గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

13 రాష్ట్రాల్లో అమల్లో/అమలు దశలో మెట్రో రైల్‌/రీజనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్ సిస్టం

Posted On: 04 AUG 2021 2:38PM by PIB Hyderabad

పట్టణాభివృద్ధిలో భాగమైన పట్టణ రవాణా రాష్ట్రాలకు సంబంధించిన విషయం. మెట్రో రైలు ప్రాజెక్టులతోపాటు; పట్టణ రవాణా మౌలిక సదుపాయాలను ఏర్పాటు ప్రారంభించడం, అభివృద్ధి చేయడం, నిధులు సమకూర్చడం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. ప్రస్తుతం ఉన్న విధానం, సాధ్యత, వనరుల అందుబాటును బట్టి; ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలు పంపితే, నగరాలు లేదా పట్టణాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రస్తుతం, దిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం, ఉత్తరప్రదేశ్‌, హరియాణా, పశ్చిమ బంగాల్‌, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌లో మెట్రో రైలు/రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఆర్‌ఆర్‌టీఎస్‌) అమల్లో/అమలు దశలో ఉంది.

    మెట్రో రైల్ విధానం-2017 నిబంధనలకు అనుగుణంగా; విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టుల అమలు ప్రతిపాదనలను సవరించాలని 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరగా, సవరించిన ప్రతిపాదనను ఆ ప్రభుత్వం ఇంకా సమర్పించలేదు.

    ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో విశాఖపట్నంలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం కొరియన్‌ ఎగ్జిమ్‌ బ్యాంకు నుంచి ఆర్థిక సాయం పొందడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదన కూడా సమర్పించింది. ఆ ప్రతిపాదనను పరిశీలించిన తర్వాత, ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించలేమని కొరియన్‌ ఎగ్జిమ్‌ బ్యాంకు తెలిపింది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం; రుణ సాయం కోసం ఆ ప్రాజెక్టు ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాల శాఖ వెబ్‌ పోర్టల్‌ ద్వారా ఇతర ఏజెన్సీలకు పంపవచ్చని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. ఈ అంశానికి సంబంధించి, విశాఖపట్నంలో లైట్ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు విదేశీ రుణ సాయం కోసం తాజా ప్రతిపాదన ఏదీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి రాలేదు.

    కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా ఇవాళ రాజ్యసభకు సమర్పించారు.

***



(Release ID: 1742486) Visitor Counter : 98