింది.

బి. వాణిజ్య సప్తాహం పేరిట నిర్వహించిన వారం రోజుల కార్యక్రమాల్లో వివిధ ఇతివృత్తాలతో పలు లక్ష్యాలతో అనేక కార్యక్రమాలు నిర్వహించారు.  (1) మరింత స్వావలంబన (2) భారతదేశం సామర్థ్యాల ప్రదర్శన: ఎదుగుతున్న ఆర్థిక శక్తి (3) హరిత, స్వచ్ఛ ప్రత్యేక ఆర్థిక మండలులు (ఎస్.ఇ.జెడ్.లు) (4) వాణిజ్య ఉత్సవ్ (5) పొలాలనుంచి విదేశీ భూముల వరకు, అంటూ వివిధ ఇతివృత్తాలను, లక్ష్యాలను ప్రతిఫలింపజేస్తూ వాణిజ్య సప్తాహం నిర్వహించారు. వాణ్యత విషయంలో ప్రపంచ స్థాయి పోటిని తట్టుకోగలిగిన ప్రపంచ వాణిజ్య రంగం లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతదేశంలో తయారీ పథకం లక్ష్యసాధన తప్పనిసరిగా సాధించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఈ వాణిజ్య కార్యక్రమాలను నిర్వహించారు. వాణిజ్య రంగంలో ప్రధానమైన భాగస్వామ్య వర్గాలు (ఎగుమతిదార్లు) మాత్రమే కాక, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనా సంస్థల ప్రతినిధులు, ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు, పారిశ్రామిక, వాణిజ్య, ఉత్పత్తిదార్ల ప్రతినిధులు, తోటపని సిబ్బంది, సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థల (ఎం.ఎస్.ఎం.ఇ.ల) ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో విస్తృత స్థాయిలో పాల్గొన్నారు. దేశవ్యాప్త ప్రాతిపదికన 700 జిల్లాల్లో గుర్తించిన భాగస్వామ్య వర్గాల వారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఐదు అంశాలకు సంబంధించి నిర్వహించిన అన్ని కార్యక్రమాలు విజయవంతమయ్యాయి.

 1. సులభతర వాణిజ్య నిర్వహణ

ఎ. వైరస్ మహమ్మారి వ్యాప్తి సమయంలో వాణిజ్యానికి సంబంధించి విధాన స్థిరత్వం కోసం, 2015-20 విదేశీ వాణిజ్య విధానం గడువును 2021-22 వరకూ పొడిగించారు. అంటే, 2022 మార్చి నెలాఖరు వరకూ గడువును పొడిగించారు.

బి. అడ్వాన్స్ ఆథరైజేషన్ ఇ.పి.సి.జి, ఇ.ఒ.యు పథకం కింద సమీకృత వస్తు సేవల పన్ను, నష్టపరిహార సుంకం వంటి వాటినుంచి మినహాయింపు సదుపాయాన్ని 2022 మార్చి నెలాఖరువరకూ పొడిగించారు.

సి. విదేశీ వాణిజ్య వ్యవహారాల డైరెక్టరేట్ జనరల్ (డి.జి.ఎఫ్.టి.) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐ.టి.) వ్యవస్థను సంపూర్ణంగా పునర్వ్యస్థీకరించారు. ఎగుమతుల ప్రోత్సాహ పథకాలకు సంబంధించిన సందేశాలను భాగస్వామ్య వర్గాలు పరస్పరం పంచుకునే సదుపాయం కల్పిస్తూ డి.జి.ఎఫ్.టి.కి సంబంధించిన ఐ.టి. వ్యవస్థను తీర్చిదిద్దారు.

డి. ప్రాధాన్యతా రహిత అంశాలపై సర్టిఫికెట్లను కూడా జారీ చేసేందుకు వీలుగా ఉమ్మడి ఇ.సి.ఒ.ఒ (eCoO) పోర్టల్.ను విస్తరింపజేశారు.

ఇ. విదేశీ వాణిజ్య విధానం, దిగుమతి, ఎగుమతి విధానం, ఎగుమతి, దిగుమతి గణాంకాలు, దరఖాస్తులపై నిర్విరామంగా సమాచారం, 24 గంటలు సహాయం అందించే వ్యవస్థ తదితర అంశాలపై తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు డి.జి.ఎఫ్.టి. ట్రేడ్ ఫెసిలిటేషన్ యాప్.లో అందుబాటులో ఉంచారు.  కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రి 2021, ఏప్రిల్ 12వ తేదీన ఈ యాప్.ను ప్రారంభించారు.

డి. ప్రత్యేకించిన కొన్ని ముందస్తు అధీకృత అంశాలు, ఇ.పి.సి.జి. అంశాల వ్యవస్థను 2021 డిసెంబరు నెలాఖరు వరకూ పొడిగించారు.

 

 1. ఎగుమతి ఉత్పాదనలకు సంబంధించి,.. పన్నులు, సుంకాల తగ్గింపు పథకం (ఆర్.ఒ.డి.టి.ఇ.పి.) అమలు

 ఎ. ఎగుమతి సరుకులు, ఉత్పాదనలకు సంబంధించిన పన్నులు, సుంకాల ఉపశమన పథకం (ఆర్.ఒ.డి.టి.ఇ.పి.) నోటిఫికేషన్.ను 2021 జనవరి 1న ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక స్థాయిల్లో ఎలాంటి వ్యవస్ధ ప్రాతిపదికలోనూ వాపసు చెల్లింపు జరగని పన్నులను, సుంకాలను, లెవీలను రీఇంబర్స్ చేయడంకోసం ఈ పథకాన్ని రూపొందించారు. ఎగుమతి వస్తువులపై వాటి తయారీ, పంపిణీ ప్రక్రియలో విధింపబడిన సుంకాలను తిరిగి చెల్లించే ఏర్పాటు లక్ష్యంగా ఈ పథకం రూపుదిద్దుకుంది. విద్యుత్ సుంకం, రవాణా, పంపిణీ రంగాల్లో వినియోగించే ఇంధనాలపై వ్యాట్ సుంకాలు ఈ పన్నుల్లో ప్రధానం భాగంగా ఉంటున్నాయి.

బి. ఆర్.ఒ.డి.టి.ఇ.పి. పథకం అనేది దాదాపు 8,555 హెచ్.ఎస్. లైన్లకు వర్తిస్తుంది. ఇందుకు సంబంధించి పన్నుల, సుంకాల ఉపశమనం 0.01శాతంనుంచి 4.3శాతం వరకూ ఉంటుంది.

సి.  ఆర్.ఒ.డి.టి.ఇ.పి. పథకం పూర్తిగా డిజిటైజేషన్ సదుపాయంతో పనిచేస్తుంది. ఈ పథకం కింద ప్రయోజనాలు పొందడానికి విడిగా దరఖాస్తును నింపాల్సిన అవసరం లేదు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ సుంకాల బోర్డు (సి.బి.
ఐ.సి.) ఈ పథకాన్ని అమలు చేస్తోంది. సి.బి.ఐ.సి.కి చెందిన ఐస్.గేట్ (
ICEGATE) ఆన్ లైన్ మాడ్యూల్ ఇందుకోసమే ఏర్పాటు చేశారు. ఈ పథకం కింద ఎగుమతిదారులు ఇ.స్క్రిప్స్.ను ఉపయోగించుకోవడం ఇప్పటికే ప్రారంభమైంది.

 1. భారతదేశంనుంచి సేవల ఎగుమతి పథకం (ఎస్.ఇ.ఐ.ఎస్.)- 2019-20 సంవత్సరపు నోటిఫికేషన్

ఎ. 2019-20వ ఆర్థిక సంవత్సరపు సేవల ఎగుమతిపై ఎస్.ఇ.ఐ.ఎస్. పథకాన్ని వివరిస్తూ 2021 సెప్టెంబరు 23న నోటిఫికేషన్ వెలువడింది.  ఈ పథకానికి అర్హమైన సంస్థల జాబితాను, వివిధ రకాల రేట్లను ఈ నోటిఫికేషన్ లో ప్రస్తావించారు.

 1. సమగ్ర ఆర్థిక సహకార, భాగస్వామ్య ఒప్పందం (సి.ఇ.సి.పి.ఎ.)- భారత్, మారిషస్ సంతకాలు

ఎ. సమగ్ర ఆర్థిక, సహకార, భాగస్వామ్య ఒప్పందం (సి.ఇ.సి.పి.ఎ.)పై భారత్, మారిషస్ 2021 ఫిబ్రవరి 22వ తేదీన సంతకాలు చేశాయి. 2021 ఏప్రిల్ 1నుంచి ఈ ఒప్పందం అమలులోకి వచ్చింది.  

బి. ఆఫ్రికా ఖండంలోని ఒక దేశంతో భారతదేశం కుదుర్చుకున్న తొలి వాణిజ్య ఒప్పందం ఇదే. సరుకుల వాణిజ్యం, ప్రారంభ స్థితిలో నిబంధనలు, సేవల వాణిజ్యం, వాణిజ్యానికి సాంకేతిక అంతరాయాలు, పారిశుద్ధ్యం, చీడల నియంత్రణ చర్యలు, వివాదాల పరిష్కారం, సహజ వ్యక్తుల కదలిక, టెలికాం, ఆర్థిక సేవలు, కస్టమ్స్ విధానాలు, ఇతర రంగాల్లో సహకారం వంటి అంశాలకు ఈ ఒప్పందం వర్తిస్తుంది.

బి. భారతదేశం, మారిషస్ మధ్య వాణిజ్యం ప్రోత్సాహం, మెరుగుదల లక్ష్యంగా సంస్థాగత యంత్రాంగం ఏర్పాటు చేయడానికి ఉభయదేశాల మధ్య కుదిరిన సి.ఇ.సి.పి.ఎ. దోహదపడుతుంది. ఇండియాకు సంబంధించి 310 ఎగుమతి వస్తువులకు ఇది వర్తిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం స్థూలంగా 11 సేవా రంగాలకు చెందిన 115 ఉప రంగాలకు భారతీయ సేవా సంస్థలతో అనుసంధానం ఉంటుంది.

 

 

 1. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సి.ఇ.పి.ఎ.)-..  భారత్-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యు.ఎ.ఇ.) సంప్రదింపులు

ఎ. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సి.ఇ.పి.ఎ.)పై  భారత్-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యు.ఎ.ఇ.) మధ్య సంప్రదింపులు 2021 సెప్టెంబరు 22న ప్రారంభమయ్యాయి. యు.ఎ.ఇ. ప్రతినిధి బృందం భారతదేశంలో పర్యటించినపుడు ఈ చర్చలు మొదలయ్యాయి. ఇప్పటివరకూ రెండు దఫాల సంప్రదింపులు జరిగాయి. 2021 డిసెంబరు లోగా సంప్రదింపులు ముగించాలని, 2022 మార్చిలోగా ఒప్పందం కుదుర్చుకోవాలని ఉభయదేశాలు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి.

బి.  సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఎంతో ప్రాముఖ్యం కలిగిందని ఉభయదేశాలూ చర్చల సందర్భంగా పునరుద్ధాటించాయి. అలాగే, ఆర్థిక సంబంధాలు, పెట్టుబడి అవకాశాలను విస్తరింపజేయడంతోపాటుగా, పరస్పర సహకార ప్రక్రియలో కొత్త మలుపుగా ఈ ఒప్పందం నిలిచిపోగలదని అంగీకరించాయి.  వ్యూహాత్మకమైన ఈ ఆర్థిక ఒప్పందం కుదిరిన రోజునుంచి ఐదేళ్లలోగా వంద బిలియన్ల అమెరికన్ డాలర్ల విలువైన సరుకులపై ద్వైపాక్షిక వాణిజ్యం పెంపొందగలదని భావిస్తున్నారు. సేవల వాణిజ్యంలో 15 బిలియన్ అమెరికన్ డాలర్ల మేరకు వాణిజ్యం వృద్ధి చెందగలదని భావిస్తున్నారు.

 1. సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సి.ఇ.సి.ఎ.)పై భారత్-ఆస్ట్రేలియా చర్చలు

ఎ. భారత్-ఆస్ట్రేలియా మధ్య సి.ఇ.సి.ఎ. సంప్రదింపులు ప్రస్తుతం పురోమగమన దిశలో సాగుతున్నాయి. మధ్యంతర ఒప్పందంపై ఉభయదేశాలు త్వరలోనే చర్చలు పూర్తిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఆఖరు నాటికి తుది ఒప్పందం కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. సరుకులు, సేవల వాణిజ్యం, పెట్టుబడులు, ప్రారంభ నిబంధనలు, కస్టమ్స్ నిబంధనల సానుకూలత, న్యాయపరమైన, సంస్థాగతమైన సమస్యలు తదితర అంశాలపై కీలకంగా చర్చలు సాగుతున్నాయి.

 1. బ్రిక్స్ (బి.ఆర్.ఐ.సి.ఎస్.) వాణిజ్య ప్రదర్శన  2021-

 2021 ఆగస్టు 16-18 (వర్చువల్)

ఎ. ప్రపంచంలో కొత్త ఆర్థిక శక్తులుగా ఆవిర్భవిస్తున్న బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల కూటమిని బ్రిక్స్ కూటమిగా వ్యవహరిస్తారు. కేంద్ర వాణిజ్య శాఖ చొరవతో బ్రిక్స్ వాణిజ్య ప్రదర్శనను భారత్ ఆధ్వర్యంలో, వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. 2021 ఆగస్టు 16నుంచి 18వ తేదీవరకూ ఈ ప్రదర్శన జరిగింది.

బి.  బ్రిక్స్ వాణిజ్య ప్రదర్శన-2021లో 5,000మందికిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ వాణిజ్య సంస్థల మధ్య ముందుగానే నిర్ణయించినట్టుగా బిజినెస్ టు బిజినెస్ (బి.టు.బి.) సమావేశాలు 2,500వరకూ జరిగాయి. 8,000వరకూ వాణిజ్య ప్రతినిధులు వర్చువల్ పద్ధతిలో సందర్శనలు జరిపారు. దీనితో 2 వేలకు పైగా వాణిజ్య చర్చలు, సంప్రదింపులను నిర్వహించగలిగారు. 

 1. దుబాయిలో జరిగిన 2020 వరల్డ్ ఎక్స్.పోలో భారత్ పెవిలియన్

ఎ. దుబాయిలో వరల్డ్ ఎక్స్.పో 2020 పేరిట ప్రదర్శన  2021 అక్టోబరు 1న ప్రారంభమైంది. 2022 మార్చి నెలాఖరు వరకూ ఇది కొనసాగుతుంది. మీసా (మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, దక్షిణ ఆసియా) ప్రాంతంలో జరుగుతున్న తొలి ప్రదర్శన కూడా ఇదే.  దుబాయి వరల్డ్ ఎక్స్.పో లో ఏర్పాటు చేసిన భారత్ పెవిలియన్.ను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి 2021 అక్టోబరు 1న ప్రారంభించారు.

బి. "మనసులను కలపడం, భవితను నిర్మించడం" అనే ప్రధాన ఇతివృత్తంతో దుబాయి వరల్డ్ ఎక్స్.పో నిర్వహిస్తున్నారు. ప్రధాన ఇతివృత్తాన్ని,.. అవకాశం, చలనశీలత, సుస్థిరత అనే ఉప ఇతివృత్తాలుగా వర్గీకరించారు. కోవిడ్-19 వైరస్ మహమ్మారి సంక్షోభం అనంతరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం, స్థితిగతులను దుబాయ్ వరల్డ్ ఎక్స్.పో ఆవిష్కరిస్తుంది. 190కి పైగా దేశాలు ఈ ఎక్స్.పోలో పాల్గొనవచ్చని, 2.5కోట్లమంది ఈ ఎక్స్.పోను సందర్శించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

సి. దుబాయి ఎక్స్.పోలో భారత్ పెవిలియన్ భారీ స్థాయిలో సందర్శకులకు ఆకర్షణగా నిలిచింది. ఎక్స్.పోను, తొలి 83 రోజుల్లోనే ఆరు లక్షలమందికిపైగా సందర్శించారు.

 1. గవర్నమెంట్ ఈ-మార్కెట్ ప్లేస్ (GeM): బహిరంగ, పారదర్శక సేకరణ

ఎ. గవర్నమెంట్ ఈ-మార్కెట్ (GeM) వేదికపై మొత్తం 31.8లక్షలమేర విక్రయకేంద్రాలను పొందుపరిచారు.  వాటిలో 7.39 లక్షల కేంద్రాలు సూక్ష్మ చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎం.ఎస్.ఎం.ఇ.లకు) చెందినవి. అంటే మొత్తం కేంద్రాల్లో దాదాపు 23శాతం విక్రయ ప్రాంతాన్ని ఎం.ఎస్.ఎం.ఇ.లే ఆక్రమించాయి. అవి జి.ఇ.ఎం. నిర్వహించే వాణిజ్యంలో ఏకంగా 57శాతం విలువైన వర్తకాన్ని నిర్వహిస్తున్నాయి.

బి. జి.ఇ.ఎం. అనే ఆన్.లైన్ మార్కెట్ వేదిక చాలా ప్రయోజనాలను సమకూర్చింది. కొనుగోలుదారులు వేచి ఉండే సమయాన్ని, ధరలను భాగా తగ్గించింది. విక్రయదార్లకు సకాలంలో చెల్లింపులు జరిగేలా అవకాశం కల్పించింది. సార్వత్రిక ఆర్థిక నిబంధనల్లో పేర్కొన్నట్టుగా వివిధ రకాల పద్ధతుల్లో ఉత్పత్తుల సేకరణకు వీలు కల్పించింది. సేకరణ జరిపే ముందుగా కొనుగోలుదార్లు సరైన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా పలు విశ్లేషణాత్మక ఉపకరణాలను జి.ఇ.ఎం. అందుబాటులోకి తెచ్చింది.

సి. ప్రభుత్వ దార్శనికతకు, ఆలోచనలకు అనుగుణంగా దేశంకోసం సమైక్య సేకరణా వ్యవస్థను జి.ఇ.ఎం. సృష్టించింది. రక్షణశాఖ పబ్లిక్ ప్రొక్యూర్.మెంట్ పోర్టల్, సెంట్రల్ పబ్లిక్ ప్రొక్యూర్.మెంట్ పోర్టల్.ను, సబ్ పోర్టల్స్.ను. తన పరిధిలోకి తీసుకురావడం ద్వారా జి.ఇ.ఎం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఒకే యూజర్ అనుభవంతో ఆన్.లైన్ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఈ చర్య తీసుకున్నారు. విడివిడిగా, విసిరేసినట్టుగా ఉన్న వివిధ పోర్టల్స్.లో ఉండే విక్రేతల వ్యవస్థను ఒక్కటిగా సమీకృతం చేసి జి.ఇ.ఎం. పోర్టల్.పైకి తీసుకువచ్చేందుకు ఈ సమైక్య సేకరణ వ్యవస్థ దోహదపడుతుంది. దీనితో ఉత్పత్తులకు మెరుగైన ధర, సేకరణలో ఉత్తమ విధానం వంటి వాటిని ఎంపిక చేసుకోవడానికి ఇది వీలు కలుగుతుంది.

డి. సమ్మిళిత పద్ధతిని ప్రోత్సహించేందుకు,.. ఎం.ఎస్.ఎం.ఇ.లు, స్వయం సహాయ బృందాలు (ఎస్.హెచ్.జి.లు), గిరిజన హస్తకళాకారులు, హస్తకళా నిపుణులు, స్టార్టప్ కంపెనీలను పోర్టల్.లో పొందుపరిచేందుకు జి.ఇ.ఎం. పలు చర్యలు తీసుకుంది. ఇందుకోసం ఎం.ఎస్.ఎం.ఇ. వ్యవహారాల మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలతో ముందస్తుగా సంప్రదింపులు జరిపింది. స్టార్టప్ రన్.వే, సరస్ కలెక్షన్, ట్రైబ్స్ ఇండియా ఇ స్టోర్, మార్గాల ద్వారా వివిధ రకాల విక్రేతలను పోర్టల్.లో  పొందుపరిచేందుకు జి.ఇ.ఎం. చర్యలు తీసుకుంది. అలాగే, హస్తకళాకారులు, చేనేత కార్మికులు, వెదురు వస్తువుల కళాకారులు వంటి వారికి కూడా చోటు కల్పించేందుకు చర్యలు తీసుకుంది.

 1. ప్రగతి మైదాన్ మరోసారి అభివృద్ధి

ఐ.ఇ.సి.సి. ప్రాజెక్టు

ఎ. చారిత్రాత్మకమైన ప్రగతి మైదాన్.ను, ప్రపంచ శ్రేణి ఎగ్జిబిషన్, సమావేశ కేంద్రం (ఐ.ఇ.సి.సి.)గా రెండు దశల్లో తీర్చిదిద్దుతున్నారు. (రెండవ దశ పనులను కొన్నేళ్ల తర్వాత చేపడతారు). ఐ.ఇ.సి.సి. ప్రాజెక్టు తొలిదశ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.  2022 జూన్ నాటికల్లా ఈ ప్రాజెక్టులోని అన్ని విభాగాల పనులూ పూర్తవుతాయి. ఐ.ఇ.సి.సి. ప్రాజెక్టులో భాగంగా, ప్రగతి మైదాన్.లో కొత్త ఎగ్జిబిషన్ సముదాయాన్ని (2,3,4,5 హాళ్ళను) 2021 అక్టోబరు 13న ప్రధానమంత్రి ప్రారంభించారు. పి.ఎం. గతిశక్తి పథకం ప్రారంభోత్సవం నేపథ్యంలోనే వీటిని కూడా ప్రారంభించారు.

 1. నేషనల్ లాజిస్టిక్స్ విధానం

ఎ. డిమాండ్, సరఫరా రంగాల్లో తీసుకోవలసిన చర్యలపై అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపిన అనంతరం జాతీయ లాజిస్టిక్స్ విధానానికి రూపకల్పన జరిగింది.  ఆయా రంగాలను ప్రత్యేక దృష్టితో నిశితంగా పరిశీలించేందుకు, లాజిస్టిక్స్ సామర్థ్యంలో ప్రపంచ శ్రేణి ప్రమాణాలకు తగినట్టుగా సదుపాయాలను మెరుగుపరిచేందుకు,  ప్రపంచ స్థాయి సరఫరా వ్యవస్థలతో సమీకృతం చేసేందుకు ఈ విధానాన్ని రూపొందించారు.

బి. విధానానికి సంబంధించి చర్యలు తీసుకోదగిన అంశాలతో 75 సూత్రాల జాతీయ లాజిస్టిక్స్ సంస్కరణల కార్యాచరణ ప్రణాళికను తయారుచేశారు.

సి. సవరించిన విధానం ఆమోదంకోసం తుదిదశలో ఉంది. లాజిస్టిక్ వ్యయాన్ని వచ్చే ఐదేళ్లలో దాదాపు 5శాతం తగ్గించడం, 25 అగ్రశ్రేణి ప్రపంచ లాజిస్టిక్ సూచికలకు దీటుగా దేశం తగిన ర్యాంకును సాధించడం, పర్యావరణ హితం, సుస్థిరమైన, సమ్మిళత భవిష్యత్తుకు సరితూగే లాజిస్టిక్ పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యాలుగా నిర్దేశించుకుంటూ ఈ విధానాన్ని రూపొందించారు.  

 1. పి.ఎం. గతిశక్తి జాతీయ బహత్ ప్రణాళిక (ఎన్.ఎం.పి.)

ఎ. దేశంలోని ఆర్థిక మండలాలను, బహుముఖ నమూనాలతో మౌలిక సదుపాయాల అనుసంధానాన్ని కలిపి,.. పి.ఎ. గతిశక్తి జాతీయ బృహత్ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్)ను చేపడుతున్నారు. భౌగోళిక సమాచార వ్యవస్థ (జి.ఐ.ఎస్.) వేదికపై ఈ ప్రణాళికను చేపడతారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల ప్రమేయంతో జాతీయ ప్రాతిపదికపై సంపూర్ణంగా సమీకృతం చేసే ఈ పథకాన్ని 2021 అక్టోబరులో ప్రారంభించారు. ప్రతి రంగంలో అభివృద్ధి పనులకు ఊతమిచ్చేలా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐ.టి.) ఆధారిత రేఖా చిత్రాల సమన్వయంతో వివిద ప్రాజెక్టుల ప్రణాళిక, నిర్వహణ, పర్యవేక్షణను చేపడతారు.

బి. ఈ మాస్టర్ ప్లాన్.కు సంబంధించి కార్యదర్శుల సాధికార బృందాన్ని, నెట్వర్క్ ప్రణాళికా బృందాన్ని కూడా  ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ బృందాల తొలి సమావేశాలు కూడా జరిగాయి. సాంకేతిక పరిజ్ఞాన సహాయ యూనిట్.ను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. భాస్కరాచార్య నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ మరియు జియోఇన్ఫర్మేటిక్స్ (బి.ఐ.ఎస్.ఎ.జి-ఎన్) ద్వారా శిక్షణా శిబిరాలు పూర్తయ్యాయి. పి.ఎం. గతిశక్తి జాతీయ మాస్టర్ ప్రణాళికలో రాష్ట్రాలను పొందుపరిచేందుకు సంబంధించిన జోనల్ సదస్సులు ఈ ఏడాది నంవంబరు నెలనుంచి సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి వరకూ జరుగుతాయి.

సి. జి.ఐ.ఎస్. వేదికపై బి.ఐ.ఎస్.ఎ.జి.-ఎన్ సంస్థ రూపొందిస్తున్న జాతీయ మాస్టర్ ప్లాన్ త్వరలో పూర్తయిపోతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి మాస్టర్ ప్లాన్.ను ప్రారంభిస్తారు.

డి. ప్రపంచ బ్యాంకు ప్రతి రెండేళ్లకు వెలువరించే లాజిస్టిక్స్ ఫెర్మామ్మెన్స్  ఇండెక్స్ (ఎల్.పి.ఐ.)ను వివిధ దేశాల లాజిస్టిక్స్ పనితీరును మధింపు చేసేందుకు విస్తృతంగా వినియోగిస్తారు. ఈ సూచికపై 2018లో 160 దేశాల్లో భారతదేశం 44వ ర్యాంకులో ఉంది. 2014లో ఇదే సూచికపై భారతదేశం ర్యాంకు 54గా నమోదైంది. (అయితే, 2018లో నమోదైన అధ్యయనమే ఇప్పటికి తాజా సమాచారం అవుతుంది).

 1. ఎగుమతి పథకం కోసం వాణిజ్య మౌలిక సదుపాయాలు (టి.ఐ.ఇ.ఎస్.)

ఎ. ఎగుమతిలో పోటీ తత్వాన్ని పెంపొందించే ధేయంతో ఎగుమతి పథకం వాణిజ్య మౌలిక సదుపాయాలను (టి.ఐ.ఇ.ఎస్.ను) 2017-18 నుంచి కేంద్ర వాణిజ్య శాఖ అమలుచేస్తూ వస్తోంది. ఎగుమతితో అనుసంధానించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తారు. బహువిధాల ఎగుమతిదార్లు వినియోగించుకునేందుకు వీలుగా ఈ మౌలిక సదుపాయాలకు రూపకల్పన చేస్తారు. ఈ పథకం గడువును మరో ఐదేళ్లపాటు, అంటే 2021-22నుంచి 2025-26 వరకూ, రూ. 360కోట్ల బడ్జెట్ కేటాయింపుతో పొడిగించారు. 2021-22 సంవత్సరపు బడ్దెట్ అంచనాల్లో ఈ పథకానికి రూ. 75కోట్లు కేటాయించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు 8వరకూ మొత్తం రూ. 113కోట్ల వ్యయంతో కొత్త ప్రాజెక్టులకు సాధికార కమిటీ ఆమోదం తెలిపింది.

 1. వ్యవసాయ ఎగుమతి విధానం (ఎ.ఇ.పి.)

ఎ. ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం కలసి ఆయా రాష్ట్రాల వ్యవసాయ ఎగుమతుల కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసుకున్నాయి. మిజోరాం, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవులు తమ ప్రణాళికలను ఖరారు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యవసాయ ఎగుమతుల కార్యాచరణ ప్రణాళికను కాలబద్ధమైన రీతిలో ఖరారు చేసుకునేందుకు అవి ఈ చర్య తీసుకున్నాయి. ప్రణాళిక ఖరారుకోసం విజ్ఞప్తి చేసిన సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపుల అనంతరం ఈ విధానాన్ని ఖరారు చేసుకున్నారు. మిగిలిన రాష్ట్రాల కార్యాచరణ ప్రణాళికలు త్వరలోనే ఆమోదం పొందనున్నాయి.

బి. రైతు సహకార సంఘాలతో ఎగుమతి ప్రక్రియ అనుసంధానాన్ని పటిష్టం చేసేందుకు వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహార ఉత్పాదనల ఎగుమతి అభివృద్ధి ప్రాధికార సంస్థ (అపెడా),.. జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్)తో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

సి. అమెజాన్ వెబ్ సర్వీసుల (ఎ.డబ్ల్యు.ఎస్.) బృందంతో పలుసార్లు జరిగిన చర్చల ప్రాతపదికగా, రెండు ప్రయోగాత్మక పథకాలకు ఆమోదం లభించింది. మామిడి పండ్ల (ఆల్.ఫాన్సో) భౌగోళిక గుర్తింపునకు  బ్లాక్ చైన్ ట్రేసబిలిటీకి, అపెడా ప్యాక్ హౌసెస్ డిజిటస్ నిర్ధారణకు సంబంధించిన ప్రతిపాదనలపై ఈ ప్రయోగాత్మక పథకాలకు ఆమోదం లభించింది.

డి. గ్రేప్.నెట్.లో బ్లాక్.చైన్ టెక్నాలజీ: గ్రేప్.నెట్ ట్రేసబిలిటీ వ్యవస్థలో భాగంగా, బ్లాక్ చైన్ పరిష్కార ప్రక్రియను అపెడా అమలు చేసింది. కేటాయింపునుంచి బట్వాడా దశ వరకూ ద్రాక్షపైరు జీవిత చక్రంలోని అన్ని కార్యకలాపాలను గురించి తెలుసుకునేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ దోహదపడింది.

 1. ఒడిశాలో కాఫీ అభివృద్ధి కార్యక్రమం

ఎ. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో గిరిజనుల ద్వారా కాఫీ పంటను, నల్లమిరియాల సాగును ప్రోత్సహించేందుకు ఒడిశా ప్రభుత్వంతో కలసి కాఫీ బోర్డు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒడిశా ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయంతో అమలుచేసేలా ఈ కార్యక్రమాన్ని  నాలుగేళ్ల గడువుతో రూపొందించారు. ఇందుకు రూ. 16.46కోట్ల బడ్జెట్.ను కేటాయించారు. మొత్తం 2,000హెక్టార్ల విస్తీర్ణంలో కాఫీ, నల్లమిరియాల సాగు, దాదాపు 4,100మంది గిరిజన రైతుల కృషితో కొనసాగుతోంది.

 1. రబ్బరు గణాంకాలు

ఎ. దేశవ్యాప్తంగా రబ్బరు గణాంకాలపై లెక్కలు వేసే ప్రక్రియను రబ్బరు బోర్డు చేపడుతోంది. ‘రుబాక్ (RUBAC)’ అన్న మొబైల్ యూప్ వినియోగంతో లెక్కింపు చేపడుతున్నారు. కేరళలోని డిజిటల్ యూనివర్సిటీ సహకారంతో ఈ మొబైల్ యాప్ రూపొందింది. రబ్బురు పంట సాగు విస్తీర్ణం, కొత్తగా రబ్బరు నాట్లు పడిన విస్తీర్ణం, తిరిగి నాట్లువేసిన ప్రాంతం, రబ్బురు చెట్ల వయస్సు వివరాలు, ఏళ్లతరబడి వదలివేసిన ప్రాంతం, కొత్త వంగడాల పరిమాణం, రబ్బురు సేకరించే వారి వివరాలు తదితర అంశాలతో ఈ గణాంకాలను నిర్వహిస్తున్నారు. కేరళలోని కొట్టాయం జిల్లాలో రబ్బరు చెట్లపై క్షేత్రస్థాయి ఎన్యూమరేషన్ కూడా ప్రారంభమైంది.

 1. ఈశాన్య ప్రాంతంలో ఆత్మా మద్దతుతో రబ్బరు నాట్ల అభివృద్ధి సహకార పథకం

ఎ. దేశం ఈశాన్య ప్రాంతంలో కొత్తగా రబ్బరు నాట్ల కార్యక్రమాన్ని, రబ్బరు ఫాంల నాణ్యత మెరుగుదల ప్రాజెక్టును ఒకేసారి అమలు చేయనున్నారు. ప్రధాన టైర్ల తయారీ కంపెనీలనుంచి రూ. 1,100కోట్ల సమీకరణతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆటోమోటివ్ టైర్ల తయారీదార్ల సంఘం (ఆత్మా-ఎ.టి.ఎం.ఎ.)గా ప్రాతినిధ్యం వహించే టైర్ల కంపెనీలు ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి మార్గదర్శకత్వం, చొరవతో ఈ మేరకు అవగాహన కుదిరింది.

బి. ఐదేళ్ల వ్యవధిలో ఈశాన్య ప్రాంతంలోని 2,00,000 హెక్టార్ల విస్తీర్ణంలో రబ్బరు నాట్లు వేసి పంటను సాగుచేడయమే లక్ష్యంగా ప్రణాళికను రూపొందించారు. 2021 జూలైలో రబ్బరు నాట్లు ప్రారంభమయ్యాయి. 2021లో 5,000హెక్టార్ల విస్తీర్ణంలో రబ్బరు నాట్లు పడవచ్చని భావిస్తున్నారు.

 

****(Release ID: 1786439) Visitor Counter : 210