మంత్రిమండలి

సైనిక్ స్కూల్ సొసైటీతో ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలోని 100 పాఠశాలల అనుబంధానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం


2022-23 విద్యా సంవత్సరం నుంచి కొత్త పాఠశాలల్లో VI తరగతిలో 5,000 మంది విద్యార్థులకు ప్రవేశం

Posted On: 12 OCT 2021 8:25PM by PIB Hyderabad

దేశ సంస్కృతి, వారసత్వ విలువలను పరిరక్షిస్తూ విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలన్న లక్ష్యంతో కేంద్రం  నూతన విద్యా విధానానికి రూపకల్పన చేసింది. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, క్రమశిక్షణ అలవరచడం, దేశభక్తిని పెంపొందించడం లక్ష్యంగా నూతన విద్యా విధానం అమలు లోకి వచ్చింది. దీనిలో భాగంగా సైనిక్ స్కూళ్ల నిర్వహణా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకుని రావడానికి వీలు కల్పించే విధానానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశం అయిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న సైనిక్ స్కూల్స్ సొసైటీ కి అనుబంధంగా పాఠశాలలను ప్రారంభించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పనిచేస్తున్న సైనిక్ స్కూళ్లకు సమాంతరంగా  విభిన్నంగా     నూతన పాఠశాలలు పనిచేస్తాయి. రాష్ట్రాలు/ స్వచ్చంద సేవా సంస్థలు/ ప్రైవేట్ రంగాలకు చెందిన 100 పాఠశాలలకు అనుబంధ హోదా ఇవ్వాలని నిర్ణయించారు. 

ప్రయోజనాలు:

*దేశంలోని అన్ని ప్రాంతాలలో ఏకువ మందికి తక్కువ ఖర్చుతో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. 

*సైనిక్ పాఠశాలలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చి  సమర్థవంతమైన శారీరక, మానసిక-సామాజిక, ఆధ్యాత్మిక, మేధో, భావోద్వేగ  వికాసాన్ని అందించడం.

*శిక్షణ వ్యవధి, శిక్షకుల నియామకం, నిర్వహణ మరియు కార్యకలాపాల బడ్జెట్‌లలో పొదుపు.  వివిధ రంగాలలో ప్రవేశించడానికి మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. 

వివరాలు:

సైనిక్ పాఠశాలలు మంచి నాణ్యతా విలువలతో కూడిన విద్యను  తల్లిదండ్రులు వారి  పిల్లలకు చేరువలోకి తీసుకుని రావడమే కాకుండా నాయకత్వ లక్షణాలను అలవరచి సైనిక దళాల్లో అత్యున్నత స్థానాలను చేరుకోవడానికి అవసరమైన విద్యను అందిస్తున్నాయి. వీటిలో విద్యను పూర్తి చేసిన విద్యార్థులు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, జ్యుడీషియల్ సర్వీసెస్ మరియు సైన్స్ వంటి ఇతర రంగాలలో అత్యున్నత స్థాయికి చేరుకోవడమే కాకుండా పారిశ్రామికవేత్తలుగా కూడా రాణిస్తున్నారు. దీనితో 

 సైనిక్ పాఠశాలలను తెరవాలనే డిమాండ్ పెరుగుతోంది.

ప్రస్తుతం దేశంలో 33 సైనిక్ స్కూళ్ళు పనిచేస్తున్నాయి. వీటి నిర్వహణలో సాధించిన అనుభవాలతో సైనిక్ స్కూల్స్ సొసైటీకి అనుబంధంగా పనిచేసే నూతన పాఠశాలలను నెలకొల్పడానికి  దరఖాస్తులను ఆహ్వానించాలని నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వ/ప్రైవేట్ పాఠశాలలు/ స్వచ్చంధ సంస్థలు తమ నిర్వహణలో పనిచేస్తున్న లేదా కొత్తగా ప్రారంభించే పాఠశాలలు అనుబంధ హోదా పొందడానికి దరఖాస్తులను సమర్పించవలసి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా URL https://sainikschool.ncog.gov.in లో దరఖాస్తులను  సమర్పించవచ్చు. ఈ వెబ్ సైట్ లో పూర్తి వివరాలను పొందవచ్చు. 

మంత్రివర్గ ఆమోదం పొందిన పథకం వల్ల ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో విద్యా రంగంలో నూతన ఒరవడి ప్రారంభం అవుతుంది. ప్రైవేట్/ప్రభుత్వ నిర్వహణలో ఉన్న పాఠశాలల మౌలిక సౌకర్యాలను పూర్తిగా వినియోగించుకోవడానికి, సైనిక్ స్కూల్ తరహా విద్యను పొందడానికి అవకాశాలను ఎక్కువ చేస్తాయి. 

2022-23 విద్యా సంవత్సరం నుంచి 100 అనుబంధ పాఠశాలల్లో ఆరవ తరగతిలో దాదాపు 5,000 మందికి ప్రవేశం కల్పించడం జరుగుతుంది. ప్రస్తుతం పనిచేస్తున్న 33 సైనిక్ స్కూళ్లలో ఆరవ తరగతిలో 3,000 మందికి ప్రవేశాలు కల్పిస్తున్నారు. 

ప్రభావం:

 సైనిక్ స్కూల్స్ విద్యా వ్యవస్థని సాధారణ విద్యా విధానంతో ఏకీకృతం చేయడం వల్ల విద్యాపరంగా , శారీరకంగా దృఢమైన విద్యార్థులను రూపొందించడానికి అవకాశం కలుగుతుంది. వీరు  సాంస్కృతి అంశాలతో పాటు అన్ని అంశాలపై  అవగాహన కలిగి ఉంటారు. జాతీయవాద లక్ష్యాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వడంపై దృష్టి సారించిన నాయకత్వ లక్షణాలతో నమ్మకమైన, అత్యంత నైపుణ్యం కలిగిన, బహుళ-పరిమాణ, దేశభక్తి గల యువజన శక్తిని రూపొందించాలన్న లక్ష్యంతో ఈ పధకానికి రూపకల్పన జరిగింది. 



(Release ID: 1763445) Visitor Counter : 249