ఆయుష్

దేశవ్యాప్తంగా మరిన్నిఆయుష్ కళాశాలలు! కేంద్ర నిధులు రూ.9 కోట్లనుంచి రూ.70కోట్లకు హెచ్చింపు


ఈశాన్యంలో కొత్తగా ఆయుష్ కళాశాలల ప్రారంభానికి కేంద్రం సుముఖం: కేంద్రమంత్రి శర్బానంద సోనావాల్

గువాహటి ఆయుష్ సమ్మేళనంలో ప్రకటన; ఆయుష్ రంగంలో ఇటీవల ఉద్యోగ అవకాశాలు పెరిగాయన్న కేంద్రమంత్రి

Posted On: 11 SEP 2021 6:10PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా మరిన్ని ఆయుష్ కళాశాలలను ప్రారంభించేందుకు అవసరమైన ఆర్ధిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం రూ. 9 కోట్ల నుండి రూ .70 కోట్లకు పెంచింది.ఆయుష్, ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ శనివారం ఈ విషయం ప్రకటించారు.  ఆయుష్ వైద్య విధాన వ్యవస్థలో విభిన్నమైన ఉద్యోగ మార్గాలు: ఈశాన్య రాష్ట్రాల్లో విద్య, ఔత్సాహిక సామర్థ్యం, ఉపాధి అవకాశాలపై దృష్టి అనే అంశంపై గువాహటిలో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ కేంద్ర మంత్రి ఈ మేరకు ప్రకటన చేశారు. ఈశాన్య ప్రాంతంలో కొన్ని ఆయుష్ కాలేజీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, భారతీయ సాంప్రదాయ వైద్య వ్యవస్థలను, వైద్య విధానాన్ని పాటించే వైద్యులను మరింత మందిని అందుబాటులోకి తెచ్చినపుడు మాత్రమే సంప్రదాయ వైద్య విధానం ప్రజాదరణ పొందుతుందని ఆయన అన్నారు. ఇందుకోసం ఈశాన్య ప్రాంతంలో మరిన్ని ఆయుష్ వైద్య బోధనా కళాశాలు రావలసి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.  కొత్త ఆయుష్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రాలకు రూ. 9కోట్లను, కేంద్ర ప్రాయోజిత పథకమైన జాతీయ. ఆయుష్ కార్యక్రమం (ఎన్.ఎ.ఎం.) కింద రాష్ట్రప్రభుత్వాలకు గతంలోనే అందించారని, అయితే, ఈ మొత్తాన్ని తాజాగా రూ. 70కోట్లకు పెంచారని కేంద్ర మంత్రి చెప్పారు.ఎన్.ఎ.ఎం. మార్గదర్శక సూత్రాల ప్రకారంకొత్త ఆయుష్ కళాశాలల ఏర్పాటుకోసం ఆయా రాష్ట్రాలు స్థలాన్ని ఇచ్చి,సిబ్బందిని గుర్తించవలసి ఉంటుందని సోనోవాల్ చెప్పారు.

అస్సాంలోని జాలుక్బారీలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల స్థాయిని రూ. 10కోట్ల వ్యయంతో ప్రతిభావ్యుత్పత్తుల కేంద్రంగా నవీకరించేందుకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించిందన్నారు.  అండర్ గ్రాడ్యుయేట్ బోధనా కళాశాలను నవీకరించేందుకు రూ 5కోట్లను, పోస్ట్ గ్రాడ్యుయేట్ సంస్థల మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు రూ. 6కోట్లను కేంద్రమంత్రిత్వశాఖ అందిస్తుందన్నారు.

గువాహటిలోని కేంద్ర ఆయుర్వేద పరిశోధనా సంస్థ (సి.ఎ.ఆర్.ఐ.)లో పంచకర్మ టెక్నీషియన్ కోర్సును ప్రారంభిస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. ఆరోగ్య రంగ నైపుణ్య మండలి-జాతీయ నైపుణ్యాభివృద్ధి మండలికి అనుబంధంగా ప్రారంభించే ఈ కోర్సులో పది సీట్లు ఉంటాయని, 10+2 విద్యార్థులు ఈ కోర్సుకు అర్హులని ఆయన చెప్పారు. ఈశాన్య ప్రాంతంలోపంచకర్మ థెరపీ నిపుణులైన సిబ్బందిని తయారు చేసే లక్ష్యంతో ఈ కోర్సును రూపొందించారని, ఈశాన్య ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరిగేందుకు ఈ కోర్సు దోహదపడుతుందని కేంద్రమంత్రి చెప్పారు.

ఇటీవలి కాలంలో ఆయుష్ రంగ వృత్తి నిపుణులకు ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయి. దీనికి తోడుగా, ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఆయుష్ వైద్య విధానంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో విశ్వాసం పెరిగింది. అని సోనోవాల్ అన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణకు సంబంధించిన అనేక అవసరాలను తీర్చగలిగే సామర్థ్యం ఆయుష్ విధానానికి ఉందని, ఇది దేశాభృద్ధికి దోహదపడుతుందని ఆయన అన్నారు. అస్సాం ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్, టెక్నాలజీ, సమాచార ప్రసార శాఖల మంత్రి కేశవ్ మహంత ఈ సమావేశంలో గౌరవ అతిధిగా పాల్గొన్నారు.

ఈ నెల ప్రారంభంలో ఈశాన్య రాష్ట్రాల ఆయుష్ మంత్రులందరితో ఒక చారిత్రాత్మక సమావేశాన్ని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ విజయవంతంగా నిర్వహించింది. ఈశాన్య ప్రాతంలో ఆయుష్ వైద్యవిధానంపైప్రచారంతో ప్రజాదరణ పెంచే అంశంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ నెల ప్రారంభంలో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా, ఆయుష్ లో ఉపాధి అవకాశాలపై చర్చించేందుకుఈ నాటి సమావేశాన్నినిర్వహించారు.

ఈ నాటి సమావేశం సందర్భంగా, ఆయుర్వేదం-విద్య, ఉద్యోగ అవకాశాలు అన్న అంశంపై  భారతీయ వైద్య విధాన వ్యవస్థ జాతీయ కమిషన్ (ఎన్.సి.ఐ.ఎస్.ఎం.) చైర్ పర్సన్ యశ్వంత్ దేవ్ పూజారి ప్రసంగించారు. అనంతరం,.. ఈశాన్య రాష్ట్రాల్లో ఆయుష్ వైద్యం సామర్థ్యంపై అన్వేషణ, ఉద్యోగ అవకాశాలు అన్న అంశంపై సదస్సు జరిగింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఆయుర్వేద విద్య, ఉద్యోగ అవకాశాలు అన్న అంశంపై జైపూర్.కు చెందిన  జాతీయ ఆయుర్వేద విద్యా సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ సంజీవ్ శర్మ ఉపన్యాసం ఇచ్చారు.ఈశాన్య రాష్ట్రాల్లో పరిశోధన, అభివృద్ధి అన్న అంశంపై ఢిల్లీకి చెందిన కేంద్ర ఆయుర్వేద విజ్ఞాన పరిశోధనా మండలి (సి.సి.ఆర్.ఎ.ఎస్.) డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్. శ్రీకాంత్ వివరించారు. ఆయుష్ రంగంలో ఔత్సాహిక వాణిజ్య తత్వం, స్టార్టప్ అనే అంశంపై పారిశ్రామిక ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య శాఖకు చెందిన స్టార్టప్ ఇండియా మేనేజర్ ఇంద్రాణి మహతో ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు.

హోమియో పతి వైద్య విధానంలో ఉద్యోగ అవకాశాలు; ఈశాన్య రాష్ట్రాల్లో పారిశ్రామిక కోణం అనే అంశంపై,.. కోల్కతాలోని జాతీయ హోమియోపతి సంస్థ (ఎన్.ఐ.హెచ్.) డైరెక్టర్ డాక్టర్ సుభాష్ ప్రంసగించారు. ఈశాన్య రాష్ట్రాల్లో హోమియో పతి విద్య, ఉద్యోగ అవకాశాలు అనే అంశంపై న్యూఢిల్లీకి చెందిన జాతీయ హోమియోపతి మండలి (ఎన్.సి.హెచ్.) కార్యదర్శి తారకేశ్వర్ జైన్ ఉపన్యసించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజారోగ్యం,.. పరిశోధన, అభివృద్ధి అనే అంశంపై కోల్కతాకు చెందిన జాతీయ హోమియోపతి సంస్థ (ఎన్.ఐ.హెచ్.)కి చెందిన డాక్టర్ సుభాష్ చౌదరి ప్రసంగించారు.

 అలాగే యునానీ వైద్య విధానంలో పరిశోధనా విద్య, ఉద్యోగ అవకాశాలు అనే అంశంపై యునానీ  కేంద్రీయ పరిశోధనా మండలి (సి.సి.ఆర్.యు.ఎం.) డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ అసిమ్ అలీ ఖాన్;సిద్ధ వైద్యంలో విద్య, ఉద్యోగ అవకాశాలు అనే అంశంపై చెన్నైకి చెందిన కేంద్రీయ సిద్ధ వైద్య పరిశోధనా మండలి (సి.సి.ఆర్.ఎస్.) డైరెక్టర్ జనరల్ డాక్టర్ కె. కనకవల్లి; సోవా రింగ్పాలో పరిశోధన విద్య, ఉద్యోగ అవకాశాలు అన్న అంశంపై లేహ్ నగరానికి చెందిన సోవా రింగ్పా జాతీయ పరిశోధనా సంస్థ (ఎన్.ఐ.ఆర్.ఎస్.) డైరెక్టర్ డాక్టర్ పద్మ గుర్మీత్, యోగా, ప్రకృతి వైద్యంలో ఉద్యోగ అవకాశాలు అన్న అంశంపై న్యూఢిల్లీకి చెందిన యోగా ప్రకృతి వైద్య కేంద్రీయమండలి డైరెక్టర్ డాక్టర్ రాఘవేంద్ర రావు ఉపన్యసించారు. అనంతరం ఆయుష్ పరిశ్రమల ప్రతినిధులు కూడా ప్రసంగించారు. ఆ తర్వాత,..ఈశాన్య రాష్ట్రాల్లోని విభిన్న ప్రాంతాల ఆయుష్ వైద్య విద్యార్థులు, పరిశోధనా విద్యార్థులతో ప్రశ్నలు, సమాధానాల కార్యక్రమం జరిగింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారులు, ఈశాన్య రాష్ట్రాల్లోని ఆయుష్ సంస్థలు, పరిశోధనా సంస్థల, కళాశాలల అధికారులతో సహా దాదాపు 250మంది ఈ సమావేశానికి హాజరయ్యారు.

 

**************(Release ID: 1754370) Visitor Counter : 187