ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన 12వ భారత అవయవ దాన దినోత్సవ వేడుకలు
' జీవించినంత కాలం రక్తదానం, మరణించిన తరువాత అవయవ దానం' అనేది ప్రతి ఒక్కరి జీవిత ఆశయం గా ఉండాలి .. డాక్టర్ మాండవీయ
'మరొకరికి అవయవ దానం చేయడం అంటే సమాజ సేవ చేయడమే' డాక్టర్ భారతీ పవార్
Posted On:
27 NOV 2021 2:10PM by PIB Hyderabad
' జీవించినంత కాలం రక్తదానం, మరణించిన తరువాత అవయవ దానం' అనేది ప్రతి ఒక్కరి జీవిత ఆశయం గా ఉండాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈ రోజు జరిగిన 12వ భారత అవయవ దాన దినోత్సవ కార్యక్రమానికి డాక్టర్ మాండవీయ అధ్యక్షత వహించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ కూడా సమావేశంలో పాల్గొన్నారు.
అవయవ దానాన్ని ప్రోత్సహించి, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి ఏటా అవయవ దాన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
మరణించిన తమ వారి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేసి అవి అవసరమైన వారికి అమర్చడం జరుగుతోంది. అయితే, ప్రస్తుతం దేశంలో అవయవ మార్పిడి అవసరం ఉన్న వారి సంఖ్య అవయవ దానం చేస్తున్న వారి సంఖ్య తో పోల్చి చూస్తే ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో అవయవ దాన అంశానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ అవయవాలను దానం చేయడానికి ఎక్కువ మందికి ముందుకు వచ్చేలా చూడడానికి చర్యలను అమలు చేస్తోంది. అవయవ దాన దినోత్సవంలో భాగంగా విషాద సమయంలో కూడా తమ ఆప్తుల అవయవాలను దానం చేసిన వారిని మంత్రి సన్మానించారు.
అవయవ దానం ప్రాముఖ్యతను వివరించిన డాక్టర్ మాండవీయ 'శుభం''లాభం' అనే రెండు అంశాలు మానవ జీవనంలో ప్రధాన అంశాలుగా ఉంటాయని అన్నారు. సమాజం సుభిక్షంగా ఉంటేనే ప్రతి వ్యక్తికీ 'శుభం''లాభం' కలుగుతాయని అన్నారు. అవయవ దానం ప్రాధాన్యతను తెలియజేయడానికి ఏర్పాటైన సమావేశంలో పాల్గొనే అవకాశం తనకు లభించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సమాజానికి మరణించిన వారు, వారి కుటుంబ సభ్యులు అందించిన సేవలకు గుర్తింపుగా 2010 నుంచి ప్రతి ఏటా జాతీయ అవయవ దాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి తన తండ్రి ఆశయం మేరకు అవయవ దానం చేసిన గుజరాత్ కు చెందిన దీపక్ అనే వ్యక్తిని గుర్తు చేసుకున్నారు. ప్రజలందరూ తమ అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేయడమే కాకుండా దేశంలో మార్పిడికి అందుబాటులో ఉన్న అవయవాల కొరతపై ప్రచారం చేసి ఇతరులను ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని ఆయన కోరారు. అవయవ దాన అంశంలో మరింత సమన్వయం అవసరమన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అవయవ దానం చేయడం పట్ల నెలకొన్న అపోహలను తొలగించి, ఎక్కువ మంది అవయవాలను దానం చేసేలా చూడడానికి ప్రజల్లో అవగాహనా కల్పించాలని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంలో డాక్టర్లు, ప్రజలు, ప్రసార సాధనాలు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని ఆయన కోరారు.
అవయవ దాన కార్యక్రమం సజావుగా, వేగంగా, సకాలంలో జరిగేలా చూడడానికి రాష్ట్ర, ప్రాంతీయ, జాతీయ స్థాయిలో వ్యవస్థలను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నామని డాక్టర్ మాండవీయ వివరించారు. దేశంలో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సల సంఖ్య పెరుగుతున్నదని డాక్టర్ మాండవీయ అన్నారు. 2013లో దేశంలో కేవలం 4990 అవయవ మార్పిడులు జరిగాయని, 2019 నాటికి వీటి సంఖ్య 12746 కి చేరిందని మంత్రి వెల్లడించారు. గ్లోబల్ అబ్జర్వేటరీ ఆన్ డొనేషన్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ వెబ్ సైట్ లో పొందుపరిచిన వివరాల ప్రకారం అవయవ మార్పిడిలో ప్రపంచంలో అమెరికా,చైనా తరువాత భారతదేశం మూడవ స్థానంలో ఉందని మంత్రి వెల్లడించారు. 2012-13 తో పోల్చి చూస్తే అవయవాలను దానం చేస్తున్న వారి సంఖ్య నాలుగు రెట్లు పెరిగిందని అన్నారు. అయితే, ప్రస్తుతం దేశంలో అవయవ మార్పిడి అవసరం ఉన్న వారి సంఖ్య అవయవ దానం చేస్తున్న వారి సంఖ్య తో పోల్చి చూస్తే ఎక్కువగా ఉందని డాక్టర్ మాండవీయ తెలిపారు. కోవిడ్-19 ప్రభావం అన్ని రంగాలతో పాటు అవయవ దాన కార్యక్రమంపై కూడా పడిందని ఆయన అన్నారు. కోవిడ్ వల్ల అవయవ దానం, సేకరణ, మార్పిడి తగ్గాయని అన్నారు. ఈ ప్రభావం నుంచి త్వరలో కోలుకుంటామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేసారు.
సమాజంలో శరవేగంగా మార్పులు వస్తున్నాయని , ప్రజల ఆలోచనా దృక్పథం కూడా మారిందని డాక్టర్ మాండవీయ అన్నారు. ప్రతి ప్రాణం ముఖ్యమైనదని, అమూల్యమైనదని, పవిత్రమైనది అన్న భావన ప్రజల్లో ఏర్పడుతున్నదని అన్నారు. దీనితో కష్టపడి సంపాదించిన సంపదను సమాజ సేవకు వెచ్చిస్తున్న వారికి లభిస్తున్న గుర్తింపు, గౌరవం త్వరలో 'అంగ దానం' చేసిన వ్యక్తులకు కూడా లభిస్తుందని ఆయన చెప్పారు.
సమావేశంలో ప్రసంగించిన డాక్టర్ భారతీ పవార్ అవయవ దానం చేయడం వల్ల అనేక ప్రాణాలు నిలబడతాయని అన్నారు. అవయవ మార్పిడి జరిగిన వ్యక్తి పునర్జీవనం పొందుతారని ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగి పోతారని ఆమె అన్నారు. అవయవ దానం చేసినవారు అమరత్వం పొందుతారని అన్నారు. అవయవ దానం చేయడం అంటే సమాజ సేవ చేయడమే అని ఆమె అన్నారు.
ఇటీవల తన కోల్‌కతా పర్యటనలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక అవయవ దాతను పలకరించి అభినందించిన విషయాన్నిమంత్రి గుర్తు చేసుకున్నారు. ఆరోగ్య సంరక్షణ, సమాజ సేవకు మరణించిన వారి అవయవాలను దానం చేసిన వారి సేవలను స్మరించుకోవడానికి అవయవ దాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని డాక్టర్ భారతీ పవార్ తెలిపారు. అవయవ దానం ద్వారా మానవాళికి వారు అందించిన నిస్వార్థ సేవలను గుర్తించి వారి అడుగుజాడల్లో నడిచి అవయవాలను దానం చేస్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ఆమె కోరారు. సుదీర్ఘ జీవితం కంటే అర్ధవంతమైన జీవితం విలువైనది అనే సామెతను గుర్తు చేసిన మంత్రి అవయవ దానంతో అర్ధవంతమైన జీవితం పొందవచ్చునని అన్నారు.
అవయవ మార్పిడిలో విశిష్ట సేవలు అందించిన వారిని మంత్రులు సన్మానించి అవార్డులను అందజేశారు. మహారాష్ట్రకు చెందిన స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ అత్యధిక సంఖ్యలో మరణించిన దాతల మార్పిడికి అవార్డును గెలుచుకుంది. ప్రాంతీయ అవయవ మరియు కణజాల మార్పిడి సంస్థ వెస్ట్రన్ రీజియన్ ఉత్తమ పనితీరుకు గుర్తింపు పొందింది.
అవయవ దాన ఆస్పత్రులు , ఉత్తమ మార్పిడి సమన్వయకర్తలను కూడా సత్కరించారు.
అవయవ దానం పై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి పోస్టర్ల రూపకల్పన పోటీని నిర్వహించి విజేతలకు బహుమతులు కూడా అందజేశారు.
చనిపోయిన తర్వాత తన అవయవాలను అవసరమైన వారికి దానం చేస్తామని ప్రతి ఒక్కరితో డాక్టర్ మాండవీయ ప్రతిజ్ఞ చేయించారు.
ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.
***
(Release ID: 1775657)
Visitor Counter : 157