ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి హరిత రిబ్బన్లను పంపిణీ చేసిన డా.మన్‌సుఖ్ మాండవీయ
పరిపూర్ణ ఆరోగ్యంలో మానసిక ఆరోగ్యం కీలక భాగం; మానసిక అనారోగ్యాలను పరిష్కరించాలంటే దానిపై అవగాహన అత్యంత అవసరం: కేంద్ర ఆరోగ్య మంత్రి
Posted On:
08 OCT 2021 3:01PM by PIB Hyderabad
"పరిపూర్ణ ఆరోగ్యంలో మానసిక ఆరోగ్యం కీలక భాగం; మానసిక అనారోగ్య సమస్యలు పరిష్కరించడానికి దానిపై అవగాహన అత్యంత అవసరం" అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా.మన్‌సుఖ్ మాండవీయ చెప్పారు. మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి హరిత రిబ్బన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ నెల 5న ప్రారంభమై, 10వ తేదీ వరకు కొనసాగనున్న 'మానసిక ఆరోగ్య అవగాహన వారం'లో చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా, దిల్లీలోని హన్స్‌రాజ్ కళాశాల భాగస్వామ్యంతో, మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 10వ తేదీని 'ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం'గా జరుపుకుంటారు.
ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రిత్వ శాఖ అధికారులు, మీడియా ప్రతినిధులకు, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి కేంద్ర మంత్రి హరిత రిబ్బన్లు పంపిణీ చేశారు. తోటివారిలో, సమాజంలోనూ మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని హన్స్‌రాజ్ కళాశాల విద్యార్థులను కోరారు.
“ఈ హరిత రిబ్బన్ మానసిక ఆరోగ్యానికి చిహ్నం. మానసిక ఆరోగ్యం గురించి మన సమాజంలో చాలా అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది" అని డా.మాండవీయ అన్నారు. అభివృద్ధికి అన్ని రకాల ఆరోగ్యం, శ్రేయస్సు అవసరమని స్పష్టీకరించారు. "ఆరోగ్యవంతమైన వ్యక్తులు లేకుండా, ఆరోగ్యకరమైన కుటుంబం, ఆరోగ్యకరమైన సమాజం, ఆరోగ్యకరమైన దేశం ఏర్పడవు. శారీరక లేదా మానసిక అనారోగ్యం తక్కువ ఉత్పాదకతకు దారితీస్తుంది. తద్వారా దేశాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది” అని చెప్పారు.
భారతదేశంలో మానసిక ఆరోగ్య సమస్యలపై చురుగ్గా వ్యవహరించాలని సమావేశానికి వచ్చినవారిని కేంద్ర మంత్రి కోరారు. "ప్రతి పది మంది విద్యార్థుల్లో ముగ్గురు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మన పిల్లల్లో 14% మందికి ఈ ఇబ్బందులు ఉన్నాయి. సాయం అవసరమైన యువతను గుర్తించడానికి, వారికి వెన్నుదన్నుగా నిలవడానికి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, సంబంధిత వర్గాలను చైతన్యపరచాల్సిన అవసరం ఉంది" అని సూచించారు. "మానసిక ఆరోగ్య సమస్యలపై మొదట మన కుటుంబ సభ్యులతో మాట్లాడాలి, క్రమంగా పాఠశాల స్థాయికి విస్తరించాలి. పిల్లలలో మానసిక అనారోగ్యాన్ని సులభంగా గుర్తించగలిగేలా మన ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది” అని మంత్రి తెలిపారు. మానసిక ఆరోగ్య సమస్యను గుర్తించడం ఎంత ముఖ్యమో, చికిత్స అందించడం కూడా అంతే ముఖ్యమని చెప్పారు.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డా.సునీల్ కుమార్, అదనపు కార్యదర్శి, మిషన్ డైరెక్టర్ (జాతీయ ఆరోగ్య మిషన్) శ్రీ వికాశ్ షీల్, జాయింట్ సెక్రటరీ (విధానాలు) శ్రీ విశాల్ చౌహాన్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
****
(Release ID: 1762434)