కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా వేగం పుంజుకున్న - అసంఘటిత కార్మికుల నమోదు


ఈ -శ్రమ్ పోర్టల్‌ లో ఒక కోటి మందికి పైగా నమోదుచేసుకున్న - కార్మికులు

నమోదు ప్రక్రియలో ముందు వరుసలో ఉన్న - బీహార్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు

దాదాపు 68 శాతం నమోదుతో రిజిస్ట్రేషన్లను సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న - సి.ఎస్.సి. లు

వివిధ రాష్ట్రాల్లో అసంఘటిత కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, మీడియా ప్రతినిధులతో సంభాషిస్తూ, ఈ-శ్రమ్ పోర్టల్ లక్షణాలు, ప్రయోజనాల గురించి వారికి అవగాహన కల్పిస్తున్న - కేంద్ర కార్మిక శాఖ మంత్రి, సహాయ మంత్రి, సీనియర్ అధికారులు

Posted On: 19 SEP 2021 6:11PM by PIB Hyderabad

ఈ-శ్రమ్ పోర్టల్‌ లో అసంఘటిత కార్మికుల నమోదును సులభతరం చేసే కార్యక్రమం ఆగస్టు 26వ తేదీన ప్రారంభమైన రోజు నుండి భారీగా ప్రాచుర్యం పొందింది.   గత 24 రోజుల్లో, ఒక కోటి (లేదా 10 మిలియన్) కంటే ఎక్కువ మంది కార్మికులు ఈ పోర్టల్‌ లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు.  ఈ రోజు వరకు, 1,03,12,095 మంది కార్మికులు ఈ పోర్టల్‌ లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు.  వీరిలో దాదాపు 43 శాతం మంది లబ్ధిదారులు స్త్రీలు కాగా 57 శాతం మంది పురుషులు ఉన్నారు. 

 

నిర్మాణం, దుస్తులు తయారీ, చేపల వేట, చిన్న పడవల నిర్మాణం, ప్లాట్‌ఫాం పనులు, వీధి విక్రయాలు, గృహ పని, రవాణా, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల వంటి, వివిధ రంగాలకు చెందిన అసంఘటిత కార్మికుల సమగ్ర సమాచారాన్ని ఒకచోట పొందుపరచాలనే ఉద్దేశ్యంతో మొట్ట మొదటి సారి చేపట్టిన ప్రక్రియలో భాగంగా రూపొందించిన  ఈ-శ్రమ్ పోర్టల్ ను కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ మరియు సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తేలి ఆగస్టు 26వ తేదీన ప్రారంభించారు.

 

ఈ రంగాలకు చెందిన పనుల్లో అత్యధిక సంఖ్యలో వలస కార్మికులు నిమగ్నమై ఉన్నారు.  2019-20 ఆర్థిక సర్వే ప్రకారం, దేశంలో 38 కోట్ల మంది అసంఘటిత కార్మికులు (యు.డబ్ల్యూ) ఉన్నట్లు అంచనా వేయడం జరిగింది.   వారందరినీ నమోదు చేయాలనే లక్ష్యంతో ఈ  పోర్టల్ ను రూపొందించడం జరిగింది.  ఈ-శ్రమ్ పోర్టల్‌ లో నమోదు చేసుకోవడం ద్వారా, ఈ వలస కార్మికులందరూ, ఇప్పుడు, వివిధ సామాజిక భద్రత మరియు ఉపాధి ఆధారిత పథకాల ప్రయోజనాలను  పొందవచ్చు.

 

అసంఘటిత రంగ కార్మికుల జాతీయ స్థాయి సమాచారాన్ని రూపొందించడం కోసం ఇటీవల ప్రారంభించిన ఈ-శ్రమ్ పోర్టల్ యొక్క లక్షణాలు, ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడం కోసం,  అసంఘటిత కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, మీడియా ప్రతినిధులతో  కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్;   సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలీ;  కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శి;   (కార్యదర్శి, ఎల్&ఈ) శ్రీ అపూర్వ చంద్ర;  చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) తో పాటు సి.ఎల్.సి. కి చెందిన ఇతర ప్రాంతీయ అధికారులు  సంభాషిస్తున్నారు.  అలాగే,  ఈ నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి, సి.ఎల్.సి.(సి), ఇటువంటి ఐదు సమావేశాలను నిర్వహించింది. ఇవన్నీ భారీ విజయాన్ని సాధించాయి. 

 

2021 సెప్టెంబర్, 19వ తేదీన మణిపూర్, ఇంఫాల్‌ లోని నమోదు కేంద్రం లో అసంఘటిత రంగ కార్మికులకు ఈ-శ్రమ్ కార్డులు పంపిణీ  చేస్తూ, వారితో  సంభాషిస్తున్న - కేంద్ర కార్మిక, ఉపాధి, పర్యావరణ శాఖల మంత్రి, శ్రీ భూపేందర్ యాదవ్

 

2021 సెప్టెంబర్ 18వ తేదీన మధ్యప్రదేశ్‌, జబల్‌పూర్‌లోని నమోదు కేంద్రం లో అసంఘటిత రంగ కార్మికులకు ఈ-శ్రమ్ కార్డులు పంపిణీ చేస్తూ, వారితో సంభాషిస్తున్న - కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలీ.

 

తాజా గణాంకాల ప్రకారం, ఈ దిగువ గ్రాఫ్ లో సూచించిన విధంగా బీహార్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు అత్యధిక నమోదుతో ఈ కార్యక్రమం అమలులో ముందంజలో ఉన్నాయి.   అయితే, ఈ గణాంకాలను చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.  చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నమోదైన కార్మికులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు.  

 

కేరళ, గుజరాత్, ఉత్తరాఖండ్, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, లడక్, జమ్మూ-కశ్మీర్, చండీగఢ్ వంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ కార్యక్రమం ఇంకా ఊపందుకోవలసిఉంది.  అసంఘటిత రంగంలోని కార్మికులకు ఉద్దేశించిన కీలకమైన సంక్షేమ కార్యక్రమాలతో పాటు, ఉపాధి ఆధారిత పథకాల ప్రయోజనాలు పొందడానికి అవసరమైన వివిధ అర్హతలను అందిపుచ్చుకోవడానికి గల అవకాశాలను ఈ నమోదు సులభతరం చేస్తుంది.

 

నమోదు చేసుకున్న కార్మికుల సంఖ్య

(తరగతి పరిధి)

 

రాష్ట్రాల సంఖ్య

రాష్ట్రాలు మరియు  కేంద్ర పాలితప్రాంతాలు 

<10,000

15

మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, పుదుచ్చేరి, మిజోరాం, సిక్కిం, గోవా, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్-నికోబార్ దీవులు, డి.&ఎన్. హవేలీ, డామన్ & డియ్యు, లడఖ్, లక్షద్వీప్.  

10,000 – 1,00,000

10

తమిళనాడు, హర్యానా, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, తెలంగాణ, గుజరాత్, ఉత్తరాఖండ్, జమ్మూ-కశ్మీర్, కేరళ, మేఘాలయ. 

1,00,000 – 3,00,000

2

మహారాష్ట్ర, ఝార్ఖండ్. 

> 3,00,000

10

బీహార్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, అస్సాం, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. 

 

భారతదేశంలో ఉపాధి కల్పన విషయంలో ప్రథమ స్థానంలో ఉన్న వ్యవసాయం మరియు నిర్మాణ రంగం నుండి అత్యధిక సంఖ్యలో కార్మికులు నమోదయ్యారు.  వీరితో పాటు, ఇంటి పనులు చేసే కార్మికులు, దుస్తులు రంగ కార్మికులు, ఆటోమొబైల్, రవాణా రంగ కార్మికులు, ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ కార్మికులు, క్యాపిటల్ గూడ్స్ కార్మికులు, విద్య, ఆరోగ్య సంరక్షణ, రిటైల్, పర్యాటక, ఆతిథ్యం, ఆహార పరిశ్రమ వంటి వివిధ రకాల వృత్తుల్లో పనిచేస్తున్న అనేక మంది ఈ పోర్టల్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 

 

నమోదు చేసుకున్న మొత్తం కార్మికుల్లో, దాదాపు 48 శాతం మంది 25-40 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో 40-50 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు దాదాపు 21 శాతం మంది ఉన్నారు.   16-25 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు 19 శాతం మంది ఉండగా,   50 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వారు 12 శాతం మంది ఉన్నారు. 

పైన గ్రాఫ్‌ లో పేర్కొన్న దాన్ని బట్టి, తమకు అందుబాటులో ఉన్న సి.ఎస్.సి. ల ద్వారా గణనీయమైన సంఖ్యలో కార్మికులు తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది.  కేరళ, గోవా వంటి కొన్ని రాష్ట్రాలతో పాటు ఈశాన్య భారతదేశంలో మేఘాలయ, మణిపూర్‌ రాష్ట్రాలలో ఎక్కువ మంది కార్మికులు ఈ పోర్టల్‌ ద్వారా తమకు తాముగా నమోదు చేసుకున్న విషయం ఆసక్తికరంగా ఉంది.  దాద్రా-నాగర్ హవేలీ, అండమాన్-నికోబార్, లడఖ్ వంటి చాలా కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా కార్మికులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.   ఇలా ఉండగా, తాజా సమాచారం ప్రకారం, దాదాపు 68 శాతం మంది కార్మికులు సి.ఎస్.సి. ల ద్వారా తమకు తాముగా నమోదయ్యారు.  అందువల్ల, తక్కువ సౌలభ్యం ఉన్న ప్రాంతాల్లో సి.ఎస్.సి. సేవల విస్తరణ ప్రాధాన్యం సంతరించుకుంది.  తమ సమీపంలో ఉన్న సి.ఎస్.సి. లను సందర్శించి, ఈ పోర్టల్‌  ద్వారా తమను తాము నమోదు చేసుకుని, ఈ కార్యక్రమం యొక్క ప్రయోజనాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కార్మికులందరినీ కోరడం జరిగింది.  ముఖ్యంగా వలస కార్మికులు దీని నుండి ఎంతో ప్రయోజనం పొందుతారు.

కార్మికులు వ్యక్తిగతంగా ఆన్‌-లైన్ లో నమోదు చేసుకోడానికి,  ఈ-శ్రమ్ మొబైల్ యాప్ లేదా వెబ్‌-సైట్‌ ను ఉపయోగించవచ్చు.  వారు ఈ పోర్టల్‌ లో తమను తాము నమోదు చేసుకోవడానికి ఉమ్మడి సేవా కేంద్రాలు (సి.ఎస్.సి), రాష్ట్ర సేవా కేంద్రం, కార్మికుల సౌకర్య కేంద్రాలు, తపాలా శాఖకు చెందిన ఎంపిక చేసిన డిజిటల్ సేవా కేంద్రాల పోస్టాఫీసులను కూడా సందర్శించవచ్చు.  ఈ-శ్రమ్ పోర్టల్‌ లో నమోదు చేసుకున్న తర్వాత, అసంఘటిత కార్మికులు డిజిటల్   ఈ-శ్రమ్ కార్డును స్వీకరిస్తారు.  వారు తమ వ్యక్తిగత వివరాలను పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు సవరించుకోవచ్చు.  వారికి ఒక సార్వత్రిక ఖాతా సంఖ్య (ఈ-శ్రమ్ కార్డు తో)  కేటాయిస్తారు. ఇది దేశవ్యాప్తంగా ఆమోదయోగ్యమైనదిగా ఉండటం వలన,   ఇప్పుడు, వారు సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందడానికి వివిధ ప్రదేశాలలో నమోదు చేయవలసిన అవసరం ఉండదు.  ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న ఎవరైనా కార్మికుడు ప్రమాదానికి గురై, అతను లేదా ఆమె మరణం లేదా శాశ్వత వైకల్యం కలిగినట్లయితే, వారు రెండు లక్షల రూపాయల పరిహారానికీ,   లేదా పాక్షిక వైకల్యం సంభవిస్తే లక్ష రూపాయల పరిహారానికి అర్హులవుతారు.

 

 

 

*****


(Release ID: 1756354) Visitor Counter : 612