పర్యటక మంత్రిత్వ శాఖ
రేపు హైదరాబాద్‌లో 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఎగ్జిబిషన్ ప్రారంభించనున్న శ్రీ ఎం. వెంకయ్యనాయుడు
తెలంగాణ, హర్యానా రాష్ట్రాలకు చెందిన కళలు, వంటలు, పండుగలు, స్మారక చిహ్నాలు, పర్యాటక కేంద్రాలు మొదలైన వివిధ అంశాలపై ఎగ్జిబిషన్ లో సవివర ప్రదర్శన
Posted On:
11 DEC 2021 12:17PM by PIB Hyderabad
భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు రేపు హైదరాబాద్ నగరంలో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ (ఈబిఎస్బి)ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నారు. ఎగ్జిబిషన్‌ను సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రాంతీయ ఔట్రీచ్ బ్యూరో నిర్వహిస్తుంది. ఈ ఎగ్జిబిషన్ లో హైదరాబాద్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వివిధ కళారూపాలు, వంటలు, పండుగలు, స్మారక చిహ్నాలు, పర్యాటక ప్రదేశాలు మొదలైన వివిధ ఆసక్తికరమైన అంశాలను సవివరంగా ప్రదర్శిస్తారు. హైదరాబాద్ నాంపల్లి లో ఉన్న పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో 2021 డిసెంబర్ 12 నుండి 14 వరకు ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తారు.
దేశ సమగ్రత, సమైక్యత స్ఫూర్తిని పెంపొందించి, దేశ ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలను బలపడేలా చూడాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ద్వారా వినూత్న కృషిని ప్రారంభించింది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత జరిగిన దేశ విలీన కార్యక్రమంలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభభాయి పటేల్ 140 వ జయంతి వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2015 అక్టోబర్ 31 న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతాలను జత చేసి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్యాలను సాధించడానికి కృషి జరుగుతోంది. ఒక రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం మరో రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతంతో ఒక నిర్దిష్ట కాలపరిమితి వరకు జతగా పనిచేస్తాయి. ఈ కాలంలో భాష, సాహిత్యం, వంటలు, పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పర్యాటకం మొదలైన రంగాలలో ఒకదానితో ఒకటి నిర్మాణాత్మక సమన్వయంతో కలిసి పనిచేస్తాయి. ప్రస్తుతం తెలంగాణ, హర్యానా రాష్ట్రాలు ఈ అంశాలలో కలిసి కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. రెండు రాష్ట్రాల భాషల్లో కీలక పదాలను నేర్చుకోవడం, రెండు చెందిన జానపద నృత్యాలను ప్రదర్శించడం, రాష్ట్ర ప్రత్యేక వంటలు, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం లాంటి వివిధ రంగాలలో పైన పేర్కొన్న అనేక కార్యక్రమాలను రెండు రాష్ట్రాలు నిర్వహిస్తాయి.
***
(Release ID: 1780547)
Visitor Counter : 135