ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

ప్రభుత్వాన్ని జన-సన్నిహితం చేయడంలో ప్రజా సమాచార ప్రదాతల పాత్ర కీలకం: ఉప రాష్ట్రపతి


సుపరిపాలన.. పారదర్శకతలకు సమర్థ సమాచార ప్రదానమే కీలకం;

శిక్షణలోగల ఐఐఎస్‌ అధికారులకు ఇవాళ ఉప రాష్ట్రపతి పిలుపు;

సరైన సమాచారంతో ప్రజలకు సాధికారత: ప్రొబేషనర్లకు ఉప రాష్ట్రపతి సూచన;

“ఉన్నత లక్ష్యం… గొప్ప స్వప్నం.. కఠోర శ్రమ.. క్రమశిక్షణ”లే
జీవితంలో విజయాలకు నా తారక మంత్రం: ఉప రాష్ట్రపతి

Posted On: 19 OCT 2021 4:23PM by PIB Hyderabad

   సుపరిపాలనలో సమర్థ సమాచార ప్రదానానికిగల కీలక పాత్రను ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు నొక్కిచెప్పారు. ప్రభుత్వ విధానాలు, వినూత్న చర్యల గురించి సకాలంలో, స్థానిక భాషల్లో చేరవేయడం ద్వారా ప్రజలకు సాధికారత కల్పించాల్సిందిగా సమాచార ప్రదాతలకు ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఇవాళ ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌ (ఐఐఎస్‌)-2020 బ్యాచ్‌ శిక్షణార్థి అధికారుల బృందంతో ఆయన సమావేశమయ్యారు. ప్రభుత్వాలు-పౌరుల మధ్య అంతరాన్ని తొలగించడంలో ప్రజా సమాచార ప్రదాతలు కీలక పాత్ర పోషిస్తారని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. “వివిధ పథకాల గురించి మీరు సరళమైన, స్పష్టమైన స్థానిక భాషలో ప్రజలకు సమాచారం ఇవ్వగలిగితే తమ హక్కులేమిటో, ప్రభుత్వ ప్రక్రియలు ఎలా ఉంటాయో వారు మెరుగైన రీతిలో అవగాహన చేసుకోగలరు. తద్వారా పారదర్శకత ప్రతిఫలిస్తుంది” అని ఆయన ప్రొబేషనరీ అధికారులకు ప్రబోధించారు.

   ప్రభుత్వ సమాచార ప్రదానంలో ‘సందిగ్ధరహిత సమాచారం’ అత్యంత ముఖ్యమైనది శ్రీ నాయుడు స్పష్టం చేశారు. ఆ మేరకు అవాస్తవ, అబద్ధపు వార్తల బెడదను సమర్థంగా ఎదుర్కొనడంపై నిశిత దృష్టి సారించాలని ‘ఐఐఎస్‌’ అధికారులకు సూచించారు. కొన్ని వర్గాల ప్రజల్లో ‘లైంగిక అసమానతలు, టీకాలపై సందేహాలు’ వంటి అంశాలపై అనుమానం-సందేహం ఉన్నాయని, అటువంటి సామాజిక అంశాలు ఇతివృత్తంగా పనిచేయాలని ఆయన కోరారు. సమాచార మాధ్యమాలు శక్తిమంతమైన ఉపకరణాలని, ఆకాంక్షిత పరివర్తనను తేవడంలో వాటిని బాధ్యతాయుతంగా వాడుకోవాల్సి ఉందని ఆయన సూచించారు. తదనుగుణంగా “సంధాన కండి… సమాచారమివ్వండి… మార్పు తెండి” అని తనదైన శైలిలో ఉప రాష్ట్రపతి ఉద్బోధించారు.

   ఐఎస్‌ శిక్షణార్థి అధికారులు ప్రస్తుతం హైదరాబాద్‌లోని పత్రికా సమాచార సంస్థ ప్రాంతీయ కార్యాలయంతోపాటు సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర మాధ్యమ కార్యాలయాలకు అనుసంధానమై శిక్షణ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సివిల్‌ సర్వీసెస్‌ను ఎంచుకోవడంపై యువ అధికారులను ఉప రాష్ట్రపతి అభినందించారు. సరైన సమాచార ప్రదానం ద్వారా ప్రజలకు సాధికారత కల్పించడంలో ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌ అధికారులు కీలక పాత్ర పోషిస్తారని ఆయన గుర్తుచేశారు.

   సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన తాను దేశంలోని ఉన్నత పదవులలో ఒకదాన్ని అందుకోగలగడం గురించి ఈ సందర్భంగా శ్రీ నాయుడు గుర్తుచేసుకున్నారు. “ఉన్నత లక్ష్యం… గొప్ప స్వప్నం.. కఠోర శ్రమ.. క్రమశిక్షణలే జీవితంలో విజయాలు సాధించడానికి నాకు తారక మంత్రంగా ఉపయోగపడ్డాయి” అని యువ సివిల్‌ సర్వీస్‌ అధికారులకు తెలియజేశారు. విజయ సాధనలో అంకితభావం ఎంతమాత్రం చెదిరిపోకుండా కృషిని కొనసాగించాలని శిక్షణార్థి అధికారులకు సలహా ఇచ్చారు. క్రీడలుసహా వివిధ భౌతిక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటూ శరీర దృఢత్వాన్ని కాపాడుకోవాల్సిందిగా శిక్షణార్థి అధికారులకు ఉప రాష్ట్రపతి సూచించారు. “మెరుగైన భవిష్యత్తు దిశగా ముందడుగు వేయడంలో నేడు మనం చేసే పని అటు ప్రకృతితో, ఇటు సంస్కృతితో ముడిపడినదై ఉండాలి” అని ఆయన ప్రబోధించారు.

   అంతకుముందు పీఐబీ-ఆర్‌ఓబీ, హైదరాబాద్‌ కార్యాలయ డైరెక్టర్‌ శ్రీమతి శృతి పాటిల్‌; డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీ మానస్‌ కృష్ణకాంత్‌లు రాష్ట్రంలో ఈ ప్రాంతీయ కార్యాలయ సంధాన శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఉప రాష్ట్రపతికి వివరించారు. ఉప రాష్ట్రపతి సచివాలయానికి చెందిన సీనియర్‌ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

***


(Release ID: 1764928) Visitor Counter : 208