ప్రధాన మంత్రి కార్యాలయం

రాంచీలో భగవాన్ బిర్సా ముండా స్మృతి ఉద్యానవనం తో కూడిన స్వాతంత్య్ర సమరయోధుల ప్రదర్శనశాలను నవంబర్, 15వ తేదీన ప్రారంభించనున్న - ప్రధాన మంత్రి


నవంబర్, 15వ తేదీ భగవాన్ బిర్సా ముండా జయంతి ని జన జాతీయ గౌరవ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించిన - భారత ప్రభుత్వం


గిరిజన సంస్కృతి, చరిత్రను పరిరక్షించి, ప్రోత్సహించడంలో ముఖ్యమైన పాత్ర పోషించనున్న - మ్యూజియం

మ్యూజియంలో 25 అడుగుల భగవాన్ బిర్సా ముండా విగ్రహం ఉంటుంది

ఇతర గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల జీవిత విశేషాలను కూడా ఈ మ్యూజియంలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.

Posted On: 14 NOV 2021 4:16PM by PIB Hyderabad

భగవాన్ బిర్సా ముండా జయంతిని జన జాతీయ గౌరవ దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం ప్రకటించింది.  ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, 2021, నవంబర్, 15వ తేదీ ఉదయం 9 గంటల 45 నిముషాలకు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, రాంచీలో భగవాన్ బిర్సా ముండా స్మృతి ఉద్యానవనం తో కూడిన స్వాతంత్య్ర సమర యోధుల ప్రదర్శనశాల ను దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. 

గిరిజన సమాజాల అమూల్యమైన సహకారాన్ని, ప్రత్యేకించి భారత స్వాతంత్య్ర పోరాటంలో వారి త్యాగాలను ప్రధానమంత్రి ఎల్లప్పుడూ నొక్కి చెబుతూ ఉంటారు.   భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో గిరిజన స్వాతంత్య్ర సమరయోధులు పోషించిన పాత్ర గురించి, ప్రధానమంత్రి, 2016 లో తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రత్యేకంగా పేర్కొంటూ,   వీర గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల జ్ఞాపకార్థం మ్యూజియంలను నిర్మించాలనీ,   తద్వారా దేశం కోసం వారి త్యాగాల గురించి రాబోయే తరాలు తెలుసుకోగలుగుతాయనీ, అభిప్రాయపడ్డారు.   కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటి వరకు పది గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల ప్రదర్శనశాలల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది.  వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలకు చెందిన గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల జీవిత విశేషాలను, జ్ఞాపకాలను ఈ మ్యూజియంలు భద్రపరుస్తాయి.

భగవాన్ బిర్సా ముండా స్మృతి ఉద్యానవనం తో కూడిన స్వాతంత్య్ర సమరయోధుల ప్రద్రర్శనశాలను, భగవాన్ బిర్సా ముండా తన జీవితాన్ని త్యాగం చేసిన రాంచీ లోని పాత కేంద్ర కారాగారం వద్ద, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నిర్మించడం జరిగింది.  దేశంతో పాటు, గిరిజన సమాజం కోసం ఆయన చేసిన త్యాగానికి నివాళిగా ఇది నిలుస్తుంది.  గిరిజన సంస్కృతి, చరిత్ర ను పరిరక్షించి, ప్రోత్సహించడంలో ఈ మ్యూజియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.  తమ అడవులు, భూమి హక్కులు, సంస్కృతి పరిరక్షణ కోసం గిరిజనులు పోరాడిన విధానంతో పాటు, దేశ నిర్మాణానికి కీలకమైన వారి శౌర్యాన్ని, త్యాగాలను కూడా ఇది ప్రదర్శిస్తుంది.

భగవాన్ బిర్సా ముండాతో పాటు, వివిధ ఉద్యమాలలో పాల్గొన్న షాహిద్ బుధు భగత్,  సిద్ధూ-కన్హు,  నీలాంబర్-పీతాంబర్,  దివా-కిసాన్, తెలంగాణ ఖాదియా,  గయా ముండా,  జాత్రా భగత్,  పోటో హెచ్,  భగీరథ్ మాంఝీ,  గంగా నారాయణ్ సింగ్ వంటి ఇతర గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల జీవిత విశేషాల గురించి కూడా ఈ మ్యూజియంలో ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు.  ఈ మ్యూజియంలో 25 అడుగుల భగవాన్ బిర్సా ముండా విగ్రహంతో పాటు, ఈ ప్రాంతంలోని ఇతర స్వాతంత్య్ర సమరయోధుల 9 అడుగుల విగ్రహాలు కూడా ఉంటాయి.

పరిసర ప్రాంతాల్లోని 25 ఎకరాల్లో అభివృద్ధి చేసిన ఈ స్మృతి ఉద్యానవనంలో మ్యూజికల్ ఫౌంటెన్, ఫుడ్ కోర్ట్, చిల్డ్రన్ పార్క్, ఇన్ఫినిటీ పూల్, గార్డెన్ తో పాటు ఇతర వినోద సౌకర్యాలు కూడా ఉంటాయి.

ఈ కార్యక్రమానికి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి కూడా హాజరుకానున్నారు.

 

*****



(Release ID: 1771787) Visitor Counter : 127