రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

జాతీయ రాజధానిలోని ఎర్రకోట వద్ద 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు - సర్వం సిద్ధం


జాతీయ జెండాను ఎగురవేసి దేశ ప్రజల నుద్దేశించి ప్రసంగించనున్న - ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 14 AUG 2021 2:59PM by PIB Hyderabad

కీలక ముఖ్యాంశాలు:

*    దేశం ‘ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్’ జరుపుకుంటోంది

*    ప్రధానమంత్రి రేపు ఎర్రకోట బురుజుల నుండి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహిస్తారు

*     బంగారు పతక విజేత నీరజ్ చోప్రాతో సహా ఒలింపియన్లను ఆహ్వానించారు

*     కరోనా యోధులు కూర్చోవడానికి ప్రత్యేకంగా బ్లాక్ ఏర్పాటు 

*     భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు అమృత్ ఆకారంలో పుష్ప వర్షం కురిపిస్తాయి

 

విదేశీ పాలన నుండి స్వాతంత్య్రం పొంది 75 సంవత్సరాలైన సందర్భంగా, భారతదేశం 'ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్' జరుపుకుంటోంది.  దేశమంతా దేశభక్తితో కూడిన ఉత్సాహంతో వెల్లివిరుస్తోంది.  భారత ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సాయుధ దళాల తో పాటు సాధారణ ప్రజానీకం కూడా, ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.

 

దేశవ్యాప్తంగా జరుపుకునే ఈ చారిత్రాత్మక 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2021 ఆగస్టు 15వ తేదీన న్యూఢిల్లీ లోని ఎర్రకోట బురుజుల నుండి నేతృత్వం వహిస్తారు.  జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం, ప్రధానమంత్రి దేశ ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తారు.  75వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2021 మార్చి నెలలో గుజరాత్‌, అహ్మదాబాద్‌ లోని సబర్మతి ఆశ్రమం నుండి ‘ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్’ ను ప్రధానమంత్రి ప్రారంభించిన విషయం తెలిసిందే.  ఈ వేడుకలు 2023 ఆగష్టు, 15వ తేదీ వరకు కొనసాగుతాయి.

 

ప్రధానమంత్రి ఎర్రకోట వద్దకు రాగానే, ఆయనకు రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ తో పాటు రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ స్వాగతం పలుకుతారు.  ఢిల్లీ ప్రాంత జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జి.ఒ.సి), ఎ.వి.ఎస్‌.ఎమ్‌., లెఫ్టినెంట్ జనరల్ విజయ్ కుమార్ మిశ్రా ను రక్షణ శాఖ కార్యదర్శి, ప్రధానమంత్రి కి పరిచయం చేస్తారు.  ఢిల్లీ ప్రాంత జి.ఓ.సి. శ్రీ నరేంద్రమోదీ ని గౌరవ వందన సమర్పణ వేదిక వద్దకు తోడ్కొని వెళ్తారు. అక్కడ సాయుధ దళాలు, ఢిల్లీ పోలీసు దళం సంయుక్తంగా ప్రధానమంత్రి కి గౌరవ వందనం సమర్పిస్తాయి. ఆ తర్వాత, గౌరవ వందనం చేసిన దళాలను ప్రధానమంత్రి పరిశీలిస్తారు. 

 

ప్రధానమంత్రి కి గౌరవ వందనం సమర్పించే బృందంలో సైన్యం, నావికా దళం, వైమానిక దళం, ఢిల్లీ పోలీసులకు చెందిన ఒక్కొక్క దళం నుండీ ఒక అధికారి, 20 మంది సిబ్బంది చొప్పున ఉంటారు.  భారత నావికాదళం, ఈ ఏడాది సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తోంది.   ఈ ఏడాది గౌరవ వందనం కార్యక్రమానికి కమాండర్ పియూష్ గౌర్ నాయకత్వం వహిస్తున్నారు.  ప్రధాన మంత్రికి గౌరవ వందనం సమర్పించే బృందంలో నావికాదళానికి లెఫ్టినెంట్ కమాండర్ సునే ఫోగట్;  సైన్యానికి చెందిన దళానికి మేజర్ వికాస్ సాంగ్వాన్;  నావికా దళానికి స్క్వాడ్రన్ లీడర్ ఏ. బెర్వాల్ నేతృత్వం వహిస్తారు.  ఢిల్లీ పోలీసు బృందానికి అదనపు డి.సి.పి. (పశ్చిమ జిల్లా) శ్రీ సుబోధ్ కుమార్ గోస్వామి నేతృత్వం వహిస్తారు. 

 

గౌరవ వందనాన్ని పరిశీలించిన అనంతరం, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎర్రకోట బురుజుల వద్దకు చేరుకుంటారు, అక్కడ ఆయనకు రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్;  రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్;  రక్షణ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్; సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం. నరవణే;  నావికాదళం అధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్;  వైమానిక దళం అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్. కె. ఎస్. భదౌరియా స్వాగతం పలుకుతారు.  ఢిల్లీ ప్రాంత జి.ఓ.సి., ప్రధానమంత్రి ని, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు ఎర్రకోట బురుజుల వద్దనున్న వేదిక వద్దకు,  తోడ్కొని వెళతారు. 

 

జండా ఎగురవేసిన అనంతరం, త్రివర్ణ పతాకానికి, ‘జాతీయ వందనం’ సమర్పిస్తారు.  జాతీయ పతాకాన్ని ఎగురవేసే సమయంలో జాతీయ గీతాన్ని మరియు 'జాతీయ వందనాన్ని'  16 మందితో కూడిన నావికాదళ వాద్యబృందం జాతీయ గీతాన్ని వాయిస్తారు.    ఈ వాద్య బృందానికి ఎం.సి.పి.ఓ. విన్సెంట్ జాన్సన్ నేతృత్వం వహిస్తారు. 

 

లెఫ్టినెంట్ కమాండర్ పి. ప్రియాంబదా సాహూ జాతీయ జెండా ను ఎగురవేసే సమయంలో ప్రధానమంత్రి కి సహాయం చేస్తారు.  అదే సమయంలో, ఎలైట్ 2233 ఫీల్డ్ బ్యాటరీ (సెర్మోనియల్) దళానికి చెందిన సాయుధ సిబ్బంది 21 తుపాకులు పేల్చి గౌరవ వందనం చేస్తారు.   ఈ సెర్మోనియల్  బ్యాటరీ దళానికి లెఫ్టినెంట్ కల్నల్ జితేంద్ర సింగ్ మెహతా (ఎస్.ఎం) మరియు గన్ పొజిషన్ ఆఫీసర్ నాయబ్ సుబేదార్ (ఏ.ఐ.జి) అనిల్ చంద్ నేతృత్వం వహిస్తారు. 

 

ప్రధానమంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే సమయంలో సైన్యం, నావికా, వైమానిక దళాలతో పాటు, ఢిల్లీ పోలీసు దళానికి చెందిన ఐదుగురు అధికారులు, 130 మందితో కూడిన జాతీయ పతాక దళం, జాతీయ గౌరవ వందనాన్ని సమర్పించనున్నారు.  భారత నావికాదళానికి చెందిన కమాండర్ కుల్‌ దీప్ ఎమ్. నేరల్కర్ ఈ అంతర్-సేవా దళం మరియు పోలీస్ దళానికి నాయకత్వం వహిస్తారు.

 

జాతీయ పతాక దళం లోని నావికాదళ బృందానికి లెఫ్టినెంట్ కమాండర్ ప్రవీణ్ సరస్వత్;   సైన్యం బృందానికి మేజర్ అన్షుల్ కుమార్;   వైమానిక దళ బృందానికి స్క్వాడ్రన్ లీడర్ రోహిత్ మాలిక్  నేతృత్వం వహించనున్నారు. ఢిల్లీ పోలీసు బృందానికి అదనపు డి.సి.పి. (నైరుతి జిల్లా) శ్రీ అమిత్ గోయల్ నేతృత్వం వహిస్తారు. 

 

ఎర్ర కోట వద్ద జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనవలసిందిగా -  ట్రాక్ అండ్ ఫీల్డ్‌ పోటీల్లో భారతదేశపు మొట్టమొదటి స్వర్ణ పతక విజేత, జావెలిన్ త్రో క్రీడాకారుడు సుబేదార్ నీరజ్ చోప్రా తో పాటు, భారత క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్.ఏ.ఐ) కు చెందిన ఇద్దరు అధికారుల తో సహా ముప్పై రెండు మంది ఒలింపిక్ విజేతలను ఆహ్వానించారు.  ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న దాదాపు 240 మంది క్రీడాకారులు, సహాయక సిబ్బంది, ఎస్.ఏ.ఐ. మరియు క్రీడా సమాఖ్య అధికారులను కూడా ఎర్రకోట బురుజుల ముందు జరిగే  జ్ఞాన్ పథ్ ను వీక్షించడానికి ఆహ్వానించారు.  టోక్యో లో జరిగిన ఒలింపిక్స్‌ క్రీడల్లో భారతదేశం అత్యుత్తమ స్థాయిలో మొత్తం ఏడు పతకాలు సాధించింది. వీటిలో ఒక స్వర్ణం, రెండు రజతం తో పాటు నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి.

 

అదృశ్య శత్రువు, కోవిడ్-19 తో పోరాడటంలో కీలక పాత్ర పోషించిన కరోనా యోధులను గౌరవించడానికి, ఎర్ర కోట బురుజులు దక్షిణ భాగంలో ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేయడం జరిగింది. 

 

మొట్టమొదటిసారిగా, ఈ ఏడాది ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎగురవేసిన వెంటనే, అమృత్ ఆకారంలో భారత వైమానిక దళానికి చెందిన రెండు ఎం.ఐ. 17 1 వి. హెలికాప్టర్ల ద్వారా కార్యక్రమం జరుగుతున్న ప్రాంతంలో పుష్ప వర్షం కురుపించనున్నారు.  వీటిలో మొదటి హెలికాప్టర్ కెప్టెన్ గా వింగ్ కమాండర్ బలదేవ్ సింగ్ బిష్ట్ వ్యవహరిస్తారు.  రెండవ  హెలికాప్టర్ కెప్టెన్ గా  వింగ్ కమాండర్ నిఖిల్ మెహ్రోత్రా వ్యవహరిస్తారు. 

 

పుష్ప వర్షం అనంతరం, ప్రధానమంత్రి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు.  ప్రధాన మంత్రి ప్రసంగం ముగిసిన వెంటనే, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్.సి.సి) కేడెట్లు జాతీయ గీతాన్ని ఆలపిస్తారు.  వివిధ పాఠశాలల నుండి ఐదు వందల (500) ఎన్.సి.సి. క్యాడెట్లు (సైన్యం, నావికా, వైమానిక దళాలు) ఈ జాతీయ ఫెర్వర్ పండుగలో దేశభక్తి పూరిత ఈ జాతీయ పండుగలో పాల్గొంటారు. 



(Release ID: 1745970) Visitor Counter : 199