ఆర్థిక మంత్రిత్వ శాఖ
తమిళనాడు లో సోదాలు నిర్వహించిన ఆదాయం పన్ను శాఖ
Posted On:
07 DEC 2021 12:56PM by PIB Hyderabad
ఆభరణాలు, వస్త్రాలు, గృహోపకరణాల రిటైల్ విక్రయాలను సాగిస్తున్న తమిళనాడుకు చెందిన రెండు సంస్థలపై ఆదాయం పన్ను శాఖ అధికారులు 01.12.2021న దాడులు చేసి సోదాలు నిర్వహించారు. చెన్నై, కోయంబత్తూరు, మధురై మరియు తిరునెల్వేలి లో ఈ సంస్థలు అనేక దుకాణాలను ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ రెండు సంస్థలకు చెందిన 37 ప్రాంతాల్లో ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.
అధికారులు దాడి చేసి సోదాలు నిర్వహించిన ఒక సంస్థ తన రికార్డులను తారుమారు చేసి అమ్మకాలు జరగనట్టుగా చూపించింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంస్థ 1000 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే అమ్మకాల వివరాలను తొక్కి పెట్టిందని అధికారులు గుర్తించారు. సంస్థ ఆవరణలో నిర్వహించిన సోదాల్లో దీనికి సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదేవిధంగా, గత కొద్ది సంవత్సరాలుగా ఈ సంస్థ వస్త్ర, ఆభరణాల విభాగాలు లెక్కల్లో చూపకుండా 150 కోట్ల రూపాయల నగదు కొనుగోళ్లు చేసిందని అధికారులు గుర్తించారు.
అధికారులు దాడులు, సోదాలు నిర్వహించిన మరో సంస్థ 80 కోట్ల రూపాయల విలువ చేసే ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు వెల్లడయింది. ఈ సంస్థ నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు పరిశీలించిన అధికారులు దీనిలో నకిలీ బిల్లుల రూపంలో పన్ను చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగాయని నిర్ధారించారు. ఎంపిక చేసిన సంస్థల నుంచి నకిలీ బిల్లులను పొంది వీటి ద్వారా ఈ సంస్థ తన ఆదాయాన్ని పన్ను చెల్లించాల్సిన మొత్తంలో చూపలేదని అధికారులు గుర్తించారు. లెక్కల్లో చూపని బంగారం కొనుగోళ్లు జరిగాయని కూడా అధికారులు గుర్తించారు. ఆభరణాల తయారీ చార్జీలను పెంచి చూపిస్తూ సంస్థ అక్రమాలకు పాల్పడిందని అధికారులు నిర్ధారించారు. లెక్కలు చూపని అద్దె రసీదులు, లెక్కలోకి రాని తుక్కు విక్రయాలు 7 కోట్ల రూపాయల వరకు సాగాయని కూడా గుర్తించారు.
రెండు సంస్థలపై నిర్వహించిన దాడుల్లో అధికారులు లెక్కలు చూపని 10 కోట్ల రూపాయల నగదు, ఆరు కోట్ల రూపాయల విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు.
తదుపరి విచారణ పురోగతిలో ఉన్నాయి.
(Release ID: 1778949)
Visitor Counter : 138