ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఇది పండగల సీజన్ సుమా! జాగ్రత్తలు చాలా ముఖ్యం!


కోవిడ్ వర్కింగ్ గ్రూపు అధ్యక్షుడి హెచ్చరిక

Posted On: 09 SEP 2021 12:44PM by PIB Hyderabad

   దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాధి నిరోధక కార్యక్రమంపై జాతీయ సాంకేతిక సలహా సంఘపు, కోవిడ్-19 అధ్యయన బృందం (ఎన్.టి.ఎ.జి.ఐ.-ఎన్.టాగీ) అధ్యక్షుడు డాక్టర్ ఎన్.కె. అరోరా పలు అంశాలు వెల్లడించారు.

 కోవిడ్-19 టీకా పంపిణీపై దూరదర్శన్ న్యూస్ (డి.డి. న్యూస్) చానల్ ద్వారా ఈ కింది ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

 

ప్రశ్న. భారతదేశంలో కోవిడ్-19 ధర్డ్ వేవ్ ఉంటుందా?

    గత కొన్ని వారాలుగా దేశంలో సగటున దాదాపు 30,000–45,000 వరకూ రోజువారీ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. కేరళలో, చాలా వరకు ఈశాన్యరాష్ట్రాల్లో, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో, దక్షిణాదిలోని కొన్ని రాష్ట్రాల్లో ఇలా కేసులు నమోదవుతున్నాయి. సార్స్-సి.ఒ.వి.-2 వైరస్ జన్యుపరివర్తన విశ్లేషణను పరిశీలించినట్టయితే, ఈ వైరస్.లు జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఎక్కువగా వ్యాపిస్తూ వచ్చాయి. వైరస్ కొత్త వేరియంట్లేవీ తాజాగా తలెత్తలేదు. ఇక, గత జూలై నెలలో నిర్వహించిన సీరో-సర్వే ప్రకారం, ఇప్పటివరకూ వ్యాధినిరోధక టీకామందు తీసుకోని వారికే వైరస్ సోకుతున్నట్టు ప్రస్తుతం నమోదైన కేసులతీరునుబట్టి తెలుస్తోంది; సెకండ్ వేవ్ చివరిదశలోనే వారికి వైరస్ సంక్రమించింది.

  జూలై నెలలో జరిగిన సీరో-సర్వే ప్రకారం 66నుంచి 70శాతం మందికి వైరస్ సంక్రమించినట్టు తేలింది. ఇంకా 30శాతం మందికి వైరస్ సంక్రమించే అవకాశాలున్నాయని కూడా ఈ సర్వే ఫలితాలను బట్టి అర్థమవుతోంది. అంటే,.. టీకా అందించని పక్షంలో అలాంటి వారికి ఎప్పుడైనా వైరస్ సంక్రమించే ఉన్నాయన్నమాట. 30శాతం మందికి వైరస్ సోకే అవకాశాలు ఉండటం, వారిపై వైరస్ తీవ్రమైన ప్రభావం చూపే సూచనలు కనిపిస్తూ ఉండటం, అరుదుగా మరణానికి కూడా ఆస్కారం ఉండటం తదితర కారణాల వల్ల,.. దేశవ్యాప్తంగా మనలో ఎవరూ,  ఎలాంటి నిర్లక్ష్యం వహించినా,..నష్టం భారీస్థాయిలోనే ఉండవచ్చు. 2021 ఏప్రిల్, మే నెలల్లో దేశంలో నెలకొన్న పరిస్థితిని మళ్లీ ఎదురు కావచ్చు కూడా.   

  అందువల్ల కోవిడ్ వైరస్ కట్టడికోసం నిర్దేశించిన నిబంధనలను, జాగ్రత్తలను పూర్తిగా పాటించడం అత్యంత ఆవశ్యకం. మనల్ని కాపాడుకోవడానికి అదే కీలకం. ప్రత్యేకించి రానున్నది పండుగల సీజన్ కాబట్టి ఈ జాగ్రత్తలు చాలా అవసరం. ఈ సమయంలో వైరస్ కొత్త ఉత్పరివర్తనాలు, మ్యుటేషన్లు వస్తే, చివరకు అదే ధర్డ్ వేవ్.కు కూడా దారితీయవచ్చు.

 

 ప్రశ్న. డెల్టా వేరియంట్.పై కోవిడ్ వ్యాక్సీన్ ఏ మేరకు ప్రభావం చూపుతుంది? ధర్డ్ వేవ్ ముప్పును నిరోధించడానికి మనం చేయాల్సిందేమిటి?

కోవిడ్ వ్యాక్సీన్ల ప్రభావ శీలతను ఈ కింది విధాలుగా వివరించవచ్చు.:

  • వైరస్ సంక్రమణ నిరోధంలో ప్రభావశీలత. తద్వారా వైరస్ వ్యాప్తినీ కట్టడి చేయడం
  • లక్షణాలతో కూడిన వ్యాధిని నిరోధించడంలో ప్రభావశీలత.
  • వ్యాధి తీవ్రతనుంచి, లేదా మరణంనుంచి రక్షించగలిగే ప్రభావశీలత

  లక్షణాలతో కూడిన వ్యాధిపై వ్యాక్సీన్ల చూపించే ప్రభావశీలత గురించే మీడియాలో మనకు ఎక్కువగా కనిపిస్తోంది. వివిధ వ్యాక్సీన్ల విషయంలో సాధారణంగా ప్రభావశీలత 60-90శాతంగా ఉంది.

  కోవిడ్ సంక్రమణను కట్టడి చేయడంలో చాలావరకు వ్యాక్సీన్లు  తగినంత ప్రభావశీలంగా ఉండటం లేదు. వ్యాక్సినేషన్ తర్వాత కూడా ఎవరైనా వ్యక్తి కోవిడ్ సంక్రమణను వ్యాప్తి చేసే ఆస్కారం ఉందని, అందువల్ల టీకా అందుకున్న తర్వాత కూడా అందరూ కోవిడ్ నిబంధనలను పాటించి తీరాల్సిందేనని పదేపదే చెప్పడం జరుగుతోంది.

  కోవిడ్-19 వ్యాక్సీన్ గురించిన ముఖ్యమైన విషయం ఏమంటే,..వ్యాధి తీవ్రతరం కాకుండా వ్యాక్సీన్ ప్రతిభావంతంగా పనిచేస్తుంది. ఆసుపత్రులో చేరాల్సిన అవసరంగానీ, మరణానికి ఆస్కారం గానీ లేకపోవచ్చు. ప్రస్తుతం భారతదేశంలోను, ప్రపంచంలోని ఇతర చోట్ల ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సీన్లన్నీ, రోగులను వ్యాధితీవ్రతనుంచి, మరణంనుంచి కాపాడుతాయి. డెల్టా వేరియంట్.తో సహా మిగతా అన్ని వేరియంట్ల విషయంలో కూడా ఇది పూర్తిగా సత్యమే. ఈ రోజున భారతదేశంలో వైరస్ సంక్రమణలన్నీ డెల్టా వేరియంట్ వల్లనే తలెత్తుతున్నాయి.

 

 ప్రశ్న. ఎవరికైనా వ్యక్తికి కోవిడ్-19 సంక్రమించిదని అనుకుంటే,.. సదరు వ్యక్తి శరీరంలో ప్రతిరక్షక కణాలు (యాంటిబాడీస్) ఉన్నాయనుకుంటే,.. తాజాగా కోవిడ్ బాధితుడైన రోగికి సదరు వ్యక్తి రక్తదానంగానీ, ప్లాస్మాదానం గానీ చేయవచ్చా?

  భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐ.సి.ఎం.ఆర్.) ఆధ్వర్యంలో జరిగిన అత్యంత నాణ్యమైన పరిశోధన ప్రకారం,..ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం ఉన్న తీవ్రవ్యాధి లక్షణాలున్న కోవిడ్ బాధితుల్లో చాలా మందికి ప్లాస్మా థెరపీ ఎలాంటి ఉపశమనమూ కలిగించలేదని తేలింది. ఇదే అంశంపై ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన అధ్యయనం కూడా,.. మరణాలను గానీ, ఆసుపత్రికి కెళ్లాల్సిన అవసరాన్ని గానీ నివారించలేకపోయింది. ఈ కారణంగానే,.. తీవ్రమైన వ్యాధి లక్షణాలున్న కోవిడ్ బాధితుల చికిత్సా ప్రక్రియనుంచి ప్లాస్మా థెరపీని తొలగిస్తూ ఐ.సి.ఎం.ఆర్. నిర్ణయం తీసుకుంది.

  ఇదివరకే చెప్పినట్టుగా,. ఎవరికైనా కోవిడ్ వైరస్ సోకిన పక్షంలో, సదరు వ్యక్తి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి క్రియాశీలం కావడంతో పాటుగా ప్రతిరక్షక కణాలు ఉత్పన్నమవుతాయి. కణాల ఆధారిత వ్యాధినిరోధక శక్తిని పరోక్ష నిరోధకశక్తిగా పేర్కొనవచ్చు. దీనికి కూడా ప్రతిరక్షక కణాలంత ప్రాముఖ్యత ఉంది. ఎవరికైనా కోవిడ్ సంక్రమించిన పక్షంలో, ఈ వ్యాధి నిరోధకశక్తికి సంబంధించిన అంశాలన్నీ వ్యాధి నిరోధంలో, వ్యాధి తీవ్రతను తగ్గించడంలో ఎంతగానో దోహదపడతాయి. 

  ఇటీవల ప్రతిరక్షక కణాల మిశ్రమాన్ని ఒక కంపెనీ మార్కెట్లో ప్రవేశపెట్టింది. కానీ, ఇది అంత ప్రయోజనం కలిగించలేకపోయింది. ఎందుకంటే,.. ప్రతిరక్షక కణాల మిశ్రమం కూడా ప్లాస్మా థెరపీ సూత్రాల ప్రాతిపదికగా రూపొందినదే. కోవిడ్ సోకిన మొదటి వారంలోనో, లేదా ప్రారంభ దశలోనో ప్లాస్మా థెరపీనో, ప్రతిరక్షకణాలనో ప్రయోగించిన పక్షంలో కొంతమేర ప్రయోజనం ఉంటుందని ఒక పరిశీలనలో తేలింది.

   ఎవరికైనా సహజంగా కోవిడ్ సంక్రమించి, తిరిగి కోలుకున్న పక్షంలో సదరు వ్యక్తిలోని వ్యాధి నిరోధక శక్తి, ఎక్కువ కాలంపాటు అతనికి వైరస్.నుంచి రక్షణ కల్పిస్తుందని, అదే వ్యక్తి వ్యాక్సీన్ తీసుకుంటే,..అలాంటి వారికి వైరస్ సంక్రమణనుంచి రెట్టింపు స్థాయిలో రక్షణ లభిస్తుందని ఇటీవల ప్రచురితమైన ఒక పరిశోధనా పత్రం తెలిపింది.

 

 ప్రశ్న. మన ప్రజలకు బూస్టర్ డోస్ వ్యాక్సీన్ అందించాల్సిన అవసరం ఉంటుందా?

   మన దేశంలోని వారికి బూస్టర్ డోస్ ఆవశ్యతకను గురించి నిర్ణయించేందుకు పశ్చిమ దేశాల్లో పరిస్థితిని ప్రాతిపదికగా తీసుకోలేం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితి ఆధారంగా జరిగే అధ్యయనాలే ఈ విషయంలో మనకు మార్గదర్శకమవుతాయి. దేశంలో 70నుంచి 80శాతం మంది జనాభాకు వైరస్ సంక్రమించిన సందర్భంలో మాత్రమే ఈ అంశాన్ని పరిశీలించే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా,..మన ప్రజలకు గరిష్ట స్థాయిలో రక్షణ కల్పించాలన్న లక్ష్యంతోనే,..అందుబాటులో ఉన్న వైజ్ఞానిక ఆధారాలు ప్రాతిపదికగా మనం తగిన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.

  ప్రశ్న.  వ్యాక్సీన్ వ్యాధినిరోధక సామర్థ్యాన్ని, ఎవరైనా వ్యక్తి శరీరంలోని పరిమితులను ఒకే అంశంగా పరిశీలించాలా...లేక విడివిడిగా చూడాల్సి ఉంటుందా? వ్యాధి సంక్రమణ తీవ్రత అనేది ఎవరైనా వ్యక్తి శారీరక పరిమితులపై ఆధారపడి ఉంటుందా, లేక వ్యాక్సీన్ సామర్థ్యం అందరికీ ఒకేలా ఉంటుందా ?

  ఈ అంశాలన్నింటినీ సమీకృత పద్ధతిలోనే పరిశీలించాల్సి ఉంటుంది. కోవిడ్ వ్యాక్సీన్ మాత్రమే కాక, ఏ ఇతర వ్యాక్సీన్.కు అయినా యువజనుల శారీరక ప్రతిస్పందన చాలా బలంగా ఉంటుంది. వారికి ఇచ్చే వ్యాక్సీన్ కూడా గరిష్టస్థాయిలో ప్రభావశీలంగా ఉంటుంది. క్రమేణా వయస్సు పెరగడం, ఇతర రకాల దీర్ఘకాల వ్యాధుల ప్రభావం వంటి కారణాలతో వ్యాక్సీన్ ప్రభావశీలత తగ్గే అవకాశం ఉంది. ఈ కారణం వల్లనే,..వ్యాక్సీన్ ప్రారంభ ప్రయోగాల్లో 60ఏళ్లు దాటిన వయోవృద్ధులకే ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చింది. అయితే, అదృష్ట వశాత్తూ,..కోవిడ్-19 వ్యాక్సీన్లు అందరి విషయంలోనూ సమాన స్థాయిలో పనిచేస్తున్నాయి. ఈ అంశాలన్నీ చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే,..యువకులు, ఎలాంటి దీర్ఘకాల వ్యాధులు సోకనివారితో పోల్చుకుంటే,.. వయో వృద్ధుల్లో, దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారిలో వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం, మరణం సంభవించే అవకాశం దాదాపుగా 20నుంచి 25 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ అంశం ఆధారంగానే, వ్యాక్సినేషన్ ముందస్తుగా ఎవరికి అందించాలన్నది నిర్ణయించారు. శరీరంలోని వ్యాధి నిరోధకశక్తిని తీవ్రంగా దెబ్బతీసే వ్యాధులు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు...చికిత్సలో ఉన్న కేన్సర్ రోగులు, స్టెరాయిడ్లు తీసుకునే రోగులకు వ్యాధినిరోధక శక్తి బాగా తెబ్బతినే ఆస్కారం ఉంది.

  అలాంటి వ్యక్తుల్లో వ్యాక్సీన్ల రక్షణాపరమైన ప్రతిస్పందన ఆశించినంతగా ఉండకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లోనే మరో డోసు లేదా బూస్టర్ డోసు రూపంలో మళ్లీ వ్యాక్సీన్ అవసరం కావచ్చు. కోవిడ్ వ్యాక్సీన్లకు సంబంధించి బూస్టర్ డోసు ఆవశ్యకత గురించి నిర్ణయం తీసుకునేటపుడు ఈ అంశాలన్నింటినీ ఎన్.టాగీ తప్పనిసరిగా పరిశీలిస్తుంది.

 

***



(Release ID: 1753646) Visitor Counter : 163