ప్రధాన మంత్రి కార్యాలయం
భారత సాంకేతిక పరిణామం-విప్లవంపై సిడ్నీ చర్చాగోష్ఠిలో ప్రధానమంత్రి కీలకోపన్యాసం
భారతదేశంలో ఐదు ముఖ్యమైన పరివర్తనల గురించి వివరణ;
“నిష్కాపట్యమే ప్రజాస్వామ్యానికి తిరుగులేని శక్తి.. అదే సమయంలో
స్వార్థశక్తులు దాన్ని దుర్వినియోగం చేసేందుకు మనం అనుమతించరాదు”;
భారత డిజిటల్ విప్లవం మా ప్రజాస్వామ్యంలో..
మా జనశక్తిలో.. మా ఆర్థిక వ్యవస్థలో పాతుకుపోయింది;
“సమాచారాన్ని మేం ప్రజల సాధికారతకు వనరుగా వినియోగిస్తాం..
ప్రజాస్వామ్య చట్రం పరిధిలో వ్యక్తి హక్కులకు బలమైన హామీతో
ఇలా చేయడంలో భారతదేశానికి అపార అనుభవం ఉంది”;
“భారత ప్రజాస్వామ్య సంప్రదాయాలు ప్రాచీనమైనవి.. ఆధునిక వ్యవస్థలు
బలమైనవి.. పైగా- ప్రపంచమంతటినీ ఒకే కుటుంబంగా మేం భావిస్తాం”;
“జాతీయ హక్కులకు గుర్తింపుతోపాటు విస్తృత ప్రజా శ్రేయస్సు
దిశగా వాణిజ్యం-పెట్టుబడులను ప్రోత్సహించేలా ప్రజాస్వామ్య
వ్యవస్థల సమష్టి కృషికి మార్గనిర్దేశం చేయగలదు”;
“సైబర్ ధనంపై ప్రజాస్వామ్య దేశాల సమష్టి పర్యవేక్షణ చాలా ముఖ్యం..
తద్వారా అది యువతను నాశనం చేసే దుష్టశక్తుల చేతికి చేరకుండా చూడాలి”
Posted On:
18 NOV 2021 9:29AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిడ్నీ చర్చగోష్ఠి ప్రారంభం కార్యక్రమంలో కీలకోపన్యాసం చేశారు. దీనికిముందు ఆస్ట్రేలియా ప్రధాని గౌరవనీయ స్కాట్ మారిసన్ పరిచయ ప్రసంగం చేశారు. అనంతరం శ్రీ మోదీ మాట్లాడుతూ- భారతదేశ సాంకేతిక పరిణామం-విప్లవం గురించి వివరించారు. ఈ సందర్భంగా డిజిటల్ ప్రపంచ వికాసంతోపాటు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారతదేశానికిగల కీలక ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. డిజిటల్ యుగం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరిస్తూ- దీనివల్ల సముద్ర తీరం నుంచి సైబర్‌దాకా... అటుపైన అంతరిక్షం వరకూ విభిన్న ముప్పులే కాకుండా సరికొత్త రూపాల్లో ప్రమాదాలు, వివాదాలను కూడా ప్రపంచం ఎదుర్కొంటున్నదని ప్రధాని అన్నారు. "ప్రజాస్వామ్యం యొక్క అతిపెద్ద బలం బహిరంగత. అదే సమయంలో, ఈ బహిరంగతను దుర్వినియోగం చేయడానికి కొన్ని స్వార్థ ప్రయోజనాలను మనం అనుమతించకూడదు”, అని ప్రధాన మంత్రి అన్నారు. అలాగే “నిష్కాపట్యమే ప్రజాస్వామ్యానికి తిరుగులేని శక్తి. అదే సమయంలో స్వార్థశక్తులు దాన్ని దుర్వినియోగం చేసేందుకు మనం అనుమతించరాదు” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్య వ్యవస్థగా, డిజిటల్ అగ్రగామిగా ఉమ్మడి సౌభాగ్యం, భద్రత దిశగా భాగస్వాములతో కలసి కృషి చేసేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. “భారత డిజిటల్ విప్లవం మా ప్రజాస్వామ్యంలో.. మా జనశక్తిలో.. మా ఆర్థిక వ్యవస్థలో పాతుకుపోయింది. మా యువతరం కార్యదీక్ష, ఆవిష్కరణలతోనే ఇది సాధ్యమైంది. మునుపటి సవాళ్లను మేమిప్పుడు భవిష్యత్తులోకి దూసుకెళ్లే అవకాశాలుగా మలచుకుంటున్నాం” అని ప్రధాని ప్రకటించారు. ఈ మేరకు భారతదేశంలో చోటుచేసుకుంటున్న ఐదు ముఖ్యమైన పరివర్తనల గురించి ఆయన వివరించారు.
మొదటిది… ప్రపంచంలోనే అత్యంత విస్తృత మౌలిక ప్రజా సమాచార వసతులు భారతదేశంలో రూపొందుతుండటం. దీనికింద 130 కోట్ల మంది భారతీయులకు నేడు డిజిటల్ గుర్తింపు ఉండగా, 6 లక్షల గ్రామాలు త్వరలోనే ఇంటర్నెట్‌తోపాటు అంతర్జాతీయంగా అత్యంత సమర్థ చెల్లింపు మౌలిక సదుపాయం ‘యూపీఐ’తో అనుసంధానం కానున్నాయి. రెండోది… పరిపాలన, సార్వజనీనత, సాధికారత, అనుసంధానం, లబ్ధి-సంక్షేమ ప్రదానం తదితరాల్లో డిజిటల్ సాంకేతికత వినియోగం. మూడోది... భారతదేశంలో అత్యంత వేగంగా పురోగమిస్తున్న అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థ. నాలుగోది… భారత పరిశ్రమలు-సేవల రంగాలే కాకుండా వ్యవసాయ రంగంలోనూ భారీ డిజిటల్ పరివర్తన. ఐదోది… భవిష్యత్ భారత రూపకల్పన కోసం విస్తృత స్థాయిలో కృషి కొనసాగుతుండటం. ““మేమిప్పుడు 5జి, 6జి వంటి టెలికాం సాంకేతిక పరిజ్ఞానాల్లో స్వదేశీ సామర్థ్యాల అభివృద్ధి దిశగా శ్రమిస్తున్నాం. కృత్రిమ మేధస్సు, యాంత్రికాభ్యాసంలో… ముఖ్యంగా కృత్రిమ మేధస్సును మానవ-కేంద్రకంగా, నైతికంగా వినియోగించడంలో భారత్ అగ్రగామిగా ఉంది. అలాగే క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లు, క్లౌడ్ కంప్యూటింగ్‌లో శక్తిమంతమైన సామర్థ్యాలను మేం అభివృద్ధి చేస్తున్నాం” అని ఆయన తెలిపారు.
భారత డిజిటల్ సౌర్వభౌమత్వం, ప్రతిరోధకత గురించి మాట్లాడుతూ- “మేమిప్పుడు హార్డ్వేర్‌పై దృష్టి సారిస్తున్నాం. సెమీ కండక్టర్ల కీలక తయారీదారుగా రూపొందే క్రమంలో ప్రోత్సాహకాల ప్యాకేజీని సిద్ధం చేస్తున్నాం. ఎలక్ట్రానిక్స్-టెలికామ్ రంగాల్లో మేం ఇప్పటికే ‘ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాలు’ ప్రవేశపెట్టాం. దీంతో భారతదేశంలో తమ శాఖల ఏర్పాటు దిశగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలను అవి ఆకర్షిస్తున్నాయి. సమాచార రక్షణ, గోప్యత, భద్రతలో భారతదేశ నిబద్ధతను కూడా ఆయన నొక్కి చెప్పారు. “అంతేకాదు… సమాచారాన్ని మేం ప్రజల సాధికారతకు వనరుగా వినియోగిస్తాం.. ప్రజాస్వామ్య చట్రం పరిధిలో వ్యక్తి హక్కులకు బలమైన హామీతో ఇలా చేయడంలో భారతదేశానికి అపార అనుభవం ఉంది” అని ప్రధానమంత్రి వివరించారు. ‘వై2కె’ సమస్యను అధిగమించడంలో ప్రపంచానికి భారత తోడ్పాటు గురించి ప్రధాని గుర్తుచేశారు. అదేవిధంగా ప్రపంచానికి ‘కోవిన్’ వేదికను సార్వజనీన సాఫ్ట్ వేర్‌గా అందించామని, భారత దార్శనికతకు, విలువలకు ఇవి ఉదాహరణలని ప్రధాని ఉద్ఘాటించారు. “భారత ప్రజాస్వామ్య సంప్రదాయాలు ప్రాచీనమైనవే అయినా, ఆధునిక వ్యవస్థలు ఎంతో బలమైనవి. పైగా ప్రపంచమంతటినీ ఒకే కుటుంబంగా మేం సదా భావిస్తాం” అని ఆయన పేర్కొన్నారు.
ప్రజా ప్రయోజనార్థం సాంకేతిక పరిజ్ఞానంతోపాటు విధానాలను వినియోగించడం, సార్వజనీన ప్రగతి, సామాజిక సాధికారతలో భారత్‌కుగల విస్తృత అనుభవం వర్ధమాన దేశాలకు ఎంతో సహాయకారి కాగలదని శ్రీ మోదీ అన్నారు. “ఆయా దేశాలను, ప్రజానీకాన్ని శక్తిమంతం చేయడం, ఈ శతాబ్దపు అవకాశాల దిశగా వారిని సంసిద్ధులను చేయడంలో మనమంతా సమష్టిగా కృషిచేయవచ్చు” అని ఆయన చెప్పారు. ఈ మేరకు ప్రజాస్వామ్య దేశాలు సమష్టిగా పనిచేసేందుకు మార్గ ప్రణాళికను సూచిస్తూ ఒక సహకార చట్రం ఏర్పాటుకు శ్రీ మోదీ పిలుపునిచ్చారు. “భవిష్యత్తరం సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధన-అభివృద్ధి విషయంలో మనమంతా కలసికట్టుగా దృష్టి సారించాల్సి ఉంది. అలాగే విశ్వసనీయ తయారీ పునాది-సరఫరా ప్రక్రియల కోసం; సైబర్ భద్రతలో భాగంగా నిఘా-సహకార విస్తరణకు, కీలక సమాచార మౌలిక వసతుల రక్షణ కోసం; ప్రజాభిప్రాయ దుర్వినియోగ నిరోధం; ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా సాంకేతిక-పాలన ప్రమాణాలు, పద్ధతుల రూపకల్పన కోసం; సమాచార పాలన, సీమాంతర ప్రవాహం, సమాచార రక్షణ-భద్రతల దిశగా ప్రమాణాలు-పద్ధతుల సృష్టి తదితరాల కోసం ఉమ్మడి కృషి కూడా అవశ్యం” అని ప్రధాని నొక్కిచెప్పారు. ఈ దిశగా రూపొందించుకునే చట్రం “జాతీయ హక్కులను, విస్తృత ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా వాణిజ్యం-పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించేదిగా ఉండాలి” అని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ‘సైబర్ ధనం’ (క్రిప్టో కరెన్సీ) ఉదాహరణను ఆయన ప్రస్తావిస్తూ- “సైబర్ ధనంపై ప్రజాస్వామ్య దేశాల సమష్టి పర్యవేక్షణ చాలా ముఖ్యం.. తద్వారా అది యువతను నాశనం చేసే దుష్టశక్తుల చేతికి చేరకుండా చూడాలి” అని స్పష్టం చేశారు.
***
DS
(Release ID: 1772886)
Visitor Counter : 291
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam