ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఢిల్లీలో డెంగ్యూ పరిస్థితిని సమీక్షించిన కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

వ్యాధి నివారణకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేయాలి :సంయుక్త కార్యాచరణ కార్యక్రమానికి రూపకల్పన
' సరైన వైద్యం అందక అనేకమంది పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. మీ మరణాలు రికార్డులలో నమోదు కావడం లేదు' డాక్టర్ మాండవీయ
వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా జరగాలి.. డాక్టర్ మాండవీయ
డెంగ్యూ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను గుర్తించి వ్యాధి నివారణకు నిపుణుల బృందాలను పంపనున్న కేంద్రం

Posted On: 01 NOV 2021 1:15PM by PIB Hyderabad

ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలో డెంగ్యూ వ్యాధిపై ఈ రోజు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. వ్యాధిని అరికట్టడానికి అమలు చేయాల్సిన చర్యలపై మంత్రి అధికారులతో చర్చించారు. ఢిల్లీలో ప్లేట్‌లెట్ల స్థాయి పడిపోవడంతో రక్తహీనతతో అనేకమంది పేద ప్రజలు నీరసంతో ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాధి లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరికి వ్యాధి నిరోధక మందులను ఇవ్వాలిఅని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వ్యాధి ఎందుకు వ్యాపిస్తుంది అన్న అంశానికి కాకుండా వ్యాధి నివారణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రాథమిక వైద్య కేంద్రాలు పనిచేయాలని ఆయన సూచించారు. డెంగ్యూ వ్యాధిని గుర్తించడానికి పరీక్షలను ఎక్కువ చేయాలని అన్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరగకుండా ప్రాణాలు కోల్పోతున్న వారి వారి వివరాలు నమోదు కావడం లేదన్నారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఎక్కువ చేసి సరైన వైద్యం అందించాలని అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 

వ్యాధి నివారణకు కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేయాలని డాక్టర్ మాండవీయ పేర్కొన్నారు. కోవిడ్ చికిత్స అందించడానికి కేటాయించిన ఆసుపత్రుల పడకలను డెంగ్యూ చికిత్సకు ఉపయోగించడానికి గల అవకాశాలను పరిశీలించాలని మంత్రి సూచించారు. కొన్ని ఆసుపత్రులు డెంగ్యూ సోకిన వారితో నిండిపోయి ఉన్న సమయంలో మరికొన్ని ఆసుపత్రుల్లో పడకలు ఖాళీగా ఉన్న అంశాన్ని అధికారులకు మంత్రి  గుర్తు చేశారు. సమస్యను పరిష్కరించడానికి సంబంధిత వర్గాలు సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందని అన్నారు. దీనిలో భాగంగా కోవిడ్ చికిత్స కోసం కేటాయించిన పడకలను డెంగ్యూ చికిత్సకు వినియోగించాలని ఆయన అన్నారు. డెంగ్యూ వ్యాధి నివారణ కోసం ఢిల్లీ రాజధాని ప్రాంత అధికారులకు పూర్తి సహాయ సహకారాలను అందించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. 

వ్యాధి నివారణకు కంటోన్మెంట్ బోర్డు, ఢిల్లీ మెట్రోపాలిటన్ ప్రాంతం తదితర వర్గాలతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసి తగిన చర్యలను అమలు చేయాలని డాక్టర్ మాండవీయ సూచించారు. డెంగ్యూ పై ప్రజలను అప్రమత్తం చేయడానికి ఆరోగ్య శాఖ అధికారులు అమలు చేస్తున్న చర్యల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ప్రజలు అధికారుల సూచనలను ఏ మేరకు పాటిస్తున్నారన్న అంశంపై మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. దోమతెరలను ఉపయోగిస్తూ, చేతులను పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తుల వాడకం, ఫాగింగ్ చేయాలని అన్నారు. డెంగ్యూ వ్యాధి సోకిన వారు నివసిస్తున్న ఇంటితో పాటు దాని చుట్టు పక్కల వున్న 60 ఇళ్లను అధికారులు స్ప్రే చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

గృహాలు, రెస్టారెంట్లు, పరిశ్రమలు, ఓవర్ హెడ్ ట్యాంకులు తదితర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని డాక్టర్ మాండవీయ ఆదేశించారు. ప్రతిరోజూ నీరు సరఫరా కాకపోవడంతో అవసరాల కోసం నీరు నిల్వ చేసుకుంటున్న మురికి వాడలను గుర్తించి ప్రత్యేక చర్యలను అమలు చేయాలని అన్నారు. తరచు శుభ్రం చేసే కూలర్లు మరియు రిఫ్రిజిరేటర్ ట్రేలు వంటి ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని అన్నారు. లార్వా నియంత్రణకు టెమెఫోస్ గుళికలు వాడాలని సూచించారు.

ఢిల్లీలో డెంగ్యూ వ్యాధి నివారణకు అమలు చేస్తున్న చర్యలను డాక్టర్ మాండవీయాకు అధికారులు వివరించారు. లార్వా నియంత్రణపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని, పూల కుండీలు, పక్షులకు ఆహారం అందించడానికి ఏర్పాటు చేసిన పాత్రలు, కూలర్లు తదితర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడడానికి చర్యలను అమలు చేస్తున్నామని అధికారులు వివరించారు. గుర్తించిన 163 ప్రాంతాల్లో లార్వాను నివారించే  గంబూసియా వంటి చేపలను విడుదల చేస్తున్నామని అన్నారు. డెంగ్యూను ఢిల్లీ  ప్రభుత్వం  నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించిందని అధికారులు వివరించారు. దీనితో వ్యాధిని వేగంగా గుర్తించి నమోదు చేయడానికి వీలవుతుంది. అన్ని రకాల జ్వరాలతో సహా డెంగ్యూ జ్వరాలపై అప్రమత్తంగా ఉన్నామని అధికారులు పేర్కొన్నారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి ఆసుపత్రుల్లో దోమలను పూర్తిగా నిర్మూలించడానికి చర్యలను అమలు చేస్తున్నామని, డెంగ్యూ వ్యాధి బారినపడిన వారికి దోమతెరలు అందిస్తున్నామని అధికారులు వివరించారు. 

డెంగ్యూ కేసుల్లో కేవలం 10% కేసులు మాత్రమే జటిలంగా మారుతాయని, మరణాలు 1%కంటె తక్కువగా వుంటాయని అధికారులు తెలిపారు. అన్ని వర్గాలతో కలిసి పనిచేసి వ్యాధి వ్యాప్తి, నివారణకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రికి అధికారులు హామీ ఇచ్చారు. డెంగ్యూ వ్యాధి నివారణకు వ్యాక్సిన్ అభివృద్ధి చేసే అంశం కూడా చర్చకు వచ్చింది. 

డెంగ్యూ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను గుర్తించి అక్కడకి కేంద్ర నిపుణుల బృందాలను పంపాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శికి డాక్టర్ మాండవీయ ఆదేశాలు జారీ చేశారు. ఈ రాష్ట్రాలలో అమలు చేస్తున్న చర్యలను తదుపరి సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. 

సమావేశానికి ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, సంయుక్త కార్యదర్శి శ్రీ వికాస్ షీల్, అదనపు కార్యదర్శి ఆర్తి అహుజా, ఎన్సీడీసీ డైరెక్టర్ డాక్టర్ ఎస్.కే. సింగ్ తడిఆరులు హాజరయ్యారు. ఢిల్లీ అదనపు ముఖ్య కార్యదర్శి శ్రీ భూపిందర్ భల్ల నాయకత్వంలో ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంత అధికారుల బృందం సమావేశంలో పాల్గొంది. 

 

***



(Release ID: 1768581) Visitor Counter : 196