నీతి ఆయోగ్
జిల్లా ఆసుపత్రుల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలపై నివేదిక విడుదల చేసిన నీతీ ఆయోగ్
Posted On:
30 SEP 2021 4:46PM by PIB Hyderabad
దేశంలో జిల్లా ఆసుపత్రుల పనితీరుపై రూపొందించిన నివేదికను నీతీ ఆయోగ్ ఈ రోజు విడుదల చేసింది. ఆసుపత్రుల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలు పేరిట ఈ నివేదికను నీతీ ఆయోగ్ సిద్ధం చేసింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశ శాఖ సహకారంతో జిల్లా ఆసుపత్రుల పని తీరును నీతీ ఆయోగ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. క్వాలిటీ కౌన్సిల్ అఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ సమాచారాన్ని విశ్లేషించింది.
నివేదికను విడుదల చేయడానికి ఏర్పాటైన సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి. కె. పాల్, సీఈఓ అమితాబ్ కాంత్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ రాకేశ్ సర్వాల్,అదనపు కార్యదర్శి ఆర్తి అహుజా, భారతదేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ రోడెరికో ఆఫ్రిన్,క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇది చైర్మన్ అదిల్ జైనుల్‌భాయ్ పాల్గొన్నారు.
దేశ ఆరోగ్య రంగంలో జిల్లా స్థాయి ఆసుపత్రులు నిర్వహిస్తున్న పాత్ర, వాటి ప్రాధాన్యతను నివేదికలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి. కె. పాల్ ప్రస్తావించారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు జిల్లా ఆసుపత్రులు వివిధ రకాల వైద్య సేవలను అందిస్తూ వారి ఆరోగ్య సంరక్షణకు కృషి చేస్తున్నాయని ఆయన అన్నారు. అయితే, ప్రధానమైన జిల్లా ఆసుపత్రులు మానవ వనరులు, సామర్ధ్యం, వనరుల వినియోగం, పని ఒత్తిడి లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. ప్రజలందరికి ఆరోగ్య సంరక్షణ అందించేందుకు ఈ సమస్యలను పరిష్కరించవలసి ఉంటుందని అన్నారు. జిల్లా ఆసుపత్రుల పనితీరుపై నీతీ ఆయోగ్ చేపట్టిన అధ్యయనంతో ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.
దేశంలో జిల్లా ఆసుపత్రుల పనితీరుపై తొలిసారిగా అధ్యయనం జరిగిందని నీతీ ఆయోగ్ సీఈఓ శ్రీ అమితాబ్ కాంత్ తెలిపారు. సమాచార ఆధారిత పరిపాలన, ప్రజలకు మెరుగైన సేవలను అందుబాటులోకి తెచ్చే అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ అధ్యయనం నిర్వహించామని ఆయన వివరించారు. వివిధ ప్రాంతాల్లో వైద్య సేవల రంగాన్ని ప్రక్షాళన చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేలా చూడాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన వివరించారు.
వ్యవస్థ, పనితీరు అంశాలకు సంబంధించి 10 సూచిక ఆధారంగా నీతీ ఆయోగ్ జిల్లా ఆసుపత్రుల పనితీరును మదింపు వేసింది. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న 707 జిల్లా ఆసుపత్రుల పనితీరును మదింపు చేయడం జరిగింది. 2017-18 సంవత్సరానికి సంబంధించిన సమాచారం ఆధారంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికోసం ఆసుపత్రులను మూడు తరగతులుగా విభజించడం జరిగింది. చిన్న ఆసుపత్రులు (200 పడకల కంటే తక్కువ లేదా సమానం), మధ్య-పరిమాణ ఆసుపత్రులు (201–300 పడకల మధ్య) మరియు పెద్ద ఆసుపత్రులు (300 కంటే ఎక్కువ పడకలు) తరగతిలో ఈ అధ్యయనం జరిగింది. 10 సూచికలలో ప్రతి ఆసుపత్రి కేటగిరీలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన జిల్లా ఆస్పత్రిలో అనుసరించిన ఉత్తమ విధానాలను నివేదికలో పొందుపరిచారు.
పడకల లభ్యత, వైద్య మరియు పారామెడికల్ సిబ్బంది, ప్రధాన ఆరోగ్య పరీక్షల సౌకర్యాలు సహా రోగుల సంఖ్య, ఒక సర్జన్ చేసిన శస్త్రచికిత్సల సంఖ్య లాంటి సూచికల ఆధారంగా సాగిన అధ్యయనంలో 24 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తున్న 75 జిల్లా ఆసుపత్రులు ఉత్తమ పనితీరును కనబరిచాయి..
ఆరోగ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న కొన్ని కీలక సమస్యలను కూడా ఈ నివేదిక ప్రస్తావించింది. దేశంలో జిల్లా ఆసుపత్రుల పనితీరును మెరుగుపరచడానికి అమలు చేయవలసిన చర్యలను నివేదికలో సూచించారు. దేశంలో ఆరోగ్య రంగ యాజమాన్య నిర్వహణ సమాచారాన్ని మరింత మెరుగుపరచడానికి, ఆరోగ్య సంరక్షణ రంగంలో జవాబుదారీతనం తీసుకురావడానికి అమలు చేయాల్సిన చర్యలను నివేదికలో పొందుపరిచారు.
ఈ నివేదిక దేశంలో జిల్లా ఆసుపత్రులను అభివృద్ధి చేయడానికి ఒక కార్యాచరణ కార్యక్రమం సిద్ధం చేయడానికి పునాదిగా ఉపయోగపడుతుంది.
పూర్తి నివేదిక ఇక్కడ here. అందుబాటులో ఉంది.
(Release ID: 1759761)
Visitor Counter : 247