విద్యుత్తు మంత్రిత్వ శాఖ

పునరుత్పాదక విద్యుత్ ఉత్పాదనపై భారత్ చిత్తశుద్ధికి అమెరికా ప్రశంస!

2030లోగా 450 గిగావాట్ల లక్ష్యం అభినందనీయం: అమెరికా బృందం..

స్వచ్ఛ హైడ్రోజన్, ఎలెక్ట్రోలైజర్ల బిడ్లలో పాల్గొనాలంటూ అమెరికా సంస్థలకు కేంద్ర విద్యుత్ మంత్రి ఆహ్వానం..

ఇంధన పరివర్తన అంశంపై సహకారానికి ఉభయపక్షాల అంగీకారం

అంతర్జాతీయ సౌరశక్తి కూటమిలో చేరాలని అమెరికాకు కేంద్ర మంత్రి విజ్ఞప్తి

Posted On: 13 SEP 2021 4:33PM by PIB Hyderabad

   వాతావరణ మార్పుల అధ్యయనంపై అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక దూత జాన్ కెర్రీ నాయకత్వంలోని ప్రతినిధి బృందాన్ని కేంద్ర విద్యుత్, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్.కె. సింగ్ ఈ నెల 13న న్యూఢిల్లీలో కలుసుకున్నారు. వాతావరణ మార్పులు, సంబంధిత సమస్యల అధ్యయనంపై ఉభయదేశాల మధ్య మరింత సహకారం, ఇంధన పరివర్తనపై మిగతా ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా ఉభయదేశాల మధ్య ఏర్పరుచుకోవలసిన భాగస్వామ్యం తదితర విషయాలను చర్చించేందుకు ఈ సమావేశం జరిగింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అలోక్ కుమార్, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

  ఇంధన అనుసంధానం లక్ష్యంగా భారతదేశం చేస్తున్న కృషి, 2030వ సంవత్సరానికల్లా 450 గిగావాట్లమేర పునరుత్పాదక విద్యుత్ సాధించాలన్న లక్ష్యంపై భారతదేశం చిత్తశుద్ధి ప్రశంసనీయమని ఈ సందర్భంగా అమెరికా ప్రతినిధి బృందం పేర్కొంది.  భారత్,..18 నెలల వ్యవధిలో 2కోట్ల 80లక్షలకు పైగా ఇళ్లను విద్యుదీకరించడం, సార్వత్రిక గృహ విద్యుదీకరణను సాధించడం అభినందనీయమని ప్రతినిధి బృందం తెలిపింది. 

    ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ, స్వచ్ఛమైన ఇంధన సాధన లక్ష్యంగా భారత ప్రభుత్వం తన దృష్టిని కేంద్రీకరించిన విషయాన్ని అమెరికా ప్రతినిధి బృందానికి తెలియజేశారు. పునరుత్పాదక విద్యుత్ “నిల్వ” చేయడమే ఈ రంగంలో ఎదురయ్యే అతిపెద్ద సవాలని, సామాన్య ప్రజలందరికీ పునరుత్పాదక విద్యుత్ అందుబాటులోకి రావాలంటే, నిల్వ సమస్యను వెంటనే పరిష్కరించవలసి ఉందని ఆయన చెప్పారు. పునరుత్పాదన ఇంధన వనరుల ద్వారా స్వచ్ఛ హైడ్రోజన్ ఉత్పత్తి, నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్లుగా విడగొట్టే ఎలెక్ట్రోలైజర్లకోసం రానున్న కొన్ని నెలల్లో భారీగా బిడ్లను పిలవాలని ప్రభుత్వం సంకల్పించినట్టు కేంద్రమంత్రి తెలిపారు. ఈ బిడ్లలో పాల్గొనేందుకు అమెరికన్ కంపెనీలను పంపించాలని అమెరికా ప్రతినిధి బృందానికి ఆయన విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛ హైడ్రోజన్ ఉత్పత్తి, స్వచ్ఛ ఇంధన కారిడార్ల ఏర్పాటుకోసం లడఖ్.లో రాబొతున్న ప్రాజెక్టులను గురించి మంత్రి ప్రధానంగా వివరించారు. ఈ సమావేశంలో జాన్ కెర్రీ మాట్లాడుతూ, 2030వ సంవత్సరానికల్లా 450 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సాధించాలన్న లక్ష్యంకోసం భారతదేశంతో గట్టి సహకారం కుదుర్చుకునేందుకు అమెరికా సుముఖంగా ఉందన్నారు. వాతావరణ మార్పుల్లో భారత్ 2 సెల్సియస్ డిగ్రీల దిగువ స్థాయిని సాధించేందుకు ఇది దోహదపడుతుందని, పారిస్ వాతావరణ మార్పుల సదస్సులో కుదిరిన ఒప్పందం ప్రకారం పెట్టుకున్న లక్ష్యంకంటే ఇది మరింత ఎక్కువేనని అని ఆయన అన్నారు.

  ప్రపంచంలో ఇంకా 80కోట్ల మందికి విద్యుత్ అందుబాటులో లేకపోవడం ఆందోళకరమని ఆర్.కె. సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అనేక దేశాలకు ప్రయోజనాలు అందించేందుకు వీలుగా అంతర్జాతీయ సౌరశక్తి కూటమిలో చేరవలసిందిగా అమెరికాకు ఆయన విజ్ఞప్తి చేశారు.

   ఇంధన పరివర్తన లక్ష్యాలను ఆర్థిక వెసులుబాటుతో రీతిలో సాధించేందుకు వీలుగా భారతీయ పరిశోధనాగారాలు, అమెరికా లేబరేటరీలతో కలసి ఉమ్మడిగా పనిచేయవచ్చని ఉభయపక్షాలూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా కెర్రీ మాట్లాడుతూ, ఇంధన పరివర్తన కృషిలో భారతదేశం, అమెరికా ప్రపంచ స్థాయిలో సారథ్యం వహించవచ్చని, పునరుత్పాదక ఇంధన ఉత్పదనా లక్ష్యాలను సాధన సాధ్యమని మిగతా ప్రపంచ దేశాలకు రుజువు చేయవచ్చని అన్నారు.

  వాతావరణ మార్పుల అధ్యయనం, ఇందుకు సంబంధించిన సమస్యల పరిష్కారం విషయంలో అమెరికాకు, భారతదేశానికి ఒకే తరహా లక్ష్యాలు ఉన్నాయని, అందువల్ల ఈ విషయంలో ఉభయపక్షాలూ  తమ తమ అనుభవాలను పంచుకుంటూ కలసి పనిచేయాలని అమెరికా ప్రతినిధి బృందం అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించి జాతీయ నిశ్చిత లక్ష్యాల (ఎన్.డి.సి.) సాధనలో ఉభయదేశాల భాగస్వామ్యం ప్రపంచంలోని మిగతా దేశాలకు స్ఫూర్తిదాయకం కాగలదని, వాతావరణ మార్పుల సమస్యల పరిష్కారంకోసం జరిగే పోరాటాన్ని మరింత బలోపేతం చేయగలదని అమెరికా బృందం అభిప్రాయపడింది.

 

****(Release ID: 1754672) Visitor Counter : 36