ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

ఎగుమతుల ప్రోత్సాహానికి భారీ చర్యలు!


ఎన్.ఇ.ఐ.ఎ. పథకం కొనసాగింపు,..
ఐదేళ్లపాటు రూ. 1,650కోట్ల గ్రాంటు..
ప్రతిపాదనలకు మోదీ ప్రభుత్వం ఆమోదముద్ర..

ఎన్.ఇ.ఐ.ఎ. ట్రస్టుకు మూలధన ప్రవాహంతో
ప్రాజెక్టు ఎగుమతులకు భారీగా అవకాశం...

రూ. 33,000కోట్ల ప్రాజెక్టు ఎగుమతులకు ఎన్.ఇ.ఐ.ఎ. మద్దతు...

ఫార్మల్ రంగంలో 12వేల ఉద్యోగాలతో సహా
తాజాగా మరో 2.6లక్షల కొత్త ఉద్యోగాలు.

పెండింగ్ బకాయిలకోసం సెప్టెంబరులో రూ. 56,027కోట్లు..

2021-22లో ఆర్.ఒ.డి.టి.ఇ.పి. కింద రూ. 12,454కోట్లు మంజూరు
సర్టిఫికెట్ ఆఫ్ ఆరిజిన్ కోసం ఉమ్మడి డిజిటల్ ప్లాట్.ఫాం.


జిల్లాల స్థాయిలో ఎగుమతి కేంద్రాలకు ప్రోత్సాహం

విదేశాల్లో మన వాణిజ్యం, పర్యాటకం, టెక్నాలజీల ప్రోత్సాహానికి
దౌత్య కార్యాలయాలకు క్రియాశీలక పాత్ర

Posted On: 29 SEP 2021 3:59PM by PIB Hyderabad

ఎగుమతి రంగానికి ఊతం ఇచ్చే అనేక చర్యలను నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంది. ఇందుకు అనుగణంగా, జాతీయ ఎగుమతి బీమా ఖాతా (ఎన్.ఇ.ఐ.ఎ.) గ్రాంట్ ఇన్ ఎయిడ్ కార్పస్ నిధిగా ఐదేళ్లపాటు రూ. 1,650కోట్ల రూపాయలను అందించే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. 2021-22వ ఆర్థిక సంవత్సరంనుంచి 2025-26వ సంవత్సరం వరకూ ఈ నిధిని అందిస్తారు.

   జాతీయ ప్రాముఖ్యత కలిగిన కీలకమైన ఎగుమతులకు తగిన ప్రోత్సాహం అందించే లక్ష్యంతో ఎ.ఇ.ఐ.ఎ. ట్రస్టును 2006లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్.ఇ.ఐ.ఎ. ట్రస్టు అనేది మధ్య కాలిక, దీర్ఘకాలిక ఇంజినీరింగ్ పరికకరాల ఎగుమతులను (ప్రాజెక్ట్ ఎగుమతులను) ప్రోత్సహిస్తుంది. భారతీయ ఎగుమతి రుణ హామీ సంస్థ (ఇ.సి.జి.సి.) జారీ చేసిన ఆదేశాల పరిధిలోని ప్రాజెక్టు ఎగుమతులకు ఎన్.ఇ.ఐ.ఎ. ట్రస్టు మద్దతు ఇస్తుంది. మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రాజెక్టు ఎగుమతికి, అలాగే విక్రయదార్ల రుణానికి సంబంధించి ఎగుమతి దిగుమతి (ఎగ్జిమ్) బ్యాంకుకు కూడా ఈ ట్రస్టు సహాయ సహకారాలు అందిస్తుంది.

  ఎన్.ఇ.ఐ.ఎ. ట్రస్టుకు పెట్టుబడి మూల ధనాన్ని అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం,.. భారతీయ ప్రాజెక్టు ఎగుమతిదార్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనితో మార్కెట్లో భారీ స్థాయిలో ప్రాజెక్టు ఎగుమతులకు అవకాశం ఏర్పడుతుంది. భారతదేశంలోని పలు ప్రాంతాలనుంచి ప్రాజెక్టు ఎగుమతులకు మద్దతు లభించడంతో దేశంలో తయారీ రంగం విస్తృతం కావడానికి అవకాశం ఏర్పడుతుంది. రూ. 1,650కోట్ల మేర కార్పస్ నిధిని అందించడంతో ఎన్.ఇ.ఐ.ఎ. ట్రస్టుకు ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. పూర్తిస్థాయిలో సామర్థ్యాల వినియోగంతో రూ. 33,000కోట్ల మేర విలువైన ప్రాజెక్టు ఎగుమతులకు ఎన్.ఇ.ఐ.ఎ. సహాయం అందించడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనితో స్వదేశీ తయారీ సరకుల ఉత్పాదన కూడా దాదాపు రూ. 25,000కోట్ల వరకూ పెరుగుతుంది.

  దీనికి తోడు, ప్రాజెక్టుల్లో 75శాతంవరకూ స్వదేశీయత కనిపిస్తుంది. 12,000మంది సిబ్బంది బ్యాంకింగ్, కార్పొరేట్ సంస్థలు వంటి ఫార్మల్ రంగానికి మళ్లే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.ఎల్.ఒ.) ‘ఎక్స్.పోర్ట్స్ టు జాబ్స్’ పేరిట వెలువరించిన నివేదిక అంచనా వేస్తోంది. ఈ నివేదిక వెలువరించిన అంచనాల ఆధారంగా, ఫార్మల్ రంగంలోను, ఇతర రంగాల్లోను మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.6లక్షల మేర పెరగవచ్చని భావిస్తున్నారు.

 

 

ఎన్.ఇ.ఐ.ఎ.- పనితీరులో ముఖ్యాంశాలు

  1. ఎన్.ఇ.ఐ.ఎ. ట్రస్టును 2006లో ఏర్పాటు చేశారు. రుణ సహాయం అందించడం, రాజకీయ పరిణామాల కారణంగా ఏర్పడే ఆర్థిక నష్టాలను ఎదుర్కొనేలా బీమా సదుపాయం అందించడం వంటి చర్యల ద్వారా రుణ సదుపాయాన్ని,  మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రాజెక్టుఎగుమతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ట్రస్టును ఏర్పాటు చేశారు.  
  2. వాణిజ్యపరంగా గిట్టుబాటయ్యే ప్రాజెక్టులకు, వ్యూహాత్మకంగా కీలకమైన వాటికి ఎన్.ఇ.ఐ.ఎ. మద్దతు ఇస్తుంది.
  3. ప్రభుత్వం కట్టుబడి ఉన్న కార్పస్ నిధి విలువ రూ. 4,000కోట్లు. అనుమతించదగిన గరిష్టస్థాయి రుణం వాస్తవ కార్పస్ నిధికి 20రెట్ల వరకూ ఉంటుంది.
  4. గత కొన్నేళ్లుగా భారత ప్రభుత్వంనుంచి అందిన మొత్తం (2021, మార్చి 31వరకూ అందిన సమాచారం ప్రకారం) రూ. 3,091కోట్లు.
  5. ఎన్.ఇ.ఐ.ఎ. ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకూ రూ. 53,000కోట్ల విలువైన 213 కవర్స్ అందించింది. 2021వ సంవత్సరం ఆగస్టు 31వరకూ అందిన సమాచారం మేరకు 52 దేశాలకు ఈ సదుపాయం అందించింది.
  6. ప్రాజెక్టు ఎగుమతులకు ఊతం అందించడంలో ఈ ట్రస్టు ప్రభావం ఆఫ్రికా, దక్షిణాసియా ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది.

 

ఎగుమతి సంబంధిత పథకాల, పనులకోసం కొన్నేళ్లుగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు

  1. 2015-20 సంవత్సరాల విదేశీ వాణిజ్య విధానం గడువును 2021 సెప్టెంబరు 30 వరకూ పొడిగించారు.  దేశంలో  కోవిడ్ మహమ్మారి సంక్షోభం కారణంగా ఈ చర్య తీసుకున్నారు.
  2. కోవిడ్ సమయంలో ఆస్తులను నగదుగా మార్చుకునేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకున్నారు. పెండింగ్ బకాయిల పరిష్కారానికి వివిధ పథకాల కింద రూ. 56,027కోట్లను 2021 సెప్టెంబరులో విడుదల చేశారు. 
  3. కొత్త పథకానికి శ్రీకారం—ఈ పథకం కింద వివిధ సుంకాలు, పన్నులు, ఎగుమతి ఉత్పాదనలపై ఉపశమనం కోసం 2021-22వ ఆర్థిక సంవత్సరంలో రూ. 12,454కోట్లను మంజూరు చేశారు. పన్నుల, సుంకాల, లెవీల రీ ఇంబర్స్.మెంటు కోసం ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు.టి.ఒ.) ప్రాతిపదికన ఏర్పాటు చేసిన వ్యవస్థ.
  4. రాష్ట్ర, కేంద్ర పన్నుల, లెవీల రిబేట్ (ఆర్.ఒ.ఎస్.సి.టి.ఎల్.) పథకం కింద కేంద్ర, రాష్ట్ర, పన్నులకు సంబంధించిన ఉపశమనం కోసం జవుళి రంగానికి మద్దతును బలోపేతం చేశారు. ఈ పథకాన్ని 2024 మార్చి నెలాఖరు వరకూ పొడిగించారు.
  5. సర్టిఫికెట్ ఆప్ ఆరిజిన్ కోసం ఉమ్మడి డిజిటల్ సాంకేతిక పరిజ్ఞాన వేదికను ప్రారంభించారు. వాణిజ్యానికి వెసులుబాటు కల్పించేందుకు, ఎగుమతిదార్లకు  స్వేచ్ఛాయుత ఎగుమతి ఒప్పంద (ఎఫ్.టి.ఎ.) వినియోగ అవకాశాలను పెంచేందుకు ఈ చర్య తీసుకున్నారు.
  6. వ్యవసాయం, ఉద్యాన పంటలు, పశుసంవర్ధక రంగం, మత్స్యరంగం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలతో సహా వ్యవసాయ సంబంధమైన ఎగుమతులకు ఊతం ఇచ్చేందుకు సమగ్రమైన “వ్యవసాయ ఎగుమతి విధానం” ప్రస్తుతం అమలులో ఉంది.
  7. 12 అగ్రశ్రేణి సేవారంగాలకోసం ఎగుమతులను ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకున్నారు. అందుకోసం ప్రత్యేకమైన కార్యాచరణ పథకాలకు రూపకల్పన చేశారు.
  8. ప్రతి జిల్లాలోనూ ఎగుమతికి అవకాశాలను గుర్తించడం ద్వారా జిల్లాలకు ఎగుమతి కేంద్రాలుగా ప్రోత్సాహం అందించడం. ఆయా ఉత్పాదనల ఎగుమతిలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించడం. జిల్లాలో తగిన ఉపాధి కల్పనా అవకాశాలను ఏర్పరిచేలా స్థానిక ఎగుమతిదార్లను, తయారీదార్లను ప్రోత్సహించడం.
  9. భారతదేశపు వాణిజ్య, పర్యాటక రంగాలకు ప్రోత్సాహం అందించేందుకు విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాలు క్రియాశీలక పాత్ర పోషించడం. అక్కడ పెట్టుబడుల లక్ష్యాలను పెంచడం.
  10.  కోవిడ్-19 వైరస్ మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో స్వదేశీ పరిశ్రమ ప్రోత్సాహానికి వివిధ రకాల బ్యాంకింగ్, ఆర్థిక సహాయ పథకాల ద్వారా ఉపశమన చర్యల ప్యాకేజీని ప్రకటించారు. ప్రత్యేకించి,... ఎగుమతుల్లో ఎక్కువ ఙాగస్వామ్యం వహిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎం.ఎస్.ఎం.ఇ.ల)కు ఈ ఉపశమన చర్యలు అమలు చేశారు.
  11. దేశంలో వాణిజ్య మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్ సౌకర్యాల ప్రోత్సాహం కోసం పలు పథకాలు చేపట్టారు. ఎగుమతులకోసం వాణిజ్య మౌలిక సదుపాయాల పథకం (టి.ఐ.ఇ.ఎస్.), మార్కెట్ అనుసంధాన చర్యల (ఎం.ఎ.ఐ.) పథకం, రవాణా, మార్కెటింగ్ సహాయ పథకం (టి.ఎం.ఎ.) వంటి వాటిని ప్రభుత్వం అమలు చేసింది.  

 

****


(Release ID: 1759472) Visitor Counter : 256