రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

భాస్వరం, పొటాష్ ఎరువులకు పోషకాధారిత సబ్సిడీ రేట్లు!


సి.సి.ఇ.ఎ. ఆమోదం,..2021-22 సంవత్సరంలో అమలు..
(2021 అక్టోబరు 1నుంచి 2022 మార్చి 31వరకూ వర్తింపు)

2021-22 రబీ సీజన్.లో నిఖర సబ్సిడీ రూ. 28,655 కోట్లు

Posted On: 12 OCT 2021 8:34PM by PIB Hyderabad

     భాస్వరం, పొటాష్ (పి అండ్ కె) ఆధారితమైన ఎరువులకు పోషకాధారిత సబ్సిడీ (ఎన్.బి.ఎస్.) సబ్సిడీ రేట్లను ఖరారు చేస్తూ, కేంద్ర ఎరువుల శాఖ చేసిన ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతలోని ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సి.సి.ఇ.ఎ.)  ఆమోదముద్ర వేసింది. 2021-22వ సంవత్సరంలో, అక్టోబరు నెల 1నుంచి 2022  మార్చి నెలాఖరు వరకూ ఈ సబ్సిడీ రేట్లు వర్తిస్తాయి. సి.సి.ఇ.ఎ. ఆమోదించిన సబ్సిడీ రేట్లు ఈ కింది పట్టికలో చూడవచ్చు.:

 

  కిలోగ్రాముకు సబ్సిడీ రేట్లు (రూపాయల్లో)

 

ఎన్ (నత్రజని)

 

పి (భాస్వరం)

 

కె (పొటాష్)

 

ఎస్ (గంధకం)

 

18.789

 

45.323

 

10.116

 

2.374

 

 

(i) సబ్సిడీ రూపంలో అందించే మొత్తం సొమ్ము రూ. 28,602 కోట్లు అవుతుంది.

(ii)  డై అమోనియం పాస్పేట్ (డి.ఎ.పి.)పై అదనపు సబ్సిడీకోసం ఏకకాలం ప్యాకేజీగా చెల్లించే ప్రత్యేక ప్యాకేజీ.. రూ. 5,716కోట్ల  అదనపు తాత్కాలిక వ్యయంతో చెల్లింపు.

(iii) ఎక్కువగా వినియోగించే నత్రజని, భాస్వరం, పొటాష్ (ఎన్.పి.కె.) గ్రేడ్ ఎరువుకోసం చెల్లించే అదనపు సబ్సిడీ కోసం ఏకకాలపు ప్రత్యేక ప్యాకేజీ. ఎన్.పి.కె. 10-26-26, ఎన్.పి.కె. 20-20-0-13, ఎన్.పి.కె. 12-32-16 వంటి ఎరువులకోసం ఈ అదనపు సబ్సిడీని అందిస్తారు. రూ. 837కోట్ల అదనపు వ్యయంతో ఈ సబ్సిడీ సదుపాయం కల్పిస్తారు. ఇందుకోసం మొత్తం రూ. 35,115కోట్ల మేర సబ్సిడీ అవసరమవుతుంది.

పోషకాల ఆధారిత సబ్సిడీ పథకం కింద మొలాసెస్.నుంచి తీసే పొటాష్.ను కూడా చేర్చాలన్న ప్రతిపాదనకు కూడా సి.సి.ఇ.ఎ. ఆమోదం తెలిపింది

 

ఆర్థిక పర్యవసానాలు:

2021-22వ సంవత్సరం రబీ సీజన్లో కావలసిన నిఖరమైన సబ్సిడీ రూ. 28,655 కోట్లు అవుతుంది.

 

ప్రయోజనాలు:

ఈ నిర్ణయంతో 2021-22వ సంవత్సరపు రబీ సీజన్లో సబ్సిడీపై, అందుబాటు ధరల్లో భాస్వరం, పొటాషియం ఎరువులు రైతులకు లభిస్తాయి. ప్రస్తుత సబ్సిడీ స్థాయిని కొనసాగించడం,.. డి.ఎ.పి.తోపాటుగా ఎక్కువగా వినియోగించే నత్రజని, భాస్వరం, పొటాష్ (ఎన్.పి.కె.) గ్రేడ్ ఎరువులకు అదనపు ప్రత్యేక ప్యాకేజీలు అందించడం వంటి చర్యలతో వ్యవసాయ రంగానికి మద్దతు లభిస్తుంది.

  పైగా, డి.ఎ.పి.పై బస్తాకు 438 రూపాయల చొప్పున.., ఎన్.పి.కె. 10-26-26, ఎన్.పి.కె. 20-20-0-13, ఎన్.పి.కె. 12-32-16లకు సంబంధించి ఒక్కొక్క బస్తాపై వందరూపాయల ప్రయోజనం లభిస్తుంది. ఈ ఎరువుల ధరలను రైతులకు అందుబాటులో ఉండేలా కొనసాగించేందుకు సి.సి.ఇ.ఎ. నిర్ణయం దోహదపడుతుంది.

 

సబ్సిడీ అమలు వ్యూహం, లక్ష్యాలు:

 భాస్వరం, పొటాష్ ఆధారిత ఎరువులు సజావుగా అందుబాటు ధరల్లో రైతులకు లభించేందుకు తగిన చర్యలు తీసుకుంటారు.  సి.సి.ఇ.ఎ. ఆమోదించిన ఎన్.బి.ఎస్. రేట్ల ఆధారంగానే భాస్వరం, పొటాష్ ఎరువులపై సబ్సిడీన సదుపాయాన్ని రైతులకు అందిస్తారు.

 

నేపథ్యం:

  యూరియాతో పాటుగా భాస్వరం, పొటాష్ ఎరువులకు సంబంధించిన 24 గ్రేడ్ల ఎరువులను ఎరువుల తయారీదార్లు, దిగుమతిదార్ల ద్వారా సబ్సిడీ ధరలపై రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ వస్తోంది. భాస్వరం, పొటాష్ ఎరువులపై సబ్సిడీకోసం  2010 ఏప్రిల్ ఒకటవ తేదీనుంచి పోషకాల ఆధారిత సబ్సిడీ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. రైతు హితమైన ప్రభుత్వ విధానానికి అనుగుణంగా, భాస్వరం, పొటాష్ ఎరువులు రైతులకు అందుబాటు యోగ్యంగా ఉంచేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో పైన పేర్కొన్న రేట్ల ప్రకారం ఎరువుల కంపెనీకి సబ్సిడీని విడుదల చేస్తారు. రైతులకు అందుబాటులో ధరల్లో ఎరువులు లభ్యమయ్యేలా తయారీ కంపెనీలు తగిన చర్యలను తీసుకునేందుకు ఇది చర్య వీలు కలిగిస్తుంది. 

 

*****



(Release ID: 1763456) Visitor Counter : 251