పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

14 పులుల అభయారణ్యాలకు ప్రపంచస్థాయి గుర్తింపు!


పులుల రక్షణే అటవీ సంరక్షణకు ప్రతీక

పులుల సంరక్షణ దినోత్సవంలోకేంద్రమంత్రి వ్యాఖ్య

Posted On: 29 JUL 2021 5:26PM by PIB Hyderabad

 పులుల సంరక్షణ అనేది, అటవీ సంకరక్షణకు ప్రతీకవంటిదని పర్యావరణం, అటవీ వ్యవహారాలు, వాతావరణ మార్పుల శాఖ కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం శాస్త్ర విజ్ఞానాన్ని, సంప్రదాయ పరిజ్ఞానాన్ని సమీకృతం చేస్తూ ప్రజల భాగస్వామ్యంతో ముందుకు వెళ్తోందని, దేశంలోని జంతుజాలాన్ని, వృక్ష సంపదను కాపాడేందుకు ఇది ఎంతో కీలకమని ఆయన అన్నారు. ప్రపంచ (అంతర్జాతీయ) పులుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా వర్చువల్ పద్ధతిలో ఆన్.లైన్ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో భూపేంద్రయాదవ్  ప్రసంగించారు. ‘చిరుత పులుల పరిస్థితి, సహచర జంతు భక్షక ప్రాణాలు, శాకాహార జంతువులు-2018’ పేరిట రూపొందించిన నివేదికను కేంద్రమంత్రి ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. పులులను సంరక్షిస్తే అది సంపూర్ణ స్థాయి పర్యావరణ రక్షణకు దారితీస్తుందనడానికి ఈ నివేదికే సాక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు.

ABH_6184.JPG

  2018వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఉన్న పులులసంఖ్యను అంచనా వేసినపుడు, వివిధ రాష్ట్రాల్లోని పులుల ఆవాసాలైన అడవుల్లో ఉండే చిరుత పులల జనాభాను కూడా అంచనా వేసినట్టు చెప్పారు. దేశంలోని పులుల ఆవాసమైన అటవీ ప్రాంతాల్లో 2018లో అంచనా వేసిన చిరుతల పులుల సంఖ్యను 12,852గా (ఎస్.ఇ. రేంజి 12,172-13,535)గా అంచనా వేశారు. 2014లో అంచనావేసిన సంఖ్య కంటే ఇది చాలా ఎక్కువ. 2014లో దేశంలోని పులులు నివసించే 18రాష్ట్రాల అటవీ ప్రాంతాల పరిధిలో ఈ సంఖ్య 7,910 (ఎస్.ఇ. రేంజి 6,566-9,181)గా నమోదైంది.

  పులుల సంరక్షణా ప్రమాణాలకు సంబంధించి భారతదేశంలోని 14 పులుల అభయారణ్యాలకు అందిన ప్రపంచ స్థాయి ప్రమాణాల గుర్తింపు పత్రాలను (సి.ఎ. /టి.ఎస్.)  కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు.  ఇలా గుర్తింపు పొందిన 14 అభయారణ్యాల్లో అస్సాంలోని మానస్, కజిరంగా, ఒరాంగ్,.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాత్పూరా, కన్హా, పున్నా,.. మహారాష్ట్రలోని పెంచ్,.. బీహార్.లోని వాల్మీకి పులుల అభయారణ్యం,.. ఉత్తరప్రదేశ్.లోని దుధ్వా,.. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్,. కేరళలోని పరాంబికుళం, కర్ణాటకలోని బండీపూర్ పులుల అభయారణ్యం, తమిళనాడులోని మదుమలై, అన్నామలై పులుల అభయారణ్యాలు ఉన్నాయి.

 

ABH_6201.JPG

  పులుల సంరక్షణ ప్రమాణాలకు సంబధించిన సి.ఎ., టి.ఎస్. గుర్తింపును, పులుల అభయారణ్యాలున్న దేశాల ప్రపంచ స్థాయి సంకీర్ణ కూటమి ఆమోద ముద్ర పొందిన గుర్తింపుగా పరిగణిస్తారు. పులుల అధ్యయన నిపుణులు, పులుల సంరక్షణ ప్రాంతాల నిపుణులు ఈ గుర్తింపు ప్రక్రియకు రూపకల్పన చేశారు. 2013లో ప్రారంభమైన ఈ ప్రక్రియ ప్రకారం, ఎంపిక చేసిన పులుల జాతుల రక్షణకు సంబంధించి కనీస ప్రమాణాలను పాటించవలసి ఉంటుంది. తాము పాటించే నిర్వహణా పద్ధతులు సజావుగా ఉన్నాయో లేదో పులుల అభయారణ్యాలు బేరీజు వేసుకునేందుకు సి.ఎ.,టి.ఎస్. ప్రమాణాల నిర్ధారణ ప్రక్రియ దోహదపడుతుంది. 

  ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ శాఖ సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే మాట్లాడుతూ, ప్రకృతితో, అన్ని జీవరాసులతో  సామరస్యంగా సహజీవనం చేసే ప్రాచీన కాలపు సంప్రదాయం ఎంతో ఉత్కృష్టమైనదని అన్నారు. ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థ రక్షణలో పులులకు కీలక పాత్ర ఉంటుందని, పులులను, సహజసిద్ధమైన వాటి ఆవాసాలను రక్షించుకునేందుకు వీలుగా అందరూ సమైక్యం కావాలని, సహకార స్ఫూర్తితో చేతలు కలపాలని ఆయన పిలుపునిచ్చారు.

  ఈ కార్యక్రమంలో ఇద్దరు కేంద్ర మంత్రుల సమక్షంలో అటవీశాఖకు చెందిన కొంతమంది ఫ్రంట్.లైన్ సిబ్బందికి సన్మానం జరిగింది. వారికి ‘బాగ్ రక్షకులు’గా అవార్డులు ప్రదానం చేస్తూ జాతీయ. పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (ఎన్.టి.సి.ఎ.) సత్కరించింది. పులుల, అటవీ ప్రాంతాల సంరక్షణలో అందించిన సేవలను గుర్తింపుగా వారికి ఈ అవార్డులు ప్రదానం చేశారు. “అడవులను, వన్య జీవులను రక్షించడంలో మన అటవీ సిబ్బంది రాత్రీ, పగలన్నది లేకుండా నిర్విరామంగా శ్రమించారు. ప్రాణాంతకమైన కోవిడ్-19 వైరస్ మహమ్మారి వ్యాప్తి సమయంలోనూ వారు ఎంతో శ్రమించారు.” అని కేంద్ర పర్యావరణ మంత్రి అన్నారు. ప్రకృతి సిద్ధమైన మన జాతీయ వారసత్వ సంపదను కాపాడటంలో అటవీశాఖ ఫ్రంట్.లైన్ సిబ్బంది అందించిన సేవలు ఎంతో
అభినందనీయమని ఆయన అన్నారు.

 

ABH_6228.JPG

  కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో లాక్ డౌన్ ఆంక్షలు అమలులోకి వచ్చిన కాలంలో అటవీ సేవలను, వన్యప్రాణుల సంరక్షణను భారత ప్రభుత్వం ‘అత్యవసర సేవల’ పరిధిలోకి తీసుకువచ్చింది. ‘స్ట్రైప్స్-STRIPES’ పేరుతో ఎన్.టి.సి.ఎ. ప్రచురించిన త్రైమాసిక సమాచార పత్రం ప్రత్యేక సంచికను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రపంచ పులుల సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని  వెలువరించిన ఈ ప్రత్యేక సంచికను ఇద్దరు కేంద్రమంత్రులు, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆర్.పి. గుప్తా, ఎన్.టి.సి.ఎ. సీనియర్ అధికారులు లాంఛనంగా ఆవిష్కరించారు.

 

ABH_6188.JPG

***



(Release ID: 1740484) Visitor Counter : 329