రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

05, సెప్టెంబర్- 03,అక్టోబర్ 2021 వ‌ర‌కు కోల్‌క‌తాలో 130వ ఎడిష‌న్‌ డ్యూరాండ్ క‌ప్ పోటీలు

Posted On: 12 AUG 2021 10:07AM by PIB Hyderabad

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఒక సంవత్సరం విరామం తర్వాత ప్రపంచంలోని మూడవ పురాతన మరియు ఆసియాలో పురాతన ఫుట్‌బాల్ టోర్నమెంట్ డ్యూరాండ్ కప్ పోటీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్‌), ఐఎఫ్ఏ (పశ్చిమ బెంగాల్) మరియు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తోడ్పాటుతో, డ్యూరాండ్ కప్ యొక్క 130వ ఎడిషన్ మ‌ళ్లీ ఒక మైలురాయిగా నిలువ‌నుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ మొదటిసారి 1888 లో దగ్‌షాయ్‌లో (హిమాచల్ ప్రదేశ్) జరిగింది. దీనికి అప్ప‌టిక భారతదేశం ఇన్‌ఛార్జ్ విదేశాంగ కార్యదర్శి అయిన మోర్టిమర్ డ్యూరాండ్ పేరు పెట్టారు. ఈ టోర్నమెంట్ మొదట్లో బ్రిటీష్ సైనికుల మధ్య ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్‌ను కాపాడ‌టానికి ఒక చేతన మార్గంగా ఉండేది. కాల‌క్ర‌మంలో ఆ తరువాత పౌరులకు కూడా దీనిలో అవ‌కాశం క‌ల్పించ‌డం జ‌రిగింది. దీంతో ఇది ప్రస్తుతం ప్రపంచంలోని ప్రముఖ క్రీడా కార్యక్రమాలలో ఒకటిగా నిలిచే స్థాయికి చేరింది. మోహన్ బగన్ మరియు ఈస్ట్ బెంగాల్ జ‌ట్లు డ్యూరాండ్ కప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లు. ఈ రెండు జ‌ట్లు పదహారు సార్లు ఈ టోర్న‌మెంట్‌ను గెలిచాయి. ఈ పోటీల‌లో విజేతగా నిలిచిన జట్టుకు మూడు ట్రోఫీలు అందించ‌బ‌డ‌తాయి. ప్రెసిడెంట్స్ కప్ (మొదటిసారి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దీనిని అందించారు), డ్యూరాండ్ కప్ (ఒరిజినల్ ఛాలెంజ్ ప్రైజ్ - రోలింగ్ ట్రోఫీ) మరియు సిమ్లా ట్రోఫీ (1903లో సిమ్లా పౌరులు మొదటగా సమర్పించారు మరియు 1965 నుండి, రోలింగ్ ట్రోఫీ) ట్రోపీల‌ను అంద‌జేస్తారు. టోర్నమెంట్ 2019లో ఢిల్లీ నుండి కోల్‌కతాకు మార్చబడింది, ఫైనల్స్‌లో మోహన్ బగన్‌ను 2-1 తేడాతో ఓడించి గోకులం కేరళ జ‌ట్టు దీనిని గెలిచింది. పశ్చిమ బెంగాల్ రాజధాని మళ్లీ నాలుగు వారాల టోర్నమెంట్‌కు ఆతిథ్యవివ్వ‌నుంది. 05 సెప్టెంబర్ నుండి 03 అక్టోబర్ 2021 మధ్య కాలంలో ఇది షెడ్యూల్ చేయబడింది. కోల్‌కతా మరియు చుట్టుపక్కల వివిధ వేదికలలో మ్యాచ్‌లు జరుగ‌నున్నాయి. సర్వీసుల నుండి నాలుగు జట్లతో సహా దేశ వ్యాప్తంగా 16 జట్లు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ డ్యూరాండ్ క‌ప్ ట్రోఫీలో పాల్గొన‌నున్నాయి. క్రీడాకారుల పోటీతత్వ మరియు నిజమైన క్రీడా స్ఫూర్తితో పోరాడేలా ఈ పోటీలు నిర్వ‌హించ‌నున్నారు.

 

***

 



(Release ID: 1745095) Visitor Counter : 246