ఆర్థిక మంత్రిత్వ శాఖ
దీపావళి సందర్భంగా పెట్రోలు, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపును ప్రకటించిన ప్రభుత్వం
రేపటి నుంచి పెట్రోలుపై ఎక్సైజ్ సుంకం 5 రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయలు తగ్గింపు
ఇందుకు అనుగుణంగా తగ్గనున్న పెట్రోలు, డీజిల్ ధరలు.
పెట్రోలుతో పోల్చినపుడు,డీజిల్‌పై రెట్టింపు మొత్తంలో ఎక్సైజ్ సుంకం తగ్గింపు వల్ల రానున్న రబీ సీజన్‌లో రైతులకు మరింత ప్రయోజనకరంగా ఉండనుంది.
వినియోగదారులకు ఊరట కలిగించేందుకు పెట్రోలు, డీజిల్ పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్ )తగ్గించాల్సిందిగా రాష్ట్రాలకు సూచన.
Posted On:
03 NOV 2021 8:18PM by PIB Hyderabad
పెట్రోలు డీజిల్ లపై సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలు ధరను రేపటి నుంచి 5 రూపాయలు, డీజిల్ ధరను పది రూపాయలు తగ్గించనుంది. దీనితో పెట్రోలు , డీజిల్ ధరలు ఆమేరకు తగ్గనున్నాయి.
డీజిల్ పై తగ్గించిన ఎక్సైజ్ సుంకం , పెట్రోలు పై తగ్గించన దానికి రెట్టింపు. భారత రైతులు తమ కఠోర శ్రమతో , లాక్‌డౌన్ దశలో కూడా ఆర్ధిక వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లేందుకు దోహదపడ్డారు. డీజిల్‌పై పెద్దమొత్తంలో ఎక్సైజ్ సుంకం తగ్గింపు రానున్న రబీసీజన్ లో రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది.
ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతూ వచ్చాయి. ఫలితంగా దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు గత కొద్ది వారాలుగా పెరుగుతూ వచ్చాయి. దీనితో ద్రవ్యోల్బణ ఒత్తిడి కనిపించింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా అన్ని రకాల ఇంధనాల కొరత కనిపించింది. అలాగే వాటి ధరలు కూడా పెరిగాయి. దేశంలో ఇంధన కొరత ఏర్పడకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది. అలాగే పెట్రోలు, డీజిల్ వంటి వాటిని మన అవసరాలకు అనుగుణంగా తగినంతగా అందుబాటులో ఉండేట్టు చూసింది.
కోవిడ్ సమయంలో మందకొడిగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ, కోవిడ్ -19 అనంతర దశలో ఎన్నో ఆకాంక్షలు గల ప్రజల ఔత్సాహిక సామర్థ్యంతో ముందుకు వెళుతూ , ఒక అద్భుతమైన మలుపు తిరిగింది. వ్యవసాయ రంగంతో పాటు,దేశ ఆర్ధిక రంగంలోని అన్ని వ్యవస్థలూ ఆర్ధిక కార్యకలాపాల విషయంలో చెప్పుకోదగిన పురోగతిని సాధిస్తున్నాయి.
ఆర్ధిక వ్యవస్థకు మరింత ఊపు నిచ్చేందుకు భారత ప్రభుత్వం డీజిల్, పెట్రోలు పై ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గించాలని నిర్ణయించింది.
పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు వినియోగాన్ని పెంచుతుంది, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతుంది. ఆ రకంగా పేద , మధ్యతరగతికి సహాయపడుతుంది. ఈ రోజు తీసుకున్న నిర్ణయం మొత్తం ఆర్ధిక చక్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలదు.
వినియోగదారులకు మరింత ఊరట కలిగించేందుకు పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ను ఇందుకు అనుగుణంగా తగ్గించాల్సిందిగా రాష్ట్రాలను కోరడం జరిగింది.
***
(Release ID: 1769356)
Visitor Counter : 307