గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

లక్షాధికారుణులుగా స్వయం సహాయక బృందాల మహిళలు


గ్రామీణ మహిళా స్వయం సహాయక బృందాల సభ్యుల వార్షిక ఆదాయం ఏడాదికి కనీసం లక్ష రూపాయలు ఉండేలా చూడడానికి ప్రత్యేక కార్యక్రమం రూపొందించిన గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

రానున్న రెండు సంవత్సరాలలో జీవనోపాధి పొందడానికి 250 లక్షల గ్రామీణ ఎస్‌హెచ్‌జి మహిళలకు సహకారం

వార్షిక ఆదాయం లక్ష రూపాయలు గా ఉండేలా చూడడానికి గృహ స్థాయిలో జీవనోపాధి అవకాశాల కల్పన

Posted On: 30 OCT 2021 12:08PM by PIB Hyderabad

గ్రామీణ ప్రాంత మహిళా  స్వయం సహాయక బృందాల సభ్యులు ఆర్థిక స్వావలంబన సాధించేలా చూడాలన్న లక్ష్యంతో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ లక్షపతి ఎస్‌హెచ్‌జి మహిళ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. గ్రామీణ  ఎస్‌హెచ్‌జి మహిళల వార్షిక ఆదాయం కనీసం లక్ష రూపాయలుగా ఉండేలా చేయాలనే  లక్ష్యంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. లక్ష్యాన్ని సాధించడానికి దేశంలో 250 లక్షల మంది  గ్రామీణ  ఎస్‌హెచ్‌జి మహిళలకు రానున్న రెండు సంవత్సరాల్లో జీవనోపాధి పొందడానికి సహకారం అందించాలని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి  దేశంలో అమలులో ఉన్న వివిధ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలకు మంత్రిత్వ శాఖ  నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. దీనికోసం రాష్ట్రాలు, బిల్ అండ్  మెలిండా గేట్స్ ఫౌండేషన్ ,ట్రాన్‌ఫోమేషన్ రూరల్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులతో మంత్రిత్వ శాఖ 2021  అక్టోబర్ 28న ఒక సమావేశాన్ని నిర్వహించింది.
  మహిళలకు మరిన్ని జీవనోపాధి అవకాశాలను అందుబాటులోకి తెచ్చే అంశాలపై సమావేశంలో చర్చించారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, పాడి పరిశ్రమ, అటవీ ఉత్పత్తుల సేకరణ లాంటి అంశాల ద్వారా విభిన్న అవకాశాలను అందించి వార్షిక ఆదాయం కనీసం లక్ష రూపాయలుగా ఉండేలా చూడాలని సమావేశంలో నిర్ణయించారు. లక్ష్య సాధనకు స్వయం సహాయక బృందాలు, గ్రామీణ సంస్థలు, క్లస్టర్ స్థాయి సమాఖ్యలను మరింత బలోపేతం చేయవలసి ఉందని అభిప్రాయపడిన సమావేశం ఈ దిశలో చర్యలను అమలు చేయాలని తీర్మానించింది. వివిధ రంగాలలో శిక్షణ పొందిన సభ్యులు స్వయం సహాయక బృందాలు లక్ష్యాల మేరకు పనిచేసేలా చూడాలని సమావేశం పేర్కొంది. లక్ష్య సాధనలో పౌర సంఘాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు ఇతర ప్రైవేట్ సంస్థల సహకారాన్ని తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. రాష్ట్రాలు ఈ దిశలో ప్రణాళికలను రూపొందించాలని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సూచించింది.
సంతృత్తి విధానంలో ప్రస్తుతం జాతీయ జీవనోపాధి మిషన్ అమలు జరుగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా 6768 బ్లాకులలో 70 లక్షల స్వయం సహాయక బృందాల ద్వారా 7.7 కోట్ల మంది మహిళలు ప్రయోజనం పొందుతున్నారు. ప్రారంభ పెట్టుబడిని అందించడంతో పాటు ఈ బృందాలకు ప్రతి సంవత్సరం 80 వేల కోట్ల రూపాయల మేరకు నిధులను సమకూర్చడం జరుగుతోంది. ఈ పథకం కింద వివిధ వర్గాలు, కులాలకు చెందిన మహిళలు ఒక స్వయం సహాయక  బృందంగా  ఏర్పడతారు. ఈ బృందాలతో కూడిన సమాఖ్య బృందం సభ్యులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించడానికి వారి ఆదాయం, జీవన ప్రమాణాలు అభివృద్ధి చెందడానికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తుంది.
బ్యాంకుల నుంచి స్వయం సహాయక బృందాలు పెట్టుబడుల రూపంలో తీసుకున్న రుణాలను ఉపయోగించి జీవనోపాధి అవకాశాలను కల్పించడానికి అమలు చేస్తున్న చర్యలు ఆశించిన ఫలితాలను ఇస్తున్నాయి.  అయితే, గ్రామీణ ప్రాంత మహిళలు గౌరవ ప్రదంగా జీవించి సుస్థిర అభివృద్ధి సాధించడానికి వారి వార్షిక ఆదాయం లక్ష రూపాయలుగా ఉండాలని మంత్రి శాఖ భావించింది. లక్ష అనేది శుభప్రదంగా  స్ఫూర్తి కల్పించే విధంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో లక్షపతి కార్యక్రమానికి రూపకల్పన జరిగింది.
గ్రామీణ మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించి వారికి జీవనోపాధి అవకాశాలను కల్పించడానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించిన కార్యక్రమాలను దీన్ దయాళ్ అంత్యోదయ పథకం కింద అమలు జరుగుతున్నాయి.   ఈ మిషన్ కింద మహిళా కిసాన్ సశక్తీకరణ్ పరియోజన లక్ష్యాల మేరకు అమలు జరుగుతోంది. మహిళలను రైతులుగా రూపు దిద్దడానికి సమాజ భాగస్వామ్యంతో అమలు జరిగిన ఈ కార్యక్రమం ఇకపై ఉత్పత్తిదారులు, సరఫరాదారులుగా స్వయం సహాయక బృందాల సభ్యులను అభివృద్ధి చేసి వారి ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడే విధంగా అమలు జరుగుతుంది.  

***



(Release ID: 1768157) Visitor Counter : 588