జల శక్తి మంత్రిత్వ శాఖ

జల్-జీవన్-మిషన్ ప్రకటించినప్పటి నుండి ఐదు కోట్లకు పైగా ట్యాప్ వాటర్ కనెక్షన్లు అందించడం జరిగింది


జె.జె.ఎం. గురించి జల సమితిలతో అక్టోబర్ రెండవ తేదీన సంభాషించనున్న - ప్రధానమంత్రి

ప్రతి గ్రామంలో నీటి భద్రత గురించి చర్చించడానికి దేశవ్యాప్తంగా నిర్వహించనున్న - గ్రామసభలు

Posted On: 01 OCT 2021 2:44PM by PIB Hyderabad

2019, ఆగస్టు నెలలో జల్-జీవన్-మిషన్ ప్రకటించినప్పటి నుండి, కేవలం 25 నెలల్లో, 5 కోట్ల కుటుంబాలకు వారి ఇళ్లలో పంపు నీటి కనెక్షన్ అందించడం జరిగింది.    కోవిడ్-19 మహమ్మారి, దాని తదుపరి లాక్-డౌన్ లు వంటి సవాళ్లు ఎదురైనప్పటికీ, గ్రామీణ కుటుంబాలకు పంపు నీటి సరఫరాను నిర్ధారించడానికి రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు నిర్విరామంగా కృషి చేశాయి.  ఈ విధంగా, నేరుగా గృహాలకు భరోసా కలిగిన పంపు నీటి సరఫరాను కలిగించడం వల్ల, ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యువతులు దూరప్రాంతాల నుండి భారీ భారాన్ని మోస్తూ, నీటిని తెచ్చుకునే, పురాతన కాలం నుంచి పడుతున్న శ్రమ ను తగ్గించినట్లు అయ్యింది.  ఈ నూతన సౌకర్యం ద్వారా ఆదా అయిన సమయాన్ని ఆదాయ ఉత్పత్తి కార్యకలాపాలు, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, పిల్లల విద్య కు మద్దతు ఇవ్వడం వంటి ప్రయోజనకరమైన పనులు చేపట్టడానికి అవకాశం కలిగింది. 

2024 నాటికి ప్రతి ఇంటికి ఉపయోగించుకోడానికి వీలైన ట్యాప్ వాటర్ కనెక్షన్లు (ఎఫ్.హెచ్.టి.సి) అందించాలనే ఉద్దేశ్యంతో, 2019 ఆగస్టు, 15వ తేదీన, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ  జల్-జీవన్-మిషన్‌ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.  2019 లో, గ్రామీణ ప్రాంతాల్లోని 18.93 కోట్ల కుటుంబాల్లో 3.23 కోట్లు (17 శాతం) కుటుంబాలు మాత్రమే పంపు నీటి కనెక్షన్ లను కలిగి ఉన్నాయి.  ఈ విధంగా, 2024 నాటికి 15.70 కోట్ల కుటుంబాలకు పంపు నీటిని అందించాలి.  దీనికి తోడు, ఇప్పటికే ఉన్న అన్ని నీటి సరఫరా వ్యవస్థలు, కుళాయి కనెక్షన్‌ ల పనితీరు కూడా నిర్ధారించుకోవలసిన అవసరం ఉంది.  ఈ కార్యక్రమం నేరుగా 19 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు, గ్రామీణ - పట్టణ ప్రాంతాల మధ్య విభజన అంతరాన్ని తగ్గించి, ప్రజారోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.  ఇప్పటి వరకు, సుమారు 8.26 కోట్ల (43 శాతం) గ్రామీణ కుటుంబాలు తమ ఇళ్లలో పంపు నీటి సరఫరాను కలిగి ఉన్నాయి.

‘ఎవ్వరినీ వదిలిపెట్టలేదు’, అనేది, జల్-జీవన్-మిషన్ నినాదం.  78 జిల్లాల్లోని ప్రతి గ్రామీణ కుటుంబం, మరియు 1.16 లక్షల గ్రామాలకు పంపు నీటి సరఫరా అందుతోంది.  పిల్లల ఆరోగ్యం, శ్రేయస్సు పై దృష్టి సారించి, గత సంవత్సరం గాంధీ జయంతి రోజున, అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలో, ఆశ్రమ శాలల్లో (గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో) తాగడానికి, మధ్యాహ్న భోజనం వండడానికి, చేతులు కడుక్కోవడానికి,  మరుగుదొడ్లలో ఉపయోగించడానికి, కుళాయి నీటి కనెక్షన్‌ లను అందించే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.  ఈ రోజు వరకు, 7.72 లక్షల (76 శాతం) పాఠశాలలు మరియు 7.48 లక్షల (67.5 శాతం) అంగన్‌-వాడీ కేంద్రాలలో పంపు నీటి సరఫరా సౌకర్యం కల్పించడం జరిగింది. 

క్షేత్ర స్థాయి విధానాన్ని అనుసరించి, గ్రామ పంచాయితీలు మరియు / లేదా దాని ఉప-కమిటీలు, అనగా, గ్రామంలోని నీటి సరఫరా వ్యవస్థల ప్రణాళిక, అమలు, నిర్వహణ, ఆపరేషన్, మర్మత్తులలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ స్థాయి నీటి సరఫరా, పారిశుధ్య కమిటీలు (వి.డబ్ల్యూ.ఎస్.సి) / జల సమితులతో, వికేంద్రీకృత, డిమాండ్-ఆధారిత మరియు స్థానిక సమాజమే నిర్వహించే కార్యక్రమంగా జె.జె.ఎం. అమలవుతోంది.  తద్వారా ప్రతి ఇంటికి క్రమబద్ధమైన, దీర్ఘకాలిక ప్రాతిపదికన స్వచ్ఛమైన పంపు నీటి సరఫరా జరుగుతుంది. 

జల సమితులు / వి.డబ్ల్యూ.ఎస్.సి.లు 73వ రాజ్యాంగ సవరణ లో పొందుపరచిన విధంగా చట్టపరమైన సంస్థలుగా పనిచేస్తాయి.  ఇందులో కనీసం 50 శాతం మహిళా సభ్యులు, బలహీన వర్గాల నుండి దామాషా ప్రాతిపదికన 10-15 మంది సభ్యులు ఉంటారు.  వి.డబ్ల్యూ.ఎస్.సి. 15వ ఆర్థిక సంఘం కాలపరిమితితో గ్రామ స్థాయిలో వివిధ వనరులను సమకూర్చడం ద్వారా ఒక సారి అమలుచేసే విధంగా గ్రామ స్థాయి కార్యాచరణ ప్రణాళిక (వి.ఏ.పి) ను సిద్ధం చేసి, దానిని, గ్రామసభలో ఆమోదించడం జరిగింది.  ఈ  గ్రామ స్థాయి కార్యాచరణ ప్రణాళిక (వి.ఏ.పి) లో, త్రాగు నీటి వనరులను పెంపొందించడం, తాగునీటి సరఫరా వ్యవస్థ నిర్వహణ, మురుగు నీటి శుద్ధి మరియు దాని పునర్వినియోగం తో పాటు, గ్రామంలోని నీటి సరఫరా వ్యవస్థ యొక్క సాధారణ నిర్వహణ వంటి 4 కీలక బాధ్యతలను కలిగి ఉంటుంది.

ఇంకా, ప్రతి గ్రామంలో శిక్షణ మరియు నైపుణ్యం కలిగిన 30-40 మంది సభ్యుల బృందం, వారి గ్రామంలోని నీటి సరఫరా వ్యవస్థలను నిర్వహించడానికి వారి సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ ఉంటారు.   ప్రతి గ్రామం నుండి ఐదుగురు మహిళలు, అనగా, ఆశ, అంగన్ వాడీ టీచర్, స్వయం సహాయ బృందాల నాయకులు, మొదలైన వారికి క్షేత్ర స్థాయి పరీక్షా పరికరాలు (ఎఫ్.టి.కె. లు) ఉపయోగించి నీటి నాణ్యతను పరీక్షించడానికి శిక్షణ ఇస్తున్నారు.  5-10 మంది సభ్యులు ప్లంబర్లు, తాపీ మేస్త్రీలు, మోటార్ మెకానిక్‌లు, ఫిట్టర్లు మొదలైన వారికి శిక్షణ ఇస్తారు.  తద్వారా ప్రతి గ్రామంలోనూ ఏదైనా అవసరాలను తీర్చడానికి నైపుణ్యం కలిగిన వనరులు అందుబాటులో ఉంటాయి. అలాగే ఉపాధి అవకాశాలను కూడా పెరుగుతాయి.   జి.పి. / వి.డబ్ల్యూ.ఎస్.సి. సభ్యులు సేవా ప్రదాతలుగా, స్థానిక ప్రజా నీటి సరఫరా సౌకర్యాలను మెరుగుపరిచే వారిగా పని చేయడానికి శిక్షణ పొందుతున్నారు.  ఈ విధంగా, గ్రామాల్లో, ఒక నిశ్శబ్ద విప్లవం కొనసాగుతోంది. 

మహాత్మా గాంధీ ‘గ్రామ స్వరాజ్’ స్వప్నాన్ని గౌరవిస్తూ,  'డబ్ల్యూ.ఏ.ఎస్.హెచ్. తో ప్రకాశవంతమైన గ్రామం' గా రూపొందించడానికి వారి గ్రామాల్లో తాగునీటి కి సంబంధించిన సమస్యల పై చర్చించి, పరిష్కరించడానికి, ఈ గాంధీ జయంతి, అంటే 2021 అక్టోబర్, 2వ తేదీన, దేశవ్యాప్తంగా, ప్రత్యేక గ్రామ సభలు జరగనున్నాయి.  ఈ సందర్భంగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ "సంవాద్" అనే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.  అనగా 3.3 లక్షల గ్రామ స్థాయి నీరు, పారిశుద్ధ్య కమిటీలు / జల సమితుల కార్యకర్తలు / ప్రతినిధులను ఉద్దేశించి,  ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రసంగిస్తారు.  మహమ్మారి సమయంలో, ముఖ్యంగా, లాక్ డౌన్ సమయంలో కూడా ప్రతి ఇంటికి పంపు నీరు సరఫరా జరిగేలా కృషి చేసిన సంఘం మరియు స్థానిక నాయకుల శక్తి, ఆసక్తి ని ప్రధానమంత్రి తో జరిపే, ఈ పరస్పర సంభాషణ మరింతగా పెంపొందిస్తుంది.

'ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్' లో భాగంగా మరియు ప్రతి గ్రామాన్ని డబ్ల్యూ.ఏ.ఎస్.హెచ్. (నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత) తో కూడిన ప్రకాశవంతమైన గ్రామంగా తీర్చిదిద్దటానికి వీలుగా ప్రతిస్పందించే, బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని పెంపొందించడంలో సహాయపడటానికీ, అలాగే, గ్రామ స్వరాజ్ ఆలోచనను వాస్తవ రూపం లోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో, ఈ సంభాషణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సంభాషణల సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ మోదీ, జల్-జీవన్-మిషన్ సాధించిన పురోగతి నివేదిక ను కూడా విడుదల చేస్తారు.  ఆర్‌.ఎల్‌.బి.లు / పి.ఆర్‌.ఐ.లతో పాటు, నీటి నాణ్యత పర్యవేక్షణ, నిఘా (డబ్ల్యు.క్యూ.ఎం.ఎస్) కోసం 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులు మరియు కార్యాచరణ ప్రణాళిక వినియోగం కోసం ఈ నివేదికను రూపొందించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో భాగస్వాములందరూ ఉపయోగించడానికి వీలు గా రూపొందించిన జల్-జీవన్-మిషన్-యాప్ తో పాటు జాతీయ జల్-జీవన్-నిధి ని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రారంభించనున్నారు.  భారతదేశంలో లేదా విదేశాలలో ఉన్న ఏదైనా వ్యక్తి, సంస్థ, కార్పొరేట్ లేదా పరోపకారి ఎవరైనా, ప్రతి గ్రామీణ గృహంలో, పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, ఆశ్రమశాల, పంచాయితీ, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రం మొదలైన వాటిలో పంపు నీటి కనెక్షన్‌ సౌకర్యాన్ని అందించడంలో ఆర్ధికంగా  సహాయపడవచ్చు.

*****



(Release ID: 1760303) Visitor Counter : 172