ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
“ఇకపై బూస్టర్ డోస్ కోసం సిఫార్సులు తథ్యం”
“రెండు రకాల వ్యాక్సీన్ల కలయికతో ముప్పు ఉండకపోవచ్చు”
“సరిగా మాస్కు ధరించడం, వ్యాక్సీన్ వేసుకునేలా
అందరినీ ప్రోత్సహించడం చాలా అవసరం”
“వేవ్.ల కట్టడికి మనకున్న పెద్ద ఆయుధాలు ఇవే”
కోవిడ్ పరిశోధనపై ఎన్.ఐ.వి. డైరెక్టర్
ప్రియా అబ్రహాం అభిప్రాయాలు
Posted On:
18 AUG 2021 11:22AM by PIB Hyderabad
దేశంలో కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో సార్స్-సి.ఒ.వి.-2 వైరస్.పై జరిగే శాస్త్రీయ పరిశోధనలో భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐ.సి.ఎం.ఆర్.), పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్.ఐ.వి.) అగ్రస్థానంలో ఉంటూ వచ్చాయి. గత ఏడాది అంతా యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తూ వచ్చాయి. “2021వ సంవత్సరం కష్టతరమైనదైనా, అది మాకు సత్ఫలితాలు అందించిన సంవత్సరం” అంటున్నారు,,..ఐ.సి.ఎం.ఆర్.-ఎన్.ఐ.వి. డైరెక్టర్ ప్రియా అబ్రహాం.
కేంద్ర విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖ ఆధ్వర్యంలోని ఇండియా సైన్స్ అనే ఒ.టి.టి. చానల్.కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియా అబ్రహాం ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు.
వైరాలజీ సంస్థలో జరిగే వ్యాక్సీన్ రూపకల్పన ప్రక్రియను గురించి ఆమె ఈ ఇంటర్వ్యూలో వివరించారు. “వ్యాక్సీన్ రూపకల్పనకు సంబంధించి మేం వెంటనే చర్యలు తీసుకున్నాం. వైరస్ స్ట్రెయిన్.ను సత్వరం గుర్తించి, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థకు 2020 ఏప్రిల్ చివరి నాటికి వ్యాక్సిన్ తయారీ పనిని అప్పగించాం. వారు, విరియన్ ఇనాక్టవేటెడ్ వ్యాక్సీన్ ను రూపొందించి, సమీక్ష కోసం మే నెలలో మాకు అందించారు. దాన్ని పరిశీలించిన అనంతరం, చిట్టెలుకలు, కోతులు వంటి మానవేతర జంతువులపై ప్రభావాన్ని పరిశీలించేందుకు ప్రయోగాత్మక పరీక్షలు ప్రారంభించాం. అలాంటి పరీక్షలు నిర్వహించండం చాలా కష్టం. మా పరిధిలో ఉన్న అత్యున్నతమైన జీవ ప్రమాణాలకు అనుగుణంగా ప్రయోగాత్మక పరీక్షలు చేపట్టాం. ఆ తర్వాత, మొదటి దశ, రెండవ దశ, 3వ దశల క్లనికల్ పరీక్షల్లో వారికి అవసరమైన సహాయం అందించాం. వ్యాధి నిర్ధారణ అంశాల్లో, లేబరేటరీ పరిశోధన విషయంలో వారికి మద్దతును కూడా అందించాం.” అని ప్రియా అబ్రహాం అన్నారు. కోవిడ్-19 వైరస్ పై జరిగిన శాస్త్రీయ పరిశోధనలకు సంబంధించి ఇంటర్వ్యూలో ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో కొన్నింటిని ఇక్కడ ఇస్తున్నాం. వైరస్ మహమ్మారి భవిష్యత్తులో ఎలా ఉంటుందనే అంశంపై ఇది ఒక విశ్లేషణ. అంతేకాక, వైరస్ కు సంబంధించిన కొన్ని సాధారణ ప్రశ్నలకు ఇంటర్వ్యూ సమాధానమిస్తుంది.
చిన్న పిల్లలపై కోవాగ్జిన్ వ్యాక్సీన్ వినియోగానికి సంబంధించిన ప్రయోగాత్మక పరీక్షలు ఏ దశలో సాగుతున్నాయి ? చిన్నారులకు వ్యాక్సీన్ ఎపుడు సాధ్యం కావచ్చు?
రెండేళ్లనుంచి 18ఏళ్ల వరకూ వయస్సున్న పిల్లలకు కోవాగ్జిన్ టీకా ఇవ్వడానికి సంబందించి 2వ, 3వ ప్రయోగాత్మక పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. వీటి ఫలితాలు అతి త్వరలోనే అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నాం. ఫలితాలను ఔషధ నియంత్రణ సంస్థకు సమర్పిస్తాం. సెప్టెంబరులోనో లేదా ఆ తర్వాతనో చిన్నారులకోసం కోవాగ్జిన్ వ్యాక్సీన్ అందుబాటులోకి రావచ్చు. దీనితో పాటు జైడస్ క్యాడిలా వ్యాక్సీన్.పై కూడా ప్రయోగాత్మక పరీక్షలు సాగుతున్నాయి. ఈ వ్యాక్సీన్.ను కూడా చిన్నపిల్లలకోసం వినియోగించవచ్చు. దీన్నీ అందుబాటులోకి తెస్తాం.
ఈ వ్యాక్సీన్లకు అదనంగా చిన్నపిల్లకోసం అందుబాటులోకి తీసుకు రాగలిగే మిగతా వ్యాక్సీన్ల మాటేమిటి. ?
జైడస్ క్యాడిలా వ్యాక్సీన్ అనేది అందుబాటులోకి రానున్న మొట్టమొదటి డి.ఎన్.ఎ. టీకా మందు. దీనికి తోడు, జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్ సంస్థకు చెందిన ఎం-ఆర్.ఎన్.ఎ. వ్యాక్సీన్, బయలాజికల్ ఇ లిమిటెడ్ సంస్థకు చెందిన వ్యాక్సీన్, సీరమ్ ఇన్.స్టిట్యూట్ కు చెందిన నోవావాక్స్ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. ముక్కు రంద్రాల ద్వారా వేసే, భారత బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ చుక్కల టీకా మందు, కూడా రాబోతోంది. ఈ టీకాను ఇంజక్షన్ ద్వారా కాకుండా ముక్కు రంద్రాల గుండా చుక్కల రూపంలో అందిస్తారు.
ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సీన్లు ఏవైనా డెల్టా ప్లస్ వైరస్ వేరియంట్.పై ప్రభావం చూపగలుగుతాయా. ?
మొట్ట మొదట చెప్పేదేమిటంటే...డెల్టా వేరియంట్ తో పోలిస్తే, డెల్టా ప్లస్ తక్కువ స్థాయిలో మాత్రమే వ్యాపించే సూచనలున్నాయి. 130 దేశాల్లో డెల్టా వేరియంట్ ప్రధానంగా కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇది వ్యాపించి ఉంది. ఎక్కువ తీవ్రతతో వ్యాపించే లక్షణం కూడా ఈ వేరియంట్.కే ఉంది. ఈ వేరియంట్.పై ఎన్.ఐ.వి.లో మేం అధ్యయనం నిర్వహించాం. వ్యాక్సీన్ తీసుకున్న వారిలో ఉత్పన్నమైన ప్రతిరక్షకాలు (యాంటి బాడీస్), ఈ వేరియంట్.పై వాటి ప్రభావం తదితర అంశాలపై మేం అధ్యయనం జరిపాం. ఈ వేరియంట్.పై యాంటీబాడీస్ ప్రభావం రెండునుంచి, మూడు రెట్లు తగ్గినట్టుగా అధ్యయనంలో తేలింది. అయినప్పటికీ, వివిధ వేరియంట్లపై వ్యాక్సీన్లు ప్రభావశీలంగానే పనిచేస్తున్నాయి. రక్షక పాత్ర పోషించగలుగుతున్నాయి. ప్రభావం కాస్త తక్కువే అయినా, తీవ్రమైన వైరస్ రూపాలను నిరోధించాలంటే మాత్రం వ్యాక్సీన్లు చాలా కీలకం. లేకపోతే సదరు వేరియంట్ల కారణంగా రోగులు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. ఒక్కోసారి మరణానికి కూడా దారితీయవచ్చు. డెల్టా వేరియంట్.తో సహా వైరస్ వేరియంట్ ఏదైనా సరే..., ఇప్పటివరకూ వ్యాక్సీన్ మాత్రం అందరికీ రక్షణ ఇస్తోంది. అందువల్ల వ్యాక్సీన్ విషయంలో ఎవరకీ ఎలాటి సంకోచం ఉండరాదు.
రానున్న కాలంలో మనకు బూస్టర్ డోస్ అవసరమవుతుందా. ? ఈ అంశంపై ఏదైనా అధ్యనయం జరుగుతోందా. ?
బూస్టర్ డోస్ వ్యాక్సీన్.కు సంబంధించి విదేశాల్లో అధ్యయనాలు సాగుతున్నాయి. బూస్టర్ డోస్ కోసం కనీసం 7 విభిన్నమైన వ్యాక్సీన్లపై ప్రయోగాత్మక పరీక్షలు చేపడుతున్నారు. అయితే, ఇపుడు దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ.) నిలిపివేసింది. మరిన్ని దేశాలు వ్యాక్సినేషన్.ను అందిపుచ్చుకునేంత వరకూ దీన్ని నిలిపివేశారు. ఎందుకంటే, అత్యధిక ఆదాయం కలిగిన దేశాలు, అత్యల్ప ఆదాయం కలిగిన దేశాల మధ్య వ్యాక్సీనేషన్ విషయంలో అంతరాలు నెలకొన్నాయి. భవిష్యత్తులో మాత్రం బూస్టర్ డోసుకు తప్పక సిఫార్సులు వచ్చే అవకాశం ఉంది.
.
వివిధ రకాల వ్యాక్సీన్ల కలియికపై కూడా అధ్యయనాలు జరుగుతున్నాయా.? మనకు అవి ప్రయోజనకరమేనా. ?
రెండు డోసుల్లో రెండు విభిన్న రకాలైన వ్యాక్సీన్లను పొరపాటుగా అందించిన సందర్భాలు ఇప్పటికే చోటు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన నమూనాలను ఎన్.ఐ.వి.లో మేం పరీక్షించాం. రెండు డోసుల్లో రెండు విభిన్నమైన వ్యాక్సీన్లను తీసుకున్న వారు సురక్షితంగానే ఉన్నారని పరీక్షల్లో తేలింది. ఎలాంటి ప్రతికూల ప్రభావం కనిపించలేదు,. పైగా, రోగనిరోధక శక్తి కూడా కాస్త మెరుగ్గానే కనిపించింది. అంటే, ఇలా వ్యాక్సీన్ల కలయిక జరిగినా అది ప్రమాద హేతువుకాదని తేలింది. ఈ అంశంపై మేం అధ్యయనంచేస్తున్నాం. దీనిపై రానున్న కొద్ది రోజుల్లోనే మరిన్ని వివరాలు అందిస్తాం.
కోవిడ్-19 పరీక్షకు సంబంధించి మెరుగైన ఫలితాలు అందించే, మరింత విశ్వసనీయమై కొత్త పద్ధతి ఏదైనా అందుబాటులోకి వచ్చిందా. ?
సెకండ్ వేవ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆసుపత్రులు, లేబరేటరీలు కొత్త కేసులతో కిక్కిరిసిపోయాయి. ఆసుపత్రుల, లేబరేటరీల సిబ్బంది చాలామంది వైరస్ సంక్రమించింది. దీనితో సెకండ్ వేవ్ సమయంలో టెస్టింగ్ సామర్థ్యం తగ్గింది. పరీక్షల్లో వాడే ప్రతికారకాలకు కూడా కొరత ఏర్పడింది. ఈ అంశాలన్నీ పరీక్షల సామర్థ్యాన్ని ప్రభావితం చేశాయి. ఆర్.టి.-పి.సి.ఆర్. పరీక్షకూడా కేవలం 70శాతం కచ్చితత్వంతో కూడినది. అయితే, వ్యాధి నిర్ధారణకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ.) ఇప్పటికీ ఇదే పరీక్షను సిఫార్సు చేస్తోంది. అయితే, భవిష్యత్తులో మరింత వేగవంతమైన, కచ్చితత్వంతో కూడిన పరీక్షలు అక్కడికక్కడే మనకు అందుబాటులోకి రావచ్చు. నమూనాలను లేబరేటరీకి పంపాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు.
ఐ.సి.ఎం.ఆర్. రూపొందించిన ఆర్.టి. ల్యాంప్ పరీక్ష గురించి చెప్పగలరా. ?
ఆర్.టి.-ల్యాంప్ (ఎల్.ఎ.ఎం.పి.) పరీక్ష అనేది ఐ.సి.ఎం.ఆర్. రూపొందించిన వ్యాధినిర్ధారణ పరీక్ష. వ్యయపరంగా అందుబాటు యోగ్యమైనది. ఖరీదైన పరికర సామగ్రిగానీ, ఎక్కువ ఖర్చయ్యే శిక్షణగానీ దీనికి అవసరం లేదు. జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే దీన్ని నిర్వహించవచ్చు. సాంకేతిక విజ్ఞాన పరంగా చెప్పుకోదగిన ప్రగతి చోటుచేసుకోని ప్రాంతాల్లో వేగవంతమైన ఈ రకం పరీక్షలను నిర్వహించవచ్చు. భవిష్యత్తులో ఈ రకం పరీక్షలు ఎక్కువ ప్రజాదరణ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఎవరికి వారు సొంతంగా పరీక్ష చేసుకునే సెల్ఫ్ టెస్టింగ్ కిట్లు కూడా ఇపుడు మార్కెట్లలోకి వచ్చాయి. దీనివల్ల టెస్టుల వేగం పెరిగే అవకాశం ఏమైనా ఉందా.?
సెల్ఫ్ టెస్టింగ్ కిట్లు అంటే,..యాంటిజెన్ పరీక్షల పరికరాలే. ఆర్.టి.-పి.సి.ఆర్. పద్ధతితో పోల్చినపుడు ఈ టెస్టుల కచ్చితత్వం తక్కువే.
బర్డ్ ఫ్లూ, జికా వైరస్ సంక్రమించిన బాధితులకు సార్స్-సి.ఒ.వి.-2 సంక్రమణకు అవకాశం ఉందా. ?
బర్డ్ ఫ్లూ, జికా వైరస్.లకు కరోనా వైరస్.కు ఏ మాత్రం సంబంధం లేదు. అయితే, హెచ్.ఐ.ఎన్.ఐ. బర్డ్ ఫ్లూ లేదా స్వైన్ ఫ్లూ, సార్స్-సి.ఒ.వి.-2 వైరస్.ల సారూప్యం ఏమిటంటే,...మాస్కు ధారణ, భౌతిక దూరం పాటించడం, చేతుల పరిశుభ్రత వంటి జాగ్రత్తలతో ఈ వైరస్.లన్నింటీనీ నిరోధించవచ్చు. ఈ వైరస్.లన్నీ శ్వాస నాళాల ద్వారానే వ్యాపిస్తాయి. అంటే, కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చన్నమాట. అయితే, జికా వైరస్ మాత్రం దోమ కాటుతోనే వ్యాప్తి చెందుతుంది.
వర్షాకాల సమయంలో కోవిడ్-19 వైరస్ సంక్రమణ పెరిగే అవకాశాలున్నాయా. ?
అవును....దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగ్యూ, చికున్ గున్యా, జికా వైరస్ వంటి కేసులు వర్షాకాలంలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. పరిసరాల్లో నీరు నిలువ ఉంటే దోమలు సంతానోత్పత్తి పెరుగుతుంది కాబట్టి, చుట్టుపక్కల నీరు చేరకుండా చూసుకోవాలి. దోమ కాటుతో ప్రబలే ఈ వ్యాధులను మించి కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉండటం బాధాకరం.
జనంతో కిక్కిరిసిన దృశ్యాలు, చిత్రాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జనంలోని ఈ తరహా బాధ్యతారహిత్యం ఏ మేరకు హానికలిగిస్తుందంటారు. ?
కచ్చితంగా ఇది పెద్ద సమస్యే అవుతుంది. ఇలా చేయడం అంటే, తదుపరి వైరస్ ఉధృతిని మనంతట మనం ‘ఆహ్వానించడమే’. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రో ఎ. గెబ్రెయూసస్ మాటల్లో చెప్పాలంటే,... “ఈ మహమ్మారి అంతం కావాలని మనం అనుకుంటేనే అది అంతమవుతుంది. ఇది మన చేతుల్లోనే ఉంది.”. అంటే,..మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. ప్రత్యేకించి రానున్న పండుగల కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. మనం సమూహాలుగా గుమికూడటం వంటివి చేయరాదు. జనం గుమికూడినపుడే వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంది.
మరో వైరస్ వేవ్ రాకపోవడం అనేది సాధ్యమేనా. ?
వైరస్ కొత్త కొత్త వేరియంట్లు క్రమంగా వస్తూనే ఉంటాయి. వీటినుంచి రక్షణకు మనవద్ద రెండు పెద్ద ఆయుధాలు ఉన్నాయి. అవి ఏమిటి...అంటే: సక్రమంగా మాస్కు ధరించడం. వ్యాక్సీన్ తీసుకునేలా ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించడం. ఇలా చేసినపుడే ఏదైనా వేవ్ తలెత్తినా, అది అంత తీవ్రంగా ఉండదు.
ఇంటర్వ్యూ కోసం ఇక్కడ చూడవచ్చు.
*****
(Release ID: 1747138)
Visitor Counter : 240