సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

రాజ్యాంగం తయారీ పై ప్రారంభమైన ఈ-ఫోటో ఎగ్జిబిషన్

Posted On: 27 AUG 2021 5:59PM by PIB Hyderabad

'ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్' లో భాగంగా, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75వ సంవత్సరం నడుస్తున్న సందర్భంగా, స్వాతంత్య్ర పోరాటంలోని వివిధ అంశాలపై, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఎం.ఐ.బి) ఈ సంవత్సరం మొత్తం వరుసగా అనేక  ఈ-ఫోటో ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని సంకల్పించింది.  ఈ పరంపరలో మొదటి ప్రదర్శనగా ‘మేకింగ్-ఆఫ్-ది-కాన్స్టిట్యూషన్’ పేరుతో ఒక ఎగ్జిబిషన్ను ఈ రోజు న్యూఢిల్లీలో దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించడం జరిగింది. 

ఈ -ఫోటో ఎగ్జిబిషన్ లో రాజ్యాంగాన్ని రూపొందించడానికి సంబంధించిన దాదాపు 30 అరుదైన చిత్రాలను పొందుపరిచారు.   వీటిని ఆకాశవాణి శబ్ద భాండాగారం మరియు ఫిల్మ్స్ డివిజన్ నుంచి సేకరించిన వీడియోలు, ప్రసంగాలతో వీటిని అనుసంధానం చేశారు.  రాజ్యాంగ పరిషత్ ఏర్పడినప్పటి నుంచి రాజ్యాంగాన్ని ఆమోదించి, చివరకు భారతదేశపు మొదటి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే వరకు మొత్తం ప్రయాణాన్ని ఈ-ఫోటో ఎగ్జిబిషన్ లో వివరించారు. 

ఈ-ఫోటో ఎగ్జిబిషన్ను https://constitution-of-india.in/  వెబ్-సైట్ లింకు ద్వారా వీక్షించవచ్చు. 

ఈ-ఫోటో ఎగ్జిబిషన్ కు సంబంధించిన కీలక ముఖ్యాంశాలు :

రాజ్యాంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత పార్లమెంటు భవనం చిత్రం మరియు రాజ్యాంగ నిర్మాణంలో చేసిన అపారమైన కృషి కారణంగా, ‘రాజ్యాంగ పితామహుడు’ గా పేరుగాంచిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్ర పటం తో ఈ-ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభమౌతుంది.

రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు (6 డిసెంబర్, 1946) మరియు అసెంబ్లీ మొదటి సమావేశం (9 డిసెంబర్, 1946) - రాజ్యాంగాన్ని రూపొందించడం లేదా ఆమోదించడం కోసం ప్రముఖంగా ఎన్నికైన ప్రతినిధులతో ఏర్పాటైన సంఘం రాజ్యాంగ పరిషత్, 1946 డిసెంబర్, 9వ తేదీన మొదటిసారిగా సమావేశమైంది.

డా. రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి గా నియమితులయ్యారు (11 డిసెంబర్, 1946) - భారత స్వాతంత్య్ర ఉద్యమకారుడు, న్యాయవాది, పండితుడు, డా. రాజేంద్ర ప్రసాద్, 1950 లో భారతదేశపు మొదటి రాష్ట్రపతి గా, రాజ్యాంగ పరిషత్ మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

'ఆబ్జెక్టివ్ రిజల్యూషన్' ప్రతిపాదన మరియు స్వీకరణ (13 డిసెంబర్, 1946) - పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 1946 డిసెంబర్, 13వ తేదీన ‘ఆబ్జెక్టివ్ రిజల్యూషన్’ ను ప్రవేశపెట్టారు. ఇది రాజ్యాంగాన్ని రూపొందించడానికి అవసరమైన తత్వశాస్త్రం, మార్గదర్శక సూత్రాలను సమకూర్చగా, ఆ తర్వాత, అది భారత రాజ్యాంగ ఉపోద్ఘాతం గా మారింది. 

జాతీయ పతాకం ఆమోదించబడింది (22 జూలై, 1947) - 1947 జూలై, 22వ తేదీన జరిగిన రాజ్యాంగ పరిషత్ సమావేశంలో భారత జాతీయ పతాకాన్ని ఆమోదించగా, 1947 ఆగష్టు, 15వ తేదీన భారత దేశ అధికారిక జెండా గా మారింది.  భారత దేశ పతాకం మూడు రంగులను కలిగి ఉంది. అవి కాషాయం, తెలుపు, ఇండియా గ్రీన్ (ఆకుపచ్చ); మధ్యలో నేవీ బ్లూ (నీలం) రంగులో 24 చువ్వలతో అశోక చక్రం ఉంటుంది.

స్వతంత్ర భారతదేశం (15 ఆగస్టు, 1947) - ఈ రోజున, బ్రిటిష్ సామ్రాజ్యం నుండి అధికారం భారతదేశానికి అప్పగించబడింది. అనేక మంది స్వాతంత్య్ర  సమరయోధుల కృషి ఫలితంగా, భారతదేశ  స్వాతంత్య్ర కాంక్ష సాకారమయ్యింది.

ముసాయిదా కమిటీ (29 ఆగస్టు, 1947) -  వివిధ కులాలు, మతాలూ, ప్రాంతాలు, లింగాలకు చెందిన 299 మంది ప్రతినిధులు రాజ్యాంగాన్ని రూపొందించారు.  కమిటీ దశలోనూ, రాజ్యాంగ పరిషత్ చర్చల సమయంలోనూ, భారత రాజ్యాంగంపై, ముసాయిదా కమిటీ మరియు దాని సభ్యుల ప్రభావం చాలా ఉంది.

భారత రాజ్యాంగం ఆమోదం పొంది, అమలయ్యింది (26 నవంబర్, 1949) - భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజుకు గుర్తు గా, ఈ రోజు ను రాజ్యాంగ దినోత్సవం లేదా జాతీయ న్యాయ దినోత్సవం గా జరుపుకుంటున్నాము.  ఈ రాజ్యాంగ సభ 1950 జనవరి, 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.

రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం (24 జనవరి, 1950) - రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం. 395 అధికారణాలు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలతో కూడిన 'భారత రాజ్యాంగాన్ని' అందరూ సంతకం చేసి ఆమోదించారు.

రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు (26 జనవరి, 1950) - భారత ప్రభుత్వ చట్టం-1935 ని  దేశ ప్రాథమిక పరిపాలన పత్రం లాగా రాజ్యాంగం భర్తీ చేసింది.  భారత రాజ్యం, భారత గణతంత్ర దేశం గా ఆవిర్భవించింది. 

మొదటి సార్వత్రిక ఎన్నికలు (1951-52) - భారతదేశంలో 1951 అక్టోబర్, 25వ తేదీ నుండి 1952 ఫిబ్రవరి 21వ తేదీ మధ్య కాలంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.  1947 ఆగష్టు నెలలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత లోక్ సభకు జరిగిన మొదటి ఎన్నికలు ఇవే.  1949 నవంబర్, 26వ తేదీన ఆమోదించబడిన భారత రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం ఈ ఎన్నికలు జరిగాయి. 

ఈ-ఫోటో ఎగ్జిబిషన్‌ లో అదనంగా ఇంటరాక్టివ్ / ఎంగేజింగ్ క్విజ్ కూడా ఉంది. ఇందులో పాఠకుల / ప్రేక్షకుల  పరస్పర చర్చను పెంపొందించడానికి మరియు పౌరుల ‘జన్ భాగిదారి ద్వారా జన్ ఆందోళన్" నిర్ధారించడానికి 10 ప్రశ్నలు కూడా ఉంటాయి.

ఈ-ఫోటో ఎగ్జిబిషన్ హిందీ, ఇంగ్లీష్ భాషలతో పాటు 11 ఇతర భాషల్లో (ఒడియా, గుజరాతీ, మరాఠీ, అస్సామీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, పంజాబీ, బెంగాలీ, ఉర్దూ) కూడా అందుబాటులో ఉంది.

దీనికి సంబంధించిన లింక్  ఎం.ఐ.బి;  బి.ఓ.సి;  పి.ఐ.బి;  దూరదర్శన్;  ఆకాశవాణి తో పాటు; కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రాంతీయ కార్యాలయాలు; ఇతర వివిధ మంత్రిత్వ శాఖల వెబ్‌-సైట్‌ లలో కూడా  అందుబాటులో  ఉంది.  ప్రాంతీయ పి.ఐ.బి. / ఆర్.ఓ.బి. కార్యాలయాల ద్వారా స్థానిక విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలకు సంబంధిత సామాజిక మాధ్యమాలలో ప్రచారం కోసం ఈ లింక్‌లు అందుబాటులో ఉంటాయి.

ఇది ఫేస్-బుక్ / ట్విట్టర్ / యూట్యూబ్ ఛానెల్స్ వంటి వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా కూడా విస్తరించబడుతుంది.  పాఠకులు / వీక్షకులు #AmritMahotsav ద్వారా ఈ అంశానికి సంబంధించిన ఏదైనా సమాచారాన్ని పోస్ట్ చేయవచ్చు లేదా పంచుకోవచ్చు. 

 

*****



(Release ID: 1749760) Visitor Counter : 4805