శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
బలమైన గోడల కోసం నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలను ఉపయోగించి లో– కార్బన్ ఇటుకల తయారీ సాంకేతికత అభివృద్ధి
Posted On:
16 SEP 2021 12:42PM by PIB Hyderabad
నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలు, క్షార ఉత్తేజిత బైండర్లను ఉపయోగించి బలమైన గోడల నిర్మాణం కోసం ఇటుకలను తయారుచేసే సాంకేతికతను పరిశోధకులు అభివృద్ధి చేశారు. వీటిని లో–కార్బన్ ఇటుకలుగా పిలుస్తున్నారు. ఈ ఇటుకల తయారీకి అధిక ఉష్ణోగ్రత అవసరం లేదు. పోర్ట్ల్యాండ్ సిమెంట్ వంటి అధిక శక్తి పదార్థాలను కూడా వినియోగించాల్సిన అవసనం లేదు. కేవలం నిర్మాణ కూల్చివేతల వ్యర్థాలతో ఈ ఇటుకలను తయారుచేశారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల నిర్మాణ వ్యర్థాలను పేరుకుపోయే సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది.
సాధారణంగా భవన నిర్మాణాల కోసం కాల్చిన మట్టి ఇటుకలు, కాంక్రీట్ ఇటుకలు, హోలో క్లే బ్లాక్స్, ఫ్లైయాష్ ఇటుకలు ఉపయోగిస్తారు. ఈ ఇటుకల తయారీకి అధిక శక్తి అవసరం అవుతుంది. దీంతో వాతావరణంలోకి పెద్దమొత్తంలో కార్బన్ ఉద్గారాలు విడుదలవుతాయి. అంటే ఈ ఇటుకలను ఓ రకంగా రూపం ఉన్న కార్బన్లుగా చెప్పవచ్చు. వీటి తయారీకి సహజ వనరులను వినియోగించాల్సి వస్తుంది. ఆ వనరులకు కొరత ఏర్పడడం వల్ల నిలకడ లేని నిర్మాణలకు దారితీస్తుంది. మనం సిమెంటు ఇటుకలుగా చెప్పుకునే బ్లాక్స్ కూడా పోర్ట్ల్యాండ్ సిమెంట్తో తయారవుతాయి. ఈ సిమెంటు తయారీకి అధిక శక్తి , సహజ వనరులను ఉపయోగించాల్సి ఉంటుంది. మనదేశంలో వార్షిక ఇటుకల వినియోగం సుమారు 900 మిలియన్ టన్నులు. అదే సమయంలో 70 నుంచి 100 మిలియన్ టన్నుల నిర్మాణ వ్యర్థాలు పోగవుతున్నాయి. ఈ నేపథ్యంలో సుస్థిర నిర్మాణాలను ప్రోత్సహించేముందు రెండు ముఖ్యమైన సమస్యల గురించి మాట్లాడుకోవలసి ఉంటుంది. నిర్మాణాల కోసం ఉపయోగించే సిమెంట్ ఇటుకల తయారీకి ఉపయోగించే సహజ వనరులను సంరక్షించుకోవడం, రెండోది... వాటి తయారీ సమయంలో వెలువడుతున్న కార్బన్ ఉద్గారాలను తగ్గించడం.
సరిగ్గా ఇదే లక్ష్యంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఐఐఎస్) శాస్త్రవేత్తలు నూతన సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఫ్లైయాష్, రాతిపొడిని ఉపయోగించి, క్షార ఉత్తేజిత పద్ధతిలో ఇటుకలను తయారుచేసే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలను ఉపయోగించి, క్షార ఉత్తేజిత ప్రక్రియ ద్వారా తయారుచేసిన ఈ లో–కార్బన్ ఇటుకలు చాలా మన్నికగా ఉండడమే కాకుండా నిర్మాణాలకు ఎంతో అనువుగా ఉంటాయి. నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాల భౌతిక-రసాయన మరియు సంపీడన లక్షణాలను నిర్ధారించిన తరువాత, దానితో చేర్చాల్సిన మిశ్రమాల నిష్పత్తులను ఖరారు చేశారు. ఆ తర్వాత ఈ లో–కార్బన్ ఇటుకల ఉత్పత్తి ప్రక్రియను అభివృద్ధి చేశారు. ఆప్టిమమ్ బైండర్ నిష్పత్తి ఆధారంగా ఈ సంపీడన ఇటుకలు తయారుచేయబడ్డాయి. ఇంజనీరింగ్ అవసరాల కోసం వీటిని పరిశీలించబడ్డాయి కూడా.
బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఐఎస్ఎస్)లోని సైన్స్ అండ్టెక్నాలజీ విభాగం అభివృద్ధి చేసిన ఈ సాంకేతిక పరిజ్ఞానంతో భారతదేశంలోని నిర్మాణం రంగానికి ఎంతో లబ్ధి చేకూరుతుంది. నిర్మాణ వ్యర్థాలను నిర్మూలించడంలో ఎదురయ్యే సమస్యలను కూడా ఇది పరిష్కరిస్తుంది.
‘‘ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ సాంకేతిక సహాయంతో లో– కార్బన్ ఇటుకలు తయారుచేయడానికి ఓ స్టార్టప్ కంపెనీ కూడా రిజిస్టరైంది. 69 నెలల్లో భారతదేశ వ్యాప్తంగా ఈ లో–కార్బన్ ఇటుకల తయారీ సాంకేతికతను వ్యాప్తిచేసే యూనిట్గా ఇది పనిచేస్తుంది. లో–కార్బన్ ఇటుకల తయారీ సంస్థలకు అవసరమైన సాంకేతిక సాయాన్ని ఈ సంస్థ అందజేస్తుంద’’ని బెంగళూరులోని ఐఐఎస్ ప్రొఫెసర్ బి.వి. వెంకటరామిరెడ్డి వ్యాఖ్యానించారు.
మరిన్ని వివరాల కోసం.. ప్రొఫెసర్ బి వి వెంకటరామ రెడ్డి, ఐఐఎస్‌సి బెంగళూరు (venkat[at]iisc[dot]ac[dot]in) ని సంప్రదించవచ్చు.
***
(Release ID: 1755578)
Visitor Counter : 266