ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

నైపుణ్యాభివృద్ధితో యువత భవిష్యత్తుకు రాచబాట: ఉపరాష్ట్రపతి


• ఇష్టపడి కష్టపడండి. బంగారు జీవితాన్ని పొందండి

• యువతకు ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచన

• జీఎంఆర్ చిన్మయ విద్యాలయ, జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సందర్శన

• శిక్షణార్థులు, విద్యార్థులతో ముచ్చటించిన ఉపరాష్ట్రపతి

Posted On: 01 AUG 2021 5:48PM by PIB Hyderabad

భారతీయ యువతలో సహజంగానే అపారమైన ప్రతిభాపాటవాలున్నాయని నైపుణ్యాభివృద్ధి ద్వారా ఆ సామర్థ్యానికి పదునుపెట్టుకుని సద్వినియోగ పరుచుకోవాలని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా తమ బంగారు భవితకు యువత బాటలు వేసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

ఆదివారం హైదరాబాద్‌ విమానాశ్రయం సమీపంలోని జీఎంఆర్-వరలక్ష్మీ ఫౌండేషన్, జీఎంఆర్-చిన్మయ విద్యాలయ లను ఉపరాష్ట్రపతి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ వివిధ అంశాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ఆయన మాట్లాడారు. యువత అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడంతోపాటు కష్టపడి పనిచేసే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఇప్పుడు శ్రమించి సొంతకాళ్లపై నిలబడితేనే భవిష్యత్తు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.

జీఎంఆర్-చిన్మయ విద్యాలయ విద్యార్థులతో మాట్లాడుతూ.. బాగా చదువుకోవాలని, విద్యతోపాటు శారీరక శ్రమను కూడా చిన్నతనం నుంచే అలవర్చుకోవాలని సూచించారు.

జీఎంఆర్ సంస్థ చేస్తున్న సామాజిక సేవ కార్యక్రమాలనూ ఉపరాష్ట్రపతి అభినందించారు. జీవితంలో ఎంత సంపాదించినప్పటికీ, సంపాదించిన దాన్ని తోటి సమాజంతో పంచుకోవాలనే ఆలోచన చాలా గొప్పదన్నారు. ఉదారవాదంతో సేవాకార్యక్రమాలు, యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న జీఎంఆర్ సంస్థ చైర్మన్ శ్రీ గ్రంథి మల్లికార్జునరావు గారిని ఉపరాష్ట్రపతి అభినందించారు.

***


(Release ID: 1741302) Visitor Counter : 234