ఆయుష్

ముందస్తు నివార‌ణ మందుల‌ను పంపిణీ చేసిన ఆయుష్ మంత్రిత్వ‌శాఖ‌


క‌రోనా వైర‌స్‌పై పోరాటం చేసేలా రోగ నిరోధ‌క‌శ‌క్తిని బ‌లోపేతం చేసే మందులు
60 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు పైబ‌డిన‌వారిపై ప్ర‌త్యేక దృష్టి.

Posted On: 02 SEP 2021 5:38PM by PIB Hyderabad

ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ కార్య‌క్ర‌మం కింద కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ త‌న కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగిస్తోంది. క‌రోనా వైర‌స్ ను త‌ట్టుకొని శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌గ‌లిగే ముంద‌స్తు నివార‌ణ మందుల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని తాజాగా ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయా మందుల‌కు సంబంధించినవి ఆహార, జీవ‌న అల‌వాట్లకు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌న నియ‌మాల పుస్తకాల్ని కూడా పంపిణీ చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని కేంద్ర ఆయుష్ శాఖ‌, నౌకాయాన శాఖ‌, ఆయుష్ శాఖ‌, మ‌హిళా శిశు అభివృద్ధి శాఖ సంయుక్తంగా నిర్వ‌హించాయి. ఈ కార్య‌క్ర‌మంలో  కేంద్ర మంత్రులు శ్రీ శ‌ర‌బానంద సోనోవాల్‌, డాక్ట‌ర్ ముంజ్ పారా మ‌హేంద్రాభాయి పాల్గొన్నారు. 
రాబోయే ఒక సంవ‌త్స‌ర కాలంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే మందుల‌ను మార్గ‌ద‌ర్శ‌క నియ‌మాల పుస్త‌కాల‌ను 75 లక్ష‌ల‌ మంది ప్ర‌జ‌ల‌కు పంపిణీ చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా 60 సంవ‌త్స‌రాలు దాటిన ప్ర‌జ‌ల‌కు, ఫ్రంట్ లైన్ కార్య‌క‌ర్త‌లకు వీటిని పంపిణీ చేస్తున్నారు. 
కోవిడ్ 19పై పోరాటంలో భాగంగా ఇస్తున్న ఆయుర్వేద ముందుస్తు నివార‌ణ మందుల్లో శన్ష‌మ‌ణి వాటి, అశ్వగంధ గ‌న్వాటి వున్నాయి. శ‌న్ష‌మ‌ణి వాటిని గుడుచి లేదా గిలోయ్ గ‌న్వాటి అని కూడా అంటారు. ఈ కిట్టును , మార్గ‌ద‌ర్శ‌క నియ‌మాల‌ను ఆయుర్వేద మందుల కేంద్రీయ ప‌రిశోధ‌నా సంస్థ ( సిసిఆర్ ఏ ఎస్ ) త‌యారు చేసింది. 
దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 75 సంవ‌త్స‌రాలవుతున్న సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ముంద‌స్తు నివార‌ణ మందుల‌ను, మార్గ‌ద‌ర్శ‌క నియ‌మాల పుస్త‌కాల‌ను క‌లిపి పంపిణీ చేయ‌డం జ‌రుగుతోంది. ఈ కార్య‌క్ర‌మం సంవ‌త్స‌ర‌మంతా కొన‌సాగుతుంది. వ‌చ్చే ఏడాది ఆగ‌స్టు నెల‌వ‌ర‌కూ వుంటుంది. 
అంద‌రికీ ఆరోగ్యం అనే ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని కేంద్ర మంత్రి శ్రీ శ‌ర‌బానంద సోనోవాల్ అన్నారు. ఆయ‌న విర్చువ‌ల్ ప్ర‌సంగం ఇచ్చారు. క‌రోనా మ‌హ‌మ్మారికి వ్య‌తిరేకంగా ఏడు కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాల‌ని ప్ర‌ధాని పిలుపునిచ్చారు. వాటిలో మొద‌టిది వృద్ధుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డ‌మ‌ని కేంద్ర‌మంత్రి స్ప‌ష్టం చేశారు. 
ఆయుష్ ముంద‌స్తు నివార‌ణ మందుల‌ను పంపిణీ చేయ‌డంద్వారా క‌రోనా వైర‌స్‌పై పోరాటం చేసేలా శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి బ‌లోపేత‌మ‌వుతుంద‌ని కేంద్ర‌మంత్రి స్ప‌ష్టం చేశారు. మ‌హ‌మ్మారికి సంబంధించిన మొద‌టి రెండు ద‌శ‌ల్లో దేశంలోని సంప్ర‌దాయ వైద్యంప‌ట్ల ప్ర‌జ‌లు త‌మ సంపూర్ణ విశ్వాసాన్ని చూపార‌ని , దాంతో దేశ‌వ్యాప్తంగా ఈ మందుల పంపిణీని చేప‌ట్టామ‌ని ఆయ‌న వివ‌రించారు. దేశ‌వ్యాప్తంగా వున్న 86 ఆయుష్ సంస్థ‌ల‌తో కూడిన బ‌ల‌మైన నెట్‌వ‌ర్క్ ద్వారా ఈ కార్యక్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 
ఈ కార్య‌క్ర‌మాన్ని స‌మ‌ర్థ‌వంతంగా రూపొందించి అమ‌లు చేస్తున్నందుకుగాను సిసిఆర్ ఏ ఎస్ అధికారులను మంత్రి అభినందించారు. ఈ మందుల‌ను పంపిణీ చేయ‌డంలో వృద్ధుల ఆరోగ్యంప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టార‌ని ఈ సంద‌ర్భంగా కౌన్సిల్ సేవ‌ల‌ను ఆయ‌న ప్ర‌శంసించారు. 
కేంద్ర స‌హాయ మంత్రి డాక్ట‌ర్ మంజ్ పారా మ‌హేంద్ర‌భాయ్ మాట్లాడుతూ ఈ కార్య‌క్ర‌మం వృద్ధుల ఆరోగ్యంపై దృష్టి పెట్టింద‌ని, వ‌య‌స్సు మీరిన ప్ర‌జ‌ల రోగ‌నిరోధ‌క‌శ‌క్తిని బ‌లోపేతం చేయ‌డం మంచిద‌ని అన్నారు. ఈ మ‌హ‌మ్మారి అనేది వృద్ధుల‌కు ప్ర‌మాద‌క‌రంగా మారింద‌ని ప్ర‌స్తుత కార్య‌క్ర‌మం దానిపై దృష్టి పెట్టింద‌ని స్ప‌ష్టం చేశారు. 
ఈ కార్య‌క్ర‌మంలో వివిధ కేంద్ర‌ప్ర‌భుత్వ సంస్థ‌ల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఆగ‌స్టు 30నుంచి సెప్టెంబ‌ర్ 5 వ‌ర‌కూ కేంద్ర ఆయుష్ మంత్రిత్వ‌శాఖ ఆధ్వ‌ర్యంలో ప‌లు కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. వై బ్రేక్ మొబైల్ అప్లికేష‌న్ ప్రారంభం,  మందు మొక్క‌ల పంపిణీ, వివిధ వెబినార్ల నిర్వ‌హ‌ణ‌లాంటి కార్యక్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. 

 

***



(Release ID: 1751933) Visitor Counter : 169