రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav g20-india-2023

పుణెలోని 'ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్‌'లో సర్వీస్ ఒలింపియన్లను సత్కరించనున్న రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌

Posted On: 22 AUG 2021 1:24PM by PIB Hyderabad

ముఖ్యాంశాలు:
* బంగారు పతక విజేత, సుబేదార్ నీరజ్ చోప్రా సహా టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఇతర రక్షణ దళాల సిబ్బంది హాజరయ్యే అవకాశం
* ఏఎస్‌ఐ, రక్షణ దళాల వర్ధమాన క్రీడాకారులతో సంభాషించనున్న రక్షణ మంత్రి
* దక్షిణ సైనిక స్థావరం ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్న శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ 
* రక్షణ మంత్రితోపాటు కార్యక్రమంలో పాల్గొననున్న సైన్యాధిపతి, దక్షిణ సైనిక కమాండర్

    పుణెలోని 'ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్‌' (ఏఎస్‌ఐ) సర్వీస్‌ ఒలింపియన్లను రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ నెల 23న సత్కరించనున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించిన సుబేదార్‌ నీజర్‌ చోప్రా సహా భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన సాయుధ దళాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ఏఎస్‌ఐ, సాయుధ దళాల వర్ధమాన క్రీడాకారులతో ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి సంభాషిస్తారు. తర్వాత, దక్షిణ సైనిక స్థావరం ప్రధాన కార్యాలయాన్ని సందర్శిస్తారు. రక్షణ మంత్రి వెంట సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం.నరవణె, దక్షిణ సైనిక స్థావరం జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ జె.ఎస్‌.నాయిన్‌ ఉంటారు.

    భారత క్రీడల చరిత్రలో తమ పేర్లను సువర్ణాక్షరాలతో రాసిన మేజర్ ధ్యాన్‌చంద్‌ నుంచి సుబేదార్‌ నీరజ్‌ చోప్రా వరకు భారతీయ క్రీడలకు సైన్యం ఎప్పుడూ వెన్నెముకగా నిలిచింది. ఒలింపిక్స్‌ సహా అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించేందుకు క్రీడల స్థాయిని పెంచడానికి, భారత సైన్యంలో 'మిషన్ ఒలింపిక్స్' కార్యక్రమాన్ని 'కీలక బాధ్యతాయుత అంశం'గా 2001లో ప్రారంభించారు.

    పుణెలోని ఏఎస్‌ఐ భారత సైన్యానికి చెందిన ప్రత్యేక, ప్రపంచ స్థాయి క్రీడాసంస్థ. ఇక్కడి నుంచి 34 మంది ఒలింపియన్లు, 22 మంది కామన్వెల్త్ క్రీడల పతక విజేతలు, 21 మంది ఆసియా క్రీడల పతక విజేతలు, ఆరుగురు యూత్ గేమ్స్ పతక విజేతలు, 13 అర్జున అవార్డు గ్రహీతలు రూపొందారు. ఈ విజయాలకు ఆయా క్రీడాకారుల అంకితభావంతో పాటు, ఏఎస్‌ఐ  సహాయక సిబ్బంది కృషి కూడా కారణంగా నిలుస్తోంది.

    సైద్ధాంతిక పద్ధతిలో నైపుణ్యం గుర్తింపు, క్రమబద్ధమైన, ప్రపంచ స్థాయి శిక్షణ, క్రీడా శాస్త్ర మద్దతు, సాయుధ దళాల సహకారంతో అంతర్జాతీయంగా వెలుగులోకి తేవడం, మంచి మౌలిక వసతులు కల్పించడం, జాతీయ క్రీడల సమాఖ్య, జాతీయ & అంతర్జాతీయ స్థాయుల్లోని ఇతర క్రీడా సంస్థల ద్వారా అంతర్జాతీయ పోటీలకు సర్వీస్ క్రీడాకారులను సిద్ధం చేయడానికి ఒక ప్రధాన క్రీడా శిక్షణ సంస్థగా పుణెలోని ఏఎస్‌ఐ అభివృద్ధి చెందింది. 

 

***



(Release ID: 1748077) Visitor Counter : 139