ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2021 డిసెంబర్ 26 వ తేదీ నాటి ‘ మన్ కీబాత్ ’ (‘ మనసు లో మాట ’) కార్యక్రమం 84 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 26 DEC 2021 11:24AM by PIB Hyderabad

ప్రియమైన నా దేశవాసులారా, నమస్కారం. ఈ సమయం లో మీరు 2021వ సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ 2022వ సంవత్సరానికి స్వాగతం పలకడానికి సిద్ధమవుతూ ఉంటారు. కొత్త సంవత్సరం లో ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ రాబోయే ఏడాది లో ఏదైనా మరింత మెరుగ్గా చేయాలని, ఉత్తమం గా మారాలని సంకల్పం తీసుకోవడం జరుగుతుంది. గత ఏడు సంవత్సరాలుగా మన ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం కూడా వ్యక్తి యొక్క, సమాజం యొక్క, దేశం యొక్క మంచితనాన్ని ఎత్తిచూపుతోంది. దాంతో పాటే మంచి చేయడానికి, మంచిగా మారడానికి స్ఫూర్తి ని ఇస్తోంది. ఈ ఏడేళ్లలో ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రభుత్వం సాధించిన విజయాల గురించి కూడా చర్చించగలిగాను. మీరు దీన్ని ఇష్టపడ్డారు. మెచ్చుకున్నారు. కానీ ప్రసార మాధ్యమాలకు దూరంగా, వార్తాపత్రికల ఆకర్షణలకు దూరంగా ఎంతో మంది మంచి ని చేస్తున్నారనేది దశాబ్దాల అనుభవం. దేశ భవిష్యత్తు కోసం వారు వారి నేటి కాలాన్ని వెచ్చిస్తున్నారు. వారు దేశంలోని రాబోయే తరాల కోసం తమ ప్రయత్నాలతో తీరిక లేకుండా ఉన్నారు. అలాంటి వ్యక్తుల చర్చ చాలా ఓదార్పును ఇస్తుంది. లోతైన స్ఫూర్తి ని ఇస్తుంది. నా విషయంలో ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం ఎప్పుడూ అటువంటి వారి కృషి తో నిండిన అందమైన ఉద్యానవనం. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో ప్రతి నెల నా ప్రయత్నం ఈ విషయం పైనే. ఆ తోట లోని ఏ పూవు యొక్క రేకు ను మీ కోసం తీసుకు రావాలా అని నేను ఆలోచిస్తాను. బహు రత్న వసుంధర గా పేర్కొనే భారతదేశ పుణ్యకార్యాల ఎడతెగని ప్రవాహం నిరంతరం ప్రవహిస్తూనే ఉన్నందుకు సంతోషిస్తున్నాను. దేశం అమృత మహోత్సవాన్ని జరుపుకొంటున్నప్పుడు ఈ మానవ శక్తి, ప్రజల శక్తి, ఆ శక్తి ప్రస్తావన, ప్రజల కృషి, భారతదేశం ప్రజలతో పాటు సమస్త మానవాళి ఉజ్జ్వల భవిష్యత్తు కోసం హామీ ని ఇస్తుంది.

 

సహచరులారా, ఇది జనశక్తి యొక్క బలం. భారతదేశం వందేళ్ల లో వచ్చిన అతి పెద్ద మహమ్మారి తో పోరాడగలగడం అందరి కృషి ఫలితం. ప్రతి కష్ట సమయంలో ఒక కుటుంబంలా ఒకరికొకరం అండగా నిలచాం. మీ ప్రాంతం లో లేదా నగరం లో ఎవరికైనా సహాయం చేయడానికి సాధ్యమయ్యే దాని కంటే ఎక్కువ చేయడానికి ప్రయత్నించారు. ఈ రోజు ప్రపంచంలో టీకామందు ను ఇప్పించడానికి సంబంధించినటువంటి గణాంకాల ను భారతదేశం తో పోల్చి చూస్తే దేశం అపూర్వమైన కార్యాన్ని చేసినట్లు అనిపిస్తుంది. ఇంత పెద్ద లక్ష్యాన్ని సాధించిందా అనిపిస్తుంది. 140 కోట్ల డోజు ల టీకామందు తాలూకు మైలురాయి ని అధిగమించడం భారతదేశం లో ప్రతి ఒక్కరి ఘనత అని చెప్పాలి. ఇది వ్యవస్థ పైన ప్రజల కు ఉన్నటువంటి నమ్మకానికి ఒక నిదర్శనంగా ఉంటుంది. విజ్ఞ‌ాన శాస్త్రం పై ఉన్న నమ్మకాన్ని చూపుతుంది. శాస్త్రవేత్తల పై ఉన్న నమ్మకాన్ని చూపుతుంది. సమాజం పట్ల మన బాధ్యతలను నెరవేర్చడంలో భారతీయులమైన మన సంకల్ప శక్తి కి సంకేతం. అయితే సహచరులారా, ఈ మహమ్మారి ని ఓడించడానికి పౌరులు గా మన స్వీయ ప్రయత్నం చాలా ముఖ్యం అని గత రెండేళ్లుగా మన అనుభవం చెప్తోంది. మన శాస్త్రవేత్త లు ఈ కొత్త రకం ఒమిక్రాన్ ను గురించి అదే పని గా అధ్యయనం చేస్తున్నారు. వారు నిత్యం కొత్త కొత్త విషయాలను సేకరిస్తున్నారు. ఆ సూచనల పై పని చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి లో కరోనా ఈ కొత్త రకానికి వ్యతిరేకం గా స్వీయ అప్రమత్తత ను, క్రమశిక్షణ ను పాటించడమనేవి దేశాని కి గొప్ప శక్తి గా ఉండగలవు. మన సామూహిక శక్తి కరోనా ను ఓడించగలుగుతుంది. ఈ బాధ్యత తో మనం 2022వ సంవత్సరం లోకి ప్రవేశించవలసి ఉన్నది.

 

ప్రియమైన నా దేశవాసులారా, మహాభారత యుద్ధ సమయంలో 'నభః స్పృశం దీప్తం' అని అర్జునుడి తో శ్రీకృష్ణుడు అన్నాడు. ఈ మాటల కు గర్వం తో ఆకాశాన్ని తాకడం అని భావం. భారతదేశం వాయు సేన ఆదర్శ వాక్యం కూడా ఇదే. భరత మాత సేవ లో నిమగ్నం అయిన అనేక జీవనాలు ప్రతి ఆకాశం లోని ఈ ఎత్తుల ను రోజూ గర్వం గా తాకుతున్నాయి. అవి మనకు చాలా నేర్పుతాయి. అలాంటి ఒక జీవనం గ్రూప్ కెప్టెన్ శ్రీ వరుణ్ సింహ్ ది. తమిళ నాడు లో ఈ నెల ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ లో శ్రీ వరుణ్ సింహ్ ప్రయాణిస్తున్నాడు. ఆ ప్రమాదం లో దేశం ఒకటో సిడిఎస్ జనరల్ శ్రీ బిపిన్ రావత్, ఆయన భార్య తో సహా అనేక మంది ధైర్యవంతుల ను మనం కోల్పోయాం. శ్రీ వరుణ్ సింహ్ కూడా మృత్యువు తో చాలా రోజులు ధైర్యంగా పోరాడారు. కానీ ఆయన కూడా మనల్ని వదలి వెళ్లిపోయారు. శ్రీ వరుణ్ సింహ్ ఆసుపత్రి లో ఉన్నప్పుడు సామాజిక మాధ్యమాల లో నా మనసు కు హత్తుకొనే విషయం ఒకటి గమనించాను. ఈ ఏడాది ఆగస్టు లో ఆయన కు శౌర్యచక్ర ను ప్రదానం చేయడం జరిగింది. ఈ సన్మానం తరువాత ఆయన తాను చదువుకున్న పాఠశాల ప్రిన్సిపల్‌ కు ఒక లేఖ ను రాశారు. ఈ ఉత్తరాన్ని చదివాక, నా మది లో మెదిలిన మొదటి ఆలోచన ఏమిటంటే విజయ శిఖరాల ను అధిరోహించినా ఆయన తన మూలాల ను మరచిపోలేదనేది. రెండోది - ఆయన తన విజయోత్సవాల ను జరుపుకోవడానికి సమయం ఉన్నప్పుడు రాబోయే తరాల కోసం ఆలోచించారు. తాను చదివిన పాఠశాల విద్యార్థుల జీవితం కూడా వేడుక గా మారాలన్నారు. తన లేఖ లో శ్రీ వరుణ్ సింహ్ తన పరాక్రమాన్ని వివరించలేదు కానీ తన వైఫల్యాల ను గురించి చెప్పారు. తన లోపాలను ఎలా సామర్థ్యాలుగా మార్చుకున్నారో చెప్పారు. ఈ లేఖ లో ఒక చోట ఆయన ఇలా రాశారు - “సాధారణ మనిషి గా ఉండటం మంచిది. ప్రతి ఒక్కరూ పాఠశాల లో రాణించలేరు. ప్రతి ఒక్కరూ 90కి మించి సాధించలేరు. మీరు సాధిస్తే అది అద్భుతమైన విజయం. తప్పక మెచ్చుకోవాలి. అయితే మీరు అలా సాధించకపోతే మీరు సాధారణ స్థాయి లో ఉన్నారని అనుకోకండి. మీరు పాఠశాల లో సాధారణం గా ఉండవచ్చు కానీ జీవితం లో రాబోయే విషయాల కు ఇది కొలమానం కాదు. మీకు ఆసక్తి ఉన్న రంగాన్ని కనుగొనండి. అది కళ కావచ్చు, సంగీతం కావచ్చు, గ్రాఫిక్ డిజైన్ కావచ్చు, సాహిత్యం మొదలైనవి కావచ్చు. మీరు దేనిలో పని చేసినప్పటికీ అంకిత భావం తో ఉండండి. మీ వైపు నుంచి అత్యుత్తమమైన దానిని చేయండి. మరింత గా కృషి చేయాల్సింది అని ఆలోచిస్తూ ఎన్నడూ పడక మీదకు చేరుకోవద్దు.’’

 

సహచరులారా, సాధారణ స్థాయి నుంచి అసాధారణం గా మారడానికి ఆయన ఇచ్చిన మంత్రం కూడా అంతే ముఖ్యమైంది. ఇదే లేఖ లో శ్రీ వరుణ్ సింహ్ ఇలా రాశారు- ‘‘నమ్మకాన్ని కోల్పోవద్దు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో దానిలో మీరు మంచిగా ఉండలేరని ఎప్పుడూ అనుకోకండి. ఇది సులభంగా రాదు. ఇది సమయం తీసుకుంటుంది. సౌకర్యాలను త్యాగం చేస్తుంది. నేను సామాన్యుడి ని. ఈ రోజు నా కెరీర్‌ లో కష్ట సాధ్యమైన మైలురాళ్లను చేరుకున్నాను. 12వ తరగతి మార్కులు మీ జీవిత లక్ష్యాలను నిర్ణయిస్తాయి అని అనుకోవద్దు. మిమ్మల్ని మీరు నమ్మండి. మరి ఆ దిశ లో పని చేయండి.’’

 

వరుణ్ గారు తాను ఒక్క విద్యార్థి ని ప్రేరేపించగలిగినా అది కూడా చాలా ఎక్కువ అవుతుంది అని రాశారు. అయితే, ఈ రోజు న నేను చెప్పాలనుకొంటున్నాను - ఆయన యావత్తు దేశాని కి స్ఫూర్తిని ఇచ్చారు. ఆయన తన లేఖ ద్వారా విద్యార్థులతో మాత్రమే మాట్లాడినప్పటికీ ఆయన మన మొత్తం సమాజానికి సందేశాన్ని ఇచ్చారు- అని.

 

సహచరులారా, ప్రతి సంవత్సరం నేను ఇటువంటి అంశాల ను గురించే విద్యార్థుల తో కలసి పరీక్షా పే చర్చా కార్యక్రమం లో పాలుపంచుకొని చర్చిస్తుంటాను. ఈ సంవత్సరం కూడా పరీక్షలకు ముందు విద్యార్థులతో చర్చించాలని ప్రణాళిక ను వేసుకొంటున్నాను. ఈ కార్యక్రమం కోసం రెండు రోజుల తరువాత డిసెంబర్ 28వ తేదీ నుంచి MyGov.in లో రిజిస్ట్రేశన్ కూడా మొదలవబోతోంది. ఈ రిజిస్ట్రేశన్ డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందుకోసం 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లితండ్రుల కోసం ఆన్‌లైన్‌ పోటీ ని సైతం నిర్వహించడం జరుగుతుంది. మీరంతా ఇందులో తప్పక భాగం పంచుకోవాలి అని నేను కోరుకొంటాను. మీతో భేటీ అయ్యే అవకాశం లభిస్తుంది. మనం అందరం కలసి పరీక్ష, ఉద్యోగజీవనం, సఫలత, ఇంకా విద్యార్థి జీవనంతో ముడిపడ్డ అనేక అంశాల పైన మేధోమథనం చేద్దాం.

 

ప్రియమైన నా దేశవాసులారా, ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో ఇప్పుడు నేను మీకు చాలా దూరం నుంచి, సరిహద్దులు దాటి వచ్చిన విషయాన్ని చెప్పబోతున్నాను. ఇది మిమ్మల్ని ఆనందపరుస్తుంది. ఆశ్చర్యపరుస్తుంది కూడాను:

 

(ఇన్ స్ట్రుమెంటల్ ప్లస్ గాత్రం #[వందే మాతరం])

వందే మాతరమ్.. వందే మాతరమ్

సుజలాం సుఫలాం మలయజ శీతలాం

సస్య శ్యామలాం మాతరం.. వందే మాతరమ్

శుభ్ర జ్యోత్స్నా పులకిత యామినీమ్

ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్

సుహాసినీం సుమధుర భాషిణీమ్

సుఖదాం వరదాం మాతరమ్

వందేమాతరం.. వందేమాతరం.

 

దీనిని మీరు విని చాలా బాగా అనిపించి ఉంటుందని, గర్వం గా భావించారని నాకు పూర్తి నమ్మకం ఉంది. వందే మాతరమ్ లో ఇమిడిపోయి ఉన్న భావం మనలో గర్వాన్ని, ఉత్సాహాన్ని నింపివేస్తుంది.

 

సహచరులారా, ఈ అందమైన వీడియో ఎక్కడిది?, ఏ దేశం నుండి వచ్చింది? అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. సమాధానం మీ ఆశ్చర్యాన్ని మరింత పెంచుతుంది. వందే మాతరమ్ ను అందించిన ఈ విద్యార్థులు గ్రీస్‌ కు చెందిన వారు. అక్కడ వారు ఇలియా లోని ఉన్నత పాఠశాల లో చదువుకొంటున్నారు. వారు ఎంతో అందం గా, భావోద్వేగంతో ‘వందే మాతరమ్’ ను ఆలాపించిన తీరు అద్భుతం గా, ప్రశంసనీయం గా ఉంది. ఇటువంటి ప్రయత్నాలు రెండు దేశాల ప్రజలను మరింత సన్నిహితం చేస్తాయి. నేను ఈ గ్రీస్ విద్యార్థులను, వారి ఉపాధ్యాయులను అభినందిస్తున్నాను. స్వాతంత్ర్య అమృత మహోత్సవం కాలం లో వారు చేసినటువంటి ప్రయాస ను నేను అభినందిస్తున్నాను.

 

సహచరులారా, నేను లఖ్ నవూ నివాసి నీలేశ్ గారి ఒక పోస్టు ను గురించి కూడా చర్చించాలి అని తలుస్తున్నాను. నీలేశ్ గారు లఖ్ నవూ లో జరిగిన ఒక ప్రత్యేకమైన డ్రోన్ ప్రదర్శన ను ఎంతగానో ప్రశంసించారు. ఈ డ్రోన్ శో ను లఖ్ నవూ లోని రెసిడెన్సీ ప్రాంతం లో నిర్వహించడం జరిగింది. 1857వ సంవత్సరం కన్నా పూర్వం స్వాతంత్ర్యం తాలూకు ఒకటో పోరాటాని కి సాక్ష్యం, రెసిడెన్సీ తాలూకు గోడల పైన ఈనాటికీ కనిపిస్తుంటుంది. రెసిడెన్సీ లో జరిగిన డ్రోన్ శో లో భారత స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన వేరు వేరు అంశాలకు జీవం పోయడం జరిగింది. ‘చౌరీ చౌరా ఆందోళన’ కావచ్చు, ‘కాకోరీ రైలు’ తాలూకు ఘటన కావచ్చు, లేదంటే నేతాజీ సుభాష్ గారి అజేయమైనటువంటి సాహసం, ఇంకా పరాక్రమం కావచ్చు, ఈ డ్రోన్ శో అయితే అందరి మనసుల ను గెలుచుకొంది. అదే విధం గా మీరు మీ నగరాల లో, గ్రామాల లో స్వాతంత్ర్య ఉద్యమాని కి సంబంధించినటువంటి ప్రత్యేక మైన అంశాలను కూడా ప్రజల ముందుకు తీసుకు రావచ్చును. ఇందులో సాంకేతికత యొక్క బోలెడంత సహాయాన్ని కూడా పొందవచ్చును. స్వాతంత్ర్యం తాలూకు అమృత్ మహోత్సవం, మనకు స్వాతంత్ర్యం తాలూకు పోరాటం యొక్క స్మృతుల ను అనుభూతి చెందింపచేసుకొనేటటువంటి అవకాశాన్ని ప్రసాదిస్తుంది. అది దేశం కోసం కొత్త సంకల్పాలను తీసుకొనేటటువంటి, ఏదైనా చేసి వెళ్లాలనేటటువంటి ఇచ్ఛాశక్తి ని చూపించే, ప్రేరణాత్మకమైనటువంటి ఉత్సవం, ప్రేరణాత్మకమైనటువంటి సందర్భం. రండి, స్వాతంత్య్ర సంగ్రామం యొక్క మహనీయుల నుంచి ప్రేరితులం అవుతూ ఉందాం, దేశం కోసం మన ప్రయాసల ను మరింత గా పటిష్టపరుస్తూ ఉందాం.

 

ప్రియమైన నా దేశవాసులారా, మన భారతదేశం చాలా అసాధారణమైన ప్రతిభావంతుల తో సంపన్నమైంది. ఆ ప్రతిభా మూర్తుల సృజనాత్మకత ఇతరులను కూడాను ఏదైనా చేయడానికి ప్రేరేపిస్తుంది. అటువంటి వారి లో తెలంగాణ కు చెందిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గారు ఒకరు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. మీ కలల ను నెరవేర్చుకోవడానికి వయస్సు తో సంబంధం లేదు అనేందుకు విఠలాచార్య గారు ఒక ఉదాహరణ. సహచరులారా, పెద్ద గ్రంథాలయాన్ని తెరవాలనే కోరిక విట్ఠలాచార్య గారికి చిన్నప్పటి నుంచి ఉండేది. దేశాని కి అప్పటికి ఇంకా స్వాతంత్ర్యం రాలేదు. కొన్ని పరిస్థితుల వల్ల చిన్ననాటి కల కలగానే మిగిలిపోయింది. కాలక్రమేణా విట్ఠలాచార్య గారు అధ్యాపకుడు అయ్యారు. తెలుగు భాష ను లోతు గా అధ్యయనం చేశారు. అందులో అనేక సృజనాత్మక రచనలను చేశారు. 6-7 సంవత్సరాల క్రితం ఆయన తన కల ను నెరవేర్చుకోవడం మొదలుపెట్టారు. తన సొంత పుస్తకాల తో గ్రంథాలయాన్ని మొదలుపెట్టారు. తన జీవిత కాల సంపాదన ను అందులో పెట్టారు. క్రమం గా ప్రజలు అందులో చేరడం, సహకరించడం ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లోని ఈ గ్రంథాలయం లో దాదాపు 2 లక్షల పుస్తకాలు ఉన్నాయి. చదువు తో మొదలుపెట్టి అనేక విషయాల లో తాను పడిన ఇబ్బందులు మరెవరికీ రాకూడదు అని విట్ఠలాచార్య గారు అంటారు. ప్రస్తుతం అధిక సంఖ్య లో విద్యార్థులు ఆ గ్రంథాలయం ప్రయోజనాల ను పొందడాన్ని చూసి ఆయన చాలా సంతోషం గా ఉన్నారు. ఆయన కృషి తో ప్రేరణ ను పొంది అనేక ఇతర గ్రామాల ప్రజలు కూడా గ్రంథాలయాల ను రూపొందించే పని లో నిమగ్నమై ఉన్నారు.

 

సహచరులారా, పుస్తకాలు జ్ఞానాన్ని అందించడమే కాకుండా వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుతాయి. జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. పుస్తక పఠనం అభిరుచి అద్భుతమైన సంతోషాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం చాలా పుస్తకాల ను చదివాను అని గర్వంగా చెప్పుకొనే వారి ని ఈ రోజుల్లో చూస్తున్నాను. ఇప్పుడు నేను ఈ పుస్తకాల ను మరిన్నిటిని చదవాలి అని అనుకొంటున్నాను. ఇది మంచి ధోరణి. దీనిని మరింత పెంచాలి. ఈ సంవత్సరం మీకు ఇష్టమైన ఐదు పుస్తకాల ను గురించి చెప్పండి అంటూ ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) శ్రోతల ను కూడా నేను అడుగుతున్నాను. ఈ విధం గా, మీరు 2022వ సంవత్సరం లో మంచి పుస్తకాల ను ఎంపిక చేసుకోవడానికి ఇతర పాఠకులకు కూడా సహాయం చేయగలుగుతారు. మన స్క్రీన్ టైమ్ పెరుగుతున్న తరుణం లో పుస్తక పఠనం మరింత ప్రాచుర్యాన్ని పొందేందుకు మనం కలసి కృషి చేయవలసి ఉంటుంది.

 

ప్రియమైన నా దేశవాసులారా, ఇటీవల నా దృష్టి ఒక ఆసక్తికరమైన ప్రయత్నం మీదకు మళ్లింది. మన ప్రాచీన గ్రంథాల కు, సాంస్కృతిక విలువల కు భారతదేశం లోనే కాకుండా ప్రపంచం అంతటా ప్రాచుర్యం పొందేందుకు ఈ ప్రయత్నం. పుణె లో భండార్ కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్ టిట్యూట్ పేరు తో ఒక కేంద్రం ఉంది. మహాభారతం ప్రాముఖ్యాన్ని ఇతర దేశాల ప్రజలకు పరిచయం చేయడానికి ఈ సంస్థ ఆన్‌లైన్ కోర్సు ను ప్రారంభించింది. ఈ కోర్సు ఇప్పుడే ప్రారంభించినప్పటికీ ఇందులో బోధించే అంశాల రూపకల్పన 100 సంవత్సరాల క్రితం ప్రారంభించినట్టు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ కోర్సు ను ఇన్స్ టిట్యూట్ ప్రారంభించినప్పుడు అద్భుతమైన స్పందన వచ్చింది. మన సంప్రదాయం లోని వివిధ అంశాలను ఆధునిక పద్ధతిలో ఎలా ప్రదర్శిస్తున్నారో ప్రజలకు తెలియజేసేందుకు నేను ఈ అద్భుతమైన చొరవ ను గురించి చర్చిస్తున్నాను. సప్త సముద్రాల అవతల ఉన్న ప్రజల కు దీని ప్రయోజనాలను అందజేసేందుకు కూడా వినూత్న పద్ధతులను అవలంబించడం జరుగుతున్నది.

 

సహచరులారా, ప్రస్తుతం భారతీయ సంస్కృతి ని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రపంచం లో పెరుగుతున్నది. వివిధ దేశాల కు చెందిన వారు మన సంస్కృతి ని గురించి తెలుసుకోవాలనే కుతూహలం తో ఉండటమే కాకుండా దానిని పెంచేందుకు సహకరిస్తున్నారు. అలాంటి వారిలో సెర్బియా కు చెందిన విద్యావేత్త డాక్టర్ మోమిర్ నికిచ్ ఒకరు. ఆయన సంస్కృతం-సెర్బియన్ ద్విభాషా నిఘంటువు ను రూపొందించారు. ఈ నిఘంటువు లో చేర్చిన 70 వేలకు పైగా సంస్కృత పదాలను సెర్బియన్ భాష లోకి అనువదించారు. డాక్టర్ నికిచ్ 70 ఏళ్ల వయసు లో సంస్కృత భాష నేర్చుకొన్నారని తెలుసుకోవడం మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మహాత్మ గాంధీ వ్యాసాల ను చదివి తాను స్ఫూర్తి ని పొందినట్లు ఆయన చెప్తారు. ఇదే మాదిరి గా మంగోలియా కు చెందిన 93 సంవత్సరాల ప్రొఫెసర్ జె. గొందె ధరమ్ గారికి చెందిన ఉదాహరణ కూడా ఉంది. గత 4 దశాబ్దాల లో ఆయన భారతదేశం లోని 40 పురాతన గ్రంథాలు, ఇతిహాసాలు, రచనల ను మంగోలియన్ భాష లోకి అనువదించారు. ఇటువంటి అభిరుచి తో మన దేశం లోనూ చాలా మంది పనిచేస్తున్నారు. గోవాకు చెందిన సాగర్ ములే గారి కృషి ని గురించి కూడా నేను తెలుసుకున్నాను. శతాబ్దాల క్రితం నాటి 'కావి' చిత్రకళ అంతరించిపోకుండా కాపాడడం లో ఆయన నిమగ్నం అయ్యారు. ‘కావి’ చిత్రకళ భారతదేశం ప్రాచీన చరిత్ర ను తన లో ఇముడ్చుకొంది. ‘కావ్’ అంటే ఎర్ర మట్టి. ప్రాచీన కాలం లో ఈ కళ లో ఎర్ర మట్టి ని ఉపయోగించే వారు. గోవా లో పోర్చుగీసు హయాం ఉన్న కాలం లో అక్కడి నుంచి వలస వచ్చిన వారు ఇతర రాష్ట్రాల ప్రజలకు ఈ అద్భుతమైన చిత్రకళ ను పరిచయం చేశారు. కాలక్రమేణా ఈ చిత్రకళ అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. కానీ సాగర్ ములే గారు ఈ కళ కు కొత్త జీవం పోశారు. ఆయన ప్రయత్నాల కు ప్రశంస లు కూడా లభిస్తున్నాయి. సహచరులారా, ఒక చిన్న ప్రయత్నం, ఒక చిన్న అడుగు కూడా మన ఘనమైనటువంటి కళ ల పరిరక్షణ లో చాలా పెద్ద తోడ్పాటు ను అందించగలదు. మన దేశం లో ప్రజలు దృఢ సంకల్పం తో గనక ఉంటే, దేశవ్యాప్తంగా గల మన ప్రాచీన కళల ను అందంగా తీర్చిదిద్దే, కాపాడుకోవాలనే తపన ఒక ప్రజా ఉద్యమ రూపాన్ని తీసుకోవచ్చు. నేను ఇక్కడ కొన్ని ప్రయత్నాల ను గురించి మాత్రమే మాట్లాడాను. దేశమంతటా ఇటువంటి ప్రయత్నాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. మీరు వాటి సమాచారాన్ని Namo App (నమో ఏప్) ద్వారా నాకు తప్పనిసరిగా తెలియ జేయగలరు.

 

ప్రియమైన నా దేశవాసులారా, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు ఒక సంవత్సరం నుండి ఒక ప్రత్యేకమైన ప్రచార ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. దానికి ‘అరుణాచల్ ప్రదేశ్ ఎయర్‌ గన్ సరెండర్ అభియాన్’ అనే పేరు ను పెట్టారు. ఈ ప్రచారం లో ప్రజలు స్వచ్ఛందం గా వారి ఎయిర్‌ గన్‌ల ను అప్పగిస్తున్నారు. ఎందుకో తెలుసా? తద్వారా అరుణాచల్ ప్రదేశ్‌ లో విచక్షణరహితం గా జరిగే పక్షుల వేట ను అరికట్టవచ్చు. సహచరులారా, 500 కు పైగా పక్షి జాతుల కు అరుణాచల్ ప్రదేశ్ నిలయంగా ఉంది. వాటి లో కొన్ని దేశీయ జాతులు ఉన్నాయి. ఇవి ప్రపంచం లో మరెక్కడా కనిపించవు. కానీ క్రమం గా ఇప్పుడు అడవుల్లో పక్షుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు దీన్ని సరిదిద్దేందుకే ఈ ఎయర్‌ గన్ సరెండర్ ప్రచార ఉద్యమం నడుస్తోంది. గత కొన్ని నెలలు గా పర్వతం నుంచి మైదానాల వరకు, ఒక సమాజం నుంచి మరొక సమాజం వరకు, రాష్ట్రం లోని ప్రతి చోటా దీనిని ప్రజలు హృదయపూర్వకం గా స్వీకరించారు. అరుణాచల్ ప్రజలు వారి ఇష్టపూర్వకం గా 1600 కంటే ఎక్కువ ఎయిర్‌ గన్‌ల ను అప్పగించారు. ఇందుకు అరుణాచల్ ప్రజల ను ప్రశంసిస్తున్నాను. వారి ని నేను అభినందిస్తున్నాను.

 

ప్రియమైన నా దేశవాసులారా, మీ అందరి నుండి 2022వ సంవత్సరం తో ముడిపడ్డ చాలా సందేశాలు, సూచన లు వచ్చాయి. ప్రతిసారి మాదిరిగానే చాలా మంది వ్యక్తుల సందేశాల లో ఒక అంశం ఉంది. అది స్వచ్ఛత కు, స్వచ్ఛ భారత్ కు సంబంధించింది. ఈ స్వచ్ఛత తాలూకు ఈ సంకల్పం క్రమశిక్షణ, జాగరూకత, అంకితభావం లతో మాత్రమే నెరవేరుతుంది. ఎన్ సిసి కేడెట్ స్ ప్రారంభించిన పునీత్ సాగర్ అభియాన్‌ లో కూడా మనం దీని సంగ్రహావలోకనాన్ని చూడవచ్చును. ఈ ప్రచారం లో ముప్ఫై వేల మందికి పైగా ఎన్‌సిసి కేడెట్ స్ పాల్గొన్నారు. ఈ ఎన్‌ సిసి కేడెట్ స్ సముద్రపు ఒడ్డు ప్రాంతాల ను శుభ్రపరిచారు. అక్కడి నుంచి ప్లాస్టిక్ వ్యర్థాల ను తొలగించి రీసైక్లింగ్ కోసం సేకరించారు. పరిశుభ్రత ఉన్నప్పుడే మన బీచ్‌ లు, మన పర్వతాలు సందర్శించడానికి అనువు గా ఉంటాయి. జీవితాంతం ఏదో ఒక ప్రదేశానికి వెళ్లాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళి తెలిసో తెలియకో చెత్త ను కూడా వ్యాపింప జేస్తారు. మనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే ప్రదేశాల ను అపరిశుభ్రం గా మార్చకుండా చూడవలసిన బాధ్యత ప్రతి దేశవాసి ది.

 

సహచరులారా, కొంతమంది యువకులు ప్రారంభించిన ‘సాఫ్ వాటర్’ (saafwater) అనే స్టార్ట్- అప్ ను గురించి నాకు తెలిసింది. కృత్రిమ మేధ (ఎఐ), ఇంటర్ నెట్ సహాయం తో ఇది ప్రజల కు వారి ప్రాంతం లోని నీటి స్వచ్ఛత కు, నాణ్యత కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఇది స్వచ్ఛతకే సంబంధించినటువంటి తదుపరి దశ అన్నమాట. ప్రజల స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఈ స్టార్ట్- అప్ ప్రాముఖ్యాన్ని దృష్టి లో పెట్టుకొని, దీనికి గ్లోబల్ అవార్డు కూడా లభించింది.

 

సహచరులారా, ఈ ప్రయత్నం లో ‘ఏక్ కదమ్ స్వచ్ఛతా కీ ఓర్’ (‘స్వచ్ఛత వైపు ఒక అడుగు’) ప్రచారం లో ప్రతి ఒక్కరి పాత్ర ప్రధానమైంది. సంస్థ లు కావచ్చు లేదా ప్రభుత్వం కావచ్చు.. ప్రతి ఒక్కరి పాత్ర ముఖ్యమైందే. గతం లో ప్రభుత్వ కార్యాలయాల్లో పాత ఫైళ్లు, కాగితాలు ఎక్కువగా ఉండేవన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ప్రభుత్వం పాత పద్ధతులను మార్చడం ప్రారంభించినప్పటి నుండి ఈ ఫైళ్లు, కాగితాలు డిజిటలైజ్ అయి, కంప్యూటర్ ఫోల్డర్‌ లో నిలవ ఉంటున్నాయి. పాత మెటీరియల్ ను, పెండింగ్‌ లో ఉన్న మెటీరియల్‌ ను తొలగించడానికి మంత్రిత్వ శాఖల లో, విభాగాల లో ప్రత్యేక ప్రచారాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారాలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. తపాలా విభాగం లో ఈ పరిశుభ్రత ఉద్యమం ప్రారంభించినప్పుడు అక్కడ ఉన్న జంక్‌యార్డ్ పూర్తి గా ఖాళీ అయింది. ఇప్పుడు ఈ జంక్‌యార్డ్ ను ప్రాంగణం గా, ఫలహారశాల గా మార్చారు. మరో జంక్‌యార్డ్ ను ద్విచక్ర వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ ప్రాంతం గా మార్చారు. అదేవిధం గా పర్యావరణ మంత్రిత్వ శాఖ దాని ఖాళీ గా ఉన్న జంక్‌యార్డ్ ను వెల్‌నెస్ సెంటర్‌ గా మార్చింది. పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్లీన్ ఏటీఎమ్ ను కూడా ఏర్పాటు చేసింది. దీని ఉద్దేశ్యం ఏమిటంటే ప్రజలు చెత్త ను ఇవ్వడం, బదులు గా నగదు తీసుకోవడం. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ లోని విభాగాలు ఎండు ఆకుల నుంచి, చెట్ల నుంచి పడే సేంద్రీయ వ్యర్థాల నుండి సేంద్రీయ కంపోస్ట్ ను తయారు చేయడం ప్రారంభించాయి. ఈ విభాగం వేస్ట్ పేపర్‌ తో స్టేశనరీ ని తయారు చేసేందుకు కూడా కృషి చేస్తోంది. మన ప్రభుత్వ శాఖ లు కూడా పరిశుభ్రత వంటి అంశం పై చాలా వినూత్నం గా ఆలోచిస్తాయి. కొన్నాళ్ల క్రితం వరకు ఎవరూ నమ్మలేదు కానీ నేడు అది వ్యవస్థ లో భాగమైపోతోంది. దేశప్రజలందరూ కలసి నడిపిస్తున్న దేశపు కొత్త ఆలోచన ఇది.

 

ప్రియమైన నా దేశవాసులారా, ఈసారి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో కూడా మనం అనేక అంశాలపై మాట్లాడుకొన్నాం. ప్రతిసారి వలెనే ఇప్పుడు కూడా ఒక నెల తరువాత కలుద్దాం. మనం మళ్ళీ భేటీ అవుదాం- కానీ, 2022వ సంవత్సరం లో. ప్రతి కొత్త ప్రారంభం మన సామర్థ్యాన్ని గుర్తించే అవకాశాన్ని తెస్తుంది. ఆ లక్ష్యాలు ఇంతకు ముందు మనం ఊహించనివి కూడా కావచ్చు. నేడు దేశం వాటి కోసం ప్రయత్నాలు చేస్తోంది.

 

క్షణశః కణశశ్చైవ, విద్యామ్ అర్థం చ సాధయేత్

క్షణే నష్టే కుతో విద్యా, కణే నష్టే కుతో ధనమ్

 

అంటే జ్ఞానాన్ని సంపాదించాలని మనం అనుకొన్నప్పుడు, ఏదైనా కొత్తది నేర్చుకోవాలి అని అనుకొన్నప్పుడు, చేయాలి అని అనుకొన్నప్పుడు ప్రతి ఒక్క క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం డబ్బు ను సంపాదించవలసి వచ్చినప్పుడు, అంటే పురోగతి చెందవలసివచ్చినప్పుడు ప్రతి కణాన్ని- అంటే ప్రతి వనరు ను సముచితం గా ఉపయోగించాలి. ఎందుకంటే క్షణం నష్టపోతే జ్ఞానం, విద్య పోతాయి. వనరుల నష్టం తో సంపద కు, పురోగమనాని కి దారులు మూసుకు పోతాయి. ఈ విషయం మన దేశవాసులందరికీ స్ఫూర్తిదాయకం. మనం చాలా నేర్చుకోవాలి. నూతన ఆవిష్కరణ లు చేయాలి. కొత్త లక్ష్యాల ను సాధించాలి. అందుకే క్షణం కూడా వృథా చేయకుండా ఉండాలి. మనం దేశాన్ని అభివృద్ధి లో కొత్త శిఖరాల కు తీసుకుపోవాలి. కాబట్టి మన ప్రతి వనరు ను పూర్తి గా ఉపయోగించుకోవాలి. ఒక రకం గా ఇది స్వావలంబనయుక్తమైనటువంటి భారతదేశం యొక్క మంత్రం కూడాను. ఎందుకంటే మనం మన వనరుల ను సక్రమం గా ఉపయోగించినప్పుడు వాటిని వ్యర్థం కానివ్వం. అప్పుడే స్థానిక శక్తి ని గుర్తిస్తాం. అప్పుడే దేశం స్వయంసమృద్ధి ని సాధిస్తుంది. కాబట్టి ఉన్నతం గా ఆలోచించాలని, ఉన్నతంగా కలలు కనాలని, వాటిని సాకారం చేసేందుకు కృషి చేయాలని మన సంకల్పాన్ని మరోసారి చెప్పుకొందాం. మన కల లు మనకు మాత్రమే పరిమితం కావు. మన స్వప్నాలు మన సమాజం, మన దేశం అభివృద్ధి కి సంబంధించినవి గా ఉంటాయి. మన పురోగతి దేశం పురోగతి కి మార్గాన్ని తెరుస్తుంది. దీని కోసం ఈ రోజు నుండి మనం ఒక్క క్షణం కూడా వృథాపోనివ్వకుండా, ఒక్క కణాన్ని కూడా కోల్పోకుండా పని చేయాలి. ఈ సంకల్పం తో రాబోయే సంవత్సరం లో దేశం ముందుకు సాగుతుందని, 2022వ సంవత్సరం ఒక నవ భారతదేశం నిర్మాణాని కి బంగారు పుట అవుతుందని నాకు పూర్తి భరోసా ఉంది. ఈ విశ్వాసంతో, మీ అందరి కి 2022వ సంవత్సరం తాలూకు బోలెడన్ని శుభాకాంక్షలు, చాలా చాలా ధన్యవాదాలూ ను.

 

***** (Release ID: 1785306) Visitor Counter : 90