ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

జాతీయ ఆక్సిజన్ నాయకత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్


దేశంలో ప్రతి జిల్లాలో ' ఆక్సిజన్ నాయకుడి'ని గుర్తించి శిక్షణ ఇవ్వడానికి రూపొందిన కార్యక్రమం

"కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 1500 కి పైగా ప్రెజర్ స్వింగ్ అడ్సార్ప్షన్ ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల్లో 1463 కేంద్రాలు పనిచేస్తున్నాయి"

Posted On: 22 DEC 2021 12:00PM by PIB Hyderabad

ప్రజల ప్రాణాలను రక్షించే అంశంలో కీలకంగా ఉండే  ఆక్సిజన్ నిర్వహణ, వినియోగంపై ప్రజారోగ్య సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు రూపొందించిన     జాతీయ ఆక్సిజన్ నాయకత్వ కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఈ రోజు ప్రారంభించారు. ప్రజారోగ్య రంగంలో మెడికల్ ఆక్సిజన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని గుర్తించిన కేంద్రం ఆక్సిజన్  వినియోగంలో ఆరోగ్య కార్యకర్తల సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమం కింద ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన ప్రాథమిక అవగాహన కల్పించి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉండడంతో దీని వినియోగంలో వృధాను తగ్గించడానికి  ఈ శిక్షణ ఉపకరిస్తుంది. ఈ కార్యక్రమం కింద దేశంలోని ప్రతి జిల్లాలో ఒక 'ఆక్సిజన్ నాయకుడిని' గుర్తిస్తారు. ఆక్సిజన్ వినియోగంలో శిక్షణ పొందిన ఈ నాయకులు తాను  పనిచేసే జిల్లాలో ఆక్సిజన్ ఇవ్వడం, దాని నిర్వహణపై నిర్వహించే శిక్షణా కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తారు. అవసరమైన సమయంలో సకాలంలో ఆక్సిజన్ సరఫరా జరిగేలా చూసి, పరిస్థితిని ఎదుర్కోవడానికి అవసరమైన చర్యలను వీరు సిద్ధం చేస్తారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ పవార్ కోవిడ్-19 తో సహా అనేక వ్యాధులకు చికిత్స అందించే విషయంలో ఆక్సిజన్ కీలకంగా ఉంటుందని అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆక్సిజన్ కు డిమాండ్ పెరిగిందని అన్నారు. దీనితో ఆక్సిజన్ ను హేతుబద్దంగా వినియోగించే అంశానికి ప్రాధాన్యత ఏర్పడిందని మంత్రి తెలిపారు. 

అవసరాలకు సరిపోయే విధంగా ఆక్సిజన్ సరఫరా అయ్యేలా చూసేందుకు కేంద్రం అన్ని చర్యలను తీసుకుంటున్నదని మంత్రి తెలిపారు. " ఆక్సిజన్ సరఫరా కోసం కేంద్రం 1500  ఎక్కువ ప్రెజర్ స్వింగ్ అడ్సార్ప్షన్ (పిఎస్ఎ  ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను మంజూరు చేసింది.  వీటిలో 1463 కేంద్రాలు  పనిచేస్తున్నాయి. పీఎం కేర్స్ నిధితో వీటిలో  1225 కేంద్రాలను నెలకొల్పి ప్రారంభించడం జరిగింది. దేశంలో ప్రతి జిల్లాలో ఇవి పనిచేస్తున్నాయి" అని మంత్రి వివరించారు. ప్రజారోగ్య సౌకర్య కల్పనా కేంద్రాలలో పిఎస్ఎ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను కోరామని డాక్టర్ పవార్ తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా పిఎస్ఎ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించామని మంత్రి అన్నారు. 

ఆక్సిజన్ నాయకత్వ కార్యక్రమం కింద ఆక్సిజన్ వినియోగం, నిర్వహణ అంశాలలో ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన అవగాహన కల్పించి తగిన శిక్షణ ఇస్తామని మంత్రి తెలిపారు. ఆక్సిజన్ వృధాను  అరికట్టడం,  అవసరానికి మించి ఎక్కువగా ఇవ్వకపోవడం లాంటి అంశాల్లో శిక్షణ ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆక్సిజన్ సరఫరా లో ఎదురవుతున్న పరిమితులు, గతంలో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ లో సంక్షోభం తలెత్తకుండా చూడాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించామని మంత్రి వివరించారు. 

నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్య) డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ ప్రతి దేశంలో వనరుల కొరత ఉందని అన్నారు. అందుబాటులో ఉన్న వనరులను సక్రమంగా వినియోగించడానికి చర్యలు అమలు కావాలని ఆయన అన్నారు. ఆక్సిజన్ వృధాను అరికట్టి, సరైన విధానంలో ఆక్సిజన్ వినియోగం అయ్యేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆయన అన్నారు. ఆక్సిజన్ నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలన్న లక్ష్యంతో ఇటీవల 'ఆక్సీ కేర్' కార్యక్రమాన్ని ప్రారంభించామని డాక్టర్ పాల్ తెలిపారు. 

 కోవిడ్-19 మహమ్మారి వైద్య ఆక్సిజన్‌కు డిమాండ్‌ను పెంచిందని కేంద్ర  కార్యదర్శి (ఆరోగ్యం) శ్రీ రాజేష్ భూషణ్ పేర్కొన్నారు. ఆక్సిజన్ సకాలంలో సరఫరా కావాల్సి ఉంటుందని కోవిడ్-19 గుర్తు చేసిందని అన్నారు. ఆక్సిజన్  ఉత్పత్తి , సరఫరా వ్యవస్థను  ఏర్పాటు చేయడంలో మరియు బలోపేతం చేయడంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారం అందిస్తుందని అన్నారు.  ఆక్సిజన్ నిర్వహణలో శిక్షణ పొందిన సిబ్బంది కొరత ఉందని అన్నారు. ఈ కార్యక్రమం ఆరోగ్య కార్యకర్తలకు తగిన శిక్షణ ఇస్తుందని అన్నారు.   మహమ్మారి కారణంగా ఉత్పన్నమయ్యే ఏదైనా అవాంఛనీయ పరిస్థితులను  ఎదుర్కొని  వ్యవస్థలపై అనవసరమైన ఒత్తిడి లేకుండా చూసే విధంగా ఈ కార్యక్రమం శిక్షణ పొందిన  ప్రస్తుత మానవ వనరులను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తుందని అన్నారు. 

కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ మనోహర్ అగ్నానీనేషనల్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ సురేష్ చంద్ర శర్మఎయిమ్స్ న్యూఢిల్లీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

 

****



(Release ID: 1784180) Visitor Counter : 155