ప్రధాన మంత్రి కార్యాలయం
సీవీసీ , సీబీఐ సంయుక్త సమావేశానికి వీడియో సందేశం పంపిన ప్రధానమంత్రి
“గత 6-7 ఏళ్లలో అవినీతిని అరికట్టగలమనే విశ్వాసం ప్రజల్లో కలిగించడంలో ప్రభుత్వం విజయవంతమైంది”
“నేడు అవినీతి నిర్మూలనకు గట్టి రాజకీయ సంకల్పం ఉంది.. పాలన స్థాయిలోనూ నిరంతర మెరుగుదల కొనసాగుతోంది”
“నవ భారతం ఆవిష్కరిస్తుంది.. ఆరంభిస్తుంది.. అమలు చేస్తుంది; ‘అవినీతి వ్యవస్థాగతం’ అనే మాటకు నేడు తావులేదు; వ్యవస్థలు పారదర్శకంగా.. ప్రక్రియలు సమర్థంగా.. పాలన సజావుగా ఉండాలన్నదే నవ భారతం ఆకాంక్ష”
“సామాన్య జనజీవనంలో ప్రభుత్వ జోక్యం తగ్గింపు దిశగా అధికార ప్రక్రియల సరళీకరణ ద్వారా ఉద్యమం తరహాలో ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది”
“ప్రజా విశ్వాసంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వాణిజ్య సౌలభ్యం.. సుపరిపాలన బలోపేతం”
“సాంకేతికత.. అప్రమత్తత.. సరళత.. స్పష్టత.. పారదర్శకతలతో నిరోధక నిఘా ప్రక్రియలు పటిష్ఠం; ఇది మన పని సులభం చేస్తూ దేశ వనరులనూ ఆదాచేస్తుంది”
“దేశాన్ని.. దేశ పౌరులను మోసగించే ఏ ఒక్కరికీ
స్థానం లేదన్న వాస్తవాన్ని సుస్పష్టం చేయాలి”
“సీవీసీ, సీబీఐ.. తదితర అవినీతి నిరోధక సంస్థలు నవ భారతానికి అడ్డుపడే ప్రక్రియలను తొలగించాలి”
Posted On:
20 OCT 2021 10:05AM by PIB Hyderabad
గుజరాత్‌లోని కేవడియాలో సీవీసీ, సీబీఐ సంయుక్త సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో సందేశం పంపారు. ఈ సందర్భంగా భారతదేశ ప్రగతి, ప్రజా సమస్యలు, జన సంక్షేమం ఆధారిత పరిపాలనకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన సర్దార్ పటేల్ ఉనికికి నిలయమైన కేవడియాలో ఈ సంయుక్త సమావేశం జరుగుతుండటాన్ని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. “నేడు అమృత కాలంలో భారతదేశం సమున్నత లక్ష్యాల సాధన దిశగా పురోగమిస్తోంది. ఇవాళ మనం ప్రజానుకూల, చురుకైన పరిపాలన బలోపేతంపై నిబద్ధత ప్రదర్శిస్తున్న సమయంలో మీ చర్య-ఆధారిత శ్రద్ధాసక్తులు సర్దార్ సాహెబ్ ఆశయాలకు మరింత బలం చేకూరుస్తాయి” అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.
జాతి జీవనంలోని అన్నిరంగాల్లోనూ అవినీతి నిర్మూలనకు సీవీసీ, సీబీఐ అధికారులంతా పునరంకితం కావాలని ప్రధాని పిలుపునిచ్చారు. అవినీతి ప్రజల హక్కులను హరించి, అందరికీ న్యాయం దిశగా సాగే కృషిని, దేశ ప్రగతిని నిరోధిస్తుందని, జాతి సామూహిక శక్తిని నిర్వీర్యం చేస్తుందని ఆయన అన్నారు. గడచిన 6-7 ఏళ్ల పాలనలో అవినీతిని అరికట్టగలమనే విశ్వాసాన్ని ప్రజలకు కలిగించడంలో ప్రభుత్వం విజయవంతమైందని ప్రధాని నొక్కిచెప్పారు. దళారులు, లంచాలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందగలమన్న నమ్మకం ప్రజల్లో పాదుకొన్నదని ఆయన పేర్కొన్నారు. నేడు ప్రజలు ఎక్కడికి వెళ్లినా, అవినీతిపరులు ఎంతటి ఉన్నతస్థానంలో ఉన్నప్పటికీ వారికి పుట్టగతులుండవని గ్రహించారని చెప్పారు. “లోగడ ప్రభుత్వాలు, వ్యవస్థలు అటు రాజకీయ, ఇటు పరిపాలన సంకల్పం ఏదీ లేకుండా నడిచేవి. కానీ, నేడు గట్టి రాజకీయ సంకల్పంతోపాటు పరిపాలన స్థాయిలోనూ నిరంతర మెరుగుదల కొనసాగుతోంది” అని వివరించారు. పరివర్తనాత్మక భారతం గురించి ప్రస్తావిస్తూ- “నేటి 21వ శతాబ్దపు భారతదేశం ఆధునిక ఆలోచనా విధానంతోపాటు మానవాళి ప్రయోజనాల కోసం సాంకేతిక పరిజ్ఞాన వినియోగ ప్రాధాన్యాన్ని నలుదిశలా చాటుతోంది. ఆ మేరకు నవ భారతం ఆవిష్కరిస్తుంది.. ఆరంభిస్తుంది.. అమలు చేస్తుంది. ‘అవినీతి వ్యవస్థాగతం’ అనే మాటకు నేడు తావులేదు. వ్యవస్థలు పారదర్శకంగా.. ప్రక్రియలు సమర్థంగా.. పాలన సజావుగా ఉండాలన్నదే నవ భారతం ఆకాంక్ష” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
గరిష్ఠ నియంత్రణ, గరిష్ఠ విధ్వంసం పరిస్థితుల నుంచి ‘కనిష్ఠ జోక్యం-గరిష్ఠ పాలన’వైపు ప్రభుత్వ పయనాన్ని ప్రధానమంత్రి వివరించారు. ఆ మేరకు సామాన్య జనజీవనంలో ప్రభుత్వ జోక్యం తగ్గింపు దిశగా అధికార ప్రక్రియల సరళీకరణ ద్వారా ఉద్యమం తరహాలో ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోందని ఆయన గుర్తుచేశారు. పౌరులకు సాధికారత కల్పనలో నమ్మకానికి, సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి ప్రభుత్వం ఏ విధంగా ప్రాధాన్యమిచ్చిందో ప్రధాని విశదీకరించారు. ఈ ప్రభుత్వం తన ప్రజలపై ఎన్నడూ అవిశ్వాసం ప్రకటించదని, ఆ మేరకు అనేక అంచెల ధ్రువీకరణ పత్రాల బెడదను తొలగించామని చెప్పారు. అంతేకాకుండా జనన ధ్రువీకరణ, పెన్షన్ల కోసం సజీవ ధ్రువీకరణ తదితరాలను దళారుల ప్రమేయం లేకుండా నేరుగా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నేరుగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో ‘గ్రూప్-సి, డి’ నియామకాల్లో ఇంటర్వ్యూల విధానాన్ని రద్దుచేశామని తెలిపారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ బుకింగ్ నుంచి పన్ను పత్రాల దాఖలుదాకా ఆన్‌లైన్ సమర్పణకు వీలు కల్పించడంద్వారా అవినీతికి అవకాశాలను తగ్గించామని చెప్పారు.
ప్రజా విశ్వాసంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వాణిజ్య సౌలభ్యం.. సుపరిపాలన బలోపేతమయ్యాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వ్యాపార నిర్వహణకు అనుమతులు, అనుసరణలకు సంబంధించి అనేక కాలం చెల్లిన నిబంధనలను రద్దుచేశామని ఆయన వివరించారు. అయినప్పటికీ నేటి సవాళ్లకు తగినట్లుగా పలు కఠిన చట్టాలను కూడా తెచ్చామని గుర్తుచేశారు. ఇంకా తొలగించాల్సిన అనేక నియమనిబంధనలు ఉన్నాయని, ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే పలు అనుమతులు, అనుసరణల ప్రక్రియలకు ముఖాముఖి హాజరతో నిమిత్తం లేకుండా చేశామన్నారు. దీంతోపాటు స్వీయ అంచనాలు, స్వీయ ప్రకటనలు వంటివాటిని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ప్రవేశపెట్టిన ‘జిఈఎం’.. ప్రభుత్వ ఇ-మార్కెట్ ద్వారా టెండర్ల విధానంలో పారదర్శకత తెచ్చామని తెలిపారు. డిజిటల్ నమూనాలతో పరిశోధనలు సుగమం అయ్యాయని, అదేవిధంగా జాతీయ బృహత్ ప్రణాళిక ‘పీఎం గతిశక్తి’తో విధాన నిర్ణయాల సంబంధిత కష్టనష్టాలు తొలగిపోతాయన్నారు. విశ్వాస కల్పన, సాంకేతికత వినియోగం దిశగా ఈ పురోగమనంలో ‘సీవీసీ, సీబీఐ’ వంటి అవినీతి నిరోధక వ్యవస్థలుసహా, అధికారులపై దేశానికి విశ్వాసం ఎంతో కీలకమని ఆయన నొక్కిచెప్పారు. “మనకు ఎల్లప్పుడూ దేశానికి అగ్ర ప్రాధాన్యమే పరమోద్దేశం కావాలి. ప్రజా సంక్షేమం, ప్రజల సమస్యల పరిష్కారం గీటురాళ్లుగా మన పనితీరును మనం అంచనా వేసుకోవాలి” అని స్పష్టం చేశారు. ఈ అంచనాలను అందుకోగల ‘కర్తవ్య నిబద్ధత’గలవారికి తాను సదా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ప్రధానమంత్రి “నిరోధక నిఘా”పై తన అభిప్రాయాలను అధికారులతో పంచుకున్నారు. అప్రమత్తంగా ఉండటం ద్వారా ‘నిరోధక నిఘా’ లక్ష్యాన్ని సాధించవచ్చునని, దీన్ని అనుభవంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం తోడ్పాటుతో మరింత బలోపేతం చేయవచ్చునని ఆయన చెప్పారు. అలాగే సాంకేతికతసహా అప్రమత్తత, సరళత, స్పష్టత, పారదర్శకతలతో నిరోధక నిఘా ప్రక్రియలు పటిష్ఠం కాగలవన్నారు. మరోవైపు ఇది మన పనిని సులభం చేయడమేగాక దేశ వనరులను కూడా ఆదా చేస్తుందని ఆయన వివరించారు. అవినీతిపరులపై చర్యలు తీసుకోవడంలో ఎంతమాత్రం సంకోచించవద్దని, దేశాన్ని, దేశ పౌరులను మోసగించే ఏ ఒక్కరికీ స్థానం లేదన్న వాస్తవాన్ని సుస్పష్టం చేయాలని ఉద్బోధించారు. వ్యవస్థలపై నిరుపేదల మనసులోగల భయాలను తొలగించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన చెప్పారు. సాంకేతిక, సైబర్ మోసాల సవాళ్లపై లోతుగా చర్చించాలని సమావేశానికి సూచించారు.
స్వాతంత్ర్య దినోత్సవం నాటి తన ప్రసంగంలో చట్టాలు, ప్రక్రియల సరళీకరణపై పిలుపునివ్వడాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఇందులో భాగంగా నవ భారత నిర్మాణానికి అవరోధాలు కాగల ప్రక్రియలను తొలగించాని సీవీసీ, సీబీఐ.. తదితర అవినీతి నిరోధక సంస్థలకు దిశానిర్దేశం చేశారు. “అవినీతిని సమూలంగా నిర్మూలించాలన్న నవ భారత విధానాన్ని మీరు మరింత బలోపేతం చేయాలి. పేదలు వ్యవస్థలకు చేరువ కావడం… అవినీతిపరుల ఏరివేతకు అనుగుణంగా చట్టాలను అమలు చేయాలి” అని అధికారులకు మార్గం నిర్దేశిస్తూ ప్రధానమంత్రి తన సందేశాన్ని ముగించారు.
(Release ID: 1765142)
Visitor Counter : 187
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam