ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో వివిధ అభివృద్ధి పథకాలను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
“గత ఏడేళ్లలో ఢిల్లీలోని తలుపులు మూసిన గదుల నుంచి దేశంలోని
ప్రతి మూలకూ ప్రభుత్వం ఎలా వచ్చిందో మహోబా చూసింది”
“రైతులు సమస్యలలో చిక్కుకోవడమే కొన్ని రాజకీయ పార్టీల సదా అవసరం.. వారు సమస్యల రాజకీయాలు చేస్తారు.. మేము జాతీయ పరిష్కార విధానాన్ని అనుసరిస్తాం”
“బుందేల్‌ఖండ్ ప్రగతి కోసం పనిచేసే ప్రభుత్వాన్ని తొలిసారి ప్రజలు
చూస్తున్నారు.. గత ప్రభుత్వాలు జనాన్ని దోచుకోవడంలో
అలసిపోగా.. కానీ, పని చేయడంలో మాకు అలుపుండదు”
“అనువంశిక ప్రభుత్వాలు రైతులను సదా లేమిలో ఉంచాయి.. రైతుల పేరిట
అవి ప్రకటనలు చేసేవి తప్ప… ఒక్క పైసా కూడా సదరు రైతులకు చేరలేదు”
“కర్మయోగుల రెండు ఇంజన్ల ప్రభుత్వం బుందేల్‌ఖండ్ ప్రగతికి అలుపెరుగక శ్రమిస్తోంది”
Posted On:
19 NOV 2021 4:18PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో వివిధ అభివృద్ధి పథకాలను జాతికి అంకితం చేశారు. ఈ ప్రాంతంలో నీటి కొరతను తీర్చడానికి, రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఉపశమన కల్పనకు ఈ పథకాలు ఎంతగానో తోడ్పడతాయి. వీటిలో అర్జున్ సహాయక్ ప్రాజెక్ట్, రతౌలీ వియర్ ప్రాజెక్ట్, భయోనీ డ్యామ్ ప్రాజెక్ట్, మడ్‌గావ్-చిల్లీ స్ప్రింక్లర్ ప్రాజెక్ట్ తదితరాలున్నాయి. ఈ ప్రాజెక్టులన్నిటికీ కలిపి రూ.3250 కోట్లు వ్యయం కాగా, వీటి ప్రారంభం ద్వారా మహోబా, హమీర్‌పూర్, బందా, లలిత్‌పూర్ జిల్లాల్లో దాదాపు 65,000 హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుంది. ఈ మేరకు ఆ ప్రాంతంలోని లక్షలాది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతవాసులకు తాగునీరు కూడా అందుతుంది. కాగా, ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ సహా రాష్ట్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- దేశం బానిసత్వ సంకెళ్లలో నలుగుతున్న వేళ ప్రజల్లో సరికొత్త చైతన్యం రగిల్చిన గురునానక్ దేవ్ జీ పర్‌కాష్ పరబ్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇవాళ భరతమాత సాహస పుత్రిక, బుందేల్‌ఖండ్‌కు గర్వకారణమైన రాణీ లక్ష్మీబాయి జయంతి అని కూడా ఆయన గుర్తుచేశారు.
ప్రధానమంత్రి తన ప్రసంగం కొనసాగిస్తూ- గత ఏడేళ్లలో ఢిల్లీలోని తలుపులు మూసిన గదుల నుంచి దేశంలోని మూలమూలలకూ ప్రభుత్వం ఎలా వచ్చిందో మహోబా ప్రత్యక్షంగా చూసిందని వ్యాఖ్యానించారు. “దేశంలోని పేదల తల్లులు, సోదరీమణులు, పుత్రికల జీవితాల్లో అర్థవంతమైన, భారీ మార్పులకు కారణమైన పథకాలు, నిర్ణయాలను ఈ నేల ప్రత్యక్షంగా చూసింది” అని ప్రధాని పేర్కొన్నారు. ఈ మహోబా నేలమీద నుంచే ముస్లిం మహిళలకు ‘ముమ్మారు తలాఖ్’ నుంచి విముక్తి కల్పిస్తానంటూ చేసిన తన వాగ్దానాన్ని ప్రధాని గుర్తు చేసుకుంటూ, అది నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అదేవిధంగా ఉజ్వల 2.0 పథకాన్ని కూడా ఇక్కడి నుంచే ప్రారంభించామని చెప్పారు.
ఈ ప్రాంతం కాలక్రమాన నీటి సమస్యలకు, వలసలకు కేంద్రంగా ఎలా మారిందో ప్రధాని ప్రస్తావించారు. సమర్థ జల నిర్వహణలో ఈ ప్రాంతం ప్రసిద్ధమన్న చారిత్రక వాస్తవాన్ని ఆయన గుర్తుచేశారు. కానీ, మునుపటి ప్రభుత్వాల హయాంలో ఈ ప్రాంతం క్రమేణా భారీ నిర్లక్ష్యానికి, అవినీతి పాలనకు ఆలవాలమైందని పేర్కొన్నారు. “ఒకానొక సమయంలో తమ కుమార్తెలకు వివాహం చేయాలన్నా ఈ ప్రాంత ప్రజలు వెనుకాడే దుస్థితి ఏర్పడింది. అలాగే జలసిరులున్న ప్రాంతానికి కోడళ్లుగా వెళ్లాలని ఇక్కడి యువతులు ప్రగాఢంగా ఆకాంక్షించేవారు. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలకు జవాబేమిటో మహోబా వాసులకు, బుందేల్‌ఖండ్ ప్రజలకు తెలుసు” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
మునుపటి ప్రభుత్వం బుందేల్‌ఖండ్‌ను దోచుకోవడం ద్వారా తమ కుటుంబాలకు మేలు చేకూరేలా చూసుకున్నదని ప్రధాని అన్నారు. “మీ కుటుంబాల నీటి సమస్యను వారెన్నడూ పట్టించుకున్నది లేదు” అని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. దశాబ్దాలుగా తమను దోచుకున్న ప్రభుత్వాలను చాలాకాలంపాటు బుందేల్‌ఖండ్ ప్రజలు చూశారని ప్రధాని అన్నారు. బుందేల్‌ఖండ్ ప్రగతి కోసం పనిచేసే ప్రభుత్వాన్ని తొలిసారి ప్రజలు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. “గత ప్రభుత్వాలు ఉత్తరప్రదేశ్‌ను దోచుకోవడంలో అలసిపోయాయి.. కానీ, మేం పని చేయడంలో ఎన్నడూ అలసిపోవడమంటూ ఉండదు” రాష్ట్రంలోని మాఫియాను అణగదొక్కుతుంటే కొందరికి కన్నీళ్లు ఆగడం లేదని, అయినప్పటికీ వారి కల్లబొల్లి ఏడుపులు, పెడబొబ్బలతో రాష్ట్రంలో అభివృద్ధి పనులేవీ ఆగబోవని ఆయన స్పష్టం చేశారు.
రైతులను సమస్యలలో ముంచెత్తి వారు నిత్యం సతమతమయ్యేలా చేయడాన్ని కొన్ని రాజకీయ పార్టీలు పనిగా పెట్టుకున్నాయని, వారు సమస్యల రాజకీయాలు చేస్తే తాము జాతీయ పరిష్కార విధానాన్ని అనుసరిస్తామని ప్రధానమంత్రి చెప్పారు. ‘కెన్-బెత్వా’ సమస్యపై తమ ప్రభుత్వం భాగస్వాములందరితో సంప్రదించి పరిష్కారం కనుగొనడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. అనువంశిక ప్రభుత్వాలు రైతులను సదా నిరాదరణకు గురిచేశాయని ప్రధాని అన్నారు. “రైతుల పేరిట అవి ప్రకటనలు చేసేవి తప్ప ఒక్క పైసా కూడా రైతులకు చేరింది లేదు. అదే సమయంలో ‘పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం ద్వారా ఇప్పటిదాకా మేము రూ.1,62,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమచేశాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ఈ ప్రాంతాన్ని ఉపాధిరీత్యా స్వయం సమృద్ధం చేసేందుకు, బుందేల్‌ఖండ్ నుంచి వలసల నిరోధానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి అన్నారు. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ రహదారి, ‘యూపీ డిఫెన్స్ కారిడార్” ఇందుకు తిరుగులేని నిదర్శనాలని చెప్పారు. ఈ ప్రాంతంలోని సుసంపన్న సంస్కృతి గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ‘కర్మ యోగుల’ నేతృత్వంలోని ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం’ ఈ ప్రాంతాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి నిబద్ధతతో ఉందని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.
***
DS/AK
(Release ID: 1773292)
Visitor Counter : 175
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam