నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో "ఆజాది కా అమృత్ మహోత్సవ్ "

Posted On: 23 AUG 2021 1:40PM by PIB Hyderabad

ఆగష్టు 23 నుంచి 27 వ తేదీ వరకు జరగనున్న  "ఆజాది కా అమృత్ మహోత్సవ్ " వారోత్సవాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహించడానికి నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తున్నది.

వారోత్సవాల్లో భాగంగా రైతులకు పీఎం-కుసుమ్, ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ రెండవ దశపై మరింత అవగాహన కల్పించేలా కార్యక్రమాలను నిర్వహించాలని నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 2019 మార్చి నెలలో ప్రారంభం అయిన ఈ రెండు పథకాలు దాదాపు అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. 

ఆన్‌లైన్ ద్వారా శిక్షణా తరగతులు, వెబినార్లు, నిపుణులు లబ్ధిదారుల మధ్య చర్చా కార్యక్రమాలను నిర్వహించడం తో పాటు కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ భౌతికంగా కూడా కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.  

 ఈ వారంలో వివిధ రాష్ట్రాల్లో  వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తూనే  ఇతర కార్యకలాపాలు కూడా నిర్వహించనున్నారు.  

ఇళ్ల పై భాగంలో సౌర విద్యుత్ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి అవసరమైన ధరఖాస్తులను వినియోగదారుల నుంచి  స్వీకరించి వాటిని పరిశీలించడానికి చండీగఢ్ రెన్యూవబుల్ ఎనర్జీ సొసైటీ  ఆన్‌లైన్ విధానాన్ని ప్రారంభించనున్నది. 

సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి అంబాసిడర్లుగా నియమితులైన వారు ఈ వారంలో వినియోగదారులను కలుసుకుని సౌర విద్యుత్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, దీనిని ఎలా పొందాలన్న అంశంపై వివిధ రాష్ట్రాల్లో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇళ్ల పై భాగాలపై సౌర  విద్యుత్ ని ఏర్పాటు చేసుకోవడానికి అయ్యే ఖర్చు, దీనివల్ల కలిగే ఆదా తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు.

ఇప్పటికే సౌర విద్యుత్ ని ఉపయోగిస్తున్న వారితో కలిసి   అంబాసిడర్లు ఫోటోలను తీసుకుని వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తారు.

ఈ పథకం ప్రయోజనాలను వివరిస్తూ  ప్రముఖ వ్యక్తులు మరియు లబ్ధిదారులు రూపొందించే వీడియోలను కూడా మంత్రిత్వ శాఖ ప్రసారం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే సౌర విద్యుత్ ఉపయోగిస్తున్నవారు దీనివల్ల తాము పొందుతున్న ప్రయోజనాలను వివరిస్తూ రూపొందించే కార్యక్రమాలను సోషల్ మీడియాలో ఉంచుతారు. 

సౌర నగరాలుగా అభివృద్ధి చేయడానికి ఇప్పటికే 20 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు నగరాలను గుర్తించాయి. సౌర నగరాలుగా మారడానికి కోణార్క్, మొధేరా (సూర్య దేవాలయ నగరాలు) సిద్ధం అవుతున్నాయి. ఈ నగరాల్లో అమలు చేయడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టులపై సంబంధిత వర్గాలతో కలసి ప్రతి రాష్ట్రం గంటసేపు సాగే సదస్సు నిర్వహిస్తుంది.

వికేంద్రీకృత పునరుత్పాదక ఇంధన ఉత్పత్తులపై  ఆన్‌లైన్ లో లబ్ధిదారులు, గ్రామ స్థాయి పారిశ్రామికవేత్తలకు  శిక్షణా తరగతులను నిర్వహించడం జరుగుతుంది. వారిలో గ్రామ స్థాయికి చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు ఎక్కువగా ఉంటారు.     

వికేంద్రీకృత పునరుత్పాదక ఇంధన ఉత్పాదక విధానాల ద్వారా  జీవనోపాధి పొందే అంశంలో అవగాహన కల్పించడానికి ఈ రంగంలో పనిచేస్తున్న స్వచ్చంధ సేవా సంస్థలు/ స్వయం సహాయక బృందాలతో ఆన్‌లైన్కార్యక్రమాలను నిర్వహిస్తారు. 

ఆఫ్-గ్రిడ్ సోలార్ లబ్ధిదారుల (ఎమ్ ఎన్ ఆర్ ఐ  పథకాల కింద అందించిన సోలార్ వీధి దీపాలు  మరియు సోలార్ స్టడీ లాంప్స్) అనుభవాలను తెలుసుకోవడానికి, ఆఫ్-గ్రిడ్ సోలార్ అప్లికేషన్స్‌పై అవగాహన కల్పించడానికి  ఉత్తర ప్రదేశ్, అస్సాంజమ్మూ కాశ్మీర్ మరియు మిజోరాం రాష్ట్రాలకు చెందిన  లబ్ధిదారుల మధ్య చర్చా కార్యక్రమం నిర్వహిస్తారు. 

పీఎం- కుసుమ్ పథకంపై అవగాహన కల్పించడానికి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రజలకు తెలియజేయడానికి అవగాహనా కార్యక్రమాలను నిర్వహించి, దీనిపై క్విజ్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది.  పీఎం- కుసుమ్ పథకం కింద సౌర విద్యుత్ ను సొంత అవసరాలతో పాటు ఇతర ఉత్పాదకత కార్యక్రమాలకు కూడా వినియోగించడానికి అవకాశం ఉంటుంది. దీనిపై అవగాహన కల్పించి విధానాలను వివరించడానికి సదస్సులను నిర్వహించాలన్న ప్రతిపాదన ఉంది.  పీఎం- కుసుమ్ పథకం లబ్ధిదారుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి, ఈ పథకం అమలు చేయడానికి అందుబాటులో ఉన్న నిధుల వివరాలను వివరించడానికి విడిగా సదస్సులను నిర్వహించడం జరుగుతుంది. 

వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లో ప్రచార, అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడానికి కొంతమంది విక్రేతలు సంసిద్ధత వ్యక్తం చేశారు.  

***


(Release ID: 1748337) Visitor Counter : 296