ప్రధాన మంత్రి కార్యాలయం

జాతీయ విద్యా విధానం-2020 మొదటి వార్షికోత్సవం సందర్భంగా విద్యారంగానికి చెందిన సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించిన - ప్రధానమంత్రి


ఈ సందర్భానికి గుర్తుగా ప్రారంభమైన - అనేక కీలక కార్యక్రమాలు

జాతీయాభివృద్ధి ‘మహాయాగ’ లో ఎన్.ఈ.పి. ఒక పెద్ద అంశం: ప్రధానమంత్రి

ఈ నూతన విద్యా విధానం, యువతకు, వారి ఆకాంక్షలకు దేశం పూర్తిగా మద్దతు ఇస్తుందనే భరోసా కల్పిస్తుంది : ప్రధానమంత్రి

దాపరికం, ఒత్తిడి లేకపోవడం, కొత్త విద్యా విధానంలో ముఖ్య లక్షణాలు: ప్రధానమంత్రి

8 రాష్ట్రాలలోని 14 ఇంజనీరింగ్ కళాశాలలు 5 భారతీయ భాషలలో విద్యను అందించడం ప్రారంభించాయి: ప్రధానమంత్రి

బోధనా మాధ్యమంగా మాతృభాష పేద, గ్రామీణ, గిరిజన నేపథ్యం నుండి వచ్చిన విద్యార్థుల్లో విశ్వాసాన్ని కలిగిస్తుంది: ప్రధానమంత్రి

Posted On: 29 JUL 2021 6:26PM by PIB Hyderabad

జాతీయ విద్యా విధానం 2020 కింద సంస్కరణలు చేపట్టి ఒక ఏడాది పూర్తయిన సందర్భంగా, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్య, నైపుణ్యాభివృద్ధి రంగానికి చెందిన విధాన రూపకర్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు.  విద్యా రంగంలో పలు కార్యక్రమాలను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు.

నూతన విద్యా విధానం ఒక ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా, దేశ ప్రజలను, విద్యార్థులను, ప్రధానమంత్రి, అభినందిస్తూ, కోవిడ్-19 కష్టకాలంలో కూడా, నూతన విద్యా విధానాన్ని క్షేత్ర స్థాయిలో అమలు పరచడంలో ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, విధాన రూపకర్తలు చేసిన కృషిని, ప్రశంసించారు.  ‘ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్’ సంవత్సర ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, ఇటువంటి ముఖ్యమైన కాలంలో, నూతన విద్యా విధానం ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  ఈ రోజు మన యువతకు అందించే, విద్య, మార్గదర్శకత్వం పై మన భవిష్యత్ పురోగతి, అభివృద్ధి, ఆధారపడి ఉంటుందని ప్రధానమంత్రి చెప్పారు. "జాతీయ అభివృద్ధి ‘మహాయాగ’ లో ఇది ఒక పెద్ద ముఖ్యమైన అంశంగా నేను విశ్వసిస్తున్నాను" అని, ప్రధానమంత్రి అన్నారు.

మహమ్మారి తీసుకువచ్చిన మార్పులు, ముఖ్యంగా విద్యార్థులకు ఆన్‌-లైన్ విద్య సర్వ సాధారణమైన విషయం గా ఎలా మారిందో ప్రధానమంత్రి ప్రస్తావించారు. దీక్ష పోర్టల్ ను 23 వందల కోట్ల మందికి పైగా వీక్షించడం, దీక్ష, స్వయం వంటి పోర్టల్‌ ల వినియోగానికి నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు.

చిన్న పట్టణాల నుండి యువత సాధించిన ప్రగతిని ప్రధానమంత్రి గుర్తించారు.  టోక్యో ఒలింపిక్స్‌ లో ఇటువంటి పట్టణాలకు చెందిన యువత చేసిన గొప్ప ప్రదర్శనను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు.  రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు, అంకురసంస్థల రంగాల్లో యువత చేసిన కృషిని, పరిశ్రమ 4.0 లో వారి నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు. యువతరానికి వారి కలలకు అనువైన వాతావరణం లభిస్తే, వారి పెరుగుదలకు పరిమితి లేదని ఆయన అభివర్ణించారు.  నేటి యువత వారి వ్యవస్థలను, వారి ప్రపంచాన్ని, వారి స్వంత నిబంధనల ప్రకారం నిర్ణయించుకోవాలని కోరుకుంటున్నారని ఆయన నొక్కి చెప్పారు. వారికి సంకెళ్ళు, పరిమితుల నుండి విముక్తి కల్పించాలి, వారికి స్వేచ్ఛ అవసరం. దేశం వారితో, వారి ఆకాంక్షలతో పూర్తిగా ఉందన్న భరోసాను, మన యువతకు, ఈ నూతన విద్యా విధానం, ఇస్తుంది. ఈ రోజు ప్రారంభించిన కృత్రిమ మేధస్సు కార్యక్రమం విద్యార్థులను భవిష్యత్తు మీద ఆధారపడే విధంగా చేస్తుంది, కృత్రిమ మేధస్సుతో నడిచే ఆర్థిక వ్యవస్థకు మార్గం సుగమం చేస్తుంది.  అదేవిధంగా, నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్, (ఎన్.డి.ఈ.ఏ.ఆర్);   నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం (ఎన్.ఈ.టి.ఎఫ్);  మొత్తం దేశానికి డిజిటల్ మరియు సాంకేతిక వ్యవస్థను అందించడంలో విశేషమైన కృషి చేశాయి, అని ప్రధానమంత్రి చెప్పారు. 

 

కొత్త విద్యా విధానంలో బహిరంగత మరియు ఒత్తిడి లేకపోవడాన్ని, ప్రధానమంత్రి ఎత్తిచూపారు.  విధాన పరంగా పారదర్శకత ఉందని, విద్యార్థులకు అందుబాటులో ఉన్న అవకాశాల్లో కూడా పూర్తి పారదర్శకత కనబడుతుందని, ఆయన చెప్పారు.  ఒకే తరగతి, ఒకే కోర్సులో ఉండాలనే పరిమితుల నుండి విద్యార్థులకు విముక్తి కలిగించే విధంగా, మల్టిపుల్ ఎంట్రీ మరియు మల్టిపుల్ ఎగ్జిట్ వంటి ఎంపికలు కల్పించడం జరిగింది.  అదేవిధంగా, ఆధునిక టెక్నాలజీ ఆధారిత అకాడెమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ విధానం విప్లవాత్మక మార్పును తెస్తుంది. ఈ  విధానం, స్ట్రీమ్ మరియు సబ్జెక్టులను ఎన్నుకోవడంలో విద్యార్థికి విశ్వాసం ఇస్తుంది.  'స్ట్రక్చర్డ్ అసెస్‌మెంట్ ఫర్ అనలైజింగ్ లెర్నింగ్ లెవల్స్', ఎస్.ఏ.ఎఫ్.ఏ.ఎల్. - పరీక్షల భయాన్ని తొలగిస్తుంది. ఈ కొత్త కార్యక్రమాలు భారతదేశ భవితవ్యాన్ని మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

మహాత్మా గాంధీని ఉటంకిస్తూ,  విద్యా బోధనలో మాధ్యమంగా స్థానిక భాషల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.  8 రాష్ట్రాలకు చెందిన 14 ఇంజనీరింగ్ కళాశాలలు హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, బంగ్లా వంటి 5 భారతీయ భాషలలో విద్యా బోధన ప్రారంభిస్తున్నాయని ప్రధానమంత్రి తెలియజేశారు.  ఇంజనీరింగ్ కోర్సును 11 భాషలలో అనువదించడానికి ఒక సాధనం (యాప్) అభివృద్ధి చేయబడింది.  మాతృభాషలో బోధనకు ప్రాధాన్యత నివ్వడం, పేద, గ్రామీణ, గిరిజన నేపథ్యం నుండి వచ్చిన విద్యార్థుల్లో విశ్వాసాన్ని కలిగిస్తుంది.  ప్రాథమిక స్థాయిలో కూడా మాతృభాషలో విద్యా బోధనకు ప్రచారం చేయబడుతోంది.  ఈ రోజు ప్రారంభించిన విద్యా ప్రవేష్ కార్యక్రమం, ఈ విషయంలో పెద్ద పాత్ర పోషించనుంది.   భారతీయ సంకేత భాషకు మొదటిసారిగా భాషా పరంగా  సబ్జెక్టు హోదా లభించిందని ఆయన తెలియజేశారు.  విద్యార్థులు దీనిని కూడా ఒక భాషగా కూడా అధ్యయనం చేయగలుగుతారు.  బోధనా మాధ్యమంగా సంకేత భాష అవసరమయ్యే విద్యార్థులు దాదాపు 3 లక్షలకు పైగా ఉన్నారు.  ఇది భారతీయ సంకేత భాషకు ఊతమిస్తుందనీ, దివ్యాంగ ప్రజలకు సహాయపడుతుందనీ, ప్రధానమంత్రి, పేర్కొన్నారు. 

 

ఉపాధ్యాయుల కీలక పాత్ర గురించి, ప్రధానమంత్రి ప్రత్యేకంగా వివరిస్తూ, రూపకల్పన దశ నుండి అమలు వరకు, నూతన విద్యా విధానంలో,  ఉపాధ్యాయులు చురుగ్గా పాల్గొన్నారని తెలియజేశారు.  ఈ రోజు ప్రారంభించిన నిష్ట 2.0, ఉపాధ్యాయులకు వారి అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించడంతో పాటు, వారు తమ సలహాలను విభాగానికి అందించడానికి కూడా ఉపయోగపడుతుంది. 

ఉన్నత విద్యలో విద్యార్థులకు బహుళ ప్రవేశ మరియు నిష్క్రమణ ఎంపికలకు అవకాశమిచ్చే, అకాడెమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్‌;   ప్రాంతీయ భాషలలో 1వ సంవత్సరం ఇంజనీరింగ్ బోధనా కార్యక్రమాలు;  ఉన్నత విద్య యొక్క అంతర్జాతీయకరణ కు మార్గదర్శకాలు; మొదలైన వాటిని, ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు.  కాగా, త్వరలో ప్రారంభించబోయే కార్యక్రమాలలో - గ్రేడ్-1 విద్యార్థుల కోసం,  "విద్యా ప్రవేష్" అనే మూడు నెలల ఆటల ఆధారిత పాఠశాల తయారీ మాడ్యూల్;   భారతీయ సంకేత భాషను సెకండరీ స్థాయి లో ఒక సబ్జెక్టు గా ప్రవేశపెట్టడం;   ఉపాధ్యాయ శిక్షణ కోసం, ఎన్.సి.ఈ.ఆర్.టి. రూపొందించిన ఒక సమగ్ర కార్యక్రమం - నిష్ఠ 2.0 ; ఎస్.ఏ.ఎఫ్.ఏ.ఎల్. (స్ట్రక్చర్డ్ అసెస్‌మెంట్ ఫర్ అనలైజింగ్ లెర్నింగ్ లెవల్స్), సి.బి.ఎస్‌.ఈ. పాఠశాలల్లో 3, 5, 8 తరగతులకు సమర్థత ఆధారిత అంచనా ఫ్రేమ్‌వర్క్; కేవలం కృత్రిమ మేధస్సు కోసం అంకితమైన ఒక వెబ్-సైట్; మొదలైనవి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా - నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్ (ఎన్.డి.ఈ.ఏ.ఆర్) తో పాటు, నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం (ఎన్.ఈ.టి.ఎఫ్) లను కూడా ప్రారంభించారు.(Release ID: 1740576) Visitor Counter : 206