రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

వరద బాధిత అరుణాచల్‌ప్రదేశ్‌లో యార్లుంగ్‌-లమాంగ్‌ రహదారిని పునరుద్ధరించిన బీఆర్‌వో

Posted On: 31 JUL 2021 12:15PM by PIB Hyderabad

ముఖ్యాంశాలు: 
ప్రతికూల వాతావరణాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ 24 గంటలూ పని చేస్తున్న బీఆర్‌వో
సమాచార మార్గాలు పునరుద్ధరణ, తేలికపాటి వాహనాలకు అనుమతి
సంపూర్ణ అనుసంధానం కోసం అన్ని వనరులనూ వినియోగిస్తున్న బీఆర్‌వో
కుంభవృష్టి కారణంగా అనేకచోట్ల కొట్టుకుపోయిన రహదారి

    అరుణాచల్ ప్రదేశ్‌లోని షి యోమి జిల్లాలో ఉన్న యార్లుంగ్-లమాంగ్ రహదారిని 'సరిహద్దు రహదారుల సంస్థ' (బీఆర్‌వో) పునరుద్ధరించింది. ఈ నెల 26, 27 తేదీల్లో కురిసిన కుంభవృష్టి కారణంగా ఈ రహదారి అనేకచోట్ల కొట్టుకుపోయింది.

    ప్రాజెక్ట్ బ్రహ్మాంక్‌కు చెందిన ఇంజినీర్ టాస్క్‌ఫోర్స్‌ అండ్‌ క్విక్ రెస్పాన్స్‌ బృందాన్ని బీఆర్‌వో సహాయ చర్యల కోసం పంపింది. నైపుణ్యంగల సిబ్బందితోపాటు, జేసీబీ, డోజర్లు, ఎక్స్‌కావేటర్లు ఈ బృందంలో ఉన్నాయి. కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ, యాభై మంది బీఆర్‌వో సిబ్బంది రాత్రింబవళ్లూ పునరుద్ధరణ పనులు కొనసాగిస్తున్నారు.

    ప్రజలు నడిచి వెళ్లేందుకు, సాయుధ దళాల సిబ్బందికి రవాణా కోసం ఈ నెల 27న రహదారిని కొంతవరకు పునరుద్ధరించగలిగారు. దీనివల్ల, ఎగువనున్న ప్రాంతాల్లోని సైనిక సిబ్బందికి నిత్యావసరాలు, వైద్య సదుపాయాల వంటి అత్యవసర సేవలు అందుతున్నాయి. తేలికపాటి వాహనాలు వెళ్లేలా 28వ తేదీ నాటికి రహదారిని పునరుద్ధరించారు. ఆగస్టు 3వ తేదీ నాటికి సంపూర్ణ పునరుద్ధరణ జరిగేలా బీఆర్‌వో తన వనరులను మోహరించింది. 

    బ్రహ్మంక్‌ ప్రాజెక్టులో భాగమైన రహదారిని ఈ ఏడాది జూన్‌ 17న ప్రారంభించారు. వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఈ రహదారి, ఎగువ ప్రాంతాల్లో విధుల్లో ఉన్న సాయుధ దళాలకు, చుట్టుపక్కల గ్రామాలకు కీలకమైనది.

***



(Release ID: 1741020) Visitor Counter : 172