ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సహాధ్యక్షతలో 18వ భారత-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు
Posted On:
28 OCT 2021 7:09PM by PIB Hyderabad
ఆసియాన్ కు ప్రస్తుతం అధ్యక్ష స్థానంలో ఉన్న బ్రూనై సుల్తాన్ హాజీ హసనాల్ బోల్కియా ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం 18వ భారత-ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. వర్చువల్ గా జరిగిన ఈ శిఖరాగ్ర సదస్సులో ఆసియాన్ సభ్య దేశాల నాయకులు పాల్గొన్నారు.
భారత-ఆసియాన్ భాగస్వామ్యం 30వ వార్షికోత్సవ మైలురాయిని చేరిన సందర్భంగా 2022 సంవత్సరాన్ని భారత-ఆసియాన్ సంవత్సరంగా పాటించనున్నట్టు నాయకులు ప్రకటించారు. భారతదేశం అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇండియా-పసిఫిక్ విస్తృత భాగస్వామ్య విజన్ రెండింటిలోనూ ఆసియాన్ కేంద్రంగా ఉన్నదని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ఆసియాన్ ఇండో-పసిఫిక్ దృక్కోణం (ఎఓఐపి), భారత ఇండో-పసిఫిక్ సముద్ర చొరవ (ఐపిఓఐ) రెండింటి శక్తిని మరింత పటిష్ఠం చేస్తూ ప్రాంతీయ శాంతి, సుస్థిరత, సుసంపన్నతల కోసం సహకారం పేరిట రూపొందించిన భారత-ఆసియాన్ ఉమ్మడి ప్రకటనను ప్రధానమంత్రి, ఆసియాన్ నాయకులు ఆహ్వానించారు.
ప్రాంతీయంగా కోవిడ్-19 మహమ్మారిపై భారతదేశం సాగిస్తున్న పోరాటాన్ని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఈ విషయంలో ఆసియాన్ చొరవలకు మద్దతు అందిస్తామని పునరుద్ఘాటించారు. మయన్మార్ లో ఆసియాన్ చేపట్టిన మానవతాపూర్వక సహాయ కార్యక్రమాల కింద వైద్య సరఫరాల కోసం రెండు లక్షల డాలర్లు, ఆసియాన్ కోవిడ్-19 రెస్పాన్స్ ఫండ్ కు 10 లక్షల డాలర్లు భారతదేశం అందించిందని ఆయన చెప్పారు.
భారత-ఆసియాన్ దేశాల మధ్య భౌతిక, డిజిటల్, ప్రజా అనుసంధానతను మరింత విస్తృతంగా విస్తరించేందుకు గల అవకాశాలపై నాయకులు అభిప్రాయాలు తెలియచేసుకున్నారు. భారత-ఆసియాన్ సాంస్కృతిక అనుసంధానత బలోపేతం చేయడానికి వీలుగా ఆసియాన్ సాంస్కృతిక వారసత్వ జాబితా రూపకల్పనకు భారతదేశం మద్దతు అందిస్తుందని ప్రధానమంత్రి ప్రకటించారు. వాణిజ్యం, పెట్టుబడుల కోణాన్ని పరిశీలిస్తే కోవిడ్ అనంతర ఆర్థిక రికవరీలో సరఫరా వ్యవస్థల విస్తరణ, పటిష్ఠతకు ప్రాధాన్యం ఉన్నదంటూ ఈ దిశగా భారత-ఆసియాన్ ఎఫ్ టిఏను పునర్ నవీకరించవలసి ఉన్నదని ప్రధానమంత్రి చెప్పారు.
ప్రాంతీయంగా విశ్వసనీయ భాగస్వామిగాను, ప్రత్యేకించి ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి కాలంలో వ్యాక్సిన్ సరఫరాల ద్వారా అందిస్తున్న భారతదేశం పోషిస్తున్న పాత్రను, సహకారాన్ని ఆసియాన్ నాయకులు ప్రశంసించారు. అలాగే ఇండో-పసిఫిక్ సహకార భాగస్వామ్యంలో ఆసియాన్ కేంద్ర స్థానంగా నిలవడానికి భారతదేశం అందిస్తున్న మద్దతును వారు ఆహ్వానించారు. ఉమ్మడి ప్రకటన ద్వారా భారత-ఆసియాన్ సహకారం మరింత విస్తరించుకోవడానికి తాము ఎదురు చూస్తున్నట్టు తెలిపారు.
దక్షిణ చైనా సాగరం, ఉగ్రవాదం సహా అందరికీ ఆసక్తి, ఆందోళన గల ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా నాయకులు చర్చించారు. అంతర్జాతీయ చట్టాలు ప్రత్యేకించి యుఎన్ సిఎల్ఓఎస్ పరిధిలో అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడుతూ నిబంధనల ఆధారిత వ్యవస్థను ప్రోత్సహించవలసిన ప్రాధాన్యతను నాయకులు గుర్తించారు. దక్షిణ చైనా సముద్రంలో శాంతి, సుస్థిరత, భద్రత, సెక్యూరిటీ నిర్వహణ, ప్రోత్సాహం ప్రాధాన్యతను నాయకులు పునరుద్ఘాటిస్తూ సాగర జలాల్లో నౌకల రవాణాకు, సముద్ర జలాల మీదుగా గగనతలంలో విమానాల రాకపోకలకు స్వేచ్ఛ ఉండాలని అభిప్రాయపడ్డారు.
భారత, ఆసియాన్ దేశాల మధ్య లోతైన, బలీయమైన, బహుముఖీన సంబంధాలున్నాయంటూ ఇందుకు సంబంధించిన పలు అంశాలను అత్యున్నత స్థాయిలోసమీక్షించి, భారత-ఆసియాన్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త దిశ కల్పించేందుకు 18వ భారత-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు చక్కని అవకాశంగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు.
(Release ID: 1767426)
Visitor Counter : 243
Read this release in:
Hindi
,
Marathi
,
Gujarati
,
Kannada
,
Malayalam
,
English
,
Urdu
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil