నౌకారవాణా మంత్రిత్వ శాఖ
ప్రధాని దార్శనికతకు అనుగుణంగా నౌకాయాన సంస్థ సేవలు!
కేంద్ర నౌకాయాన మంత్రి సోనోవాల్ ప్రశంసలు..
వజ్రోత్సవాలు సంబరాల్లో ఎస్.సి.ఐ.
Posted On:
04 OCT 2021 12:16PM by PIB Hyderabad
రవాణాతో పరివర్తన సాధన అంటూ ప్రధానమంత్రి ప్రబోధించిన దార్శనికతకు అనుగుణంగా, ప్రధాని కలలను సాకారం చేయడానికి తగిన సేవలందించడంలో అతిపెద్ద సముద్రయాన సంస్థ అయిన భారతీయ నౌకాయాన సంస్థ (ఎస్.సి.ఐ.) పాత్ర ఎంతో గణనీయమైనదని కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రి శరబానంద్ సోనోవాల్ చెప్పారు. ఎస్.సి.ఐ. వజ్రోత్సవాల సందర్భంగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సోనోవాల్ మాట్లాడారు. కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ సహాయమంత్రి శంతనూ ఠాకూర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
గత అరవై ఏళ్ల కాలంలో ఘన విజయానికి ప్రతీకగా నిలిచిన ఎస్.సి.ఐ.కి, ఆ సంస్థ పాత, ప్రస్తుత ఉద్యోగులకు కేంద్రమంత్రి సోనోవాల్ అభినందనలు తెలిపారు. “ఎస్.సి.ఐ. భవిష్యత్తులోకూడా తన బలాన్ని నిరూపించుకోవలసి ఉంటుంది.”, అని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశంలో ప్రజలంతా బృంద స్ఫూర్తితో పనిచేయాల్సి ఉందని, పౌరులంతా తమ బలాన్ని, ప్రత్యేకతను ప్రదర్శించి ముందుకు సాగాలని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని మంత్రి ఉద్బోధించారు.

సముద్రసంబంధమైన రవాణా రంగం సామర్థ్యాన్ని గురించి మంత్రి మాట్లాడుతూ, ఒక ప్రకృతి వనరుగా సముద్ర శక్తిని ప్రజలు తెలుసుకునేలా చేయాలని, సరైన సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో సమంజసమైన మార్గంలో దాన్ని వినియోగించుకోవాలని అన్నారు. "సముద్ర సంబంధమైన రంగాల్లో మన దేశం అభివృద్ధికి, ప్రపంచ పురోగమనానికి మనం మరెంతో కృషి చేయాల్సి ఉంది" అని ఆయన అన్నారు. సముద్ర సంబంధ రవాణా రంగం పురోగతి లక్ష్యంగా మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ఎస్.సి.ఐ.కి విజ్ఞప్తి చేశారు. ఈ రంగం సామర్థ్యాలపై దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల్లో అవగాహన పెంచేందుకు కూడా ఎస్.సి.ఐ. కృషి చేయాలన్నారు. బయటి వ్యక్తుల ప్రమేయం, సహాయం ఏదీ లేకుండానే సొంత శక్తి సామర్థ్యాలతోనే స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్న ఎస్.సి.ఐ.ని ఆయన ప్రశంసించారు. స్వావలంబనా పటిమను ప్రదర్శిస్తూ, ఆత్మనిర్భర భారత్ స్ఫూర్తికి అనుగుణంగా ఎస్.సి.ఐ. పనిచేయడం అభినందనీయమన్నారు.
పశ్చిమాసియా దేశాలతో ఎగుమతి, దిగుమతి వాణిజ్యం లక్ష్యంగా రూపొందించిన ఎం.వి. ఎస్.సి.ఐ. చెన్నై అనే నౌకను కాండ్లా రేవునుంచి కేంద్రమంత్రి వర్చువల్ పద్ధతిలో పతాకం ఊపి ప్రారంభించారు. ఈ నౌక కాండ్లా ఓడరేవునుంచి కొచ్చి, ట్యుటికోరిన్ వెళ్తుంది. అక్కడ ఎగుమతి సామగ్రిని నింపుకుని తూర్పు ఆసియా దేశాలకు పయనిస్తుంది.

2021 మార్చి ఆరవ తేదీన జవహర్ లాల్ నెహ్రూ లిక్విడ్ బెర్త్ జెట్టీనుంచి పయనమై, చరిత్ర సృష్టించిన భారతనౌకాయాన సంస్థకు చెందిన ఎం.టి. స్వర్ణ కృష్ణ నౌకలోని మహిళా నావికా సిబ్బందిని కేంద్రమంత్రి సోనోవాల్ ఈ సందర్భంగా సత్కరించారు. మహిళా సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ, “భారతీయ మహిళలు ఎంతో స్ఫూర్తిదాయకంగా పురోగమిస్తున్నారు. మహిళా సాధికారతకోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంతోనే ఇది సాధ్యమైంది. రానున్న రోజుల్లో ఈ రంగంలోకి మరింత మంది మహిళలు వచ్చే అవకాశం ఉందని నేను కచ్చితంగా చెప్పగలను. నౌకాయాన రంగంలోకి భవిష్యత్తులో మరింత మంది మహిళలకు స్ఫూర్తిదాయకంగా మీరు ఎంతో ఆదర్శవంతంగా నిలిచారు.” అని ఆయన అభినందించారు.
ప్రపంచ నౌకాయానం రంగంలో ఇది చారిత్రాత్మక ఘట్టమని, ఈ ప్రక్రియలో మహిళా నావికులు ప్రదర్శించిన తెగువ, ధైర్యసాహసాలు అద్భుతమైనవని కేంద్రమంత్రి అన్నారు. పురుషుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే నౌకాయాన రంగంలో నారీశక్తికి నిదర్శనంగా వారు నిలిచారని మంత్రి అభినందించారు. కేంద్ర నౌకాయాన శాఖ సహాయమంత్రి ఠాకూర్ మాట్లాడుతూ,..దేశంలోని అన్ని ప్రధాన ఓడరేవులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు తాము ఎంతో కృషిచేస్తున్నామని అన్నారు.

గత అరవై ఏళ్లలో భారతీయ నౌకాయాన సంస్థ (ఎస్.సి.ఐ.) సాగించిన పయనాన్ని వివరిస్తూ రూపొందించిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని కేంద్రమంత్రి సోనోవాల్ వర్చువల్ పద్ధతిలో ఆవిష్కరించారు. మంత్రి ఆవిష్కరించిన కాఫీటేబుల్ పుస్తకాన్ని ఈ లింకు ద్వారా సందర్శించవచ్చు.
ఈ కార్యక్రమంతోపాటుగా, ఎస్.సి.ఐ. ఆవరణలో ఒక తులసి మొక్కను సోనోవాల్ నాటారు. ఎస్.సి.ఐ. సిబ్బంది ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన వీక్షించారు.
లోక్.సభ సభ్యుడు మనోజ్ కోటక్, నౌకాయాన శాఖ కార్యదర్శి డాక్టర్ సంజీవ్ రంజన్, ముంబై పోర్ట్ ట్రస్టు చైర్మన్ రాజీవ్ జలోటా, ఎస్.సి.ఐ. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి హెచ్.కె. జోషి తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
శ్రీమతి హెచ్.కె. జోషి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎస్.సి.ఐ. సృజనాత్మక చర్యలు, ఆర్థిక నిబద్ధతతో సంస్థకు ఎంతో మేలు జరిగిందన్నారు. గత అరవై ఎళ్లకాలంలో సంస్థ సాధించిన విజయాలను వివరిస్తూ పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా నిర్వహించారు. కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖకు, నౌకాయాన డైరెక్టరేట్ జనరల్ కార్యాలయానికి చెందిన అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.



ఎస్.సి.ఐ. గురించి...
భారతీయ నౌకాయాన సంస్థ (ఎస్.సి.ఐ.)ని 1961వ సంవత్సరం అక్టోబరు 2వ తేదీన స్థాపించారు. ఈస్ట్రన్ షిప్పింగ్ కార్పొరేషన్, వెస్ట్రన్ షిప్పింగ్ కార్పొరేషన్ సంస్థల కలియకతో ఎస్.సి.ఐ. రూపుదాల్చింది. 2008 ఆగస్టు ఒకటవ తేదీన “నవరత్న” కంపెనీగా ఎస్.సి.ఐ.ని భారత ప్రభుత్వం గుర్తించింది. మూలధన వ్యయం, ఉమ్మడి సంస్థల ఏర్పాటు, సంస్థల విలీనం వంటి విషయాల్లో ఎస్.సి.ఐ.కి స్వయం ప్రతిపత్తిని కూడా ప్రభుత్వం కల్పించింది.
అరవై సంవత్సరాల చరిత్రలో ఎగుమతి, దిగుమతి వాణిజ్యం లక్ష్యంగా ఎస్.సి.ఐ. ఎన్నో సేవలందించింది. ప్రపంచ ఆర్థికాభివృద్ధికి కూడా తన వంతు సేవలందించింది. సమర్థవంతంగా, ఖర్చుకు తగిన ఫలితాలతో రవాణా ప్రక్రియను నిర్వహించడమే పరమావధిగా ఎస్.సి.ఐ. పనిచేస్తూ వస్తోంది. భారతీయ సముద్ర రంగ రవాణాలో అగ్రశ్రేణి నౌకాయాన సంస్థగా ఎస్.సి.ఐ. గత అరవైఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. భారతదేశంలోనే అతిపెద్ద నౌకాయాన సంస్థ అయిన ఎస్.సి.ఐ. (53లక్షల డి.డబ్ల్యు.టి. టన్నుల సామర్థ్యంతో) 59 నౌకలను కలిగి ఉంది. స్వదేశీ/అంతర్జాతీయ రంగంలో జరుగుతున్న వాణిజ్యంలో 28శాతం ఎస్.సి.ఐ. ద్వారానే సాగుతోంది. భారతదేశపు ద్రవరూప సహజవాయు రవాణా కంపెనీలు, వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల తరఫున 50 నౌకలను భారతీయ నౌకాయాన సంస్థ (ఎస్.సి.ఐ.) నిర్వహిస్తూ వస్తోంది.
ఎస్.సి.ఐ. గురించి సంక్థిప్త వివరాలను ఇక్కడ చూడవచ్చు.
*****
(Release ID: 1760847)
Visitor Counter : 191