నీతి ఆయోగ్

దేశంలో విద్యుత్‌ వాహన చార్జింగ్‌ మౌలిక వసతులపై మార్గనిర్దేశానికి కరదీపికను ఆవిష్కరించిన నీతి ఆయోగ్‌


ప్రభుత్వ చార్జింగ్‌ నెట్‌వర్కుల ఏర్పాటులో రాష్ట్రాలు..
స్థానిక సంస్థలకు తోడ్పడనున్న కరదీపిక

Posted On: 12 AUG 2021 3:13PM by PIB Hyderabad

   విద్యుత్‌ వాహనాల చార్జింగ్‌ నెట్‌వర్క్‌ (ఈవీ)ల ఏర్పాటు విధివిధానాలు, నిబంధనల రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలకు మార్గనిర్దేశం కోసం నీతి ఆయోగ్‌ ఇవాళ ఓ కరదీపికను ఆవిష్కరించింది. దేశం వేగంగా విద్యుత్‌ వాహనాల వినియోగంవైపు మళ్లడంతోపాటు వాటి చార్జింగ్‌ కోసం మౌలిక వసతులు పెంచడం దీని లక్ష్యం. ‘విద్యుత్‌ వాహన చార్జింగ్‌ మౌలిక వసతుల అమలు కోసం కరదీపిక’ను నీతి ఆయోగ్‌, కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ (ఎంఓపీ) పరిధిలోని శాస్త్ర-సాంకేతిక శాఖ (డీఎస్టీ), ఇంధన సామర్థ్య సంస్థ (బీఈఈ), ప్రపంచ వనరుల సంస్థ (డబ్ల్యూఆర్‌ఐ) సంయుక్తంగా రూపొందించాయి.

   విద్యుత్‌ వాహన చార్జింగ్‌ మౌలిక వసతుల కల్పన ప్రణాళిక రూపకల్పన, అనుమతులు, అమలుకు సంబంధించి ప్రాధికార సంస్థలు, ఇతర భాగస్వాములు అనుసరించాల్సిన విధివిధానాలపై ఈ కరదీపిక ఒక క్రమబద్ధ, సంపూర్ణ విధానాన్ని నిర్దేశిస్తుంది. అలాగే ‘ఈవీ’ చార్జింగ్‌ సౌలభ్య కల్పనకు అవసరమైన సాంకేతిక, నియంత్రణ చట్రాలు, పాలన వ్యవస్థలపైనా అవగాహన కల్పిస్తుంది. విద్యుత్‌ వాహనరంగ వికాస వేగాన్ని పరిగణనలోకి తీసుకుంటూ చార్జింగ్‌ మౌలిక వసతుల అభివృద్ది అవసరంపైనా దృష్టి సారిస్తుంది. భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్న వాతావరణ మార్పుపై పోరాటంలో విద్యుత్‌ వాహన రవాణావైపు పరివర్తన ఒక అంతర్జాతీయ వ్యూహం. ఈ నేపథ్యంలో “ఈవీ చార్జింగ్‌ నెట్‌వర్కులను అమలు చేయడంలో వివిధ స్థానిక పాలన సంస్థలకు సాధారణంగా ఎదురయ్యే సవాళ్లను ఈ కరదీపిక పరిష్కరిస్తుంది. ఆ మేరకు రాష్ట్రాలు-స్థానిక సంస్థల మధ్య ఉత్తమ పద్ధతుల పరస్పర ఆదానప్రదానం కోసం ఆరంభ బిందువుగా ఉపయోగపడుతుంది” అని నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌ అన్నారు.

   ఈ సందర్భంగా నీతి ఆయోగ్‌ సీఈవో శ్రీ అమితాబ్‌ కాంత్‌ మాట్లాడుతూ- “మన దేశంలో ‘ఈవీ’ పర్యావరణ వ్యవస్థ వేగంగా విస్తరిస్తుండగా, అనేకమంది చార్జింగ్‌ మౌలిక వసతుల మార్కెట్‌లో ప్రవేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో బలమైన, అందుబాటు ‘ఈవీ’ చార్జింగ్‌ నెట్‌వర్కుల ఏర్పాటులో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వాములు సంయుక్తంగా కృషి చేయడానికి ఈ కరదీపిక ఒక సమగ్ర విధానాన్ని నిర్దేశిస్తుంది” అన్నారు. కాగా, చార్జింగ్‌ సదుపాయాలకు నిరంతర విద్యుత్‌ సరఫరాలో కీలకపాత్ర పోషించగల రాష్ట్రాల విద్యుత్‌ సంస్థలకు ‘ఈవీ’ చార్జింగ్‌ ఓ కొత్త రకం విద్యుత్‌ డిమాండ్‌ను సృష్టిస్తుంది. ఈ డిమాండును తీర్చగల సామర్థ్యంగల విద్యుత్‌ పంపిణీ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు మార్గం వేస్తుంది.

   విద్యుత్‌ మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ అలోక్‌ కుమార్‌ ప్రసంగిస్తూ- “చార్జింగ్‌ మౌలిక సదుపాయాల నిర్వహణలో అవరోధాలను అధిగమించే దిశగా కేంద్ర విద్యుత్‌ శాఖతోపాటు దేశంలో చార్జింగ్‌ మౌలిక వసతుల ఏర్పాటుకు నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించే ఆ శాఖ పరిధిలోని ఇంధన సామర్థ్య సంస్థ (బీఈఈ)లు సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రాల ఏజెన్సీలు, డిస్కమ్‌లతో సమన్వయం చేసుకోవడానికి ఈ కరదీపిక ఎంతో సహాయపడుతుంది. దేశ మిశ్రమ ఇంధన రంగంలో పునరుత్పాదక వనరుల వాటా వేగంగా పెరుగుతున్న పరిస్థితుల నడుమ విద్యుత్‌ రవాణావైపు పరివర్తన ప్రయోజనాలు రానున్న రోజుల్లో కీలకం కానున్నాయి” అన్నారు.

   చార్జింగ్‌ కేంద్రాలు అందుబాటులో ఉంటే శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాలతో పోలిస్తే విద్యుత్‌ వాహనాలను ఎక్కడైనా చార్జ్‌ చేసుకోవచ్చు. అయితే, పగలు లేదా రాత్రివేళ  పార్క్‌ చేసినప్పుడల్లా చార్జ్‌ అయ్యేలా చూడటంవంటి విభిన్న పద్ధతులు ‘ఈవీ’ చార్జింగ్‌ నెట్‌వర్కుల ప్రణాళికలో భాగంగా ఉండాలి. ఆ మేరకు ప్రభుత్వ చార్జింగ్‌ మౌలిక వసతులు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయడం కోసం స్థానిక అధికార యంత్రాంగాలు లక్ష్యాలు నిర్దేశించాలి. అలాగే అవన్నీ ప్రణాళిక ప్రక్రియలో అంతర్భాగమయ్యేలా చూడాలి. ఆ మేరకు “ఈవీ చార్జింగ్‌ మౌలిక సదుపాయాలను తమ రవాణా, పట్టణ ప్రణాళిక చట్రాల్లో భాగం చేయడంలో ప్రణాళిక విభాగం అధికారుల కీలకపాత్రను ఈ కరదీపికను ప్రస్ఫుటం చేస్తుంది. చార్జింగ్‌ మౌలిక వసతుల ఏర్పాటు అవసరాన్ని వివిధ రాష్ట్రాలు, నగరాలు పరిగణనలోకి తీసుకుంటున్న నేపథ్యంలో చార్జింగ్‌ నెట్‌వర్కుల కోసం స్థానిక ప్రణాళికల నిమిత్తం సకాలంలో అందివచ్చిన వనరుగా ఈ కరదీపిక ఉపయోగపడుతుంది” అని ‘డబ్ల్యూఆర్‌ఐ’ ఇండియా సీఈవో డాక్టర్‌ ఒ.పి.అగర్వాల్‌ చెప్పారు.

   ఈ పరివర్తనకు మద్దతుగా బలమైన, విస్తృత ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ చార్జింగ్‌ నెట్‌వర్క్‌ సృష్టి కీలకం. ఈ నేపథ్యంలో “ఈవీ చార్జింగ్‌ కోసం చౌకైన నెట్‌వర్కులకు సంబంధించి భారతీయ ప్రమాణాలు, నమూనాలను అభివృద్ధి చేయడంలో ‘డీఎస్టీ’ మార్గదర్శనం చేస్తోంది. ఇవి భారతదేశంలో ‘ఈవీ’ పర్యావరణ అవసరాలకు తగినవిధంగా ఉంటాయి. ఈ కరదీపికలో నిర్వచించిన చౌకైన ‘ఈవీ’ చార్జింగ్‌ పాయింట్ల కోసం వైవిధ్య ప్రణాళిక విధానం ఇవ్వబడింది. ఇది రానున్న ప్రమాణాలకు ఎంతో అనువుగా ఉండటమేగాక చార్జింగ్‌ మౌలిక వసతులు వేగంగా పెరగడానికి తోడ్పడుతుంది” అని డీఎస్టీ కార్యదర్శి డాక్టర్‌ అశుతోష్‌ శర్మ తన ప్రసంగంలో పేర్కొన్నారు. హైవేల మీద ప్రతి 25 కిలోమీటర్లకు లేదా 3*3 గ్రిడ్‌వద్ద కనీసం ఒక చార్జింగ్‌ స్టేషన్ ఏర్పాటును జాతీయ లక్ష్యంగా కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ నిర్దేశించింది. అలాగే మరిన్ని విభజిత లక్ష్యాలు, ప్రణాళికలను నిర్దేశించే బాధ్యత పట్టణ స్థానిక సంస్థలు లేదా రాష్ట్ర నోడల్‌ ఏజెన్సీలపై ఉంటుంది. తదనుగుణంగా పురపాలక సంస్థలు, డిస్కమ్‌ల వంటి అమలు యంత్రాంగాలకు మార్గనిర్దేశం కోసమే ఈ కరదీపిక ప్రధానంగా ఉద్దేశించబడింది. దీంతోపాటు చార్జింగ్‌ మౌలిక వసతుల ఏర్పాటు ప్రక్రియను మరింత సరళం చేయగల నియంత్రణ చర్యలను కూడా ప్రముఖంగా చూపుతుంది. ఈ కరదీపికకు కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పు శాఖ, భారీ పరిశ్రమల శాఖల నుంచి కూడా మద్దతు లభించింది.

 

***



(Release ID: 1745226) Visitor Counter : 250