సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

సినీవాణిజ్య వృద్ధికి, సహకారానికి చక్కని మార్గం బ్రిక్స్ సమ్మేళనం


బ్రిక్స్ కూటమి ఫిల్మ్ టెక్నాలజీ చర్చాగోష్టిలో
కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రకటన.

మన టెక్నీషియన్ల సృజనాత్మక శక్తిని
సద్వినియోగం చేసుకోవాలని, పిలుపు

Posted On: 01 SEP 2021 6:10PM by PIB Hyderabad

  భారతదేశం ఆసియాలో కీలకమైన దేశమని, బ్రిక్స్ (బి.ఆర్.ఐ.సి.ఎస్.) కన్సార్షియం సభ్యదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రధాన పాత్ర పోషించాలన్నది తమ భావన అని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చెప్పారు. 2021, సెప్టెంబరు ఒకటవ తేదీన ‘బ్రిక్స్ ఫిల్మ టెక్నాలజీ చర్చాగోష్టి’లో కేంద్రమంత్రి ప్రసంగిస్తూ,.. బ్రిక్స్ ఆధ్వర్యంలో తొలిసారిగా ఫిల్మ్ టెక్నాలజీ చర్చాగోష్టిని నిర్వహించడం, సభ్యదేశాలన్నింటినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చేందుకు జరిగిన ప్రయత్నమని అన్నారు. “చలన చిత్రాలు, కళలు, సంస్కృతి తదితర మాధ్యమాల ద్వారా సహకారాన్ని పెంపెందించుకునేందుకు మనకు పలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. చలన చిత్ర వాణిజ్యంలో ప్రగతికి, వృద్ధికి ఇవి దోహదపడతాయి.” అని ఆయన అన్నారు. ప్రధాన ఆర్థిక శక్తులుగా ఆవిర్భవిస్తున్న బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాప్రికా దేశాలతో కూడిన బ్రిక్స్ కూటమి ఆధ్వర్యంలో,.. భారతీయ వాణిజ్య, పారిశ్రామిక మండలుల సమాఖ్య (ఫిక్కీ-ఎఫ్.ఐ.సి.సి.ఐ.), భారతీయ చలనచిత్ర, టెలివిజన్ సంస్థ (ఎఫ్.టి.ఐ.ఐ.),..కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖతో కలసి ఉమ్మడిగా ఈ చర్చాగోష్టి నిర్వహించాయి. “భారతదేశంలో నిర్వహించే బ్రిక్స్ శిఖరాగ్ర సమ్మేళనం సన్నాహాల్లో భాగంగా బ్రిక్స్ ఫిల్మ్ టెక్నాలజీ చర్చాగోష్టిని నిర్వహించడం  గర్వకారణంగా భారత్ భావిస్తోంది.” అని ఠాకూర్ అన్నారు.

  భారత్ అధ్యక్షతలో  బ్రిక్స్ సహకారాన్ని మరింత సుస్థిరం చేసి, సంస్థాగతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు. “బ్రిక్స్ దేశాల ప్రజలందరి హృదయాలను గెలుచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకు చలనచిత్ర చర్చాగోష్టి ఒక అవకాశం. చలనచిత్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అందరినీ ఒక్కటి చేయడానికి ఇది దోహదపడుతుంది. చలనచిత్ర సాంకేతిక పరిజ్ఞాన ప్రతిభా పాటవాలను గౌరవ మర్యాదలతో భారతదేశంలో సత్కరించాలన్న భావన గౌరవ ప్రధానమంత్రిదే. బ్రెజిల్.లో జరిగిన 11వ బ్రిక్స్ శిఖరాగ్ర సమ్మేళనంలో ప్రధాని ఈ ప్రతిపాదన తీసుకువచ్చారు.” అని కేంద్రమంత్రి గుర్తు చేశారు. మన సాంకేతిక నిపుణుల సృజనాత్మకతను సద్వినియోగం చేసుకోవాలని, బ్రిక్స్ దేశాల పౌరులందరికీ జాతి నిర్మాణ స్ఫూర్తిని అలవర్చాలని ఆయన పిలుపునిచ్చారు.

  “చలన చిత్ర పరిశ్రమ కోసం పనిచేస్తున్న సేవారంగం పాత్రను, సాంకేతిక నిపుణుల సేవలను గుర్తించడమే బ్రిక్స్ ఫిల్మ్ టెక్నాలజీ చర్చాగోష్టి ప్రధాన ధ్యేయం. బ్రిక్స్ కూటమిలో సభ్యదేశాల్లోని చలన చిత్ర సాంకేతిక పరిజ్ఞాన నిపుణులకు తగిన అవకాశాలను కల్పించడంలో ఈ చర్చాగోష్టి దోహదపడుతుంది. దీనితో ప్రపంచ సినీ  రంగంపై కొత్త దృక్పథం, దార్శనికతతో అన్వేషణకు వీలుంటుంది.” అని కేంద్రమంత్రి అన్నారు.

  కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర మాట్లాడుతూ,...ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విభిన్న సంస్కృతులను పరస్పరం గౌరవించుకునేందుకు ఈ చర్చాగోష్టి తగిన వేదికను కల్పిస్తుందన్నారు. చలన చిత్రాల తయారీని ప్రోత్సహించే వివిధ సాంకేతిక పరిజ్ఞాన సంస్థలకు ఒక సరైన వేదికను, తగిన భాగస్వామ్యాలను ఈ  చర్చాగోష్టి కల్పిస్తుందన్నారు. పరస్పర అభిప్రాయాల మార్పిడి, సహకారం మెరుగుదల కోసం చలనచిత్ర సంస్థలను ఒక తాటిపై తెచ్చేందుకు దోహదపడుతుందన్నారు.

 “చలన చిత్ర పరిశ్రమలో వి.ఎఫ్.ఎక్స్ అనిమేషన్, కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజెరీ, మీడియా అవుట్ సోర్సింగ్ వంటి అంశాలకు సంబంధించి బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు ఎంతో గణనీయమైన కృషి చేస్తున్నాయి. చలన చిత్ర నిర్మాణం, ప్రపంచ వినోద పరిశ్రమలో సాంకేతిక పరిజ్ఞానం స్థాయిని పెంచే విషయంలో పరస్పర సహకారానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. భారతదేశంలో 52వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంతో పాటు బ్రిక్స్ చలన చిత్రోత్సవం కూడా జరగబోతోంది. మన ఉత్తమ చలన చిత్రాలను పంచుకునేందుకు ఈ రెండు కార్యక్రమాలూ చక్కని అవకాశం కల్పిస్తాయి.” అని అపూర్వ చంద్ర అన్నారు.

   బ్రెజిల్ ఫెడరల్ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ ప్రత్యేక కార్యదర్శి మేరియో ఫ్రియాస్ మాట్లాడుతూ,  సాంస్కృతిక రంగంలో బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు పరస్పరం సహాయం అందించుకుంటూ, సహకారాన్ని ప్రోత్సహించేందుకు మనం కృషిని కొనసాగించాల్సిందేనని అన్నారు. “సాంస్కృతిక ఆర్థిక వ్యవస్థపై ఆంక్షలతో కూడిన చర్యల ప్రభావాన్ని తగ్గించేందుకు ఇది దోహదపడుతుంది. బ్రిక్స్ దేశాల మధ్య దృశ్య-శ్రవణ సహకారం మార్కెట్ అవకాశాల అన్వేషణకు, సాంస్కృతిక కార్యకలాపాల విస్తృతికి అవకాశం కల్పిస్తుంది.” అని ఆయన అన్నారు.

 కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నీరజా శేఖర్ ఈ చర్చాగోష్టికి వందన సమర్పణ చేశారు. ఫిక్కీ ప్రధాన కార్యదర్శి దిలీప్ చంద్ర సమన్వయకర్తగా వ్యవహరించారు. రెండు రోజులపాటు జరిగే చర్చాగోష్టిని బ్రిక్స్ కూటమి సభ్యదేశాలకు చెందిన పలువురు ప్రముఖ వక్తలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వర్చువల్ పద్ధతిలో ప్రదర్శను నిర్వహిస్తున్నారు. దక్షిణాఫ్రికా, చైనా, రష్యాల స్టాల్స్ తో పాటుగా, వర్చువల్ పద్ధతిలో పది స్టాల్స్.ను కూడా ఏర్పాటు చేశారు.

 

****



(Release ID: 1751341) Visitor Counter : 196