గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

భారత స్వాతంత్ర్య 75 వార్షికోత్సవం నేపథ్యంలో ‘ట్రైబ్స్‌ ఇండియా’ వస్తువుల జాబితాలో 75 కొత్త ఉత్పత్తులు చేర్చిన ‘ట్రైఫెడ్‌’


జీఐ సూచీలో నమోదుకు 20 రాష్ట్రాలకు చెందిన 75 గిరిజన ఉత్పత్తుల గుర్తింపు

Posted On: 17 AUG 2021 3:25PM by PIB Hyderabad

ముఖ్యాంశాలు:

  • భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవం నేపథ్యంలో ‘ట్రైఫెడ్‌’ 75 కొత్త గిరిజన ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఇప్పటికేగల విస్తృత, ఆకర్షణీయమైన ‘ట్రైబ్స్ ఇండియా’ వస్తువుల జాబితాలో వీటికి స్థానం కల్పించింది.
  • ‘ట్రైఫెడ్‌ జిఐ ఉద్యమం’లో భాగంగా ‘భౌగోళిక సూచీ’ (జీఐ) కింద నమోదు కోసం గిరిజన మూలాలుగల 75 ఉత్పత్తులను ఎంపిక చేసింది. ఇవి ‘భారత భౌగోళిక వస్తు సూచీ (నమోదు, పరిరక్షణ) చట్టం-1999 కింద సూచికలో చేర్చబడతాయి.
  • ‘భౌగోళిక సూచీ’లో నమోదు కోసం 20 రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులు గుర్తించబడ్డాయి.
  • ఈ మేరకు గుర్తించిన 75 ఉత్పత్తులలో 37 ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలకు చెందినవే.
  • వీటిలో గిరిజన కేంద్రక రాష్ట్రాల నుంచే కాకుండా జార్ఖండ్‌ నుంచి 7 ఉత్పత్తులు, మధ్యప్రదేశ్‌ నుంచి 6 ఉత్పత్తులు ‘జీఐ’ సూచీ కింద నమోదు కోసం గుర్తించబడ్డాయి.

   భారతదేశం 75 ఏళ్ల స్వాతంత్ర్య వార్షికోత్సవాలు నిర్వహించుకోనున్న నేపథ్యంలో అనేక చర్యలు చేపట్టడంతోపాటు ఈ చరిత్రాత్మక మైలురాయి చేరిన సందర్భాన్ని స్మరించుకుంటూ ఆత్మనిర్భర్‌ భారత్‌ స్ఫూర్తితో చేపట్టిన ‘అమృత మహోత్సవం’ కింద పలు కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. గిరిజనుల ఆదాయాలు, జీవనోపాధులకు సుస్థిరత, మద్దతులో భాగంగా ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమం కింద ‘ట్రైఫెడ్‌’ తన కృషిని కొనసాగిస్తోంది. గిరిజన హస్త కళాకారుల నైపుణ్యానికి గుర్తింపు, వారి జీవనోపాధికి ఊతం నిమిత్తం ‘ట్రైఫెడ్‌’ తనవంతుగా వారు తయారుచేసే ఉత్పత్తులను ‘ట్రైబ్స్‌ ఇండియా రిటైల్‌ నెట్‌వర్క్‌’ ద్వారా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మార్గాల్లో సేకరించి విక్రయాలు చేపట్టింది.

   భారత్‌ 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలవైప పయనిస్తున్న నేపథ్యంలో 75 కొత్త గిరిజన ఉత్పత్తులను ‘ట్రైఫెడ్‌’ ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఇప్పటికేగల విస్తృత, ఆకర్షణీయమైన ‘ట్రైబ్స్ ఇండియా’ వస్తువుల జాబితాలో వీటికి స్థానం కల్పించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సేకరించి, ప్రవేశపెట్టిన ఈ ఉత్పత్తులలో అనేక ఆకర్షణీయ వస్తువులున్నాయి. ఈ మేరకు లోహపు బొమ్మలు, చేతితో తయారుచేసిన ఆభరణాలు, వేలాడదీసేవి సహా పలు రకాల అలంకరణ వస్తువులు, హస్తకళా నైపుణ్యంతో తయారుచేసిన చొక్కాలు, కుర్తాలు, మాస్కులు వీటిలో ఉన్నాయి. అంతేకాకుండా పలు సుగంధ ఉత్పత్తులు, రకరకాల పానీయాలు, మూలికా చూర్ణాలు వంటివి కూడా లభిస్తాయి.

   దీనితోపాటు ‘ఇండియా ఎట్‌ 75 (INDIA@75) –ప్రజా ఉద్యమం’లో భాగంగా గిరిజన మూలాలుగల లేదా సేకరించిన 75 ఉత్పత్తులను ‘ట్రైఫెడ్‌’ గుర్తించింది. ఇవన్నీ ‘భారత భౌగోళిక వస్తు సూచీ (నమోదు, పరిరక్షణ) చట్టం-1999 కింద సూచికలో చేర్చబడతాయి. ‘భౌగోళిక సూచీ’లో నమోదు కోసం 20 రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులు గుర్తించబడ్డాయి. ఇలా ఎంపిక చేసిన 75 ఉత్పత్తులలో 37 ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలకు చెందినవే. ఇక గిరిజన కేంద్రక రాష్ట్రాల నుంచే కాకుండా జార్ఖండ్‌ నుంచి 7, మధ్యప్రదేశ్‌ నుంచి 6 వంతున ఉత్పత్తులు ‘జీఐ’ సూచీ కింద నమోదు కోసం ఎంపికయ్యాయి.

   ఇక్కడితో ‘ట్రైఫెడ్‌’ కృషి ఆగిపోలేదు... ప్రపంచంలోని భారత రాయబార/దౌత్య కార్యాలయాల పరిధిలో 100 ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ విక్రయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనుంది. జీఐ సూచిక కింద నమోదైన గిరిజన సహజ-సేంద్రియ ఉత్పత్తులుసహా కళా-హస్తకళా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రాచుర్యం కల్పించడం ఈ కేంద్రాల లక్ష్యం. ఈ దిశగా గిరిజన ఉత్పత్తుల సుసంపన్నతను, వైవిధ్యాన్ని చాటేవిధంగా రూపొందించిన వస్తు జాబితాలు, కరదీపికలను రాయబార కార్యాలయాలకు అందజేసింది. ఇప్పటిదాకా సంప్రదించిన రాయబార/దౌత్య కార్యాలయాల్లో జమైకా, ఐర్లాండ్, టర్కీ, కెన్యా, మంగోలియా, ఇజ్రాయెల్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, కెనడా తదితర దేశాల్లోని 42 కార్యాలయాల నుంచి ఇప్పటికే స్పందన లభించింది. ఈ నేపథ్యంలో తొలివిడతగా గిరిజన ఉత్పత్తులను పంపే ప్రక్రియలో ట్రైఫెడ్‌ ప్రస్తుతం నిమగ్నమై ఉంది.

   అణగారిన గిరిజనానికి సాధికారత దిశగా దేశవ్యాప్తంగా గిరిజన సమాజాల ఆర్థిక సంక్షేమానికి (మార్కెటింగ్‌ కార్యకలాపాల విస్తృతి, వారి నైపుణ్యాల సుస్థిరత ఉన్నతీకరణల ద్వారా) ట్రైఫెడ్‌ ఎంతగానో కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ‘ట్రైబ్స్‌ ఇండియా’ పేరిటగల ‘రిటైల్‌ నెట్‌వర్క్‌’ ద్వారా గిరిజన కళలు-హస్తకళా ఉత్పత్తులను సేకరించి విక్రయాలు చేపట్టింది. ఇందుకోసం 1999లో న్యూఢిల్లీలోని నం.9 మహదేవ్‌ రోడ్డులో ప్రధాన విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, దీని పరిధిలో దేశవ్యాప్తంగా 141 చిల్లర విక్రయ కేంద్రాలు నడుస్తున్నాయి. ఈ విధంగా చేపట్టిన అదనపు కృషివల్ల ఆయా విశిష్ట గిరిజన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విస్తృత ప్రాచుర్యం లభిస్తుంది. తద్వారా ‘స్థానికత కోసం స్వగళం.. గిరిజన ఉత్పత్తుల కొనుగోలు’ నినాదాన్ని మరింత అధికస్థాయికి తీసుకెళ్లే వీలుంటుంది. ఇది దేశవ్యాప్తంగా గిరిజనుల సుస్థిర ఆదాయ-ఉపాధి సృష్టికి పరివర్తనాత్మక రీతిలో తోడ్పడుతుంది. ఈ మేరకు భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘ట్రైఫెడ్‌ బృందం’ ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలుపుతూ గిరిజన సంక్షేమానికి తాము చేస్తున్న కృషి ఫలించగలదని ఆశాభావం వ్యక్తం చేస్తోంది!

 

***



(Release ID: 1746793) Visitor Counter : 224