జల శక్తి మంత్రిత్వ శాఖ

ఉత్తరాఖండ్‌లో జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి సరఫరా పథకాల కోసం రూ.164.03 కోట్ల ఆమోదం


5 జిల్లాలను కవర్ చేసే పథకాలు 140 గ్రామాలలో 48 వేల మందికి ప్రయోజనం చేకూరుస్తాయి

ఉత్తరాఖండ్‌లోని అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు ఇప్పుడు కుళాయి నీటి సరఫరాను కలిగి ఉన్నాయి

Posted On: 24 DEC 2021 12:56PM by PIB Hyderabad

తాగునీటి సరఫరా పథకాలకు 2021 డిసెంబర్ 23న జరిగిన రాష్ట్ర స్థాయి పథకం మంజూరు కమిటీ (ఎస్ఎల్ఎస్ఎస్సి) సమావేశంలో ఉత్తరాఖండ్ జల్ జీవన్ మిషన్ కింద రూ.164.03 కోట్లు ఆమోదం ఇచ్చారు. మంజూరైన ఎనిమిది నీటి సరఫరా పథకాలలో అన్నీ బహుళ-గ్రామ పథకాలు. ఇది 9,200 పైగా గ్రామీణ గృహాలకు కుళాయి నీటి కనెక్షన్‌ను అందిస్తుంది.

ఈ ఎనిమిది పథకాలు అల్మోరా, బాగేశ్వర్, డెహ్రాడూన్, నైనిటాల్, ఉత్తరకాశీ జిల్లాల్లోని 140 గ్రామాలకు ప్రయోజనం చేకూరుస్తాయి. అల్మోరా జిల్లాలోని మాసి, మంగూర్‌ఖాల్, ఝిమార్ బహుళ గ్రామాల కుళాయి నీటి సరఫరా పథకాలు 68 గ్రామాలలో నివసిస్తున్న సుమారు 20 వేల మందికి ప్రయోజనం చేకూరుస్తాయి. బాగేశ్వర్ జిల్లాలోని షామా మరియు బైదామజేరా బహుళ-గ్రామాల కుళాయి నీటి సరఫరా పథకాలు 38 గ్రామాలలో నివసిస్తున్న సుమారు 18 వేల మందికి ప్రయోజనం చేకూరుస్తాయి. నైనిటాల్ జిల్లాలోని 9 గ్రామాలలో నివసిస్తున్న 3 వేల మందికి పైగా ప్రజలకు బస్‌గావ్ లోష్‌గ్యాని బహుళ-గ్రామ కుళాయి నీటి సరఫరా పథకాలు స్వచ్ఛమైన కుళాయి నీటిని అందిస్తాయి. అదేవిధంగా ఉత్తరకాశీలోని కందారి బహుళ గ్రామాల పథకం, డెహ్రాడూన్‌లోని మోతీధర్ పనియాల పథకం ద్వారా ఈ రెండు జిల్లాల్లోని 25 గ్రామాల్లో నివసిస్తున్న 7 వేల మందికి పైగా లబ్ధి పొందనున్నారు.

వేసవిలో ఈ గ్రామాలన్నీ తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. డిసెంబర్, 2022 నాటికి ఈ పథకాలు పూర్తయితే, ఈ 140 గ్రామాలలో నివసిస్తున్న 48 వేల మందికి పైగా ప్రజలు రాబోయే 30-40 సంవత్సరాలకు ఒక క్రమ పద్ధతిలో తగినంత స్వచ్ఛమైన కుళాయి నీటి సరఫరాను పొందుతారు.

 

గత రెండు నెలల్లో తాగునీటి సరఫరా పథకాలకు ఉత్తరాఖండ్‌లోని 11 జిల్లాల్లో విస్తరించి ఉన్న 846 గ్రామాలలో 58.5 వేల ఇళ్లకు 714 కోట్ల రూపాయలతో 3 లక్షల మందికి పైగా లబ్ధి చేకూర్చేందుకు ఎస్ఎల్ఎస్ఎస్సి ఆమోదించింది. సుదూర  నీటి వనరుల నుండి నీటిని తెచ్చుకోవడానికి ప్రతిరోజూ చాలా గంటలు గడిపిన మహిళలు మరియు పిల్లలు ఎదుర్కొంటున్న కష్టాలను ఇది చాలా తగ్గిస్తుంది.

15 ఆగస్ట్ 2019న, జల్ జీవన్ మిషన్ ప్రారంభించిన సమయంలో, కేవలం 1.30 లక్షల (8.58%) గ్రామీణ గృహాలకు మాత్రమే కుళాయి నీటి సరఫరా ఉంది. 28 నెలల్లో, కోవిడ్-19 మహమ్మారి మరియు లాక్‌డౌన్ అంతరాయాలు ఉన్నప్పటికీ, రాష్ట్రం 6.22 లక్షల (41.02%) కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్‌ను అందించింది. ఈ విధంగా, ఇప్పటి వరకు, రాష్ట్రంలోని 15.18 లక్షల గ్రామీణ కుటుంబాలలో, 7.53 లక్షల (49.60%) వారి ఇళ్లలో కుళాయి నీటి సరఫరా జరుగుతోంది. 2021-22లో రాష్ట్రం 2.64 లక్షల కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు అందించాలని యోచిస్తోంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం డిసెంబర్, 2022 నాటికి అన్ని గ్రామీణ గృహాలకు స్వచ్ఛమైన కుళాయి నీటి సరఫరాను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

జల్ జీవన్ మిషన్ (జేజేఎం) కింద, గ్రామీణ గృహాలకు కుళాయి నీటి సరఫరాను అందించడానికి చేపట్టాల్సిన పథకాల పరిశీలన మరియు ఆమోదం కోసం రాష్ట్ర స్థాయి పథకం మంజూరు కమిటీ (ఎస్ఎల్ఎస్ఎస్సి) ఏర్పాటుకు నిబంధన ఉంది. నీటి సరఫరా పథకాలు/ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకునేందుకు ఎస్ఎల్ఎస్ఎస్సి రాష్ట్ర స్థాయి కమిటీగా వ్యవహరిస్తుంది మరియు జాతీయ జల్ జీవన్ మిషన్ (ఎన్ జేజేఎం) నామినీగా కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా ఈ కమిటీలో సభ్యులు.

 

ప్ర‌తి ఇంటిలో పరిశుభ్రమైన కుళాయి నీరు ఉండేలా చూడాలి, మ‌హిళ‌లు, బాలిక‌ల‌ను దూరం నుండి నీటిని తెచ్చుకునే అవ‌కాశం నుండి విముక్తి చేయాల‌న్న ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దార్శ‌నిక‌త‌ను సాకారం చేసేందుకు, మిషన్ 2021-22లో ఉత్తరాఖండ్‌కు రూ.360.95 కోట్ల గ్రాంట్-ఇన్-ఎయిడ్ విడుదల చేసింది కేంద్రం. ఈ ఏడాది కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ రూ. 1,443.80 కోట్లు కేటాయించారు, అంటే గతేడాది కేటాయింపుల కంటే నాలుగు రెట్లు పెరిగింది. కేంద్ర జల శక్తి మంత్రి, నాలుగు రెట్లు పెంపుదలకు ఆమోదం తెలుపుతూ, డిసెంబర్, 2022 నాటికి ప్రతి గ్రామీణ ఇంటికీ కుళాయి నీటి సరఫరాను అందించడానికి రాష్ట్రానికి పూర్తి సహాయానికి హామీ ఇచ్చారు.

దేశంలోని పాఠశాలలు, ఆశ్రమశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లలకు సురక్షితమైన కుళాయి నీటిని అందించడానికి, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 100-రోజుల ప్రచార కార్యక్రమాన్నిప్రకటించారు. దీనిని 2 అక్టోబర్ 2020న కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లోని అన్ని పాఠశాలలు మరియు అంగన్‌వాడీ కేంద్రాలకు వాటి ప్రాంగణంలో కుళాయి నీటి సరఫరా అందించబడింది.

‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ మరియు సబ్‌కా ప్రయాస్’కు అనుగుణంగా పనిచేస్తూ, జల్ జీవన్ మిషన్ నినాదం ‘ఎవరూ ఈ పథకం అందకుండా ఉండకూడదు’.  ఇది త్రాగదగిన కుళాయి నీటి సరఫరాకు సార్వత్రిక ప్రాప్యతను లక్ష్యంగా చేసుకుంది. 

2019లో మిషన్ ప్రారంభంలో, దేశంలోని మొత్తం 19.20 కోట్ల గ్రామీణ కుటుంబాలలో 3.23 కోట్ల (17%) మందికి మాత్రమే కుళాయి నీటి సరఫరా ఉంది. గత 28 నెలల్లో, కోవిడ్-19 మహమ్మారి మరియు లాక్‌డౌన్‌ల అంతరాయాలు ఉన్నప్పటికీ, జల్ జీవన్ మిషన్ వేగంగా అమలు జరిగింది.  నేడు, 5.45 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్‌లు అందించడం జరిగింది. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా 8.69 కోట్ల (45.20%) గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి సరఫరా ఉంది. గోవా, తెలంగాణ, హర్యానా రాష్ట్రాలు మరియు అండమాన్ & నికోబార్ దీవుల యుటి లు, పుదుచ్చేరి, దాద్రా నాగార్ హవేలీ, డామన్ అండ్ డయ్యు గ్రామీణ ప్రాంతాలలో 100% గృహ కుళాయి కనెక్షన్‌ని నిర్ధారించాయి. ప్రస్తుతం 83 జిల్లాల్లోని ప్రతి ఇంటికి, 1.28 లక్షలకు పైగా గ్రామాలకు కుళాయి నీటి సరఫరా జరుగుతోంది.

*****



(Release ID: 1785116) Visitor Counter : 124