విద్యుత్తు మంత్రిత్వ శాఖ
వాతావరణాన్ని కలుషితం చేయని ఇంధన వినియోగాన్ని ఎక్కువ చేయడానికి ఇంధన పరిరక్షణ చట్టం 2001 లో సవరణలు ప్రతిపాదించిన విద్యుత్ మంత్రిత్వ శాఖ
పారిశ్రామిక సంస్థలు వినియోగిస్తున్న ఇంధనంలో పునరుత్పాదక ఇంధన వనరుల కనీస వాటా నిర్ధారణకు సవరణ ప్రతిపాదన
సవరణలపై నాలుగు సంబంధిత వర్గాలతో చర్చలు నిర్వహించిన మంత్రిత్వ శాఖ
వాతావరణంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని సవరణలకు ప్రతిపాదన
Posted On:
30 OCT 2021 9:57AM by PIB Hyderabad
దేశంలో పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించి ఉత్పత్తి అవుతున్న విద్యుత్ వినియోగాన్ని ఎక్కువ చేయడానికి ఇంధన పరిరక్షణ చట్టం 2001 కి సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులు, పెరుగుతున్న ఇంధన వినియోగ అంశాలను దృష్టిలో ఉంచుకుని నూతన రంగాల్లో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెరిగేలా చూడాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ ప్రతిపాదనలు చేసింది. పరిశ్రమలు, భవన నిర్మాణం, రవాణా లాంటి రంగాల్లో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ఎక్కువ చేయడానికి వీలుగా చట్టంలో సవరణలు ప్రతిపాదించడం జరిగింది.
విద్యుత్ రంగంతో సంబంధం ఉన్న వర్గాలతో చర్చలు జరిపిన తరువాత విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలకు రూపకల్పన చేసింది. ఒక సంస్థ లేదా పరిశ్రమలో వినియోగించే విద్యుత్ లో పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించి ఉత్పత్తి చేసే విద్యుత్ కనీస వినియోగం ఏమేరకు ఉండాలన్న అంశాన్ని నిర్దేశిస్తూ చట్టంలో మార్పులు చేయాలని ప్రతిపాదించారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే విధంగా ఇంధనాన్ని వినియోగించే సంస్థలకు కార్బన్ సేవింగ్ సర్టిఫికెట్ రూపంలో ప్రోత్సాహకాలను అందించడం జరుగుతుంది. చట్టంలో ప్రతిపాదించిన ఇటీవల సమీక్షించిన విద్యుత్ శాఖ మంత్రి శ్రీ ఆర్.కే.సింగ్ వీటిపై సంబంధిత మంత్రిత్వ శాఖలు/ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సలహాలు, సూచనలను పొందాలని అధికారులను ఆదేశించారు. దీనికి అనుగుణంగా విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీ అలోక్ కుమార్ 2021 అక్టోబర్ 28 వ తేదీన మంత్రిత్వ శాఖలు, సంస్థలతో చర్చలు జరిపి సవరణలకు తుది రూపు ఇచ్చారు.
చట్టాన్ని సమగ్రంగా పరిశీలించడానికి నాలుగు సమావేశాలను ( జాతీయ స్థాయిలో ఒక చర్చా వేదిక , మూడు ప్రాంతీయ సదస్సులు) విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఈ సమావేశాలలో అన్ని అంశాలను చర్చించి ప్రతిపాదించిన సవరణలను చర్చించి సంబంధిత వర్గాల అభిప్రాయాలను మంత్రిత్వ శాఖ సేకరించింది. సవరణల ప్రభావం ప్రత్యక్షంగా ఉండే సంస్థలకు కూడా వీటిని వివరించి వాటి అభిప్రాయాలను మంత్రిత్వ శాఖ తీసుకుంది. ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణల వల్ల దేశంలో కార్బన్ మార్కెట్ అభివృద్ధి సాధిస్తుంది. గ్రిడ్ ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిర్ధారించిన పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం జరుగుతుంది. దీనివల్ల శిలాజాల ఇంధన వనరుల వినియోగం తగ్గి పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది.
వాతావరణంలో మార్పులకు అనుగుణంగా ఇంధన వినియోగంలో మార్పులు తీసుకు రావడానికి ప్రపంచ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలలో భారతదేశం ముందున్నది. 2005 నాటి పరిస్థితులకు అనుగుణంగా 2030 నాటికి ఉద్గారాల విడుదలను 33-35% వరకు తగ్గించాలని భారతదేశం లక్ష్యంగా నిర్ణయించుకుని దీనికి అనుగుణంగా చర్యలను అమలు చేస్తోంది. 2030 నాటికి మొత్తం ఇంధన అవసరాలలో 40 శాతం అవసరాలను శిలాజ-ఇంధనేతర ఇంధన వనరులను వినియోగించి ఉత్పత్తి చేయాలని విధ్యుత్ మంత్రిత్వ శాఖ లక్ష్యంగా నిర్ణయించుకుని కార్యక్రమాలను అమలు చేస్తున్నది. ఇంధన వినియోగ సామర్ధ్యాన్ని ఎక్కువ చేసి 2030 నాటికి కార్బన్ డయాక్సైడ్ విడుదలను 550 ఎంటీ సీవో2 కి తగ్గించగల సామర్ధ్యాన్ని దేశం కలిగి ఉంది. చట్టంలో ప్రతిపాదించిన సవరణల వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థలోని వివిధ రంగాలలో కాలుష్య సమస్య లేని ఇంధన వినియోగం పెరుగుతుంది. శిలాజాల ఇంధన వనరుల వినియోగం తగ్గి గ్రీన్ హైడ్రోజన్ ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా అందుబాటులోకి వస్తుంది.
వాతావణం కలుషితం కానీ విధంగా ఇంధన వనరులను వినియోగించే సంస్థలకు ప్రోత్సహకాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రైవేట్ రంగాన్ని కూడా పర్యావరణ పరిరక్షణలో పాల్గొనేలా ప్రోత్సహిస్తాయి. భారీ నివాస భవనాలను కూడా చట్ట పరిధిలోకి తీసుకుని రావాలన్న ప్రతిపాదన వల్ల సుస్థిర ఆవాస ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి అవకాశం కలుగుతుంది.
అన్ని రంగాలలో చోటు చేసుకుంటున్న అభివృద్ధి వల్ల ఇంధన వినియోగం తప్పనిసరిగా పెరుగుతుందని విద్యుత్ మంత్రిత్వ శాఖ ఖచ్చితంగా చెబుతోంది. దేశ ఇంధన అవసరాలను పూర్తిగా చర్యలను అమలు చేయడంతో పాటు పర్యావరణ సమతుల్యం దెబ్బ తినకుండా చూడడానికి చర్యలను అమలు చేయవలసి ఉంటుందని అధికారులు అంటున్నారు. ఇంధన పరిరక్షణ చట్టం 2001 కి ప్రతిపాదించిన సవరణల వల్ల పారిస్ ఒప్పందం అమలుకు దేశం అమలు చేస్తున్న చర్యలకు సంస్థలు తమ సహాయ సహకారాలను అందించడానికి అవకాశం కలుగుతుంది. కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి వీలవుతుంది.
***
(Release ID: 1767871)