సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
లెహ్‌లో ఏర్పాటు చేసిన మొదటి హిమాలయ చలన చిత్రోత్సవాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్
త్వరలోనే చలన చిత్ర శిక్షణా సంస్థతో జమ్ము అండ్ కశ్మీర్, లద్దాఖ్ లను అనుసంధానిస్తాం: శ్రీ అనురాగ్ ఠాకూర్
కంటెంట్ క్రియేషన్ లో ప్రపంచానికే ఉపఖండంగా మారనున్న భారతదేశం : శ్రీ అనురాగ్ ఠాకూర్
చలన చిత్రోత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న షేర్ షా దర్శకుడు శ్రీ విష్ణవర్ధన్, ప్రధాన నటుడు శ్రీ సిద్దార్థ్ మల్హోత్రా
Posted On:
24 SEP 2021 6:33PM by PIB Hyderabad
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్, లెహ్ లోని సింధు సాంస్కృతిక కేంద్రం వేదికగా ఏర్పాటు చేసిన మొదటి హిమాలయ చలన చిత్రోత్సవాన్ని కేంద్ర సమాచార ప్రసారాలశాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ప్రారంభించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ ఐదు రోజుల చలనచిత్రోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాని ఇచ్చిన జన్ భాగీధారి (ప్రజలను భాగస్వాములను చేయాలి) పిలుపు మేరకు ఈ చిత్రోత్సవంలో స్థానిక సినీ దర్శకులు పాల్గొంటున్నారు. వీరంతా 12 హిమాలయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులు.
కొండ ప్రాంత రాష్ట్రాలకు శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం సరికొత్త అస్థిత్వాన్ని ఇస్తున్నదని, ఇందుకోసం సమాచార ప్రసార శాఖ అవిశ్రాంతంగా కృషి చేస్తోందని మంత్రి అన్నారు.
ఈ సందర్భంగా ప్రసంగం చేసిన ఆయన హిమాలయా రాష్ట్రాల్లో విభిన్న సంస్కృతి వుందని, అది అందరూ తెలుసుకోవాలని అన్నారు. ఈ రాష్ట్రాల్లోని యువత ప్రతిభను వెలికి తీయాలంటే వారికి అవకాశాలు అవసరమని ఆయన అన్నారు. సాంస్కృతికపరమైన ప్రత్యేకతలను ఒకచోట చూపాలంటే సినిమా రంగం ఒక వేదికను కల్పిస్తుందని ఆయన స్పష్టం చేశారు. దేశ సంస్కృతికి ముఖ్యమైన వేదికను సినిమా ప్రపంచం కల్పిస్తుందని వివరించారు.
లద్దాఖ్ ప్రాంత ప్రజల ధైర్య సాహసాలను ఆయన ప్రశంసించారు. సరిహద్దుల రక్షణలో దేశ సైనికులతో కలిసి భుజం భుజం కలిపి లద్దాఖ్ ప్రజలు పని చేస్తున్నారని కితాబునిచ్చారు. అనేక తరాలుగా వివిధ యుద్ధాలలో పాల్గొన్న మన సైనికుల ధైర్యసాహసాలను షేర్ షా లాంటి సినిమాలు ఆవిష్కరించాయని ఆయన అన్నారు. అలాంటి సినిమాలు రాబోయే తరాలకు కూడా స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు.
ఓటిటి వేదికల ప్రాధాన్యత గురించి శ్రీ అనురాగ్ మాట్లాడారు. పెద్ద పెద్ద రాష్ట్రాలే కాదు చిన్న రాష్ట్రాలకు కూడా ఓటిటి వేదికలు తగిన అవకాశాలనిస్తున్నాయని అన్నారు. త్వరలోనే అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో లద్దాఖ్ ప్రాంతానికి కూడా గుర్తింపు లభిస్తుందని అన్నారు.
ఓటిటి వేదికలపై మంచి కంటెంట్ కు లభిస్తున్న ఆదరణ గురించి ఆయన వివరించారు. భారత్ లో ఓటిటి మార్కెట్ వేగంగా పెరుగుతోందని అన్నారు. కంటెంట్ తయారీలో ప్రంపంచంలోనే భారతదేశం ఉపఖండంగా తయారవుతుందని ఆయన పేర్కొన్నారు. నాణ్యమైన కంటెంట్ కోసం మనవాళ్లకు శిక్షణ ఇవ్వాలని అన్నారు. అంతర్జాతీయంగా అఖండ విజయాలను సాధించిన సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఇండియాలో చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గేమింగ్ విజువల్ గ్రాఫిక్స్ రంగంలో వృద్ధికి చాలా అవకాశముందని అన్నారు.
జమ్ము అండ్ కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలకోసం చలన చిత్ర శిక్షణాకేంద్రం కావాలనే డిమాండ్ ఎప్పటినుంచో వుందని త్వరలోనే ఆ డిమాండ్ నెరవేరుతుందని ఆయన స్పష్టం చేశారు. దేశంలో మీడియా ఎంటర్ టెయిన్ మెంట్ రంగం అభివృద్ధి గురించి మాట్లాడిన ఆయన ఈ రంగం 2023 నాటికి 30 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని దీని ద్వారా లద్దాఖ్, ఇతర హిమాలయ రాష్ట్రాలతో సహా దేశమంతా లబ్ధి పొందుతుంని అన్నారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. చెల్లింపుల ద్వారా టీవీ సేవలను ( పేటీవీ) పొందేవారు భారతదేశంలో 19 కోట్ల 70 లక్షల మంది వున్నారని ఆయన అన్నారు. ఈ విషయంలో చైనా తర్వాత మనం రెండో స్థానంలో వున్నామని అన్నారు. హిమాలయ ప్రాంతంలో ఇంతవరకూ 30 వేల ఉచిత డిష్ టీవీ సెట్లను అందించామని మిగతావారికి కూడా ఒక ఏడాదిలోపు ఇస్తామన్నారు.
ఆజాదీకా అమృత మహోత్సవ్ లో భాగంగా ఏర్పాటు చేసిన హిమాలయ రాష్ట్రాలకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుల ప్రదర్శనను కూడా ఆయన ప్రారంభించారు. హిమాలయ ప్రాంతంపై ఫోకస్ పెడుతూ ఏర్పాటు చేసిన ఉత్తమ భారతీయ సినిమా విభాగాన్ని కూడా ప్రారంభించారు. దీన్ని జమ్ము అండ్ కశ్మీర్, లద్దాక్ ప్రాంతానికి చెందిన రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో నిర్వహిస్తోంది.
పరమ వీర్ చక్ర అవార్డు పొందిన కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితగాధతో తీసిన షేర్ షా చిత్రాన్ని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దర్శకులు శ్రీ విష్ణు వర్ధన్, ప్రధాన నటుడు శ్రీ సిద్దార్థ్ మల్హోత్రా పాల్గొన్నారు.
లెహ్ పార్లమెంటు సభ్యుడు శ్రీ జామ్ యాంగ్ సెరింగ్ నమ్ గయాల్ మాట్లాడుతూ ఈ చలన చిత్రోత్సవాన్ని ప్రారంభించడానికిగాను కేంద్ర సమాచారశాఖ, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంత అధికారులు చేసిన కృషిని ప్రశంసించారు. ఈ చలన చిత్రోత్సవం కారణంగా లద్దాఖ్ యువతకు దేశ విదేశాల్లో అవకాశాలు లభిస్తాయని అన్నారు. లద్దాక్ కేంద్రపాలిత అభివృద్ధి కోసం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని కొనియాడారు. విద్య, వైద్య, ప్రాధమిక వసతుల రంగంలోను ఆర్ధిక రంగంలోను లద్దాఖ్ ప్రగతి సాధిస్తోందని కేంద్రపాలిత ప్రాంతాల అభివృద్ధి సూచికలో లద్దాఖ్ మొదటి స్థానంలోకి చేరే రోజు ఎంతో దూరంలో లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా లద్దాఖ్ లెప్టినెంట్ గవర్నర్ శ్రీ ఆర్ .కె. మాథూర్ మాట్లాడుతూ చలన చిత్రోత్సవాలు పలు ప్రాంతాలను కలుపుతాయని అన్నారు. లద్దాఖ్ యువత ప్రతిభ వెలికి వస్తుందని స్పష్టం చేశారు. ఈ చలనచిత్రోత్సవంతోపాటు వర్క్ షాపులను, మాస్టర్ క్లాసులను ఏర్పాటు చేశారు. హిమాలయ ప్రాంతానికి చెందిన సినిమా రంగ నిపుణులచేత వీటిని నిర్వహిస్తున్నారు. స్థానిక చలనచిత్ర ప్రేమికులకు తగిన శిక్షణ ఇవ్వడానికి, వారి నైపుణ్యాలను వెలికి తీయడానికి దోహదం చేస్తున్నారు.
పోటీ విభాగంలో షార్ట్ ఫిల్ములను, షార్ట్ డాక్యుమెంటరీలను కూడా ప్రదర్శిస్తున్నారు.
అంతే కాదు ఆహార ఉత్సవానని, సాంస్కృతిక ప్రదర్శనలు, సంగీత ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
ఈ చలనచిత్రోత్సవాన్ని ఈ నెల 28దాకా నిర్వహిస్తారు. దీన్ని లద్దాక్ కేంద్ర పాలిత ప్రాంత అధికారులు, కేంద్ర సమాచార శాఖ ఆధ్వర్యంలోని ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
హిమాలయ ప్రాంత ప్రత్యేకతల కారణంగా ఇక్కడ చలన చిత్రాలు తీయడానికి ప్రపంచ వ్యాప్తంగా వున్న సినిమా దర్శకులు ఆసక్తిని చూపుతున్నారు. ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలోని ప్రజలను, సంప్రదాయ నైపుణ్యాలను, వృత్తులను ఇప్పటికే అనేక చిత్రాలలో ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ చలన చిత్రోత్సవం స్థానిక సినిమా దర్శకులప్రతిభను వెలికి తీయడానికి మంచి అవకాశం.
గత రెండు దశాబ్దాలలో ఈ ప్రాంతంలో స్వతంత్ర సినిమా తయారీ పరిశ్రమ కూడా అభివృద్ధి చెందింది. స్థానిక భాషల్లో చిత్రాలు తయారవుతున్నాయి. ఈ ప్రాంతంలో వేగంగా జరిగిన విద్యుదీకరణ కార్యక్రమం కారణంగా ఆడియో విజవల్ రంగం ప్రగతి సాధించింది.
హిమాలయ ప్రాంత చలన చిత్ర రంగం సంస్థాగతంగా ఎదగడానికిగాను హిమాలయ చలనచిత్రోత్సవం దోహదంచేస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. తద్వారా భారతదేశ హిమాలయ ప్రాంతాలలోని సినిమా నిర్మాణంలో చెప్పుకోదగ్గ మార్పులు సంభవిస్తాయి.
***
(Release ID: 1758020)
Visitor Counter : 215